16, నవంబర్ 2009, సోమవారం

చందమామ జ్ఞాపకాలు

అలరించే చందమామల కలెక్షన్లో కొంత
చందమామ జ్ఞాపకాలు! జ్ఞాపకం తెచ్చుకోవాలా చందమామ గురించి. చందమామ ఎప్పుడూ నాతోనే ఉన్నది. అందులో కథలు ముఖ్యంగా బొమ్మలు. బొమ్మలు లేని చందమామను ఊహించుకోండి!! ఏంత దిగులేస్తుందో .

1964-65 ప్రాంతాల్లో మా మామయ్యగారింటికి వెళ్ళినప్పుడు, వాళ్ళింట్లో మొట్టమొదటిసారి చందమామ దర్శనం. ఇప్పటికి గుర్తు అది అట్టలు లేని పాత చందమామ. ఆందులో రాకాసి లోయ ధారావాహిక ఉన్నది. రోజంతా ఆ పుస్తకం పట్టుకుని వదల్లేదు. బొమ్మల్ను తరచి తరచి చూస్తూ, ఇంతకుముందు చూసినప్పుడు కనిపించని కొత్త విషయాలు కనిపెడుతూ, కథలను కొద్ది కొద్దిగా చదివాను. ఆ తరువాత అప్పుడప్పుడు ఒకటి రెండు చందమామలు చదివిన గుర్తు.

1966లో, మా నాన్నగారు, నా పుట్టినరోజు నాడు, చందమామ పట్టుకుని వచ్చి నాకు బహుమతిగా ఇచ్చారు(పైన ఉన్న బొమ్మ ఆ చందమామదే) అది మొదలు, మా ఇంట్లో చందమామ ఎప్పుడూ ఉంటూనే ఉన్నది. అప్పట్లో చందమామ 75 పైసలు ఉండేది. ప్రతి నెల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం, చందమామ వచ్చే తేదీల ప్రకారం స్కూలు నుంచి వచ్చేప్పుడు చెవిటి దుర్గయ్య షాపు మీదగా రావటం. అనుకున్న సమయానికి రాకపోతే ఎప్పుడు వస్తుందని, దుర్గయ్యను పీడించటం! చందమామ వచ్చినట్టుగా కనపడగానే, ఉరుకులు పరుగుల మీద ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకుని వచ్చి, కొనుక్కుని, బొమ్మలు చూసుకుంటూ తిరిగి వెళ్ళటం, అదొక మరవలేని ఆనందకరమైన అనుభవం.

నిజానికి, అప్పట్లో ఇంకా వ్రాయటం, చదవటం నేర్చుకునే రోజులలో,చక్కటి భాషలో ఉన్న చందమామ కథలను చదవటం, నాకు ఎంతగానో ఉపకరించింది. తెలుగు తప్పులు లేకుండా వ్రాయటం అబ్బింది. అలాగే మంచి, మంచి వాడుక పదాలను కూడగట్టుకుని కొంతలో కొంత భాష మీద పట్టు సంపాయించటానికి చందమామ దోహదపడిందనే చెప్పలి. ఇదంతా కూడ మనమేదో నేర్చుకుంటున్నామన్న భావనతో కాదు, అలా అలవోకగా, చందమామ కథలు చదువుతుండగా నాకు జరిగిన ఉపకారం. స్కూలులో పిల్లలలో చాలా మంది గ్రంథాలయానికి వెళ్ళి అక్కడ పడిగాపులు పడి చదివే పుస్తకం, నేను ఇంట్లోనే హాయిగా అనేక సార్లు చదివెవాణ్ణి.


కొంతకాలానికి, శిధిలాలయం ధారావాహిక జరుగుతున్నాప్పటికి కొంత జ్ఞానోదయం కలిగి ధారావాహికను పుస్తకం నుంచి విడిచేసి ఒక చోట పైలు చెయ్యటం మొదలు పెట్టాను, అది కూడ మధ్యలో ఎక్కడనుంచొ. కాని, అంతకుముందు, చందమామలను సరిగ్గా జాగ్రత్త పరచనందున, చుట్టాల్లోనే తలా ఒక్కళ్ళు పట్టుకు పోయి, చిరిగిపోయి అదృశ్యమైనాయి. ఇక నేను 13-14 ఏళ్ళు వచ్చేప్పటికి చందమామలను జాగ్రత్తగా ఉంచి అల్మరాకు తాళం వెయ్యటం మొదలుపెట్టి కాపాడేవాణ్ణి. చివరకు మా నాన్న అయినా సరే నన్ను ఆడిగి తీసుకుని, మళ్ళీ తిరిగి ఇచ్చేవరకు వదిలే వాణ్ణికాదు. పుస్తకం అట్టగాని, పేజిలుగాని నలగనిచ్చేవాణ్ణికాదు. ఇలా శ్రధ్ధ తీసుకుని కొంత చందమామ నిధిని పోగుచేసుకున్నాను. మా చుట్టాలో ఒక అమ్మాయి(అక్కయ్య అవుతుంది) ఒక రోజున, "వీడు ఒట్ఠి పిసినారి, చందమామలు అడిగితే ఇవ్వడు" అన్నది. నాకు చాలా కోపం వచ్చి, "చందమామ కొని దాచుకునేవాడు పిసినారా, లేక కొనకుండా ఎవరింట్లోనో చదువుదామని వెంపర్లాడేవాళ్ళు పిసినారా" అని కఠినంగా జవాబు చెప్పాను. ఇప్పటికి ఈ మాట చెప్పుకుని మేము కలసినప్పుడు నవ్వుకుంటాము.

