18, జులై 2009, శనివారం

శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు


భమిడిపాటి హాస్య గుళికలు

శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారు నాకేంతో ప్రీతిపాత్రుడైన రచయిత. నా చిన్నప్పుడు మా నాన్నగారు పరిచయం చేసిన (ఆయన దాచుకున్న అతికొద్ది పుస్తాకాల్లో ఒకటి) "ఎప్పుడూ ఇంతే", "కచటతపలు"
నాటికల సంపుటితో మొదలుపెట్టి, ఆయన రచనలన్నీ వెతికి, వెతికి చదివాను. 1982 ప్రాంతాలలో రాజమండ్రి వెళ్ళినప్పుడు, అక్కడ కోటగుమ్మం కూడలిలో కోడపల్లి వీరవెంకయ్య ప్రచురణల వారి వద్ద (నా ఎదురుకుండానే ఆ అమ్మే కుర్రాడు పుస్తకం మీదున్న రేటు చెరిపి దానికి మూడింతలు వ్రాస్తున్నా మారుమాట్టాడకుండా) దొరికినన్నని పుస్తకాలు కొన్నాను. అలాగే వారి పుస్తకాలన్నీ పోగుచెసే ప్రయత్నంలో ఇంకా ఉన్నాను. మానవ సంబంధాలు, మనందరిలో ఉండే ద్వంద ప్రవృత్తి గురించి తేటతెల్లంగా అద్భుతమైన హాస్యంతో వ్రాయటం, కామేశ్వరరావుగారి తరువాతనే ఎవరైనా. ఈయన వ్రాసిన పుస్తకాలు ఇప్పటికీ చాలమటుకు లభ్యం కావటంలేదు. ఈమధ్యనే, విజయవాడకు చెంధిన ప్రచురణ సంస్థ వారెవరో, వీరి రచనలన్నీ ఒక సంపుటిగా వేస్తున్నారని తెలిసి ఎంతగానో సంతోషించాను. కాని అటువంటి సంపుటి ఎప్పటికి బయటకు వస్తుందో తెలియదు. కామేస్వరరావుగారి గురించి నాకు తెలిసిన విషయాలను అందరితో పంచుకుందామని ఈ ప్రయత్నం.

వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఏప్రిల్ 28, 1897 సంవత్సరంలో నరసావధానులు, లచ్చమ్మ దంపతులకు జన్మించారు. వీరు భీమవరంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, ప్రతిభావంతులైన విద్యార్ధులకిచ్చే ఉపకార వేతనం సహాయంతో, పిఠాపురం మహారాజా కళాశాలలో గణితంలో పట్టా పొందారు. తరువాత కొంతకాలం నరసాపురం మరియు కాకినాడలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1922లో ఎల్.టి పరీక్షలో ఉత్తీర్ణులై రాజమండ్రి వీరేశలింగం ఆస్తిక ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర అధ్యాపక పదవిలో స్థిరపడి, అదే పాఠశాలకు రెండు సంవత్సరాలు ప్రధానోధ్యాపక బాధ్యతలను కూడా నిర్వహించారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వీరు చాలా నాటకాలు, నాటికలు, కథలు రచించారు. సమకాలీన సాంఘిక సమస్యలను వీరి రచనలలో హాస్యరసానురంజకంగా మలచిన ప్రజ్ఞాశాలి అవటం వలన పండితలోకం వీరిని హాస్య బ్రహ్మ అని కొనియాడారు. ఉత్తమమైన హాస్య రచనలతో ఎందరినో మనసారా నవ్వించిన వీరు 1958, ఆగష్టు 28న పరమపదించారు.


భమిడిపాటి కామేశ్వర రావు గారి అనేక హాస్య రచనల నుండి కొన్ని హాస్య పూరకమై, ఈనాటికి సందర్భ శుద్ధిగా ఉండేవి కొన్ని ఇక్కడ ముచ్చటించుకుందాము:





