ఇప్పటి చానెళ్ళ గోల లేదు. బ్రేకింగ్ న్యూస్ అంటే ఏమిటో తెలియదు. నానా అల్లరీ చేస్తూ వార్తలు చదివే గోల చానెళ్ళు లేవు. వీళ్ళ మాటలు వాళ్లకి, వాళ్ళ మాటల్ని వీళ్ళకి చేరవేసి లేనిపోని దుమారాలు లేపే వెర్రి న్యూస్ చానెల్స్ అస్సలే లేవు. ఉన్నదల్లా దూరదర్శన్. ఎంతటి వార్తనైనా సరే ప్రధాని మంత్రి హత్య కానివ్వండి ఒక సామాన్య రోడ్ ప్రమాదం కానివ్వండి వార్తా ఏదైనా సరే ఏమాత్రం ఆవేశ కావేశాలకు లోను కాకుండా వార్తలు మనకు అందించే బంగారు రోజులు అవి. న్యూస్ చూస్తె బ్లడ్ ప్రెషర్ రాని రోజులు.
ఈ రోజున పొద్దున్నే మెయిలు చూడగానే ఒక చక్కటి వెబ్ సైటు నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఒక కొత్త వీడియోని జత పరిచాము చూడండి అని. ఏమిటది. అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందిన "రజని" ధారావాహిక ప్రారంభ సంగీతం. ఆ వీడియోని చూడండి.
రజని
అప్పట్లో రజని సీరియల్ అంటే ఒక క్రేజ్. బాసు చటర్జీ తీసిన ఈ సీరియల్ ఒక సంచలనం. ఒక సామాన్య మహిళా సమాజంలో జరిగే అవినీతి, ఆపటం, అంతే కాక మరెన్నో అవకతవకలను ధైర్యంగా బయట పెట్టటం చూసి ఎందరో స్పూర్తి పొందారు. ఈ సీరియల్ మళ్ళీ ప్రసారం చేస్తే బాగుంటుంది. అవినీతి మీద పోరాటం అంటే తెల్ల టోపీలు పెట్టుకుని ఒక చోట పోగుపడి, ఊరికే పాటలు డాన్సులు కాదు, అదేదో లోక్ పాల్ బిల్లు రాంగానే మాజిక్ చేసినట్టు అవినీతి పోతుందన్న భ్రమలో నినాదాలు ఇవ్వటం కాదు, (ఆ బిల్లు ఒకవేళ పాస్ అయ్యి, ఆ లోక్పాలే ఒక నియంతలా మారి అవినీతి పరుడైతే? మళ్ళి ఉద్యమించాలి దానికి ఒక పాతిక సంవత్సరాలు!) సామాన్య ప్రజలు చెయ్యవలసినది ఎంతో ఉన్నది అని చూపించే ధారావాహిక ఇది.
ఆ వెబ్ సైటు ఏమిటి అని వివరాలు అడిగేవారి కోసం, ఈ కింది లింకు ఇస్తున్నాను. చూడండి. అక్కడే, మనకు నచ్చిన అప్పటి ధారా వాహికలు వగైరా వచ్చినప్పుడు మనకు ఒక "ఎలర్ట్" మెయిలు పంపే సౌకర్యం కూడా ఉన్నది. ఈ బ్లాగులో ఎన్నెన్నో అప్పటి ధారావాహికల ఆడియోలు, వీడియోలు ఎన్నెన్నో ఉన్నాయి చూసి ఆనందించండి.
ఏదో మెయిలు వచ్చింది అని అది చూసి ఊరుకో బుద్ది వెయ్యలేదు. "యు ట్యూబ్" లో వెతుకుతూ ఉంటే ఎన్నెన్నో అలనాటి జ్ఞాపకాలని తవ్వి తీసే వీడియోలు దొరికినాయి. ఈ వీడియోలో, దూరదర్శన్ లో మొట్టమొదటి మహిళా వార్తా చదువరి గా పేరొందిన శ్రీమతి ప్రతిమా పురి, రష్యన్ అంతరిక్ష ప్రయాణికుడు, యూరి గగారిన్ ని ఇంటర్వ్యూ చేయబోతున్న వీడియో ఆ పైన సల్మా సుల్తానా మొదటిసారి తాను న్యూస్ చదివిన అనుభవం చెప్పే వీడియో అన్ని కలిపి దూరదర్శన్ ఏభై సంవత్సరాల పండుగ సందర్భంగా తయారు చేసిన డాక్యుమెంటరీ కనపడింది. ఆ డాక్యుమెంటరీలో మొత్తం కాకుండా కావలిసినంతవరకూ ఈ కింది వీడియో లో చూడండి. ఈ వీడియో కర్టెసీ దూరదర్శన్ అయినప్పటికీ, ఇది దొరకటానికి కారణం "బాతే" (అంటే కబుర్లు) అనే పేరుగల బ్లాగ్. ఈ బ్లాగుకు లింకు ఇదే వ్యాసంలో మరొక చోట ఇవ్వబడింది.
