22, జులై 2009, బుధవారం

ఇల్లాలి ముచ్చట్లుఇల్లాలి ముచ్చట్లు ఒక చక్కటి సాహితీ ప్రయోగం. "ఇల్లాలి ముచ్చట్లు" అనే శీర్షిక మొదలు పెట్టినది, ఆంధ్రజ్యోతి
వార పత్రికలో. శీర్షికను 1967 సంవత్సరంలో మొదలు పెట్టారు. శీర్షికను "పురాణం సీత" నిర్వహించేవారు. అందరూ శీర్షికను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ సతీమణి వ్రాస్తున్నదని చాలా కాలం అనుకునేవారట. కాని, సుబ్రహ్మణ్య శర్మే, మహిళా రచనా శైలిని అనుకరిస్తూ చాలా కాలం ఎవరికీ అంతు చిక్కకుండా నిర్వహించారు. దీనికి కారణం, శీర్షిక పేరు మహిళా సంబంధమయి, రచయిత పురుషుడయితే పాఠకులు ఆదరించరేమో అన్న అనుమానం ఒకటి కాగా, అప్పటి రోజులలో, మహిళా రచయితలదే పైచేయి అవుతూ వారి రచనలే ప్రసిద్ధి చెంది ఉండటం మరొక కారణం కావచ్చును. పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఆంధ్రజ్యోతి వారపత్రికకు సంపాదకుడయిన తరువాత కూడ తన బాధ్యతలను నిర్వహిస్తూనే, శీర్షికను కూడ విజయవంతంగా కొనసాగించారు.

ఈ శీర్షికలో మనం రోజువారి చూసే సంఘటనలు, రాజకీయాలు, తగాదాలు, చిన్న పిల్లల ఆటలు వంటి విషయాల గురించి (చైనా రాజకీయాల దగ్గరనుంచి చీపురు కట్టవరకు) హాస్యభరితంగా, ఆహ్లాదకరంగా వ్రాస్తూనే అవసరమైనప్పుడు, అవసరమైనంతవరకు సునిసితమైన విమర్శదగ్గర నుండి, కత్తుల్లాంటి మాటలతో తీవ్ర విమర్శకూడా చేస్తూండేవారు. చక్కటి పొందికతో, ఎక్కడా కూడ తూకం చెడకుండా, ఈ శేర్షిక ప్రతి వారం ఒక పేజీ మాత్రమే ప్రచురించేవారు.
ఇల్లాలి ముచ్చట్లు చిహ్నం (LOGO)
వ్యాస శీర్షికకు ప్రత్యేక చిహ్నం ఉండటం అన్నది, తెలుగు వారపత్రికలలో ఇదే
మొదటిది అయిఉండవచ్చును. తెలుగు వారిళ్ళల్లో, మహిళలు వంట చెయ్యటం అన్నది సర్వ సామాన్యం. పూర్వం కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు. తరువాత, తరువాత, బొగ్గుల కుంపట్లు వచ్చినాయి. కట్టెల పొయ్యి, గ్యాస్ స్టౌవ్ కు మధ్య, తెలుగు మహిళలు ఎక్కువ కాలం బొగ్గుల కుంపట్ల మీదనే దశాబ్దాలపాటు వంటలు చేసి తమ తమ కుటుంబ సభ్యులకు ఆప్యాంయంగా వడ్డించారు. కుంపటి ముందు కూచుని, అవసరమైనప్పుడు విసినకర్రతో విసురుతూ, వంట చేస్తున్నప్పుడు, కొంత ఆలోచించటానికి మహిళలకు అవకాశం ఉండేది(కుంపట్ల మీద వంట నెమ్మదిగా జరుగుతుంది కనుక). అటువంటి ఆలోచనలను, తన బుర్రలో వండి పురాణం సీత పాఠకులకు అందిస్తున్నట్టు ఉంటుంది చిహ్నం . కుంపటి మీద బాణలి నుంచి అట్లకాడతో బయటకు తీయబడుతున్న పదార్ధం భూగోళం ఆకారంలో వెయ్యటంలో ఉద్దేశ్యం, శీర్షిక భూమ్మీద ఉండే/జరిగే ప్రతి విషయాన్ని సృశిస్తుందని సూచిస్తుంది.

