7, అక్టోబర్ 2010, గురువారం

పద్యాలతో'రణం'

శ్రీ ఏలూరిపాటి అనంత రామయ్య గారు
(పై ఫొటొ సౌజన్యం www.webprapancham.com)
దూర్‌దర్శన్ డి డి-8 చానెల్లో కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన బహుళ ప్రజాదరణ పొందిన కార్యక్రమం "పద్యాలతోరణం". ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినవారు శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్యగారు.

అసలు కార్యక్రమపు శీర్షికలోనె ఒక గడుసుదనం, ఉన్నది ఆపైన కార్యక్రమంలో ఉండే విషయం అవగతమయ్యేట్టుగా ఉంచారు. పద్యాలతోరణం అంటే పద్య మాలిక లేదా పద్యాల దండ అని స్పురిస్తుంది. కాని తరచి చూస్తే పద్యాల తో రణం అని కూడ అనిపిస్తుంది.
పోటీదార్లు పద్యాలతో యుద్ధం చేసుకుంటారని వీక్షకులు భావించేట్టుగా ఉండేది శీర్షిక. కార్యక్రయంలో తెలుగు పద్యాలు ధారణ చేసి వాటిని అడిగినప్పుడు గడగడా చెప్పగల సమర్ధులే పాల్గొనగలిగేవారు. నాకు గుర్తున్నంతవరకు ఈ కార్యక్రమం అరగంట వచ్చేది. నలుగురైదుగురు పోటీదార్లు పాల్గొనేవారు. వీరందరూ పద్యాలమీద ఆసక్తితో కార్యక్రమ నిర్వాహకులను మెప్పించి పోటీదార్లుగా ఎన్నికైనవారే.

ఈ కార్యక్రమాన్ని ఎంతో జనరంజకంగా, పద్యాలు చదవలేనివారికి కూడ అర్ధమయ్యే పధ్ధతిలో (మాకు గ్రాంధికం వచ్చు, మీరూ నేర్చుకురండి అనేవాళ్ళలాగ కాకుండ) విజయవంతంగా "ఆంధ్ర వ్యాస" శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్యగారు నిర్వహించేవారు. కార్యక్రమంలో మూడు నాలుగు  ఆవృత్తాలు ఉండేవి అనుకుంటాను (*).

1. మొదట ఒక వరుసలో పద్యాలు చదవటం. మొదటి పోటీదారుకు ఏ అక్షరంతో మొదలయ్యే పద్యం చదవాలో అనంతరామయ్యగారే నిర్దేశించేవారు. ఆ తరువాత, మొదటి పోటీదారు పద్యం పరిసమాప్తి అవ్వగానె, ఆ పద్యంలోని చివరి అక్షరంతో, రెండవ పోటీదారు అందుకోవాలి. అలా చివరివరకు వెళ్ళి మళ్ళి వ్యతిరేక దిశలో మొదటి వరకు వచ్చేది అన్నట్టుగా గుర్తు.
2. ఒక వర్ణన ఇచ్చి ఆ వర్ణన గురించిన ప్రసిధ్ధ పద్యాలు చదవటం
3. ఒక అలంకారం చెప్పి, ఆ అలంకారం పొదగబడ్డ పద్యం చదవటం

కార్యక్రమం జరుగుతున్నంతసేపూ ఎంతో ఉత్కంఠభరితంగా జరిగేది. అనంతరామయ్య గారి ధారణ శక్తి (అప్పటికే ఆయన షష్టిపూర్తి జరుపుకుని కొన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది) అబ్బురపరిచేది. పోటీదారు ఎవరైనా తడబడుతున్నా, తప్పుగా పదాన్ని పలికినా, చప్పున అందుకుని ఆ పద్యాన్ని ఆశువుగా చెప్పేవారు, అర్ధం వివరించేవారు.

అలాగే వర్ణనలు, అలంకారాలు మరి మిగిలిన పద్యాలలో కనపడే ప్రక్రియలన్ని కూడ వివరంగా చెప్పేవారు. పద్యాలను రాగయుక్తంగా చక్కగా చదివేవారు, అర్ధాన్ని తేట తెలుగులో విశదపరిచేవారు.

కార్యక్రమం చివరలో పోటీదార్లు అందరికీ వారికి వచ్చిన మార్కుల ప్రకారం మూడు బహుమతులు ఇచ్చేవారు. బహుమతులు అన్ని మంచి పుస్తకాలే ఉండేవి. ఈ బహుమతులను-పావని సేవాసమితి
-సాహిత్యం మీద అభిరుచి, అభిమానం (వ్యాపార దృష్టిమాత్రమే కాకుండా) ఉన్న ఒక ప్రచురణ సంస్థ వారు ఇచ్చేవారు(**).

ఇటువంటి అద్భుతమైన సాహిత్య కార్యక్రమాన్ని రూపొందించి ఒక ప్రముఖ సాహితీవేత్తకు తగిన స్వాతంత్ర్యం ఇచ్చి, ప్రసారం చేయటానికి నిర్ణయం తీసుకున్న దూరదర్సన్ అధికార్లు ఎంతైనా ప్రజల, సాహిత్య అభిమానుల మెప్పు పొందారు.