ఇప్పటి తరానికి తెలియని,దూరదర్శన్ రోజుల్లోఅప్పట్లో అందరికీ తెలిసిన వార్తా చదువరులుఇంకా వెతుకుతూ ఉంటే సల్మా సుల్తానా తో సి ఎన్ ఎన్ చానెల్ లో రాజ్దీప్ సర్ దేశాయ్ చేసిన ఇంటర్వ్యూ కనపడింది. ఇందులో రాజ్దీప్ అడిగిన "అప్పటి టి వి న్యూస్ కు ఇప్పటి టి వి న్యూస కు తేడా ఏమిటి?" అన్న వెర్రి ప్రశ్నకు, సల్మా సుల్తానా చాలా మెల్లిగా మెత్తగా మాట్లాడుతూనే అద్భుతమైన జవాబు చెప్పారు ఆవిడ . అలాగే అప్పట్లో "బ్రేకింగ్ న్యూస్" లేదనీ , కాని रुकावट केलिए खेद है మటుకూ తరచూ చూపించే వాళ్ళమనీ , తన మోహంలో ఏ విధమైన భావమూ చూపించకుండా, ఒక జోక్ పేల్చారు .ఈ కింది వీడియో ఆసాంతం చూసి రాజ్దీప్ సర్ దేశాయ్ కే కాకుండా ఇప్పటి టి వి చానెళ్ళ వాళ్ళందరికీ నసాళానికి అంటే జవాబు సల్మా ఏమి చెప్పారో చూడండి.
ఇందిరా గాంధీ మీద హత్యా ప్రయత్నం జరిగిన రోజు నాకు బాగా గుర్తు. నేను అప్పుడు వరంగల్ లో పని చేస్తున్నాను. మా ఆఫీసులో క్రికెట్ పిచ్చి ఉన్న ఆఫీసరు ఒకాయన, టెలిఫోన్ ఎక్చేంజికి ఫోన్ చేసి పాకిస్తాన్లో జరుగుతున్నా భారత్-పాక్ మాచ్ స్కోర్ అడగబొయ్యాడు.(అప్పట్లో అదొక్కటే సాధనం ఆఫీసులో ఉంటే స్కోర్ కనుక్కోవటానికి)ఆ పక్కనుంచి ఆ ఎక్చేంజి ఉద్యోగి, క్రికెట్ స్కోర్ ఎక్కడయ్యా బాబు, ఇందిరా గాంధీ మీద హత్యా ప్రయత్నం జరిగిందట, ఆవిడ వళ్ళంతా రక్తం ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారుట, లైన్లన్నీ జామ్ అయి ఉన్నాయి అని చెప్పాడు. ఈ వార్త మా ఆఫీసుకు చేరిపోయింది. ఎందుకైనా మంచిది అని మా ఆఫీసు (మొత్తం గ్లాస్ గోడతో ఉన్నది) షట్టర్లు మూయించేసాను. ఆఫీసు వరంగల్లులో మంచి రద్దీగా ఉండే ఎం జి ఎం హాస్పిటల్ కూడలిలో ఉండేది. కాసేపటికి చాలా వేగంగా వెళ్ళే మోటార్ కేడ్ మా రోడ్ నుంచే వెళ్ళింది. అప్పటి హొం మంత్రి శ్రీ పి వి నరసింహా రావు అప్పుడు వరంగల్లులోనే ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన (ఈమాటకు అర్ధం ప్రత్యక్షంగా అప్పుడే చూడగలిగాను) బయలుదేరి, వరంగల్లులో ఎప్పటిదో ఒక పాత రెండో ప్రపంచ యుద్ధపు రన్ వే ఉంటే అందులో దిగిన ప్రత్యెక విమానంలో ఢిల్లీ వెళ్ళిపొయ్యారు. ఆఫీసుకు దగ్గరలోనే ఉన్న ఒకాయన వెంటనే వెళ్లి తన ట్రాన్సిస్టర్ పట్టుకు వచ్చాడు. నేను రేడియో ఆస్ట్రేలియా ట్యూన్ చేసి ఉంచితే, వాళ్ళు అప్పటికే (పొద్దున్న పదకొండు అయ్యి ఉంటుంది), ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులే కాల్చారని, ఆమె మరణించిందని చెప్తున్నారు. మన రేడియో కాని దూరదర్శన్ లో కాని ఏవిధమైన వివరాలు లేవు.