రచనా శైలి
వ్యాసరచన ఎక్కువ భాగం స్వగతంలోనే జరిగింది. కొన్ని కొన్ని వ్యాసాలలో "పురాణం సీత" తన భర్తతోమా(పో)ట్లాడుతున్నట్టు వ్రాయటం జరిగింది. వార పత్రికలలో, వ్యాసాలను స్వగతంగాను లేదా ఏక వ్యక్తిసంభాషణ రూపంలో, కధలాగ చెప్పే పద్ధతి, వ్యాస శీర్షికతోనే మొదలు. వ్యాసాలన్నీ చక్కటి వ్యావహారికిభాషలో అవసరమైన చోట ఆంగ్ల పదాలను యధాతధంగా వాడుతూ, సంగీతంలో మెట్లు మెట్లుగా పరాకాష్టకుచేరుకున్నట్టుగా ముగింపుకు చేరువవుతాయి. దాదాపు అన్ని వ్యాసాలలోనూ ఒక విధమైన ఊపిరి సలపనివేగం ఉన్నది. పాఠకుడు వ్యాసం చదవటం మొదలుపెడితే ముగింపుగు వచ్చినాక మాత్రమే తెలుస్తుంది, చివరవరకూ చదివినట్టు. పాఠకుల ఆసక్తికి కారణం, కొంతవరకు వ్యాసంలో చర్చించబడ్డ కాలపు సామాజికసమస్యలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొనేవి అయినప్పటికి, వ్యాస శైలి అటువంటి ఆసక్తినిఎక్కువగా నిలపగలిగిందని చెప్పక తప్పదు. వ్యాసాలన్నీ కూడ హాస్యభరితంగా ఉంటాయి. ఓక పక్క కన్నీళ్ళుపెట్టిస్తూ కూడా హాస్యం అంతర్లీనంగా వ్రాయగలగడం (నుదుటన్ వ్రాసిన వ్రాలు...దడిగాడువానసిరా ఒకఉదాహరణ) పురాణం సీతకే చెల్లింది. ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు విధంగా వ్రాయటమేమీతేలిక కాదని, తేలికని ఊహిస్తున్నవారు ప్రయత్నించి చూడవచ్చని సవాలు చేసి, శీర్షిక శైలినికొనియాడారు.


కొన్ని ముచ్చట్లు
శీర్షికలోని వ్యాసాలనుండి కొన్ని ముచ్చట్లను ఇక్కడ ఉదహరించటం జరిగింది.

ఎన్నికలలా వ్యాసం నుండి-"...వాళ్ళకు జాతీయ పతాకానికి, కాంగ్రెసు జండాకి వున్న తేడా తెలీదు. ఇలాంటిప్రజలుంటారనే మన నెహ్రూగారు కాంగ్రెసు జండాలో రాట్నం పీకిపారేసి చక్రం పెట్టారు. జండా జండాఒకటే అనే భావం కలిగేలా జాతీయ పతాకాన్ని రూపొందించకుండా వుండవలసింది.

గోవూవత్సం వ్యాసం నుండి-..."ఆడదానికొచ్చే బాధలన్నీ వ్యక్తిగతమైనవికావు. సమాజం అమె నెత్తిమీదరుద్దినవి....."

