15, ఫిబ్రవరి 2010, సోమవారం

వ్యాపార ప్రకటనా కాలుష్యం

వినటానికి వీలుగా ఈ కింద ఆడియో ఫైలు ఇవ్వబడినది. తెలుగు చదలేకపోయినా, విని అర్ధం చేసుకునేవారికి ఈ ఏర్పాటు సౌకర్యంగా ఉంటుంది.

ఈ రోజున వ్యాపార ప్రకటనలు లేని చోటులేదు. అవి చూడకుండా, వినకుండా మనం తప్పించుకోలేం. రోడ్డు మధ్య ఉండే డివైడర్లు దగ్గర్నుంచి, సిటీ బస్సులు, చివరకు రైలు పెట్టెలు ఇలా ఎందెందుకు వెతికినా అందే కలదు వ్యాపార ప్రకటన. ఈ ప్రకటనలలో వాడే భాష, మోసపూరిత ప్రలోభాలు, భామల భంగిమలు అన్ని కలసి వ్యాపార ప్రకటనలను మానసిక, దృశ్య కాలుష్య స్థితికి తీసుకు వచ్చాయి.

వీటిమీద పడి బతుకుతున్నారు కాబట్టి ఈ టి.వి చానేళ్ళుగాని, దిన/వార పత్రికలు గాని ఈ కాలుష్యాన్ని ఆపడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడంలేదు. అసలు ఇదొక కాలుష్యమని గుర్తించడానికి కూడ జంకుతున్నారు. చివరకు ఈ వ్యాపార ప్రకటనలు, ఒక మాఫియాగా తయారయ్యి, పత్రికలను, టి.వి. చానెళ్ళను శాసించి, వారు వ్రాసే, ప్రసారం చేసే విషయాలను, ప్రసార సరళిని శాసించే వరకు వచ్చింది పరిస్థితి. ఇప్పుడున్న మీడియా స్వతంత్రమైన మీడియా కాదు. ఈ మీడియా అడ్వర్టైస్మెంటు మాఫియా చేతిలో కీలుబొమ్మ. మీడియానే ఆ వ్యాపార ప్రకటనలు లేకుండా బతకలేమని ఈ మాఫియాలో స్వచ్చందంగా చేరిపోయి, వారి బాధ్యతను విస్మరిస్తే సామాన్య జనంలోని మనమే కొంత బాధ్యత తీసుకుని మన అభిప్రాయ వ్యక్తీకరణ చేసి కొంత ఒత్తిడి తీసుకుని రావాలి, తప్పదు.

అందుకోసం ఒక సమూహాన్ని ఏర్పరచటం జరిగింది. వ్యాపార ప్రకటనలు, వాటివల్ల వచ్చే దుష్పలితాలను చర్చించటనికి ఒక వేదికగా ఉపయోగ పడాలని నా అభిలాష ఈ విషయం మీద బాధపడుతున్నవారు ఈ గ్రూపులో చేరి తమ తమ అభిప్రాయాలను అందరితో పంచుకోగలరు.
‌‌ బ్లాగులో పక్కనే ఉన్న లింకు నొక్కి సమూహంలో చేరి మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. లేదా ఈ కింద లింకు ఉన్నది:Visit and Join this group

బెడదను తగ్గించటానికి, నాకు తోచిన కొన్ని నియమాలను కింద ఇస్తున్నాను.





