ప్రియమైన బాలసుబ్రహ్మణ్యం గారూ, పాడుతా తీయగా కార్యక్రమపు ఇతర నిర్వాహకులారా,
మీకు ఇవే నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా వీక్షిస్తున్న ప్రేక్షకుడిగా, ఆ కార్యక్రమపు అభిమానిగా నాలుగు మాటలు మీకు అందచేద్దామని ఈ చిన్ని ప్రయత్నం. మీకే నా మాటలు సూటిగా పంపకుండా, ఇక్కడ బ్లాగులో ఎందుకు వ్రాయటం అని మీకు అనిపించవచ్చు. ఒకటి, మీకు పంపాల్సిన చిరునామా నాకు తెలియదు. పంపినా మీకు వచ్చే అసంఖ్యాకమైన ఉత్తరాల్లో నాదొకటి అయిపోతుంది. రెండు, నాలాగా అనుకుంటున్న వాళ్ళు, నేను అనుకుంటున్నది బాగుంది అనుకున్న వాళ్ళల్లో ఎవరన్న మీ చెవిన నేను వ్రాసిన నాలుగు మాటలు వెయ్యకపోతారా అని ఒక ఆశ. అంతే.
పాడుతా తీయగా కార్యక్రమం సంగీత ప్రియులకు, ముఖ్యంగా సినిమా పాటల ప్రియులకు ఎంతో అభిమానమైన కార్యక్రమంగా మారింది. ఈ కార్యక్రమంలో సంగీతం నేర్చుకుంటూ చక్కగా పాడగలిగిన చిన్నారులెందరినో వయస్సులవారీగా పోటీలు ఏర్పరిచి ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉండటం ఎంతో ఆనందాన్నిస్తున్నది. ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులుగా సుబ్రహ్మణ్యం గారూ, మీదైనా ఒక ప్రత్యెక ముద్ర ఈ కార్యక్రమం మీద ఎంతగానో కనబడుతూ ఉంటుంది. కార్యక్రమం మధ్యమధ్య మీరు చెప్పే "అప్పటి" విశేషాలకోసమే నేను ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటాను. పాటలు మొదటి రౌండ్లల్లో కొంత విసుగెత్తించినా, దాదాపు ప్రేక్షకులు అందరూ గుర్తించిన గాయనీ గాయకులే సెమి ఫైనల్ దాకా రావటం ఇక అక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ ప్రతిభ మరింత పదును పెట్టుకుని ఫైనల్స్ లో నెగ్గటం ఇప్పటి దాకా అనేక సార్లు చూడటం జరిగింది.
నేను ఈ లేఖ వ్రాద్దామని మొదలు పెట్టినది ఒకే ఒక్క విషయం చెప్పటానికి. ఇప్పటి దాకా పాడుతా తీయగా కార్యక్రమం మొత్తం ఫోకస్ సినిమా పాటలమీదే ఉన్నది. సినిమా పాటల మీదుగా ప్రేక్షక ఆదరణ, వాళ్లకు సంగీతం మీద అభిరుచి కలిగించటంలో ఈ కార్యక్రమం ఎంతగానో విజయం సాధించింది. ప్రేక్షక ఆదరణే ఏ కార్యక్రమానికైనా పట్టుకొమ్మ. మీ కార్యక్రామానికి ఉన్న ఆదరణ దృష్ట్యా, మీరు కొత్తగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ విషయంలో ఈ కింది సూచనలు మీ ముందు ఉంచుతున్నాను.
- ఇప్పటి వరకూ బాల బాలికలకు సంవత్సరాలుగా ఆవకాశం ఇచ్చి వాళ్ళల్లో నిజమైన ప్రతిభ కలిగిన వాళ్ళను గాయకులుగా చేయటం జరిగింది. ఇప్పుడు, కొంచెం పెద్ద వాళ్ళను అంటే ముఫ్ఫై-నలభై పైబడి పాడగలిగి ఉన్న వాళ్ళను, ముఖ్యంగా మహిళలకు ఆవకాశం ఇచ్చి, సినిమా పాటలు కాకుండా లలిత సంగీతం, పెళ్లి పాటలు, మంగళ హారతులు వాళ్ళ చేత పాడించి, ఆ పోటీలో నెగ్గిన వారికి బహుమతులు ఇస్తే ఎంతైనా బాగుంటుంది.
- ఇలా చెయ్యటం వల్ల, మన సాంప్రదాయం లో ఉన్న అనేకానేక అద్భుతమైన పాటలు ఇప్పటికి దాదాపుగా కనుమరుగయ్యి పోతున్న వాటిని మళ్ళి ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చి, ఆ పాత పాటలను పునరుద్ధరించిన వారు అవుతారు.
- అనేకానేక పెళ్లి పాటలు, మంగళహారతులు మొదలైన వాటి సాహిత్యం కూడా ఇప్పుడు పెద్దగా దొరకటం లేదు. మరికొంత కాలం జరిగితే, అసలు కనపడకుండా పొయ్యే ప్రమాదం ఉన్నది. మీరు ఈ కార్యక్రమం ద్వారా మన సాంప్రదాయక పాటలను ప్రోత్సహిస్తే, ఆ విధమైన సంగీతాన్ని పెంచి పోషించిన వారు అవుతారు, ఈ పాటలు ఆ సంస్కృతీ మళ్ళి పునరుద్ధరించిన వారు అవుతారు.
పై సూచనల వంటివి ఇప్పటికే మీకు వచ్చి ఉంటాయి ఆపైన మీకే ఆ ఆలోచన ఉండి ఉండవచ్చు. ఒక్కసారి ఆలోచించి వీలయితే పాడుతా తీయగా కార్యక్రమానికి కొంత కాలం పైన సూచించిన విధంగా కొత్త రూపు ఇచ్చి ప్రేక్షకులను అలరించమని నా కోరిక, నా ఆకాంక్ష ఈ బహిరంగ లేఖ ద్వారా తెలియచేస్తున్నాను.
ఇట్లు
శివరామ ప్రసాదు కప్పగంతు
బెంగుళూరు, భారత్





