23, అక్టోబర్ 2009, శుక్రవారం

అమరావతి కథల సమీక్ష 6

అమరావతి కథలకు ఉపోద్ఘాతమా!! అని అనిపించి, ఈరోజున మరో ఐదు కథల గురించి ఇక్కడ ఉంచటం జరిగింది. కథలను చక్కగా వ్రాయగల శక్తి ఉన్నా రచయిత సత్యంగారు
26.భోజన చక్రవర్తి
ముఖ్య పాత్ర-అప్పంభొట్లు
బాపు బొమ్మ-అప్పంభొట్లు పీటమీద దిట్టంగా కూచుని, తన ముందు విస్తట్లోకి వడ్డించబడుతున్న భక్ష్య భోజనాలను ఆరగిస్తున్నట్టు వేశారు. సామాన్యంగా ఒక బొమ్మలోని వస్తువులు గాని, మనుషులు గాని ఒకే నిష్పత్తిలో వేయటం జరుగుతూ ఉంటుంది. కాని ఈ బొమ్మలో, అప్పంభొట్లును చాలా పెద్దగాను, బొమ్మలోని మిగిలినవి-వడ్డిస్తున్న మహిళ, భోజ్య పదార్ధాలు-అతని లో సగంకూడ లేనట్టు వేసి, అప్పంభొట్లు తిండి పుష్టి ముందు ఇతరాలన్నీ కూడ తీసికట్టు అని సూచించారు.
కథ-తిండి పుష్టి గల అప్పంభొట్లు అనే వ్యక్తి కథ వినోదాత్మకంగా చెప్పబడింది. అతని "తినగల శక్తి" కి ఉదాహరణగా మూడు సంఘటనలు వర్ణించబడినవి. ఆ వర్ణనలో చక్కటి హాస్యం తొణికిసలాడుతుంది. అప్పంభొట్లు తిండిపోతుకాదని అతని తినే పద్దతే అంతని తెలుస్తుంది. అతను తిని ఊర్కోడు, దానికి తగినంత శ్రమ కూడ పడి తిన్నదానిని హరాయించుకోగల శక్తి చూపిస్తాడు. గ్రామంలో ఇతరులకి అంతో ఇంతో సహాయపడుతూ తన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. తన తదనంతరం, తన తద్దినానికి తిండి పుష్టి గల భోక్తలను పెట్టమని చివరికోరిక కోరతాడు తన కొడుకుతో. "తండ్రిలాంటి తిండి పుష్టి ఉన్నవాడు కన్పించలేదు. ఉన్నా, అలా పెట్టగల తాహతూ కుదరలేదు. అతని మనవలకీ, మునిమనవలకీ అప్పంభొట్లు ఆహారలీలలు చెప్పుకోవటమే మిగిలింది" అని చెప్తూ ముగించి, తరాలు మారేటప్పటికి వచ్చి పడిన జీవనవిధాన మార్పు సూచించారు రచయిత.

27.నావెళ్ళిపోయింది
ముఖ్య పాత్రలు-పడవ వాడు రంగయ్య, వ్యాపారి సుబ్బయ్య
బాపు బొమ్మ-సుబ్బయ్య నోరు పెద్ద సుడిగుండంలాగానూ, అందులో రంగయ్య అతని పడవ లోపలకు లాగబడుతున్నట్లు వెయ్యబడింది.
కథ-అమరావతి నుండి ఆవలి గట్టుకి కృష్ణా నదిమీద పడవ నడుపుకునే రంగయ్య జీవనం ఈ కధాంశం. అతను, అమరావతి గ్రామ ప్రజల మధ్య మనిషిగా వారి నవ్వులూ, కన్నీళ్ళూ పంచుకుంటూ వారి జీవితాలలో కలసిపోయి బతకటం చక్కగా సంఘటనాపూర్వకంగ చెప్పబడింది. వ్యాపారి సుబ్బయ్యకు తన తండ్రి చేసిన అప్పు ఏరోజుకారోజు సంపాదనలోనుండి జమవేసి మిగిలిన దాంతో తన బతుకు లాక్కొస్తుంటాడు రంగయ్య. వ్యాపారి సుబ్బయ్య దౌర్జనంగా రంగయ్య పడవను తన దొంగవ్యాపారానికి వాడుకోవటమే కాక, తన దొంగ సరుకు బయటబడినప్పుడు, తనను రంగయ్యే బయటపెట్టి ఉంటాడన్న భ్రమలో అతని మీద పగ బట్టి, అతని పడవను అప్పుకింద జమచేసి బలవంతంగా తీసుకునె వెళ్ళిపోతాడు. "ఇంతకాలం అందర్నీ ఆవతలొడ్డుకు చేర్చాను. బగమంతుడు నన్నీ వొడ్డునే వొదిలేశాడా!" అని రంగయ్య కుమిలి పోయ్యాడు అని చెప్తూ కథ ముగించారు రచయిత.

