కుటుంబ నియంత్రణ గురించి ఆకాశ వాణిలో అనేకానేక కార్యక్రమాలు, పాటలు, వచ్చాయి. ఇంకా వస్తూ ఉండి ఉంటాయి. 1970లలో కుటుంబ నియంత్రణ గురించిన పాటలు మరీ తరచుగా వస్తూ విసుగు పుట్టించేవి. ఆత్యయిక పరిస్థితి (1975-77) ప్రకటించిన ఇందిరా గాంధీ ప్రభుత్వం, ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమ అమలులో అత్యుత్సాహం చూపించి, ఎంతో చెడ్డపేరు మూటకట్టుకోవటమే కాకుండా, ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో ఘోరంగా ఓడింపబడింది.
అందరికీ కుటుంబ నియంత్రణ అనంగానే గుర్తుకు వచ్చేది ఎర్ర త్రికోణం. కలెక్టరు జానకి సినిమాలో అనుకుంటాను, నాగభూషణం (ఎస్ పి గొంతులో) ఒక హరికథ లాంటిది చెప్తూ "ఎర్ర త్రికోణం, ఎర్ర త్రికోణం" అంటూ ఒక నినాదంలాగా పాడుతూ సరదా పుట్టిసాడు.
ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో అసలు ఎర్ర త్రికోణం ఎవరు ప్రవేశపెట్టారు అని చూస్తే దొరికిన వివరాలు.
అతి పిన్న వయస్సులోనే మరణించిన (41 సంవతరాలు) ఉత్తర ప్రదేశ్ చెందిన శ్రీ ధర్మేందర్ కుమార్ త్యాగిగారు ఈ ఎర్ర త్రికోణం గుర్తును రూపొందించి బహుళ ప్రచారాంలోకి తీసుకు వచ్చారు. ఈయనే దీప్ త్యాగి అన్నపేరుతోనూ ఆపైన డి కే త్యాగి అన్న పేరుతో ఆరోజుల్లో సుపరిచితులు. వీరు భారత ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ విభాగంలో, అసిస్టెంటు కమిషనరుగా నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానుల కాలంలోనూ, అతి కొద్ది సమయం ఇందిరా గాంధి హయాంలో కూడ పని చేశారు.
త్యాగి గారు 1960లలో రూపొందించిన ఈ ఎర్ర త్రికోణం కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి ఒక గుర్తుగా యావత్ భారతదేశంలోనూ ప్రాచుర్యం పొందింది. వీరు రూపోందించిన ఈ ఎర్ర త్రికోణం, కుటుంబ నియంత్రణ కార్యక్రమపు గుర్తుగా కొన్ని ఆఫ్రికా దేశాలలో కూడ వాడుతున్నారట. త్యాగి గారు కాన్సర్ వ్యాధి పాలపడి అతి పిన్న వయస్సులో 41వ ఏట 1969లో మరణించారు . ఆయనకు పిల్లలు లేరు!
ఇదంతా ఎందుకు వ్రాస్తున్నాను అంటే, ఈ రోజు కొన్ని పాత టేపులు వింటుంటే ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, సుశీలగారు (అనుకుంటాను), ఆకాశవాణి కోసం పాడిన ఒక కుటుంబ నియంత్రణ పాట దొరికింది. ఎప్పుడు రికార్డు చేశామో గుర్తులేదు. ఆకాశ వాణి విజయవాడ కేద్రం నుంచి 1970 ల చివరి భాగంలో కాని 1980 ల మొదటి సంవత్సరాలలో కాని ఈ పాట ప్రసారం అయ్యి ఉంటుంది. పాట వినటానికి బాగున్నది. అందుకని అందరితో పంచుకుందామని ఇక్కడ ఉంచుతున్నాను. ఈ కింది ప్లెయర్ ద్వారా వినవచ్చు.
పై పాటను ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడారు. గాయని సుశీల గారు అనుకుంటాను. పాటను చక్కగా భావయుక్తంగా, దాదాపు సినిమా పాటలాగా పాడారు. పాట అవసరమైన చోట హుషారుగానూ , చెప్పవలసిన విషయం చెప్పేప్పుడు గంభీరంగానూ చాలా అర్ధవంతంగా సాగింది. పాట ఐదు నిమిషాల పైనే ఉన్నది. పాట రచయిత, సంగీతం సమకూర్చిన వారి పేర్లు తెలియవు. ఈ పాటకు సంబంధించిన వివరాలు ఎవరి దగ్గరన్న ఉంటే తెలియచేస్తే సంతోషం.
సామాన్యంగా రేడియోలో వచ్చే లలిత సంగీతంలో సరదా, హుషారు చాలా తక్కువగా, దాదాపు లేకుండా, ఉప్పులేని కూరల్లాగా ఉండేట్టుగా, ఆకాశవాణి వారు కడు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఈ మాట నేను అనటమే కాదు, ఎస్పీనే ఒక రెండు వారాల క్రితం "పాడుతా తీయగా" కార్యక్రమంలో ఆకాశవాణి లలిత గీతాల మీద బాహాటంగా అందరి ముందు ఒక చురక వేశారు.
రేడియో అప్పట్లో వినే వాళ్ళల్లో కొంతమంది, రికార్డు చేసిన టేపులు ఉండే ఉంటాయి. ఆరోజుల్లో టేపు చేసిన కార్యక్రమం ఏదైనప్పటికి, డిజిటైస్ చేసి అందరితో పంచుకుంటే అలనాటి ఆ కార్యక్రమాలు ఇప్పటి ప్రపంచానికి తెలియటమే కాదు, రేడియో కార్యక్రమాలకు గుర్తుగా కలకాకాలం చరిత్రలో నిక్షేపించబడతాయి.
ఇంకో వంద-రెండొందల సంవత్సరాల తరువాత ఆలోచించండి, ఆర్ఖియాలజీ సర్వే వారు తవ్వకాల్లో దొరికిన హార్డ్ డిస్కులు, ప్లాపీలు, సిడి/డివిడిలు ఇంటర్ నెట్లో దొరికిన పాత బ్లాగులు, వెబ్ సైట్లు వెతికి, పరిశోధించి, పూర్వకాలంలో ఇలా ఇలా ఉండేది అని అప్పటి సమాజానికి అందిచే ప్రయత్నం చేస్తుంటారు.
*****
***
*
***
*
‘మిసమిసలాడే గువ్వలు రెండూ గుసగుసలాడాయీ పచ్చని గూడూ కట్టుకుని వెచ్చగ ఉన్నాయీ’ అనే
రిప్లయితొలగించండిఈ పాటను ఏళ్ళ క్రితం రేడియోలో నేను విన్నాను!
ఈ పాట బాలూతో పాడింది సుశీల గారే. దీన్ని సాధించి, అందరితో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.
ఎర్ర త్రికోణం రూపకర్త వివరాలు కూడా మీ టపా ద్వారానే తెలిశాయి.
వేణూ గారూ. గాయని పేరు స్పష్టీకరించినందుకు ధన్యవాదాలు. మీ సోర్సెస్ నుండి ఈ పాట రచయిత, సంగీతం (ఆకాశవాణి నిలయ విద్వాంసులు కారనుకుంటున్నాను, ఎస్పీనే అయ్యి ఉంటారా!) కాస్త పరిశోధించి చెప్పగలరు.
రిప్లయితొలగించండి