30, డిసెంబర్ 2010, గురువారం

రేడియో కథలు

ఇవ్వాళేదో ఆ ఇంగ్లీషువాడు ఆడియో బుక్స్ అంటే అబ్బురంగా చూసి అదేమిటో మనమూ విందామని తహతహ లాడుతున్నరేకాని ఈనాటి టెక్ సావీ యువత, మనింట్లోనే పూసిన పుష్పాల సువాసన చూడలేని, మనింట్లోని సంగీతాన్ని వినలేని వారిగా తయారవ్వటంలో వారి తప్పులేదు అని నా అభిప్రాయం. ఇప్పటి యువతకు రేడియో అంటే ఏమి తెలుసు? వాళ్ళు పుట్టేప్పటికే టి వి దయ్యం అందరిళ్ళల్లో ఉన్నది, ఆ తరువాత పూనకాల ఎఫ్ ఎం రేడియో దరువులు , కేకలు, అరుపులు ఉండనే ఉన్నాయి. వాళ్ళకేమి తెలుస్తుంది పాపం రేడియో కథానికల విషయం!!!

నాకు బాగా చిన్నతనం. అప్పట్లో విజయవాడ రేడియో కేద్రం నుండి అప్పుడప్పుడూ మదరాసు కేద్రం నుండి తెలుగు కార్యక్రమాలు రిలే అయ్యేవి. ఈ కార్యక్రమాల్లో నాకు ఇప్పుడె గుర్తుకు వచ్చింది, "చక్రపాణి" అన్న పేరుతో (పేరులో నేను తప్పుగా గుర్తు పెట్టుకుని ఉంటే సరిచేయండి) ఒక అనౌన్సర్ ఉండేవారు. వారి గొంతు ఎంతో విలక్షణంగా ఉండేది. ఆ తరువాత, గొల్లపూడి మారుతీరావుగారు తన సొంపైన కంఠస్వరంతో తన కథలు, ఇతరుల కథలు హాయిగా చదివేవారు. అసలు కథంటే ఏమిటో తెలియని వయస్సు. చదువుతున్న వారి కంఠస్వరాల మాధుర్యపు గారడీ వల్ల కథలంటే మక్కువ ఏర్పడి సాహిత్య అభిమానిగా మారటానికి పునాదులు అక్కడే ఉన్నాయనిపిస్తుంది. (అప్పుడు నా వయస్సు 7-8 ఏళ్ళు ఉండవచ్చు).

ఇంతటి జ్ఞాపకాల దొంతరను కదిలించిన సంఘటన ఏమిటి? మన బ్లాగు గంధర్వ (వారి జి మైలు పేరు రంజని తప్ప మరే వివరాలు తెలియవు అందుకని "గంధర్వ" అని సరదాగా అంటున్నాను. వారు ఒక చక్కటి మైలు పంపారు. వారి మైళ్ళు ఎప్పుడూ ముక్తసరిగా, సూటిగా చెప్పవలసిన మాటలే తూకం వేసినట్టు ఉంటాయి. వారు క్లుప్తంగా చెప్పినది ఏమంటే ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగా జానకీరాణి గారు "రేడియో కథానికలు" అన్న విషయం మీద రేడియోలో ప్రసంగించారని, కాని ఆ రికార్డింగు సగం నుంచే ఉన్నదని (ముందుగా తెలియక పోవటం వల్ల, రికార్డింగుకు సిధ్ధంగా ఉండే అవకాశం లేక) "నేను-మీరు" బ్లాగ్‌లో ఈ ఆడియో ఉన్నదని చెప్పారు. సరి, అక్కడకు పోయి చూస్తే ఆడియో ప్లే కావటంలేదు-సరిగ్గా లింకు చేసినట్టులేరు.

రంజనిగారే ఆ ఆడియో పంపారు. కింది ప్లేయర్ ద్వారా వినండి.




(PHOTO COURTESY www.apallround.com)

జానకీరాణిగారు ఆ కొద్ది సమయంలో ఎన్నెన్ని విశేషాలు చెప్పారు, ఎంతటి విశ్లేషణ. రేడియో కథానికకు ఉండే పరిధులు చక్కగా వివరించారు. ఈ పరిధులన్ని కూడ ఇప్పటి మీడియ (ముఖ్యంగా ఎలక్‌ట్రానిక్ మీడియా) అనుసరిస్తే ఎంత బాగుండును. జానకీ రాణిగారి ప్రసంగంలో నాకు దొరకని సమాచారం ఒక్కటే. ఆకాశవాణి హైదరాబాదు కేద్రం నుండి 1980 ఆగస్టు నుండి అనుకుంటాను "నవలా స్రవంతి" అని ఒక కార్యక్రమం రాత్రి 8:45 కు ప్రతిరోజూ వచ్చేది. ఆ కార్యక్రం గురించి.

తురగా జానకీరాణిగారు రచయిత్రిగానే నాకు తెలుసు. ఆవిడ రేడియోలో పనిచేశేవారన్న విషయం నేను వెబ్ లోకంలోకి 2003లో వచ్చేవరకు తెలియదు. జానకీ రాణిగారు చలంగారి మనుమరాలని ఆవిడ చలంగారి గురించి ఒక విశ్లేషణాత్మక (ఆవిడ పక్కనుండి) పుస్తకం వ్రాశారని కూడ తెలియదు.

బ్లాగులో ప్రచురించటానికి జానకీ రాణిగారి ఫొటో దొరుకుతుందా అని గూగులిస్తుంటే ఒక చక్కటి వెబ్ సైటు అందులో ఆవిడతో ఒక ఇంటర్వ్యూ దొరికాయి. ఈ కింది లింకు నొక్కి ఆ ఇంటర్వ్యూ చదువుకోవచ్చు.



రేడియో అంటేనే బహుజన హితాయ... బహుజన సుఖాయ... రేడియో ద్వారా హితం పలుకుతాం

-తురగా జానకీరాణి


1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.