12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

చందమామలో బొమ్మలు***************************************************************************************************
చక్కటి బొమ్మలు ఉన్నాయి ఈ వ్యాసంలో, బొమ్మలు చూస్తూ వినటానికి వీలుగా ఆడియో ఇచ్చాను పైన. ప్లేయర్ నొక్కి వినండి.
****************************************************************************************************
చందమామలో
కథలను మనం ఎందుకు అంత ఇష్టపడి చదివే వాళ్ళం. ముఖ్యంగా బొమ్మలు. మళ్ళి చెప్తే బొమ్మలు, మరొక్కసారి అడిగినా, ఎన్ని సార్లు అడిగినా బొమ్మలు అనే సమాధానం.


మనకు
ఘంటసాల గారి గురించిన ఒక మంచి పొగడ్త ఉన్నది (వారి వర్ధంతి నెలలోనే , అప్పుడే మూడు దశాబ్దాలు దాటిపోయింది) అదేమిటంటే,

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం పాడటం వల్ల, ఘంటసాలకు పేరు వచ్చిందా, లేక ఘంటసాల పాడటం వల్ల, పుష్ప విలాపానికి పేరు వచ్చిందా , చెప్పటం కష్టం. రెండూ నిజం అనిపిస్తాయి.
అలాగే చందమామలో, దాసరి వారి ధారావాహికలో వారు సృష్టించే పాత్రల వల్ల చిత్రా గారు అంతటి అద్భుతమైన బొమ్మలు వేసేవారా, లేక చిత్రాగారు బొమ్మలు వెయ్యటం వల్ల దాసరి వారి ధారావాహికలు అంత ప్రాచుర్యం పొందినాయా!! చెప్పటం కష్టం.

ఇప్పుడు పత్రికలలో చూస్తుంటాం, బొమ్మ దారిన బొమ్మ కథ దారిన కథ. ఒకవేళ రెండిటికీ పొంతన ఉన్నా బొమ్మ ఏదో నాలుగు గీతాలు గిలికేసి, కార్టూన్లు వెయ్యటమే కాని వేసేవారికి గాని, పత్రికలో సంపాదకులుగా చలామణిలో ఉన్న వారికి గాని ఆసక్తి ఉన్నట్టుగాలేదు. చందమామలో చూసినన్ని మంచి బొమ్మలు, కథకు చక్కగా అతికిపోయి, కథలో చెప్పని అనేక విషయాలను చెప్తూ, మన్ని ఏమైనా సరే కథను చదివించగల శక్తిగల బొమ్మలు వేయగాలవారు ఈరోజున, మన వార/మాస పత్రికలలో లేరనే చెప్పాలి. వార పత్రికలలో కథలకు, కార్టూన్లు బొమ్మలుగా వేసే వరవడి ఎప్పుడు ఏర్పడిందోగాని, చిత్రకారుల తమ శక్తి యుక్తులు చూపటం మానేసినట్టుగా కనపడుతున్నది. చందమామలో ఇప్పటికీ పనిచేస్తూ (ఎనభై పైబడ్డ వయస్సు అయినా సరే) బొమ్మలు వేస్తున్న శంకర్ గారు, మనందరికీ పురాణ పురుషులను తమ బొమ్మలతో పరిచయం చేసారు.

పాత రోజులలో శంకర్స్ వీక్లీ చూసి రాజకీయ నాయకులు ఎలా ఉంటారో తెలుసుకునేవాడిని. మామూలు పత్రికలలో బొమ్మలు దాదాపు నల్లగా ఉండేవి. శంకర్ పిళ్ళై (చందమామలో బొమ్మలు వేసే ఆయన కాదు వీరు వేరే ఉన్నారు).

రోజు కొత్తగా వచ్చిన నవ్య వార పత్రికలో ఒక చదువరి, కథకు బొమ్మే ప్రాణం అని చెప్తూ, ఉదాహరణకి చందమామ, యువ పత్రికలను ఉదాహరించారు. వారు వ్రాసిన లేఖ కింద ఇస్తున్నాను.
కింది బొమ్మలు పాతాళ దుర్గం, రామాయణం ధారావాహికలలో నుండి చందమామ వారి సౌజన్యం

చెట్టుమీదనుంచి శత్రువు మనుషులు, వీళ్ళను చూసి ఎక్కడ ఉన్నది చెబుతున్నారు. ధూమక సోమకులు ఏమి చేస్తారు? ఒక్క దెబ్బతో గూధచారులను బాణంతో పడగొట్టారు