ఇంతటి అద్భుత కార్యక్రమం, ఆయన తరువాత సరిగ్గా నిర్వహించే వారు లేక ఆగిపోయింది. కాని, దూర్‌దర్శన్ వారు అప్పటి కార్యక్రమాలను మళ్ళి ఒకసారి పున:ప్రసారం చేస్తే పద్యాలమీద ఆసక్తి ఉండి అప్పుడు చూడటం కుదరనివారికి మహదవకాశం లబించినట్టే. దూర్‌దర్శన్ వారు ఆ కార్యక్రమ వీడియోలను ఆసక్తి గలవారు తగిన పైకం పంపిన మీదటే డి.విడి లలో రికార్డు చేశే పధ్ధతి (VIDEO ON DEMAND) మీద ఇచ్చినా బాగుండును.

******************

(*) కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారి గుర్తు ప్రకారం, మొత్తం ఐదు ఆవృతులు ఉండేవి.1. అచ్చులతో రెండు [అంత్యాక్షరీలు ]ఒకటి వారికి(ఏలూరిపాటి వారికి) నచ్చినది, మరొకటి మనకి (పోటీదారులకు) నచ్చినది ఇంకొకటి వర్ణన . తమ గుర్తును అందరితో పంచుకున్న రాజేశ్వరి గారికి ధన్యవాదములు .
(**)
పద్యాల తోరణం కార్యక్రమానికి
రెండు ఎపిసోడ్లకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఆచార్య ఫణీంద్ర గారు తెలియచేసిన సమాచారం. వారికి కృతజ్ఞతలు.

******************o-o-o-o-o-o-o-o-o-o-o-o-o-o-o-o-o-o

4 వ్యాఖ్యలు:

 1. నమస్కారములు.
  శ్రీ ఏలూరిపాటి అనంత రామయ్యగారు చక్కని కార్య క్రమము నిర్వ హించారు.మొత్తం ఐదు ఆవృతులు ఉండేవి.1. అచ్చులతో రెండు [అంత్యాక్షరీలు ]ఒకటి వారికి నచ్చినది ,మరొకటి మనకి నచ్చినది ఇంకొకటి వర్ణన .[అని గుర్తు ] స్తానికంగా ఉన్నందున అనేక సార్లు నేను పాల్గొనడం జరిగింది.పిమ్మట వారు అమెరికా వచ్చి వెళ్ళాక బేధ భావంతో వారిని తొలగించి అనేక చోట్ల కార్యక్రమాలు నడిపారు గానీ ఎక్కువ నడవ లేదు. మొత్తం మీద " పద్యాల తోరణం " ఎంతో ఆశక్తి గా ఇష్టం గా ఉండేది.ఇక అటువంటి అదృష్టం " న భూతో న భవిష్యతి "

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రాజేశ్వరిగారూ. నమస్తే. పద్యాల తోరణం కార్యక్రమంలో పాల్గొన్న వారి కంటపడే అదృష్టం నా చిన్ని బ్లాగు చేసుకున్నందుకు ఆనందంగా ఉన్నది. మీరు అనంతరామయ్యగారిని చూసిన అదృష్టవంతులు. మాకు ఆయన దర్శనం టివి ద్వారానే. మీరు ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిగా, దూరదర్శన్ వారిని అలనాటి ఆ కార్యక్రమపు వీడియోల గురించి, వాటి పున:ప్రసారం గురించి, దూరదర్శన్ వారికి ఆ అద్భుత కార్యక్రమపు వీడియో డివిడిలుగా తెచ్చి అమ్మే ఆలోచన ఉన్నదా? వాకబు చేస్తూ, అటువంటి ఆలోచన ఉంటే, డజన్లకొద్ది అభిమానులు అవి కొనటానికి సిధ్ధంగా ఉన్నసంగతి తెలియచెప్పగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శివరామప్రసాదు గారు!
  బహుమతులు అందించిన ప్రచురణ సంస్థ పేరు ’పావని సేవా సమితి’.
  ఏలూరిపాటి వారి ఆహ్వానం మేరకు ’పద్యాల తోరణం’ రెండు ఎపిసోడ్లలో జడ్జిగా వ్యవహరించే భాగ్యం నాకు కలిగింది. కార్యక్రమ వివరాలను గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఫణీంద్ర గారూ. మీరు ఇచ్చిన సమాచారానికి కృతజ్ఞతలు.

  పద్యాల తోరణం కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన మీరు, నా వ్యాసం చూసి వ్యాఖ్య వ్రాయటం నాకు చాలా ఆనందానిచ్చింది.

  కార్యక్రమంలొ పాల్గొన్న పోటీదారుగా రాజేశ్వరిగారు ఆపైన న్యాయనిర్ణేతగా మీరు, వ్యాసాన్ని చదివి, ఆ వెంటనే సమాచారాన్నిస్తూ వ్యాఖ్యలు వ్రాసినందుకు ధన్యవాదాలు.

  బ్లాగుల్లో ఊరికే ముఖ:స్తుతి, ఇచ్చకపు వ్యాఖ్యలు కాకుండ, ఈ విధంగా వ్రాసిన వ్యాసంలో పొందుపరచటానికి వీలైన సమాచారాన్నందించే వ్యాఖ్యలు బ్లాగర్లు వ్రాయటం అలవర్చుకుంటె (చౌకబారు/వితండ వాదనలు మానుకుని) బ్లాగులోకం మరింత ఆకర్షణీయంగా మారుతుంది, బ్లాగుల్లో వ్రాసే సమాచారాన్ని కూడ ప్రామాణికంగా ఉదహరించే రోజులు వస్తాయి.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.