1973-74 సంవత్సారాలు వచ్చేప్పటికి పోయిన పాత చందమామలు సంపాయించాలని ఒక దుగ్ధ, తీవ్రమైన అకాంక్ష ప్రారంభమయింది. మా నాన్న అప్పుడు (నేను కాలేజీలో చదువుకునే రోజులు), రోజూ 50 పైసలు ఇచ్చెవాడు (స్కూల్లో ఉన్నప్పుడు 5 నుంచి 10 పైసలు). ఆ రోజులలో అదే గొప్ప !! ఈ డబ్బులు ఖర్చు చెయ్యకుండా జాగ్రత్తపరచి, రోజూ సాయంత్రం టైపు క్లాసు తరువాత విజయవాడలో గాంధీనగర్లో ఉన్న సెకండ్ హాండ్ పుస్తక షాపులన్ని గాలించేవాణ్ణి. నా ఆసక్తి గమనించి, వాళ్ళుకూడ పాత చందమామలు వస్తే నాకోసం ఉంచేవాళ్ళు. ఇలా పుస్తకం 30 పైసలు, 40 పైసలు కొండకచో 50పైసలు పెట్టి అనేక పాత చందమామలు 1968నుంచి పూర్తిగానూ, 1953 నుంచి కొన్ని పోగుచెసాను. శిధిలాలయం ధారావాహిక పూర్తిగా ఒకే బైండుగా తయారు చేసాను. అలాగే, మహాభారతం మొత్తం మొదటినుంచి చివరివరకు ఇప్పటికి ఉన్నాయి. కాకపోతె శిధిలాలయం శిధిల స్థితిలో ఉన్నది.

చందమామలో ఉన్న కథలు చదివి పాడైపొయ్యను అంటారు కొంతమంది. అంటే వాళ్ళ దృష్టిలో న్యాయంగా బ్రతకటం, లంచాలు పట్టకపోవటం,ధైర్యంగా నా అభిప్రాయాలు చెప్పటం, పాడైపోవటం అన్నమాట. ఏమీ పరవాలేదు, చందమామ కథలు నాకిచ్చిన చక్కటి ప్రవర్తనా సరళి,జీవితంలో ఎంతగానో ఉపకరించింది, హాయిగా బ్రతకటానికి అనువైన మార్గాన్ని ఎంచుకునే అలోచనా బలం కలిగింది.

చందమామలో బొమ్మలను ఉదహరించకపోతే, చందమామ జ్ఞాపకాలేమిటి. ఏమి బొమ్మలండి! ఒక్కసారి చూస్తే సరిపోతుందా ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. చిత్రా గారు ధారావాహికలకు, ఇతర కథలకు వేసిన బొమ్మలు, మొదటినుంచి చివరివరకూ ఒకేలాగ ఉండే పాత్రల బొమ్మలు అబ్బురపరచేవి. శంకర్ గారు వేసే పురాణధారావాహికల బొమ్మలటే నాకు ప్రాణం. ఏ పురాణ పాత్ర ఎలా ఉంటుంది అన్న విషయం మరి ఆయన ఏ గ్రంధాలు చదివి, శొధించి వేశేవారోగాని, నాకు మాత్రం అన్ని పురాణ పాత్రలు సుపరిచియం కావటానికి కారణం, వారి బొమ్మలే. ఇక వడ్డాది పాపయ్యగారి బొమ్మల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వేసిన ముఖ చిత్రాలు చందమామకు ఎంతగానో వన్నె తెచ్చినాయి. కొత్త చందమామను షాపువాళ్ళు వరుసగా పెట్టినప్పుడు, ఆ దుకాణానికే గొప్ప అలంకరణ చేసినట్టుగా ఉండేది. పాపయ్యగారు, ఆయనకి మాత్రమే సాధ్యమైన శైలిలో, అద్భుతమైన రంగుల్లో, వేసిన బొమ్మలు అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది.

నాకెప్పుడన్నా చీకాకు కలిగినప్పుడు చందమామ బొమ్మలు చూస్తూ స్వాంతన పొందుతాను. ఇంతటి అద్భుతమైన బొమ్మలను సేకరించి, ఒక పుస్తకం వెయ్యగలిగితే చందమామ వారు తెలుగు సాహిత్యానికి చిత్రలేఖన కళకు ఎంతగానో సేవ చేసినవారిగా చరిత్రకు ఎక్కుతారు.

ఇలా వ్రాసుకుంటూ పోతే చందమామ జ్ఞాపకాలు అనేకం. ఒక్క మాటలో చెప్పాలంటే చందమామ నా చిన్నప్పటి నేస్తం, గురువు కూడ.
***************************************
పైన వ్రాసిన నా జ్ఞాపకాలు చందమామ వారు తెలుగు ఆన్-లైన్ ఎడిషన్ లో ప్రచురించారు. ఈ క్రింది లింకు ద్వారా చూడవచ్చు.

చందమామలో ప్రచురణ
***************************************


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.