17, నవంబర్ 2009, మంగళవారం

అందమైన చందమామ బంధం!


(సెప్టెంబరు 8న ఆన్ లైన్ చందమామలో ప్రచురించిన జ్ఞాపకాలివి.)

'చందమామ’ అంటే అమాయకమైన, అందమైన నా బాల్యం!


చందమామ పేజీల్లోకి చూపులు సారిస్తే... చెప్పలేనంత పరవశం. ఆ అక్షరాలు ఊహలకు రెక్కలు తొడిగేవి. అద్భుత కథల లోకాల్లోకి అలవోకగా తీసుకెళ్ళేవి. అంతులేని కుతూహలాన్ని రేకెత్తించేవి.


ఉత్కంఠ కలిగించే కథలూ, ధారావాహికలూ; కథలో పాత్రలకు ప్రాణం పోసే అద్భుతమైన రంగుల బొమ్మలూ... !


ముఖ్యంగా జానపద, పౌరాణిక ధారావాహికల్లో పేజీ సైజులో మురిపించే అపురూప చిత్రాలు నా చిన్ననాటి స్మృతులను వర్ణ రంజితం చేశాయి.


అవి ఏవో మామూలు బొమ్మలని అనిపించవెప్పుడూ. జీవం తొణికిసలాడుతూ కథల్లో భాగమౌతాయి. చాలాసార్లు కథలకే కొత్త అందాలను సంతరిస్తాయి. ఒక్కోసారైతే ఆ కథలనే మించిపోయేంతగా మురిపిస్తుంటాయి!


‘ఎప్పుడైనా అరణ్యాలను చూశావా?’ అని ఎవరైనా అడిగితే ‘లేదు!’ అని చప్పున చెప్పాలనిపించదు.

ఎందుకంటే కీకారణ్యాలూ, కారడవులూ నాకు సుపరిచితమే అనిపిస్తుంది. అందమైన ఆకులూ, పూలూ, ఫలాలతో పొడుగ్గా, విశాలంగా పెరిగిన వృక్షాలూ; ఆ చెట్లను పెనవేసుకుపోయే ఊడలూ; నేల మీద హొయలు పోయే రెల్లు పొదలూ ... సుదూరంగా కొండలూ ... ఇలా అనంతమైన ప్రకృతిలో ఒదిగిన అరణ్య సౌందర్యం చందమామ బొమ్మల్లో అద్భుతంగా సాక్షాత్కరిస్తుంది.



చందమామ సంపాదకీయం ఉండే ‘హంసల బొమ్మల’ పేజీ చూడటం ఇష్టంగా ఉండేది. అంత చిన్న వయసులో కూడా ఆ పేజీపైన ఉండే ‘చక్రపాణి’, ‘నాగిరెడ్డి’ గార్ల పేర్లు బాగా గుర్తుంచుకున్నాను.


మా స్కూలు అసెంబ్లీలో ‘విద్యార్థి వాణి’ పేరుతో ఆ రోజు దినపత్రికలో వచ్చిన వార్తలను పిల్లలతో చదివించేవారు. నేను ఐదో తరగతి చదువుతున్నపుడు ఓ రోజు (1975 సెప్టెంబరు చివర్లో).. ‘చక్రపాణి’ గారు చనిపోయారనే వార్త విన్నాను. ఎంతో దిగులేసింది. ‘ఇక చందమామ రాదా?’ అని చాలా బాధపడిపోయాను.


‘బేతాళ కథలు’ శంకర్ బొమ్మ ఎందరో అభిమానులకు మల్లే నాకు కూడా ప్రీతిపాత్రం. కథ చివర - (కల్పితం) అని ఉండేది. అది విచిత్రంగా తోచేది. అదొక్కటే కల్పితమా, మిగిలినవి కావా అనే బుల్లి తర్కాలు కొంచెం పెద్దయ్యాక వచ్చాయి. ఆ కథ ముగిసే పేజీలో ఉండే శంకర్ బొమ్మ- ‘బేతాళుడు మెలి తిరిగిన తోకతో చెట్టు మీదకు దూసుకువెళ్ళటం, ఆ వెనకే విక్రమార్కుడి భంగిమ’ గొప్పగా అన్పించేవి.


చందమామలో వచ్చిన ‘రాతి రథం’, ‘శిథిలాలయం’, ‘యక్ష పర్వతం’ ధారావాహికలు నా స్మృతి పథంలో ఉన్నాయి. ఖడ్గ వర్మ, జీవదత్తుడు అప్పటి నా హీరోలు. వాళ్ళిద్దరి ఆహార్యం వైవిధ్యంగా, ఎంత చూడముచ్చటగా ఉండేదో!