నిజం చెప్పించాలంటే కొంతలో కొంత ఒత్తిడి తెస్తేనే పని జరుగుతుంది . భిల్లుడి చేత నిజం కక్కించటానికి, విరూపుడి ప్రయత్నం


ఫోటోలో ఉన్న ఏక్షన్ అంతా ఇంతా కాదు. కిందపడి దోల్లుతున్న వ్యక్తీ రాజోచిత దుస్తులలో ఉన్నాడు, అతని చేతిలో నాటుకున్న బాణం అతని పక్కన తెలు కొండి లాంటిది పడి ఉన్నది, కథ చదివితే కాని తెలియదు అది రాక్షసుడి కొమ్ము అని . పక్కనే నుంచుని గాయపడిన వ్యక్తిని ఎద్దేవా చేస్తున్నట్టుగా హావభావాలతో మరొక వ్యక్తీ, పక్కనే సైన్యం, ఇవన్ని చూశినాక కథ చదవకుండా ఎలా ఉండేది?
రాకుమారి కాంతిసేన ను ఎత్తుకెడుతున్న రాక్షసుడికి మంత్ర దండంతో దెబ్బలు!! ఎందుకు ఎలా, కథ చదివితేనే తెలిసేది.

అడవిలో కొలను, దాని వడ్డున ఇద్దరు యువకులు సింహంతో పోరు, బొమ్మలో లేకపోయినా మరొక వ్యక్తీ నీడతో అతను బాణం తీయబోతున్నట్టు నీడతో చూపించిన చిత్రాగారి అద్భుత సృష్టి.

రామాయణంలో ఒక ఘట్టం పాపయ్య గారి అద్భుత చిత్రీకరణ
రామాయణంలో, సీతను కనుగొని తిరిగి వస్తున్నా హనుమాన్, శ్రీ శంకర్ గారి ప్రతిభ
జటాయువును చంపుతున్న రావణుడు, పక్కనే సీత శంకర్ గారి ప్రతిభకు తార్కాణం
చూసి రమ్మంటే కాల్చి రావటానికి నిర్ణయించుకుని, రావణుని కొలువులోకి ప్రవేసించిన వీర హనుమాన్ శ్రీ శంకర్ గారి కుంచే గారడీ


దశాబ్దాల క్రితం చందమామలో వేయబడిన చిత్రాల గురించి నాటికీ మనం చెప్పుకుంటున్నాం, పత్రికలలో ఉత్తరాలు వ్రాస్తున్నాం. కారణం, బొమ్మలలో ఉన్న ప్రాణం. కథకు సరిపోయేట్టుగా వేయగలిగిన చిత్రకారుల ప్రతిభ. అంతకు మించి, ఆయా చిత్రకారుల ఊహా శక్తి, కథలలోని వాతావరణం, కథా కాలం, కథ జరిగిన చోటు గురించిన పూర్తీ అవగాహనతో వేయబడిన చిత్రాలవి. ఆపైన బొమ్మలో ఉన్న వ్యక్తులకు వస్తువులకు, చెట్లకు, ఇతరాలకు మధ్య చక్కటి నిష్పత్తి చూపటం. అది కాలంలో కథలకు చిత్రాలు వేసేవారికి పెద్దగా తెలియదు.

మళ్ళి మన పత్రికా చిత్ర రచనా వరవడిలో మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం

2 వ్యాఖ్యలు:

  1. శివ గారూ !
    చాలా సంతోషం. అలవాటైన చెయ్యి కదా ! ఊరుకోలేదు. చందమామ బొమ్మలు చూపించారు. గతాన్ని మళ్ళీ తవ్వారు. ఎంత తవ్వినా తరగని గని చందమామ. ధన్యవాదాలు. మరో విషయం. ఘంటసాల గారి వర్థంతి నిన్ననే అయింది. నా టపా చూశారా ?

    ప్రత్యుత్తరంతొలగించు
  2. శివరాం గారూ,
    చందమామ బొమ్మలపై మీ కథనంలోని కొన్ని భాగాలను నేను కొల్లగొడుతున్నాను మరి. ఇంతకు మించి గొప్పగా రాయడం నాకు చేతకాకే ఈ పని చేస్తున్నాను. ఏమనుకోకండి మరి.

    ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.