  1. ఏ వ్యాపార ప్రకటనా కూడ ఒక వారంలో 25-30 సార్లకు కన్న ఎక్కువ సార్లు చూపకూడదు . తరచి తరచి చూడటం వల్ల, మనకు తెలియకుండానే ఆ వ్యాపార ప్రకటన ప్రలోభంలో పడిపోతున్నాము.మనకు ఇంతకంటే మంచి వస్తువును వెతుక్కునే వివేచనను కోల్పోతున్నాము.
  2. ఒక కార్యక్రమం వస్తున్నాప్పుడు మధ్యలో వ్యాపార ప్రకటనల సమయం, ఆ కార్యక్రమ సమయంలో 5% కంటే మించి ఉండరాదు. అంటే అరగంట కార్యక్రమంలో,వ్యాపార ప్రకటనలు 90 సెకన్లు మాత్రమే వెయ్యాలి.
  3. వ్యాపార ప్రకటనలు చేయబడుతున్న ఏ ఉత్పత్తి మీద అయినా సరే, ఆ వస్తువు ప్యాకింగు మీద, వస్తు తయారీకి జరిగిన ఖర్చు, వ్యాపార ప్రకటనకు చేసిన ఖర్చు తప్పనిసరిగా చూపించాలి.
  4. ఒక కార్యక్రమం, వ్యాపార ప్రకటనల కోసం ఆపినప్పుడు, తెర మీద కుడి పక్కన పై మూల ఒక టైమర్ టిక్ చేస్తూ, మరెంత సమయంలో అసలు కార్యక్రమం వస్తుందో చూపించాలి.
  5. ఏ రెండు చానెళ్ళు, ఒకే సారి వ్యాపార ప్రకటనలు వెయ్యకూడదు. ప్రస్తుతం, మనం చానెల్ మార్చినా ఈ బెడదను తప్పించుకోలేకుండా ఉన్నాం. ఈ చానెళ్ళన్ని కూడబలుక్కుని, ఒకే సమయంలో వ్యాపార ప్రకటనలు గుప్పించటం వల్ల, మనకు బలవంతంగా వారి ప్రకటనలను చూపిస్తున్నారు. ఇది మన వ్యక్తిగత స్వేచ్చను హరించటమే కాకుండా, ఈ ప్రకటనా కాలుష్యాన్ని, మన బుర్రల్లోకి స్లో పాయిజన్ లాగ ఎక్కిస్తున్నారు.
  6. వ్యాపార ప్రకటనల సౌండు అసలు కార్యక్రమం శబ్దంలో 75% శాతం మాత్రమే ఉండాలి.సామాన్యంగా అసలు కార్యక్రమం కంటే ఎక్కువ శబ్దంతో ప్రకటనలు వస్తాయి, ఆ విధంగా శబ్ద కాలుష్యాన్ని కూడా కలుగ చేస్తున్నారు.
  7. రోడ్లమీద, హోర్డింగులు తప్పనిసరిగా నియంత్రించి, అతి తక్కువ గా ఉండటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
  8. రోడ్ డివైడర్లను వ్యాపార ప్రకటనలకు వాడకూడదు. ప్రభుత్వ ఆస్తులైన, బస్సులు, రైళ్ళు, వాటి వాటి భవనాలను వ్యాపార ప్రకటనలకు ఉపయోగించకూడదు.
  9. ధారావాహికల ఎపిసోడుల సంఖ్యను నియంత్రించాలి. అలా నిరంతరం వచ్చే ధారావాహికలను అనుమతించరాదు. రచయితల, నటుల సృజనాత్మకను ఇటువంటి నిరంతర ధారావాహికలు దెబ్బ తీస్తున్నాయి. పైగా ఏదో ఒకటి వ్రాయాలి కాబట్టి, ప్రతి చెత్త జనం మీదకు వదులుతున్నారు.అవసరం అయితే ధారావాహికలకు సినిమాలకు ఉన్నట్టే సెన్సారు ఒక ఉండాలి. ప్రతి ఎపిసోడు ఆ సెన్సారు వారు చూసిన తరువాతనే ప్రసారం చెయ్యాలి. ఈ సెన్సారు వాళ్ళు ఏదో కట్టడి చేస్తారని కాదు. ఒక్కో ఎపిసోదుకు ఇంత నియమాలు పెడితే, నియంత్రణ అదే జరుగుతుంది.
  10. ఏ వస్తువుకుగాని, సర్వీసుకుగాని అనవసర ప్రచారం చెయ్యకూడదు. ఇలా అనవసర ప్రచారం చెయ్యటం వల్ల, వినియోగాదారులమైన మనం ఎక్కువ ఖర్చుపెట్టాలిసి వస్తున్నది.
  11. ఒక వస్తువు, సర్వీసు ధరలో, వ్యాపార ప్రకటన ఖర్చు 0.01% కు మించి ఉండరాదు.
ప్రస్తుతం గుడ్డెద్దు చేలో పడినట్టుగా, అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రవర్తిస్తున్న ఈ వ్యాపార ప్రకటనా మాఫియాకు ముక్కుతాడు వెయ్యటానికి, నాకు తోచిన కొన్ని మార్గాలను ఇక్కడ వ్రాశాను. దయచేసి మీ, మీ అభిప్రాయాలను కూడ పంచుకోగలరు.
**************************************************************
సామాన్యంగా బ్లాగులో ఒక వ్యాసం వ్రాసినప్పుడు కొద్దో గొప్పో వ్యాఖ్యలు వస్తాయి. కాని ఆ వ్యాఖ్య మనం వ్యాసంలోనేఉంచితే బాగుంటుంది అనిపించటం మాత్రం అరుదు. ఆఫ్రికా ఖండంలోని కిగాలీ ఉంటూ ఓపికగా తెలుగు బ్లాగులనుచూడటమే కాకుండా అప్పుడప్పుడూ మంచి వ్యాఖ్యలు వ్రాస్తున్నారు స్వర్ణమల్లిక. ఆమె వ్రాసిన వ్యాఖ్య నాకు నచ్చినది ఈ కింద ఇస్తున్నాను