28.నీరు నిలవదు
ప్రధాన పాత్రలు-ఊరిలోని అమ్మలక్కలు
బాపు బొమ్మ-కృష్ణానదిలో నిలబడి గుంపులు గుంపులుగా, నీళ్ళు తెచ్చుకుంటూ, బట్టలుతుక్కుంటూ, స్నానంచేస్తూ కబుర్లాడుకుంటున్న మహిళలు. నదీ ప్రవాహం, వారు నుంచున్నంతమేరా మకిలిగాను వారిని దాటిన తరువాత శుభ్రంగాను ఉన్నట్టుగాను వేసి, కథలోని రచయిత చెప్పదలచిన విషయ్యాన్ని చూపించారు
కథ-ఉదయాన గ్రామ మహిళలు రకరకాల పనులకోసం కృష్ణానదిని చేరి, అక్కడ వారు ఆడుకునే మాటలే ఈ కథ. ఆ మాటల్లోంచి రచయిత చేయించిన వారి అంతరంగ దర్శనం కథ ఉద్దేశ్యం. ఒకళ్ళ మాట మరొకరు చొరబడకుండా,ఒకరిమాటకు మరొకరు అడ్డొస్తూ, ఒకరు చెప్పిన విషయాన్ని మరొకరు ఖండిస్తూ, అక్కడలేనివారి గురంచి చెప్పుకోవటం, కొంత కావాలని, మరికొంత సహజంగా ఏదైనా వార్త ఒకరినుంచి మరొకరి వచ్చేటప్పటికి ఎలా మారి వికృతరూపం చెందుతుందో సోదాహరణ పూర్వకంగా చెప్పబడింది. ఎవరెన్ని కబుర్లు చెప్పుకున్నా అవేమీ కాలగమనంలో నిలిచేవి కావని నదీ ప్రవాహ గమనంలో కలసి పోతాయని కాని వాటి రుచే మిగులుతుందని తేల్చి చెప్పి కథ ముగిస్తారు రచయిత.

29.ఎంగిలా?
ముఖ్య పాత్రలు-రామశాస్త్రి, శ్రీదేవమ్మ
బాపు బొమ్మ-పరమేశ్వరుని అర్ధనారీశ్వర రూపంలో వేసి, ఆరూపంలోని శివుని రామశాస్త్రి, పార్వతీ దేవిని శ్రీదేవమ్మ మొక్కుతున్నట్ట్లు వేసి కథలో వారు తమ అమాయకత్వంలో పార్వతీ పరమేశ్వరులను వేరువేరుగా భావించి విడివిడిగా పూజించటం సూచించారు. అదేవిధంగా, భార్యా భర్తలు పార్వతీ పరమేశ్వరుల లాగ జీవించాలని మరొక చక్కటి భావనను కూడ స్పురింపచేశారు.
కథ-సాంసారిక విషయాలమీద ఎంత మాత్రం దృష్టి సారించక దైవ ప్రార్థనే పరమావధిగ ఒకరు శివుని, మరొకరు పార్వతీ దేవిని పూజిస్తున్న నవ దంపతుల కథ ఇది. ఈ కథలో వారిద్దరూ సాంసారిక జీవనం వైపుకు మళ్ళిన విధానం ఐదు మన్మధ బాణాలుగ వర్ణించటం (ముళ్ళపూడి వెంకటరమణ కనిపెట్టినవి ఈ బాణాలు)ఒక చక్కటిప్రక్రియ.శివపార్వతులే ఏక శరీరంగా ఉండి భార్యా భర్తలు ఉండవలసిన విధానం సూచిస్తున్నప్పుడు, భర్త ముద్ద నోటికి అందిస్తున్నప్పుడు, "ఎంగిలి కాదో" శ్రీదేవమ్మ అని అనటం "ప్రసాదమనుకోరాదో అని రామశాస్త్రి తానప్పుడప్పుడే అర్ధం చేసుకుంటున్న విషయాన్ని చమత్కరించి తెలియ చెప్పటం కథకు పెట్టిన పేరు "ఎంగిలా?" అన్న ప్రశ్నకు సమాధానంగా ఉన్నది.