  • పాలక సంఘాల్లో ఎన్నికల మజా అన్న వ్యాసం నుండి
    ఇప్పటి పరిపాలనతో సంబంధించిన ఎన్నికల పోటీల్లో నెగ్గటానికి ఎవరికేనా, నంగోరు ధనం, నంగోరు నక్కజిత్తులూ ఉండాలి. లేక ఒకవేళ హీనుడైనా పరిపూర్ణమైన నక్కజిత్తు లుండి, ఇంకోడిచేత ధనం పెట్టుబడి పెట్టంచినా చాలు.
    ఒకడు పాడు పన్లు చేస్తూవుంటే, మనంకూడా, నెగ్గాలంటే, అంతకంటే పాడుపన్లు చెయ్యవలసి వచ్చేది ఎన్నికల్లోనే.
    ఎన్నికల నిఘంటువులో అసత్యం అధర్మం, అన్యాయం, ద్రోహం క్రౌర్యం, దారుణం లాంటి మాటలుండవు.
    పదవి లాక్కోవాలని ఒకరూ, ఉంచుగోవాలని ఒకరూ రాక్షస చాణక్యుల్లాగ ఎత్తుపై ఎత్తులు వేస్తూనే ఉంటారు. పాలకసంఘం పాలించవలసిన మేరలో ఉన్న జనంసంగతి ఎవర్కీ అక్కర్లేదు. జనం పంపినమీదట పాలకసంఘంలోకి వెళ్ళి, వెంటనే ఆ జనాన్ని మరచిపోడమే ఎన్నికల్లో మజా; ఒకవేళ జ్ఞాపకం ఉంచుగున్నా, ఆ జనుల్లో మొదటి జనుడు తనేగదా అనుకోడం మరీ మజా!!




  • వన్స్మోర్ వ్యాసంలో - మామూలు ధోరణి మారి, వ్యాపారం ముదిరినప్పుడు, చాలా మంది తెలుగువాళ్ళు లోగడ మాట్లాడుతూన్న తెలుగు మానేసి ఎక్కువ గంభీరంగా ఉండడానికి, యధాశక్తి ఇంగ్లీషులో కోపిస్తారు.




  • నాటకం-టాకీ వ్యాసంలో-(అంతకుముందు సినిమాలకు శబ్దం ఉండేదికాదు. శబ్ద చలన చిత్రాలు ఒచ్చిన కొత్తల్లో సినిమాలను "టాకీ" అనేవారు)టాకీలలోని కథ వగైరా గురించి-
    .....సరి మరి కథ. అది పురాణం అవాలి. లేకపోతే అంధ(అచ్చు తప్పేమో ఆంధ్ర బదులు అంధ అని ఉన్నదనుకోవటానికి వీలులేదు. రచయిత ఉద్దేశ్యం "అంధ" అంటే "గుడ్డి" అని) జనానికి గణ్యత ఉండదు. అంధ జనం నూటికి తొంభై. వాళ్ళంతా హాజరైనప్పుడుగాని టాకీ వర్తకం కిట్టదు. వాళ్ళకి భక్తి కుదిరేందుకు దేవుళ్ళూ, భయం వేసేందుకు అడివి మృగాలూ, హుషార్ కలిగేందుకు సుందరులూ వాళ్ళ స్నానాలూ, ఆటలకి గంభీరమైన శీర్షికలూ-సర్వంగిలాబా చెయ్యడంకోసం కైంయిమంటూ మంచి పీకవాళ్ళు పాటలూ! దాంతోటి జన బాహుళ్యం మొదట తమాషాకోసమున్నూ తరువాత తోచకానూ ఎగపడడం. 'వార ప్రతిష్ఠతో' డబ్బురావడం, డబ్బొచ్చిన టాకీ గనక గొప్పదని చెప్పడం! అందువల్ల అందులో యంత్రిపబడ్డ నటులు అసమానంగా అభినయించారనిన్నీ, వాళ్ళ కీర్తి మిన్ను ముట్టడం రూఢీ గనకనే వాళ్ళని 'తార' లు అంటున్నారనిన్నీ చెప్పుగోడం.
    ...బొమ్మకి కన్ను చాలు (టాకీలో మాటలకి గణ్యత తక్కువ గనక) అందుకని, టాకీ పామరుల్ని కూడా అకర్షిస్తుంది. కాదు పామరుల్నే ఆకర్షిస్తుంది....