మూడే రంగులు వ్యాసం నుండి..."ఏయ్! రిక్షావాలా! కాలవంటే తెలుసు కదా! నహర్ అంటే కాలవట. కాలవపక్కనుండే వాళ్ళు కనుక నెహ్రూలన్నారట: కాలవ పక్కనుండే మీవాళ్ళంతా నెహ్రూ లౌతారట్రా ఇడియట్!(దాదాపు 1990 వరకు విజయవాడలో ఏలూరు కాలవ, బందరు కాలవ, రైవస్ కాలవల ఒడ్లమీదబీదవాళ్ళు-రిక్షావాళ్ళు తదితరులు- గుడిసెలు వేసుకుని జీవితాలు ఈడుస్తూ ఊండేవారు. వ్యాసంలోని వ్యాఖ్య, రచయిత వ్యంగ విమర్శనా పటిమకు పరాకాష్ట)
ధర్మ దర్శనం వ్యాసం నుండి ...."స్వర్గం, మోక్షం ఎంత మంచివైనా, ఎవరో దిక్కుమాలిన వాళ్ళకూఅభాగ్యులకూ తప్ప, ఎవరికీ స్వర్గస్థులం కావాలని వుండదు, అదేమి చిత్రమో..."

దడిగాడువానసిరా వ్యాసం నుండి..."జెరూస్లెంలో ఆక్రోశకుడ్యమని ఏడవటానికి గోడ కట్టేరుట. గోడదగ్గరకు వెళ్ళి ఏడిస్తే మనశ్శాంతి లభిస్తుందట. అలాటి ఎన్నో గోడలు మనకి కావాలే....మన బ్రతుకులుతల్చుకుంటే గోడకేసి తిరిగినా ఇంట్లో ఏడుపొచ్చేస్తుందే. మరి మనం వేరే ఎక్కడికి వెళ్ళనక్కర్లేదే....."

తారుమారు బలే పెళ్ళి వ్యాసం నుండి..."గొప్పగా, డాబుగా దర్జాగా వుండటానికి ఎంత ప్రయత్నిస్తేమనుష్యులు అంత అసహ్యంగా వుంటారు....."

చిత్తశుద్ధిలేని శివపూజలు వ్యాసం నుండి-ప్రభుత్వం చేస్తున్న కుటుంబ నియంత్రణ ప్రచారంగురించి..."ఉన్నమాట చెబుతున్నాను. పిల్లల్ని నిందిస్తే పిల్లల తల్లికి కష్టంగా వుంటుంది. పిల్లల తల్లికి కష్టంకలిగితే ఉద్యమ అంతా దెబ్బతింటుంది. ఎంతో సున్నితమైన సమస్యను పరమ మోటుగా డీల్చేస్తొంది..."

మనమాట మన పలుకు అందులోని కులుకు వ్యాసం నుండి-'...మన నిజమైన తెలుగు మన అట్టడుగు వర్గప్రజల దగ్గర ఇంకా మిగిలివుంది. మన అమ్మమ్మలు, అత్తలు, వదినలు, బామ్మలు వీరంతా ప్రాంణంలేచి వచ్చేహాయైన తెలుగు మాట్లాడుతారు. చాలా విచారకరమైన సంగతి ఏవంటే పుస్తకాలు రాసేవాళ్ళు చాలామందిదగ్గర ఆడ మగా అన్న తేడా లేకుండా ఒరిజనల్ ఒకటోరకం తెలుగు లేదు.....అనగా తెలుగు బిడ్డ కావటానికిబదులు తెలుగు పీడగా తయారవుతున్నాం...."

కర్రలూ-పాములూ వ్యాసం నుండి-"...మరి మనదేశంలో ఇన్ని పార్టీలేవిటి? చక్కగా రెండో మూడో పార్టీలుంటేఅందంగా వుటుందిగాని సంతలో దుకాణాల్లగ ఇన్ని పార్టీలేవిటీ? ఇందరు నాయకులేవిటి? వీళ్ళంతా ఏవిటిచేస్తారు?...."

ఆంధ్రా తుగ్లక్ లేక మా పిచ్చి మావయ్య వ్యాసం నుండి-"...శరీరాలు ఎదిగి మనసులు ఎదగకమూసుకుపోయిన బాపతు జనం ఆడవారిలోనేకాదు మగవారిలో కూడా హెచ్చుమందేవుండి వుంటారు..."

