5, అక్టోబర్ 2010, మంగళవారం

నండూరి సుబ్బారావుగారు :: మనుమరాలి జ్ఞాపకాలు

ఫోటో కర్టెసీ శ్రీ గొల్లపూడి మారుతీ రావుగారు
నండూరి సుబ్బారావుగారి మనమరాలు శ్రీమతి తుర్లపాటి స్వాతి గారు పంపిన తమ తాతగారి జ్ఞాపకాలు యధాతధంగా

చిన్నతనం లొ తాతగారి తొ పాటు రేడియో స్టేషన్ కు అక్క నేను వెళ్ళే వాళ్ళం . కళాకారులు రికార్డింగు చేసేప్పుడు ఒక్కొసారి అక్కడే ఉండే వాళ్ళం, ఎంతో సరదాగ ఉండేది. అప్పుడప్పుడు పాటలు అవి తాతగారు మా చేత పాడించేవారు ఇప్పుడు ఆకాశవాణిలో లొ అప్పటి ఆణిముత్యాలవంటి నాటికలు, ఇతర కార్యక్రమాలు మళ్ళి ప్రసారం చేస్తే ఎంతో బాగుంటుంది!

నాకు తాతగారి ఉద్యోగ జీవితపు వివరాలు అంతగా తెలియవు. నా దగ్గర ఫొటోలు కూడ లేవు. తాతగారు ఇంట్లో చాలా సరదాగ ఉండేవారు. పేరుకి మా తాతగారే కాని, మాతో సమానంగా సరదాగ ఉండేవారు. నాకు బాగా జ్ఞాపకం ఉన్నవి;

స్కూల్ నుండి రాగానే, నేను మా అక్క తాతగారి దగ్గర ఒక గంట కూర్చునే వాళ్ళం. కథలు, కబుర్లు మా కుటుంబంలోని పూర్వీకుల వివరాలు ,తన అనుభవాలు అన్ని చెప్పేవారు. ముగ్గురం కలిసి బామ్మని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళము. ఒక్కోసారి సాయంత్రం, నాటికలు, నవలలు వ్రాస్తూ ఉండేవారు. ఒకసారి వ్రాయటం మొదలు పెడితే అయ్యేదాక వ్రాస్తూనే ఉండేవారు. రాత్రి భోజనం తరువాత, బయట వెన్నెల్లో కూర్చుని అక్కకి నాకు . పురాణ గాధలు వివరంగా చెప్పేవారు. చిన్నప్పుడు అక్కకి నాకు తెలుగు నేర్పించారు. పాఠాలు చెప్పే సమయంలో , చెప్పవలసిన విషయం చాలా బాగా చెప్పేవారు. మన తెలుగు భాష అంటే వారికి చాల గౌరవం. వత్తులు సరిగ్గా పలుకకపోయినా, వ్రాయకపోయినా, తాతగారు చాలా కోపం చూపించేవారు. ఒక రొజు రాత్రి 11 గంటల దాక నా చేత అక్షరాలు వ్రాయించారు. సరిగా వ్రాస్తే కాని, అమ్మని అన్నం పెట్టద్దు అని చెప్పారు. మళ్ళి గంట, గంటకు తనని లేపి వ్రాసింది చూపించమని చెప్పి పడుకున్నారు. అలా నేర్పారు కాబట్టే ఈ రోజు వేరే దేశంలో ఉన్నా, తెలుగు మీద మమకారం పోకుండా ఉండటమే కాకుండా మరింత ఎక్కువయ్యింది. ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నా, తెలుగులో ఏదైనా వ్రాస్తుంటే అదో ఆనందం. ఒక్క క్షణం ఆ అక్షరాలు ఎంత అందంగా ఉన్నాయి అని ఆగి మెచ్చుకోకుండా ఉండలేము. ఇలా, తాతగారి మధురమైన జ్ఞాపకాలు ఎన్నో.

తాతగారు చూడటానికి, వినటానికి కూడ ఎంతో ఆకర్షణీయంగా ఉండేవారు . చాలా పెద్దవారు ఐనాక కూడ మంచి తేజస్సు ఉండేది ఆయన ముఖంలో. గంభీరంగా ఉండేవారు. నడిచేవారు. మాట్లాడేవారు. మాట్లాడే పధ్ధతి ఎంతో కరెక్టుగా ఉండేది. అదే మాకు కూడ నేర్పించారు. పెద్దవాళ్ళను గౌరవించటం. నమస్కారం చెప్పటం, ఇలా అన్నీ మన పధ్ధతులను నేర్పించారు. వారితో అంతకాలం గడపగలగటం, మంచి పధ్ధతులను నేర్చుకోవటం, మా అదృష్టంగా భావిస్తాము.

మా చిన్నప్పుడు తాతగారిగానే తప్ప, ఆకాశవాణిలో రచయితగా కాని , నటుడిగా కాని మాకు తెలియదు. వంశి గారి వెబ్ సైటులో తాతగారి నాటికలు విని ఎంతో సంతోషం కలిగింది. ఎఫ్ ఎం రేడియోనే గొప్పగా ఉండే ఈ రోజుల్లో ఆకాశవాణికి మీ వంటి అభిమానులు ఇంకా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నది.

మా నాన్నగారైన నండూరి శశి మోహన్ గారిని మా తాతగారి గురించిన ఫొటోలు ఇతర వివరాలు, పంపమని మైలు ఇస్తున్నాను.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.