  • తెలుగు నటుడు వ్యాసం నుండి-
    నటుడికి సౌష్టవమూ, బలమూగల విగ్రహమూ, అడే కాళ్ళూ, తిరిగే చేతులూ, కోటేసినట్టుండే ముక్కూ, చారెడేసి జిలజిలలాడే కళ్ళూ, హృదయభావాన్ని స్వీకరించి స్థిరం చేసుకోగల ముఖమూ, కంచుగీసినట్టూ మధురంగానూ ఉండగల గాత్రమూ, ఉచితమైన సంగీత సామగ్రీ, ఆరు వేషాలుగల తెలుగు ఉచ్చారణా, ఆంధ్ర భాషా, ఇతర సన్నిహిత భాషల్లో ప్రవేశమూ, వాటిల్లో ఉచ్చరణా పాటవమూ, అమోఘమైన ధారణా, ఉచితవేషం ధరించుకోగల తెలివీ,బోధనా శక్తీ, ఆకర్షణా, సౌశీల్యమూ, నాటకకర్త గిలికిన రచనకి మెరుగు పెట్టగల ప్రతిభా-ఇల్లాగా వీలైనన్ని శక్తులూ, సామర్ధ్యాలూ ఉంటేగాని ఎంతమాత్రము వీల్లేదని కోప్పడి శాసించారు.
    పరిక్షలు వ్యాసం నుండి-
    పరీక్షలకోసం, మార్కుల కోసం మాత్రమే బాధపడేవాడికి, విద్య అంటదు. విద్యకోసం పాటుపడేవాడికి పరీక్షవల్ల బాధే ఉండదు.
    ...జీవితం ఒక పెద్ద నిత్య పరీక్ష. జీవితపరీక్షకి ఎప్పుడో తయారు అవుతానులే అనడంకాక, అప్పటికప్పుడు తయారుగా ఉండడం మానవుడి విధి.
    మన తెలుగు వ్యాసం నుండి-
    ...నూటికి నూరుమంది పైచిలుకు మాట్టాడే తెలుగు కలగాపులగమే. ఈ పులగంలో సస్కృతం, పార్శీ, ఇంగ్లీషుమాత్రం జోరుగా పడ్డాయి. తెలుగు యొక్క మెత్తదనం వల్లనే ఇన్నిన్ని భాషల పదాలు బాణాల్లాగ హృదయం నాటేలాగ తెలుగులో గుచ్చుకుని ఉన్నాయి. తెలుగు శరీరంలో వాటిని నిల్చి ఉండనిస్తే అవి సెలలువేసి ప్రాణం తీసేస్తాయని కొందరూ, లేక వాటిని పైకిలాగిపారేస్తే వెంటనే ప్రాణపోకట అని కొందరూ!




  • ఎప్పుడూ ఇంతే నాటికలో ఒక పాత్ర
    ....చంపేస్తానని ఎంత పని చేయిస్తునావురా నీ తుపాకీ ఇదైపొనూ! నిన్నైనా మోస్తుం లెక్కలేకుండా!!మావాడైపోయాడు, అదీ మా విచారం, అదీ మా శిరఛ్ఛేదం. మావాణ్ణితప్ప విడిచి మరి ఇతరుణ్ణి ఎవణ్ణయినాసరే తెగ మోద్దుం చచ్చేవరకూను!....
    వాడు కేవలం నాశనం అయుపోవాలి. నాకది చాలు! నే బాగు పడక్కర్లేదు. దుర్యోధునుడికి పై అంతస్థు నాది. వాడు చేతగాని వాడు. ధర్మరాజుకి ఉందనీ, తనకి లేదనీ తనకి కూడా కలగాలనీ ఏడిచాడు. నేను, నాకక్కర్లేదు, ఇంకోడికి పోతే చాలనీ.....



  • లు నాటికలో-ఒక పాత్ర
    ..."ఈ వ్యాపారంలో ఎల్లానైనా నేనే ఓ గొప్పవాణ్ణికావాలి, కానీ ఖర్చుకాకుండా. అధమం వీణ్ణి కానియ్యకూడదు....
    ...పంపకాలు కుదరక పారపోసుగోడం మనకి కొత్తగాదు!...
    అద్దెకొంపలు వ్యాసం నుండి
    ....అద్దె యజమానురాలుగారు ఒక్కత్తే ఒక యెత్తూ! ఒక్కొక్క యజమానురాలి చర్య అద్భుతం! అసలు ఆవిడ గృహిణి, అందులో అద్దెకొంపల రాణీ. అందులో కాస్త స్వాతిశయంకూడా ఉంటే ఆవిడ అద్దెకొచ్చిన వాళ్ళని ఎలాచూస్తుందని తమ ఊహ? తప్పు చేసిన కోడల్ని అత్తగారు ఇంతగా రొకాయించదు! నీతితప్పిన పెళ్ళాన్ని తాళి గట్టినముగుడు ఇంతగా దండించడు! నేరంచేసిన పాపిని దండనాధికారి ఇంతగా దుయ్యబట్టడు! చవట పరిపాలన చేసే మండలేశ్వరుణ్ణి సామాజ్య మంత్రి ఇంతగా ఆజ్ఞ పెట్టడు! అద్దెల వాళ్ళ ఆచారం గర్వం, తన ఆచారం మడి. తన వస్తువు ఇంకోరి ఇంట్లో కనపడితే, వారిది దొంగతనం; ఇంకోరి వస్తువు తనింటోఉంటే "ఎక్కడికి పోతుందే! పొరపాటో" అవడం! అద్దెలవాటాల తూముల్లోంచి ప్రవహించేది అపవిత్రమైన కంపుముండానీరు, తన వాటా తూముల్లోంచి వెళ్ళేది పావనమైన అభిషేకజలం(ఇదంతా కలిపి ఒకటే తోము అయినా సరే ఆవిడ వాదన అంతే). దొడ్లో తక్కినవాళ్ళ వాటాల్లో కాసేవన్నీ కేవలం తనవే. నలుగురూ వచ్చే నూతిదగ్గర తమరి తాలూకు పిల్ల గుడ్డలు మాత్రమే జాడించవచ్చు! అద్దెలవాళ్ళుగనక ఆపనే అక్కడచేస్తే, "ఎవళ్ళకొచ్చింది ఈ వినాశకాలం! అన్నం తింటారా, గడ్డి తింటారా!" అంటో తను ఆపని చేస్తూనే, ధరీ అంచూ లేకుండా లెక్చరు పూర్వకంగా తిట్టడం........"(ఇలా ఇంకా రెండు పుటలు ఉన్నది, అప్పటి అద్దె ఇళ్ళల్లో ఉండేవారు ఎదుర్కోవలసిన బాధల చిట్టా)