అభిప్రాయాలు
కొడవటిగంటి కుటుంబరావు-"...ఇల్లాలి ముచ్చట్లు శీర్షిక తెలుగు జర్నలిజంలో ఒక సరికొత్త ప్రయోగంకావటమే గాక, చాలా విజయవంతమైన ప్రయోగం....అది (ఇల్లాలి ముచ్చట్లు) ములుకు తాళ్ళ చరణాకోల. దాన్ని ఒక్కసారి ఝుళిపిస్తే అనేక చోట్ల గాయాలవుతాయి.......ఇట్లా రాయటం తేలిక అని ఎవరన్నభ్రమపడినట్టయితే, ప్రయత్నించి చూడవచ్చు.

నార్ల వెంకటేశ్వర రావు- పురాణంలోని సీతవలె, పురాణం సీత అందరి మన్ననలను పొందుతున్నది.

రాచకొండ విశ్వనాధ శాస్త్రి-".....మన దేశంలో నూటికి తొంభై తొమ్మిది మంది ఇల్లాళ్ళకి జీవితం ముచ్చట అనేప్రసక్తి లేకుండా పువ్వుల తోటలో నిప్పుల మంటలా ఉంటుందికదా! అటువటప్పుడు 'ఇల్లాలి ముచ్చట్లు" అనడంలో అర్ధం ఉందా అనిపించింది నాకు. చదివేక మాత్రం, 'ముచ్చట' వేరు 'ముచ్చట్లు' వేరు అనితెలుసుకున్నాను. తీన్ తారుగా చిక్కులు చిక్కులుగా బాధలు బాధలుగా ఉన్న, జీవితం ఎందుకు ఇలాఉంది అని తెలుసుకొందికి, వ్యాసాల్లో, ఇల్లాలు కొంత పయత్నించినట్టుగా నాకు తోస్తొంది.

నండూరి రామమోహనరావు-- పుస్తకానికి ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వనక్కర్లేదు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో పుస్తకంలోని శీర్షికలు వారంవారం పడుతున్నప్పుడు పాఠకుల నుంచి శరపరంపరగా వచ్చిపడిన ప్రశంసలేఅసలైన సర్టిఫికేట్లు....... ముచ్చట్లలో పేజీ తిరగేసినా బోలుడు గడుసుదనం, సెటైర్, పొగరు, వగరుకనిపిస్తాయి.

============================================

నేను పూర్వం తెలుగు వికీపీడియాలో వ్రాసిన వ్యాసం పున:ప్రచురణ. ఇందులోని చిత్రాలు, వ్యాఖ్యలు నవోదయా పబ్లిషర్స్, విజయవాద, సీతా బుక్స్. తెనాలి వారు ప్రచురించిన ఇల్లాలిముచట్లు సంపుటిలనుండి గ్రహింపబడినాయి.

10 వ్యాఖ్యలు:

 1. ఎవరూ కామెంటు రాయలేదేమిటో ఆశ్చర్యంగా వుంది!

  శివరామప్రసాద్ గారు: మంచి పరిచయం. మీరు వికీలో యిచ్చిన రెండు ముఖచిత్రాలతో వున్న పుస్తకాలు నా దగ్గర కూడా వున్నాయి. కాక ఈ మధ్యనే నవోదయ, హైదరాబాదు వారు ఒక సంకలనం వేసారు. ఇవి కాక వేరే సంకలనాలు వచ్చాయా? ఈ మూడింటిలోను మాత్రం ఎంపిక చేసిన columns మాత్రమే వుంటాయి. మొత్తం series ని పోగుచేయగలమా :-)

  భవదీయుడు,
  శ్రీనివాస్

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శ్రీనివాస్ గారు,

  మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. ప్రస్తుతానికి దొరికినంతే ఆనందం. ఇల్లాలి ముచ్చట్లు మొత్తం వ్యాసాలు దొరకాలంటే, పాత పుస్తకాల వారే మనకు సహాయపడాలి. లేదా, చందమామ వారివలె ఆంధ్ర జ్యోతి వారు కూడ తమ పాత సంచికలన్నీ కూడ స్చన్ చేయించి పి డి ఎఫ్ లు అందించాలి. ఇది అయ్యేపని కాదు. ప్రస్తుత వ్యాపార ధోరణిలో ఆంధ్ర జ్యోతి వారు ఆ పని చెస్తారా?? నాకు అనుమానం. వాళ్ళు గనుక ఆ పనిచేస్తే, పత్రికల్లో ఇంకా సాహిత్య అభిమానం ఉన్నదని మనం సంతోషించవచ్చును.