30.బాకీ సంగతి
ముఖ్య పాత్రలు- రంగయ్య, పంతులు
బాపు బొమ్మ- రంగయ్యనే కాడెద్దుగా కట్టి దున్నిస్తున్న పంతులు. చిన్న రైతులను ఏ విధంగా పీడించి పిప్పి చేస్తున్నరో, కధా విషయాన్ని చక్కగా చూపించారు బాపు.
కథ రంగయ్య తన తండ్రి చేసిన అప్పును ప్రతి సంవత్సరం చెల్లు వెస్తూనే ఉంటాడు. అయినా సరే బాకీ మొత్తం కట్టలేదని, పంతులు అతని ఎద్దుల్ని జప్తు చేసి పట్టుకొని పోతాడు. తన ఎద్దులు లేక పొవటంతో వ్యవసాయం ఎలా కొనసాగించలో అన్న ఆరాటంతో పంతులు మీద మండిపడుతూ అతని ఇంటి ముందు నుంచుని కేక వేస్తాడు రంగయ్య. కథలో సంభాషణలు చాలా తక్కువ. రంగయ్య ఆక్రోశంతో, కోపావేశంలో తనలో తను అనుకునే మాటలు, అపరాధభావంతో ఉన్న పంతులు మనసులోని భావనలతో రచయిత కథ నడిపారు.కథ చివరలో, ఎద్దుల్ని వదిలి పెడుతూ పంతులు అన్న విషపు మాటలకు ("...... మీ నాన్న చేసిన బాకీ కదా!పూర్తి చేస్తే చచ్చిన ఆయన ఆత్మ శాంతిస్తుందని ... సరే ...ఇచ్చినంతే చాలు...ఇవ్వని వాళ్ళని పీడిస్తానా"), రంగయ్య అమాయకంగా "ఎప్పటికిమల్లే బాకీ జమేసుకోండయ్యా! మా అయ్య బాకీ తీర్చకుండా ఉంటానా?నేను పోతే నా కొడుకు చేత బాకీ తీర్చేట్టు వొట్టేయించుకుని పోతానయ్యా!" అని సమాధానమిస్తాడు. ఈ ఉదంతాన్ని హృదయాన్ని హత్తుకునేట్లు రచించి, రైతులను తర తరాలుగా పీడిస్తున్న నీచులు పరివర్తన చెందుతారేమో అని రచయిత ఆశపడినట్టు కనిపిస్తుంది.

3 వ్యాఖ్యలు:

 1. శివ గారూ !
  కథలకు బొమ్మలు చాలామంది వేస్తారు. అయితే రచయిత అన్ని పేజీలలో చెప్పిన అంశాన్ని తన గీతల్లో ఒకే బొమ్మలో చెప్పగల శక్తిమంతుడు బాపుగారు. అందుకే ఆయన ఆబాల గోపాలానికి ప్రియమైన కళాకారుడు. ఒక రకంగా కాదు అన్ని రకాలుగా ఆయన అజాత శతృవే!
  కథా సమీక్షలు అందరూ రాస్తారు. అమరావతి కథల్ని గతంలో చాలామందే సమీక్షించారు. ఆ సందర్భంలో బాపుగారి బొమ్మల్ని కూడా ప్రశంసించారు. కానీ మీరు ఆ గీతల వెనుక వున్న భావాల్ని విశ్లేషించడం అభినందనీయం. ఇదొక కొత్త వరవడి. కోనసాగించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శివ గారూ,

  ‘భోజన చక్రవర్తి’ కథలో అప్పంభొట్లు పాత్రను అజరామరం చేశారు సత్యం శంకరమంచి. ఈ కథకు బాపు గీసిన బొమ్మ ను మీరు బాగా వర్ణించారు. అసలు ఆ బొమ్మలను కూడా ఈ వర్ణన దగ్గర ఇవ్వగలిగితే నిండుగా బావుండేది.

  (కాపీ రైట్ సమస్యా? మీ పోస్టు- ఆ కథలను సదుద్దేశంతో చేసే పరిచయమే కదా, ఇబ్బంది వస్తుందంటారా?)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ధన్యవాదాలు వేణుగారూ.

  బొమ్మలు ఇవ్వకపోవటం వెలితిగానే ఉన్నది. అట్టమీద బొమ్మ వెనుక అట్టమీద ఉన్న సత్యంగారి ఫొటో fair use కింద copy right సమస్యలు రావు. కాని లోపలి బొమ్మలు అన్ని ఒక్కొటొక్కటిగా ప్రతి కథకు ఇవ్వటం మొదలుపెడితే ప్రస్తుతం కాపీ రైటు ఉన్నవారు (ఎవరి దగ్గర ఉన్నదో మరి) వారు ఎలా స్పందిస్తారో తెలియదు. లేనిపోని సమస్యలు ఎందుకు అని ఆ పని చెయ్యలేదు. ఒక పేజీజికి మించంకుండా అత్యంత నైపుణ్యంతో సత్యంగారు చక్కటి కథలను మనకు అందించారు. నా ప్రయత్నం ఈ చిన్న కథలకు అతి తక్కువ మాటలతో సమీక్ష వ్రాయటం. అలా వ్రాయటానికి ఒక format ఏర్పరుచుకున్నాను. కథ ఎంత గొప్పగా ఉన్నదో, అందులో సారాన్ని చూడంగానే తెలిసేట్టుగా బాపూ గారు బొమ్మలను గీసారు. బాపూ గారి బొమ్మల గురించి వ్రాయకపోతే సమీక్షే కాదనిపించి, బొమ్మల వెనుక ఉన్న భావాన్ని నాకు అర్ధమైనంతవరకు వ్రాయటానికి ప్రయత్నిస్తున్నాను.

  రావుగారూ,

  మీ వ్యాఖ్యకు నా ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.