‘విచిత్ర కవలలు’ (రెండోసారి ప్రచురణ) చదవటం మాత్రం బాగా గుర్తు. వీటి రంగుల బొమ్మలు సమ్మోహితం చేశాయి. ఆ సీరియల్ మొదటి ప్రచురణకు నలుపు-తెలుపు బొమ్మలు వేసింది చిత్రా. ఆ ధారావాహిక రెండోసారి ప్రచురించినప్పుడు చిత్రా సరికొత్తగా, మరింత మెరుగ్గా రంగుల బొమ్మలు వేశారు. వీటిని ఇన్నేళ్ళయినా మర్చిపోలేదు.


తర్వాత ప్రచురించిన ‘మాయా సరోవరం’ కూడా క్రమం తప్పకుండా చదివాను.



ఎప్పుడో దశాబ్దాల క్రితం ప్రచురించిన మెగా సీరియల్స్ తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట, జ్వాలా ద్వీపం, మకర దేవత లాంటి ధారావాహికలను ఈ మధ్యనే చదివాను. వీటి సృష్టికర్త దాసరి సుబ్రహ్మణ్యం గారిని విజయవాడలో కలుసుకోవటం మర్చిపోలేని అనుభవం.


క్కని కవర్లో ముస్తాబై పోస్టులో మా స్కూలుకు వచ్చే చందమామ కోసం ప్రతి నెలా ఆత్రంగా ఎదురుచూసేవాణ్ణి. మంత్రముగ్ధం చేసే వ.పా. ముఖచిత్రం, దానిపై సన్నని తెలుపు బోర్డరుతో ఎర్రని త్రికోణాకృతి... దానిలో ఉండే 1 రూపాయి... వీటన్నిటినీ తనివి తీరా చూడటం వల్లనేమో మనసులో ముద్రించుకుపోయాయి.


సింగిల్ పేజీ కథలను ఆలస్యం చెయ్యకుండా చకచకా చదివేసేవాణ్ణి. ‘రామాయణ, మహా భారత’ గాథలను సచిత్రంగా చదవటం వల్ల నాకు ఎప్పటికీ గుర్తుండిపోయాయి. పురాణేతిహాసాలను ‘పనిగట్టుకొని చదివే’ పని లేకుండా వాటి గురించి కొంత అవగాహన పెంచింది చందమామ.



నా బాల్యంతో ముడిపడిన చందమామలనూ; నేను పుట్టకముందు ప్రచురితమై నేను గతంలో ఎన్నడూ చూడని చందమామలనూ చదవగలిగానంటే ఇంటర్నెట్టే కారణం. తొలి చందమామ సంచికను చూడగలగటం (డిజిటల్ రూపం అయితేనేం? ) ఎంత గొప్పగా అనిపించిందో!


మూడు సంవత్సరాల క్రితం కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు ‘ఈమాట’ వెబ్ మ్యాగజీన్ లో రాసిన ‘చందమామ జ్ఞాపకాలు’ వ్యాసం చదివాను. అప్పటివరకూ చందమామ గురించి నాకు తెలియని ఎన్నో విశేషాలు గ్రహించాను. చందమామకు అద్భుత ముఖచిత్రాలను అందించిన, ‘మహా భారతం’ పాత్రలకు రూపురేఖలు దిద్దిన- ఎంటీవీ ఆచార్య అనే గొప్ప చిత్రకారుడి గురించి రోహిణీప్రసాద్ గారి వ్యాసమే పరిచయం చేసింది.


తెలుగు బ్లాగ్లోకం పరిచయంతో- త్రివిక్రమ్, నాగ మురళి, బ్లాగాగ్ని (ఫణి), శివరామ ప్రసాద్... వీరందరి కృషి తెలిసింది.


సజీవమైన, చక్కని తెలుగు వాడుక భాష చందమామ ద్వారానే నాకు అందింది. బాల్యంలోనే నాలో తరగని పఠనాసక్తిని పెంచింది చందమామే!


పది సంవత్సరాల క్రితం చందమామ ప్రచురణ ఆగిపోయినప్పుడు ఆత్మీయ నేస్తం దూరమైన బాధ.. మళ్ళీ ప్రచురణ ఆరంభమైనపుడు ఎంతో సంబరం !


చందమామ అంటే అక్షరాల్లో సంపూర్ణంగా వ్యక్తం కానంత అపురూపమైన అనుబంధం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.