కామేశ్వరరావుగారి గురించి నేను వ్రాసిన మొత్తం చదివినందుకు అభినందనతో ఒక చిన్న చిరు కానుక. వారు రచించిన మూడు పుస్తకాలు ఈ కింద ఇచ్చిన లంకె ద్వరా మీ కంప్యూటర్ లోకి దింపుకోవచ్చు. ఈ పుస్తకాలను జాగ్రత్తగా స్కాన్ చేసి వెబ్‌లో ఉంచిన ఆర్ఖైవ్ డాట్ ఆర్గ్ (http://www.archive.org/) వారికి నా కృతజ్ఞతలు. కాకపోతే వారు కామేశ్వరరావుగారి ఇంటిపేరు తప్పుగా ప్రచురించారు (భిమిడిపటి అని, భమిడిపాటికి బదులుగ) అందుకని, మీరు వెతకాలనుకున్నాప్పుడు సెర్చ్ లో bhimidipati అని టైపు చెయ్యాలి.

http://rapidshare.com/files/257422471/BHAMIDIPATI_BOOKS.zip
దయచేసి వ్యాఖ్యలు చూడండి. అక్కడ శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు మరిన్ని లంకెలు ఇచ్చారు. ఆ లింకులు అనుసరిం మరిన్ని భమిడిపాటి వారి పుస్తకాలను మీ కంప్యుటర్లోకి దింపుకోవచ్చును.

2 కామెంట్‌లు:

  1. Again, no comments! Hmm.

    Archive.org లో మూడు కంటే ఎక్కువే పుస్తకాలున్నాయి.

    http://www.archive.org/details/lokobhinnarichi021012mbp
    http://www.archive.org/details/MayalaMaaLokam
    http://www.archive.org/details/manatelugu021183mbp
    http://www.archive.org/details/mejuvani021410mbp
    http://www.archive.org/details/matavarasa021316mbp
    http://www.archive.org/details/kalakshapam2020570mbp

    There should be more. Also, a few more at ulib.org

    మీకు తెలిసే వుంటుంది. కామేశ్వరరావుగారబ్బాయి రాధాకృష్ణ చివరినిమిషంలో విశాలాంధ్ర వాళ్ళ్కు హక్కులిచ్చారు. ఇప్పుడు ఆయన లేరు కానీ, విశాలాంధ్ర వాళ్ళు కొన్నింటిని ప్రచురిస్తున్నారు.

    -- శ్రీనివాస్

    రిప్లయితొలగించండి
  2. పోయిన వారమే 'మన తెలుగూ చదవడం మొదలుపెట్టాను... స్చ్రిబ్డ్ లో కనబడితే! అయితె, మరిన్ని ఉన్నాయన్న మాట. ధన్యవాదాలు - మీకూ, శ్రీనివాస్ గారికీ!

    మా ఇంట్లో భమిడిపాటి వారి పాత పుస్తకాలు - దంతవేదాంతం, అంతా ఇంతే, మేజువాణీ - ఇలాంటివి ఉన్నాయి కానీ, ఆ పుస్తకాలు అవసాన దశలో ఉన్నందువల్ల - నేను చదివేటప్పుడు వాటికేమన్నా అవుతుందేమో అన్న భయం కొద్దీ ఇప్పటి వరకూ ముట్టలేదు. ఇకపై ఆన్లైన్ లో చదువుతా :-)

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.