  శివరామప్రసాదు కప్పగంతు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అయితే ఆంధ్రదేశం లో కాలవ పక్క నివసించే ఎంతోమంది నెహృలవుతారన్నమాట.ఒక కొత్త విషయం ఇది నా బోంట్లకు. మీ సమీక్ష విపులంగా ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Sir,
  Are you interested in writing to pustakam.net? If so, please do mail me.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. పురాణం సీత గారి లింకు నుండి ఇక్కడకి వచ్చాను. పరిచయం బాగుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 6. పరిచయం చాల బాగుంది..ధన్యవాదాలు !!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @S

  I write in my blog I do not wish to communicate with people who do not show their identity.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నమస్కారములు
  పురాణం సీత గారి ఇల్లాలి ముచ్చట్లు గురించి చక్క గా వివరించారు.అ రోజుల్లొ చాలా మంది వారి భార్య రాస్తున్నా రనుకునే వారు కాని " సీత " పేరుతొ పురాణం వారె అని కొందరికి తెలుసు. నిజానికి నా వ్యాసాలు " అత్తగారు ఐస్క్రీము ,అత్త గారు హనీమూను,అత్తగారు ,ఆర్ .టీసి .బస్సులు " ఇలా ఎన్నొ పురాణం వారు ప్రచురించారు.72 ప్రాంతాలలొ ఇక " జ్యొతి పత్రిక హైదరాబాదు వచ్చాక " అనేక మార్పులు జరిగాయి .నావి రచనలు పోవడంతొ [ ఆ రోజుల్లొ ఆర్టికల్ ప్రింటైం దన్న సరదాఏ తప్ప దాచి ఉంచు కోవాలని తెలియదు ] ఒక సారి పెద్ద లైబ్రరీకి వెళ్ళి దొరుకుతా ఏమో అని ఆశగా వెతికాను ప్చ్ ! దొరక లేదు.మీ రచన చదివాక చాలా ఆనందం కలిగింది.నిజం గా దొరికితె నా రచనలు చదివితె నాకు తెలుప గలరు.ధన్య వాదము సెలవు

  ప్రత్యుత్తరంతొలగించు
 9. రాజేశ్వరిగారూ, నమస్తె.

  మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. నవోదయావారు "ఇల్లాలి ముచ్చట్లు" మళ్ళి మరొక ప్రచురణ చేశారు. అందులో 159 వ్యాసాలు ఉన్నాయి. ఒకటి రెండు తప్ప అన్ని కూడ నేను ఇంతవరకు చదవనివే ఉన్నాయి. మీకు దొరికితే తీసుకోండి.

  నాకొక ఆలోచన వచ్చింది. ఇల్లాలి ముచ్చట్లు ఒరవడిలో వ్రాయగలవారు, అదే పధ్ధతిలో కొన్ని వ్యాసాలు వ్రాసి ప్రచురిస్తే ఎలా ఉంటుంది. ముందు బ్లాగుల్లో ప్రచురించి ఆ తరువాత ఏదైనా పత్రికకు పంపించవచ్చు.

  "నవ్య" పత్రికవారికి ఇప్పటికి నెను ఒక పది మెసేజీలు పంపాను. పాత ఆంధ్ర జ్యోతి సంచికలలో ఉన్న ఇల్లాలి ముచ్చట్లు అన్ని కూడ కలిపి ఒక పుస్తకం గా తీసుకు వచ్చి, ప్రచురించమని. ఒక్క లాభాపేక్షే కాకుండా, సాహిత్య అభిలాషతో ఈ పని వారు చెయ్యగలిగితే ఎంతైనా బాగుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.