31, ఆగస్టు 2009, సోమవారం

క్విక్ గన్ మురుగన్ - సినిమాట!!


రాజేంద్ర ప్రసాదు ఉన్నాడు కదా అని సినిమా చూడ్డానికి సాహసించాను. కాని, సినిమాలో చమక్ లేదు. రాజేంద్రప్రసాద్ లొ ఉండే హుషారు నటనలో ఉండే సహజత్వం ఈ సినిమాలో ఎంతమాత్రం లేవు. సినిమా మొదటినుంచి చివరివరకు, రాజేంద్ర ప్రసాద్ ఏదో తెలియని రోగంతో బాధపడుతున్నవాడిలా కనిపించాడు. ఇటువంటి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఎందుకు నటించాడో(!!) ఒక మిస్టరీ. డబ్బుకోసం మాత్రమే అయ్యి ఉంటుంది, పేరు వచ్చే అవకాశం లేనేలేదు.

ఈ సినిమాకి కథ ఉన్నదా? అని పేద్ద అనుమానం వచ్చింది. ఇంగ్లీషు సినిమాలని పారడీ చేస్తూ సినిమా తియ్యాలని ప్రయత్నించింట్టు సూచన మాత్రంగా తెలుసుకోగలిగాను . ఆంగ్ల కౌబాయ్ సినిమాలని ఎద్దేవా చేస్తూ సినిమా తీస్తే మన సోదరులకు అర్థం అవ్వటం కష్టమన్న దురభిప్రాయానికి వచ్చినవాళ్ళై, ఒక అరవ కథ, కొంత గూండాగిరి గోల, కొంత ఫాంటసీ కలిపి ముందు దోశ చేద్దాంలే అని పిండి తయారుచేసి, తరువాత సాంబారుమీదకి మనసుపోయి, ఆ పిండంతా సాంబారులో పోసి మరగ కాచి, మళ్ళీ మనసు మార్చుకుని, ఆ వచ్చిన పదార్థంతో పరోటా చేయబోయినట్టున్నది.

ఈ సినిమాలో నాకు నచ్చిన ఒకేఒక్క డైలాగు "మీ కేబుల్ కనెక్షన్ కట్ చేసేస్తా" అని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ఒక పెద్దావిడని రౌడీ ఎంబిఎ బెదిరించటం

ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాదు ఉన్నాడని తెలియకపోతే అనేకమంది ఈ సినిమా చూసే సాహసం చేసేవారు కాదు. సినిమా భవితవ్యం మీద విడుదలకి ఒకటి రెండు రోజులముందు అనుమానం పెనుభూతమై, ఒక వివాదాన్ని సృష్టించినట్టు స్పష్టమవుతున్నది. ఈ సినిమా చూసి ఎవరన్నా అవమానపడి గొడవచెయ్యాలంటే, ఎంబిఎ చదివినవాళ్ళు చెయ్యాలి, రౌడీ ఎంబిఎ పాత్ర సృష్టించినందుకు.

ఈ సినిమా తీసిన వాళ్ళు చేసిన మరొక ఘోరం ఏమంటే, టిఫిన్ బాక్సు బాంబులతో ముంబాయిని హడిలిపొయ్యేట్టు చెయ్యచ్చు అన్న ఒక విషపు అలోచనను విపులంగా చూపించటం. సెన్సారువాళ్ళు ఇటువంటి చెత్తను కత్తిరించి పారెయ్యాల్సింది.

మొత్తం మీద ఒక చౌకరకం, థర్డ్ రేటు నేలబారు సినిమాలో నటించాడన్న అపకీర్తి, రాజేద్రప్రసాదు మోసుకుంటూ తిరిగాల్సిన గతి పట్టింది. అదీ నా విచారం. పైగా, చాలా గాప్ తరువాత వచ్చిన సినిమా అతనిది. పూర్తిగా రాంగ్ చాయిస్.

1 వ్యాఖ్య:

  1. పాపం డబ్బుల కోసం అయ్యుంటుంది. ప్చ్ !!! ఎట్టా ఉండే రాజేంద్ర ప్రసాద్ ఎట్టా అయిపోయాడు.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.