20, ఫిబ్రవరి 2011, ఆదివారం

చందమామకు పంపిద్దామనుకున్న కథ

కీర్తిశేషులు శ్రీ శుద్ధపల్లి రామ్మూర్తి
=========================

**************************************************************************
కథ మా తాతయ్య (పై ఫోటో) మా చిన్నప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆయన చెప్పిన కథలో ఉన్న ముఖ్యాంమే గుర్తున్నది. దానికి చిలువలు పలువలు కలిపి చిన్ని కథ తయారు చేశాను.
**************************************************************************

-------------------------------------
అర్జున గర్వ భంగం
-------------------------------------
మహా భారత యుధ్ధం అయిపోయింది. పాండవులు విజయం సాధించారు. ధర్మరాజు పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉన్నది. మిగిలిన పాండవులు ఎవరికి నియోగించబడిన పనులు వారు చేసుకు పోతున్నారు. అర్జునుడు రోజులో ఎక్కువ భాగం పూజలో గడుపుతున్నాడు. తన పూజ కోసం ఒక తోటనే పెంచి, దేవుని ప్రీతిపాత్రమైన ఫల, పత్ర, పుష్పాలను అర్పిస్తూ పూర్తి పూజా విధానాలతో భగవంతుని పూజిస్తూ ఆనందం పొందుతూ ఉన్నాడు.

ఒక రోజున శ్రీకృష్ణుడు వచ్చి, "అర్జునా! నాకు ఇంద్రునితో కొద్దిగా పని ఉన్నది ఇంద్రలోకం వెళ్దాము, నాతొ బాటుగా వస్తావా" అని అడిగాడు. అర్జునుడు, అత్యవసరమైన రాజకార్యాలు ఏమీ దగ్గరలో లేకపోవటంవలన, శ్రీకృష్ణునితో వెళ్ళటానికి ధర్మరాజు అనుమతితో, అంగీకారం తెలిపాడు. ఆ మర్నాడు, ఇద్దరూ కలసి ఇంద్ర లోకానికి చేరారు. ఇంద్రుడు వీరిని ఆహ్వానించి తన భవనంలోకి తీసుకుని వెళ్ళాడు. శ్రీకృష్ణుడు, ఇంద్రుడూ కలసి ఏదో దైవ కార్యం చర్చిస్తుండగా, అర్జునుడు బయట ఉన్న తోటలో తిరుగాడుతూ ఉండగా ఒక పెద్ద కట్టడం చూసి అక్కడకు వెళ్ళి చూశాడు.

ఆ కార్యాలయం బయట "మానవ పూజా గణనా కార్యాలయం" అని వ్రాసి ఉన్నది. ఇదేమి విచిత్రం అనుకుంటూ ఆ కట్టడం లోపలి వెళ్ళాడు, అర్జునుడు. లోపల చూస్తే అనేకమంది దేవతా ఉద్యోగులు చక చకా పట్టీలు, ఆవర్జాలతో నిండిన పుస్తకాలు నింపుతున్నారు, మరికొందరు ఒక చోటి నుండి, మరొక చోటికి బదిలీ ఆవర్జాలు పట్టుకుని వెళ్ళి, వేరొక ఆవర్జాలో అంకెలు వేస్తున్నారు. అక్కడె కొంచెం తీరికగా కనిపించిన అధికారి దేవతని సమీపించి, అర్జునుడు అడిగాడు, "ఓ దేవతా అధికారీ, ఇదేమి కార్యాలయము, ఏమి పని జరుగుతున్నది , పూజలకు సంబంధించిన లెక్కలవలె చిత్రముగా కనిపించుచున్నది, కొంచెం వివరింపగలరా" అని అడిగాడు.

అది విన్న ఆ దెవతా అధికారి, అర్జుని వంక ఒక్కసారి చిత్రంగా చూసి, వెంటనె తనకున్న శక్తితో అతను మానవమాత్రుడైనప్పటికీ , శ్రీకృష్ణునితో అక్కడకు వచ్చినట్టుగా తెలుసుకుని, ఇలా చెప్పసాగాడు. "అయ్యా, అర్జునా, నిజమే, ఇదొక కార్యాలయమే, ఇక్కడ భూలోకంలో జరుపబడే దైవ కార్యాలన్నిటిని గణించటం జరుగుతున్నది. ఎవెరెవరు ఎంత పూజ చేస్తున్నారు అని వారి వారి ఖాతాలలో నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.

