30, ఆగస్టు 2009, ఆదివారం

ఓ సారి ఏమయ్యిందంటే

నాకున్న హాబీలలో ముఖ్యమైనది, హామ్ రేడియో . సరే ఒక రోజున (2008లొ)సి క్యు 100 అనేటటువంటి ఇంటెర్నెట్ హాం రేడియోలో రాత్రి బాగా పొద్దుపోయినాక పిలవటం మొదలుపెట్టాను, ఎవరన్న దొరుకుతారేమో మాట్లాడదామని. కాసేపటికి ఇంగ్లాండు నుంచి ఒక పెద్దాయన (88 ఏళ్ళవారు) నా పిలుపు అందుకుని మాట్లాడటానికి వచ్చారు. ముందస్తు నమస్కారాలు అవి అయ్యాక, పిచ్చాపాటిగా సరదాగా అనేక విషయాల మీద చర్చిస్తున్నాము. విషయం ఇకనామిక్స్ మీదకి మళ్ళింది. నేను ఇకనామిక్స్ చదువుకున్నాప్పటికి (నా ప్రాథమిక డిగ్రీలోను, బాంకింగ్ పి జి డిప్లొమాలోనూ), నాకు ఆ సబ్జెక్ట్ మీద అంతగా ఇష్టంలేదు-సరిగ్గా అర్థంకాక అయ్యింటుంది!! ఎకనామిక్సులో నాకు అన్నిటికంటే చిరాకు పుట్టించే విషయం ఏమంటే, ఏదన్నా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేప్పుడు చేసుకునే కొన్ని ఊహలు (Presumptions). అందులో ఒకటి మిగిలిన విషయాలన్ని మారకుండా ఉన్నప్పుడు అనుకోవటం! సరే ఈ విషయం నాకు ఎందుకు నచ్చదో, మిగిలిన విషయాలు మారకుండా ఎలా ఉంటాయి (ఇదేమన్నా ఫిజిక్సా, బయోలజీనా మిగిలిన విషయాలు మారకుండా ఉంచి ప్రయోగాలు చెయ్యటానికి), ఇది మానవ ప్రవర్తనమీద ఆధారబడ్డ విషయం కదా అని నా వాదనను ఆయనకు వినిపించాను (చిత్రం భళారే విచిత్రంలో, బ్రహ్మానందం మారువేషంవేసుకుని ఒక్క లైను చెప్పి నా నటన ఎలా ఉంది అని చూపుల్తో అడిగే భంగిమ పెట్టి). పాపం ఆ ఇంగ్లీషు పెద్దాయన మొదట్లో కొంత నెమ్మదించినా, కాసేపటికి తన వాదన చక్కగా చెప్పటం మొదలు పెట్టారు. ఇలా కొంతసేపు జరిగినాక, నాకు అనుమానం వచ్చింది, ఏమా ఇంత బాగా తర్కిస్తున్నారు ఈయన, ఏమయ్యి ఉంటారు అని. ఆలశ్యమెందుకు అని ఆడిగేశాను. ఆయన కొంతసేపు చెప్పలేదు, కాని చివరకు తాను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆచార్యుడిగా పని చేశానని. నాకు మతి పోయింది. మనమేదో మిడి మిడి జ్ఞానంతో, బ్రతుకు తెరువు కోసమే చదువుకున్న చదువుతో (జ్ఞాన సముపార్జన కోసం కాదుకదా మన చదువులు!!) ఆ సబ్జెక్టుమీద తన జీవిత కాలం పరిశోధించి ప్రపంచ ప్రసిధ్ధిగాంచిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్సులో ఆచార్య పదవిలో ఉన్నాయనతోనా ఈ వాదనంతా అని నాకు బిడియం కలిగింది (Embarassed కి సమానమైన తెలుగు పదం అనుకుంటున్నాను). వెంటనే ఆయనికి హాం రేడియోలో కుదిరినంతవరకు సాష్టాంగ ప్రణామం చేసాను. ఆయన చల్లాగా నేను చెప్పినది అంతా విని, "మీ వాదన మీది, నా వాదన నాది ఇలా వాదనలతోనే కదా సబ్జెక్టు మరింత లోతుగా తయారయ్యేది" అని తాను తన వాదనకు చెప్పవలసిన విషయాలు చెప్పుకొచ్చారు. ఇలా చాలాసేపు మాట్లాడుకున్నక శలవు తీసుకున్నాను. మళ్ళీ ఆయనతో మాట్లాడటం తటస్థించినా, ఇకనామిక్స్ విషయం తీసుకొచ్చే ధైర్యం చెయ్యలేదు . ఒక్కోసారి అనిపిస్తుంది అదంతా కలేమో అని, కాని మాట్టాడినంతసేపు, నా కంప్యూటర్లో అడాసిటీ సాప్టువేర్ సంభాషణ మొత్తం రికార్డు చేసింది. అప్పుడప్పుడూ ఆ రికార్డింగు విని ఆనందిస్తుంటాను, మన్ని ఓడించటానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆచార్యుడంతడి వారు రావలిసి వచ్చింది కదా అని ఫోజు (నాకునేనే) కొట్టుకుంటూ.
ఎకనామిక్సులో జ్ఞాని అయిన ఆయన దగ్గర ఎంత ఒబ్బిడి!(హుమిలిటి), ఆవతలి వ్యక్తి సామాన్య జ్ఞానం మాత్రమే కలవాడయినప్పటికి, అతని వాదనలో కొత్త విషయం ఏమన్న ఉందేమో చూద్దాం అన్న ఉత్సాహమే తప్ప, తన జ్ఞానం అంతా ప్రదర్శించి నోరు మూయించే ప్రయత్నం ఎంతమాత్రం చెయ్యలేదు. మరదే అన్నీ ఉన్న ఆకు అంటే!

ఇంగ్లీషులో ఫుట్ ఇన్ ది మౌత్(Foot in the Mouth) అని ఒక వాడుక ఉన్నది. ఆ వాడుకకి ఇదొక మంచి ఉదాహరణ!

1 కామెంట్‌:

  1. శివ గారూ! చాలా మంచి అనుభవాన్ని పంచుకున్నారు. మీరు రాసిన పద్ధతి కూడా బావుంది. మీరు ‘అప్పుడప్పుడూ విని ఆనందించే ఆ రికార్డింగ్’ను మీ బ్లాగులో పెట్టేసి, మాకూ వినిపించొచ్చు కదా! ఏమంటారు?

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.