"...........ఎవరి గోలలో వాళ్ళు పడి ఈ ప్రకటనలు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు, కానీ అది మనసుల మీద స్లో పాయిజన్ లా ప్రభావం చూపిస్తోందని తెలుసుకోలేకపోతున్నాం. ఎన్నో అసభ్యమైన, అనవసరమైన, అంతకంటే అసందర్భమైన ప్రకటనలు చూసి చూసి అసహనం వస్తోంది. స్త్రీలు, పసి పిల్లలు, పండు ముదుసలులు, ఎవ్వరినీ వదలడంలేదు క్రియేటివ్ తలలు. కాదేదీ ప్రకటనకనర్హం అన్నట్టుగా ఉంది వీళ్ళ ధోరణి. ఫలానా అగరు బత్తి వెలిగించి ప్రార్ధిస్తేగానీ దేవుడు వరమివ్వడుట, ఫలానా షాపింగ్ మాల్లో బట్టలు, నగలు కొంటేగానీ మగపెళ్ళివాళ్ళు పెళ్ళికి ఒప్పుకోరు, ఫలానా శీతల పానీయం తాగితేగానీ ఆట సరిగ్గా ఆడలేరు. ఇలా ఎన్నని చెప్పాలి ప్రకటనల లీల. కొన్నిటిని చూసి నవ్వుకుని వదిలేస్తే, కొన్నిటిని చూసి అసహ్యం పుడుతుంది. ఏదో ఒక డియోడ్రంట్ వాడితే పక్కింటి శ్రీమతి వలలో పడుతుందిట. మరి ఇది కూడా క్రియేటివిటీనే................"

******************************************************************

6 కామెంట్‌లు:

  1. ఆలోచించాల్సిన విషయం చెప్పారు. ఎవరి గోలలో వాళ్ళు పడి ఈ ప్రకటనలు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు, కానీ అది మనసుల మీద స్లో పాయిజన్ లా ప్రభావం చూపిస్తోందని తెలుసుకోలేకపోతున్నాం. ఎన్నో అసభ్యమైన అనవసరమైన అసందర్భమైన ప్రకటనలు చూసి చూసి అసహనం వస్తోంది. స్త్రీలు, పసి పిల్లలు, పండు ముదుసలులు, ఎవ్వరినీ వదలడంలేదు క్రియేటివ్ తలలు. కాదేదీ ప్రకటనకనర్హం అన్నట్టుగా ఉంది వీళ్ళ ధోరణి. ఫలానా అగర్బత్తి వెలిగించి ప్రార్ధిస్తేగానీ దేవుడు వరమివ్వడు, ఫలానా షాపింగ్ మాల్లో బట్టలు, నగలు కొంటేగానీ మగపెళ్ళివాళ్ళు పెళ్ళికి ఒప్పుకోరు, ఫలానా శీతల పానీయం తాగితేగానీ ఆట సరిగ్గా ఆడలేరు. ఇలా ఎన్నని చెప్పాలి ప్రకటనల లీల. కొన్నిటిని చూసి నవ్వుకుని వదిలేస్తే, కొన్నిటిని చూసి అసహ్యం పుడుతుంది. ఏదో ఒక డియోడ్రంట్ వాడితే పక్కింటి శ్రీమతి తేలికగా వలలో పడుతుందిట. మరి ఇది కూడా క్రియేటివిటీనే.

    మీరు చేసిన సూచనలు చాలా బాగున్నాయి. నాకు అంతంత మంచి మంచి ఆలోచనలు తట్టవు గానీ, నా పరిధిలో నా బుర్రకు తోచే ఆలోచన ఒకటి ఉంది. స్త్రీలు, చిన్నపిల్లలతో తీసే ప్రకటనలు కొన్ని నియమాలకు లోబడి ఉంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  2. Thank you Malakpet Rowdy. For anything there is a beginning. Lets try to create public opinion against this modern day menace. Join the Google Group and offer your comments and participate in the discussion.

    రిప్లయితొలగించండి
  3. Swarna Mallika! Thank you for your good comment. Shall I add this into the main article?

    If we start giving examples of ads in bad taste, it takes long, long time. The so called creative minds are not creative at all. They are just self serving perverted people who shall stoop to any level to please their customer and come out with any idea for selling the product, acceptability, by the very Customers they are trying to target, notwithstanding.

    రిప్లయితొలగించండి
  4. ప్రకటనల మీద అభిప్రాయాలు ప్చ్ ! మంచి ఆలోచనీ ? ఆచరణ లో సాద్యమా ? నా వరుకు నేను టివి ని చూడడము మానేసాను. radio మాత్రమీ వింటాను. తిరిగి అందరు ఇదే స్తాయికి వస్తారని ఆశ. ప్రకటనల బెడత నుండి తప్పింసుకూవాలంటీ ఇదీ ఒక మంచి ఆలోచన అని అనుకుంటున్నాను >

    రిప్లయితొలగించండి
  5. సార్! మీ రచనలో ఒక్క పంక్తిగా అయినా నా భావం చేరితే అది నా అదృష్టంగా భావిస్తాను.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.