ఒకవేళ ఒకరి తరఫున వేరొకరు పూజ చేసినా సరే, ఆ పూజలు కూడ, చేసినవారి విధేయతను బట్టి వారెవరి కోసం పూజ జరిపారో, వారి వారి అర్హతను బట్టి వారి పేరున ఆ పూజా ఫలితం నమోదు జరుపుతూ ఉంటారు. అదే కాదు, పూజలో వాడబడిన పూజా ద్రవ్యాలూ, పువ్వులు మొదలైనవన్నీ ఇక్కడకు చేరుకుంటాయి. ఏ ఏ దేవుడికి చేయబడ్డ పూలు ఆ దేవుని వద్దకు పంపుతూ ఉంటాము. అక్కడనుండి మళ్ళి ఆ పూలు, ఇతరాలు మళ్ళి భూమ్మీదకు సృష్టికి వాడబడతాయి. ఇదీ ఇక్కడికార్య కలాపాలు" అని వివరించి, అప్పుడె అటుగా వెడుతున్న ఒక దేవతను పిలిచి, అర్జునునికి వారి కార్యాలయం లోని వివిధ విభాగాలను చూపించమని పురమాయించాడు. అర్జునుడు ఆ అధికారికి కృతజ్ఞతలు తెలిపి ఆ దేవతతో బయలుదేరాడు.

ఆ దేవత వారి కార్యాలయంలో ఉన్న అనేకానేక విభాగాలు, లెక్కలకు సంబంధించిన శాఖలు చూపించి, చివరకు ఒక పెద్ద గదుల సముదాయానికి తీసికెళ్ళాడు. అక్కడ ఎంతో మంది దేవతా ఉద్యోగులు ఉన్నారు. వారు చాలా వేగంగా పనులు చేస్తూ, పూలు ఇతర పూజా ద్రవ్యాలు వేరు వేరు చేస్తూ హడావిడిగా అటూ ఇటూ తీసుకువెళ్తున్నారు. బయట విష్ణు దూతలు, శివదూతలు వారినుండి ఆ పూలు వగైరాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు.

అధికారి చెప్పినది గుర్తుకు వచ్చి, అర్జునునికి ఒక అలోచన వచ్చింది, తాను రోజులో చాలా భాగం పూజలోనే గడుపుతూ ఉన్నాడాయే. మరి తన పూజా ఫలితం ఎలా ఉన్నదో చూసుకోవాలనిపించింది. వెనువెంటనే ఆ సముదాయం వ్యవహారాలు చూస్తున్న అధికారి దగ్గరకు వెళ్ళి తన కోరిక వెలిబుచ్చాడు. ఆయన అర్జునుని, హస్తినాపుర ఉపశాఖ ఉన్నచోటికి స్వయంగా తీసుకుని వెళ్ళాడు. అక్కడ చూస్తే డజనుకు పైగా దేవతలు, ఎంత అమృతం తాగి ఉన్నవారైనా, తెగ ఆయసపడిపోతూ కుప్పలు కుప్పలుగా పూలు తోడిపోస్తున్నారు. వాళ్ళను వెళ్ళి అర్జునుడు ఆత్రంగా అడిగాడు, "నా పూజా ఫలం ఎంత ఉన్నది", అని. ఒక దేవత ఒగరుస్తూ, ఒక పక్క పూలు తోడిపోస్తూనే, "నీ పేరేమి" అన్నాడు. అర్జునుడు తన పేరు, ఊరు చెప్పుకున్నాడు. అప్పుడు ఆ దేవత ఎంతమాత్రం లెక్కలేకుండా 'ఏమోనండి, మీ పేరెప్పుడూ వినలేదు మేము. అక్కడ హస్తినలో ఎవరో భీముడట, ఆయన చేసిన పూజా ఫలితమే ఈ పూలన్ని. తోడలేక చచ్చిపోతున్నాము రోజూను. మరింత సిబ్బందిని ఇమ్మంటే, ఇంద్రులవారి ఆజ్ఞ లేదని అంటున్నారు" అన్నాడు బాధగా.

అర్జునుడికి మతిపోయింది. తానేమి, తన పూజేమి ఇంత కాలంగా ఎంతో నిష్టగా, పూజా విధానాలన్నీ కూడా తప్పకుండా శాస్త్రాలలో చెప్పిన రీతిలో
రోజున ఏ పువ్వు , ఏ పత్రం వాడాలో తెలుసుకుని తాను పూజ చేస్తున్నాడే, అయినా ఇక్కడ ఇంద్రలోకంలో తానంటే ఏమాత్రం గణ్యత లేకపోవటమేకాక, తన అన్న భీముడికి ఇంత పేరా అని చాలా చింతిస్తూ, ఇంద్రభవనానికి తిరిగి వెళ్ళాడు.