ఆఫీసులో ఒక్క పని జరుగలేదు. మా టైపిస్ట్ పొద్దున్న ఎక్కించిన కాయితం, రెండు లైన్లు టైపు చేసినది, మేమిక ఆఫీసు మూద్దాం అని నిర్ణయించినాక ఆ మిగిలిన మరో రెండు లైన్లూ సాయత్రం ఐదు గంటలకు పూర్తి చేసి ఇచ్చాడు.
ఇంత జ్ఞాపకాల దొంతర కదిపి అప్పటి విషయం ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, బయట ఇంత గోల జరుగుతున్నా కూడా, అప్పటి ప్రచార సాధనాలు అయిన ఆకాశ వాణి కాని, దూర దర్శన్ గోల చెయ్యలేదు. అనవసరపు ఇంటర్వ్యూలు చేసి అల్లరి చెయ్యలేదు. కాని జరగవలసిన ఘోరం జరిగిపోయి, సిక్కుల మీద మూకుమ్మడి దాడులు దేశవ్యాప్తంగా ముఖ్యంగా ధిల్లీ లో జరిగాయి. కాని ఆ దాడులకు కారణం దూర దర్శన్ కాదు (2005 లో ఒక ఫ్యాక్షనిస్ట్ హత్య జరిగినప్పుడు జరిగినది ఏమిటి, ప్రాతాలతో సంబంధం ఆ నాయకుడితో ఏమాత్రం సంబంధం లేని చోట్లల్లో కూడా దహనకాండ జరిగింది దానికి కారణం .....!!!).
దూరదర్శన్ రోజుల్లో న్యూస్ అసలు చెప్పకుండా ఏదో జరిగిపోయింది అని ప్రజలు బీతిల్లి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేట్టు చేస్తే, ఇప్పుడు అనవసరపు వార్తా ప్రసారాలతో గొడవలకి కారణం అవుతున్నాయి మన చానెళ్ళు. రెండూ కూడా ఒక విషయాన్నీ ఎలా చెయ్యకూడదో చెప్పేవే.
దూరదర్శన్ రోజుల్లో న్యూస్ అసలు చెప్పకుండా ఏదో జరిగిపోయింది అని ప్రజలు బీతిల్లి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేట్టు చేస్తే, ఇప్పుడు అనవసరపు వార్తా ప్రసారాలతో గొడవలకి కారణం అవుతున్నాయి మన చానెళ్ళు. రెండూ కూడా ఒక విషయాన్నీ ఎలా చెయ్యకూడదో చెప్పేవే.
ఇందిరా గాంధీ మీద జరిగిన "హత్యా ప్రయత్నంగానే" సాయంత్రానికి కూడా దూరదర్సన్ తమ వార్తల్లో చెప్పారు. వచ్చే దు:ఖాన్ని ఆపుకుంటూ, సల్మా సుల్తానా ఆ వార్తను ఎ విధంగా చదివారో, అప్పటి ఆమె భావాలు కొన్ని సంవత్సరాల క్రితం చెప్పినవి ఈ కింది వీడియోలో చూడండి.
దూరదర్సన్ మాత్రమె మనకి టి వి గా ఉన్న రోజుల్లో మనకు కనపడే అప్పటి న్యూస్ రీడర్లను ఇతరుల ఫోటోలు చూడాలంటే "బాతే బ్లాగ్" చూడాలిసిందే . ఈ కింది లింకు నొక్కి ఆ బ్లాగ్ లో ఉన్న అనేకానేక విశేషాలు, విషయాలు చూడండి.
good olden DD days..!!
రిప్లయితొలగించండిధన్యవాదాలు! మళ్లి ఆ రోజులలోకి తీసుకెళ్ళినందుకు
రిప్లయితొలగించండి