అప్పటికి శ్రీకృష్ణుడు ఇంద్రునితో చర్చలు ముగించి అర్జునుని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంద్రుడు కూడ అర్జునుని కుశల ప్రశ్నలు వేసినాక, మళ్ళి భూలోకానికి తిరిగి వెళ్ళే ప్రయాణం మొదలు పెట్టారు కృష్ణార్జునులు . దారిలో శ్రీకృష్ణుడు, అర్జునుని చూసి, ఏమీ ఎరుగనట్టుగా, ఈ విధంగా అడిగాడు, "అర్జునా! ఏమిటి నువ్వు చాలా దిగులుగా కనిపిస్తున్నావు, మనం ఇక్కడకు వచ్చేప్పుడు నీలో ఉన్న ఉత్సాహం కనపడటం లేదు?" అని అడిగాడు, అర్జునుడు కొంత తటపటాయించినా, కాసేపటికి నిట్టూరుస్తూ, ఇంద్రలోకంలో తాను చూసిన, విన్న వివరాలు చెప్పాడు. అది విన్న శ్రీకృష్ణుడు, "ఔరా! భీముడు ఇంతటి గొప్ప భక్తుడన్న మాట , ఏమైనా ఈ విషయం తేల్చుకోవాలిసిందే, అవసరమైతే నేను ఇంద్రునితో స్వయంగా మాట్లాడుతాను. కాని, ముందుగా మనం భీముడు చేస్తున్న పూజా వివరాలు సేకరించాలి" అన్నాడు. వారు క్షేమంగా భూలోకం చేరుకున్నారు.

సరే, మర్నాడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు కలసి భీముడు ఉండే భవన ప్రాంతంలో జాగ్రత్తగా ఎవరికీ కనపడకుండా ఉండి, భీముడు తన రోజువారి వ్యాయామాలు అవి ముగించుకుని స్నానానికి నడివద్దకు బయలుదేరటం చూసి , భీముని వెనుక కొంత దూరం నుండి ఆయనకు కనపడకుండా అనుసరించి వెళ్ళారు. నదిలో స్నానంచేసిన భీముడు, వెంట తెచ్చుకున్న గుండిగ నిండుగా నీళ్ళు పట్టి భుజానికెత్తుకున్నాడు, దారిలో ఒకటి రెండుపూలు కోసుకుని, అక్కడే ఉన్న శివాలయానికి వెళ్ళి, "హర హర మహాదేవ శంభొశంకరా" అని ప్రార్ధిస్తూ ఆగుండిగడు నీళ్ళూ శివలింగం మీద అభిషేకం చేసి, తెచ్చిన రెండుపూలు శివలింగం మీద ఉంచి, నమస్కరించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కృష్ణార్జునులు ఇద్దరూ, భీముడిని ఆరోజంతా కనిపెడుతూనే ఉన్నారు కాని, భీముడు మరే పూజా చేయ్యలేదు, పరిపాలనా వ్యవహారాలో, తన విభాగమేమో తన పనేమో శ్రద్ధగా చేసుకుపోతూ కనిపించాడు.

అర్జునుడి ఇది చూసి డీలాపడిపోతూ, శ్రీకృష్ణునికి నమస్కరించి, "భగవాన్, నాకు నీవే తరుణోపాయం చూపాలి. ఏమిటీ మాయ, క్షణాల్లో పూజ ముగించిన భీమునికి ఇంత ఫలితమా, గంటలకొద్దీ శాస్త్రోత్కంగా పూజలు చేసే నాకు ఊరు పేరు లేకపోవటమా, ఏమిటీ అన్యాయం" అని అక్రోశించాడు.

శ్రీకృష్ణుడు మందహాసం చేస్తూ, 'అర్జునా! నేను నిన్ను కొంతకాలంగా గమనిస్తూ ఉన్నాను. నీలో నువ్వొక మహాభక్తుడివని గర్వం పెరిగి పోతున్నది. భక్తుడికి ఉండవలసినది, అణుకువగాని, అహంకారం కాదు. నీకు కలిగిన గర్వాన్ని తొలగించటానికే, నేను నిన్ను ఇంద్రలోకం చూశే అవకాశం కల్పించాను. భీమునికి ఉన్నది భగవంతునిమీద భక్తి, ఏకాగ్రత. అతను పూజ చేసే విధానం పెద్దగా పట్టించుకోడు. పూజ చేసిన కాసేపూ, భగవంతుని మీద తదేక దీక్షతో తన్ను తాను పూర్తిగా భగవంతునికి వశమైపోతాడు. అందుకనే అతని భక్తికి, పూజకు అంతటి విలువ. కాని, నీవు, పూజ చేసే విధానం, పూల సేకరణ, శాస్త్రాలలో ఉన్న వివిధ రకాల పూజా విధానాలలో కొట్టుకుని పోతూ, చివరకు పూజ చేయటం లక్ష్యాన్నే మరచావు. పూజా విధానాలు నీ మనస్సును భగవంతుని మీదకు కేంద్రీకరించటానికేగాని, భగవంతుని మీద మనస్సు పెట్టకుండా, తంతు జరపటానికి కాదు. భక్తికి, పూజకు సంబంధించిన కీలకమైన ఈ విషయం భీముడు స్వతహాగా తెలుసుకున్నాడు. నువ్వు కూడ ఈ రహస్యం తెలిసినవాడివై, నీ పూజలో ఉండవలసిన ఏకాగ్రతను సాధించు, మంచి ఫలితాన్ని పొందుతావు" అని ఆశీర్వదించాడు. ఆ పైన అర్జునుడు కూడ ఏకాగ్రతను సాధించి తరించాడు.











1 కామెంట్‌:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.