2, నవంబర్ 2012, శుక్రవారం

సెల్ఫ్ గోల్ లేదా ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డ చందాన
ఫోటో లో ఉన్నాయన క్షమించాలి, ఆయనేమీ తప్పు చెయ్యలేదు. ఫోటో  బాగుందని వాడాను అంతే  ఆయన చాలా మంచివాడు.
 ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు అన్న సామెతను నిజం చెయ్యాలని కంకణం కట్టుకున్నారల్లే ఉన్నది కుమార్ రాజావారు! అక్కడేమో పెద్ద అయ్యవారు, పెద్ద పెద్ద మంత్రిత్వ శాఖలు ఒక శాఖ మీద నుంచి మరొక శాఖకు లంఘిస్తూ నిర్వహిస్తూ ఉంటారుట, ఇక్కడ కుమార్ రాజావారు ఏమి చేస్తారో తెలియదు కాని డబ్బులు అలా వచ్చి పడుతూ ఉంటాయట. అదే అడుగుతూ ఒకాయన ట్విట్టాడుట. అంతే కుమార్ రాజా వారికి ఖోపం వచ్చేసి పోలీసులకి ఈ మైలు ఇచ్చారుట. వెనువెంటనే, టోపీలు కూడ సరిగ్గా పెట్టుకున్నారో లేదో, మన సర్వసమర్ధ పోలీసులు,  ఆ ట్విట్టుణ్ణి (విటుణ్ణి కూడా ఇంత త్వరగా అరెస్టు చెయ్యరేమో) తెల్లవారు ఝామున  అరెస్ట్ చేసి జైలో పారేశారుట. పాపం ఆయన చచ్చీ చెడి బైయిల్ సంపాయించి (ఎంత ఖర్చు అయ్యిందో పాపం) బయటపడ్డాడుట. ఇవ్వాళ  ఏ టి వి (ఆంగ్లంలో) చానెల్ పెట్టినా కూడా హోరెత్తిపోతున్నది ఈ సెల్ఫ్ గోల్ కథనంతో.

సెల్ఫ్ గోలా? ఇదేమిటి అనడక్కండి. అయినా సరే చెప్తాను.  ఈ ట్వీట్టటంలో,  కుమార్ రాజా మీద ఈ పిల్ల కాకి ఏమి ట్విట్టాడో ఎవ్వరికీ తెలియదు ఇవ్వాళ్టివరకూ. కాని కుమార్ రాజా వారి కండ కావరం వల్ల, ప్రపంచం మొత్తం ఇప్పుడు ట్విట్టుడు, ఏమి ట్విట్టాడో తెలిసిపోయింది. నిన్నటి వరకూ పదహారు మంది స్నేహితులు (అందులో ఐదుగురు చుట్టాలేనుట) ఉంటే, ఇవ్వాళ పదిన్నర ప్రాంతానికి, కుమార్ రాజా వారు చేసిన గోల వల్ల,  పదకొండు వందల పైగా జనం విరగపడి ఆ ట్విట్టుడికి స్నేహితులుగా చేరిపొయ్యారుట, రాత్రికి రాత్రి సెలబ్రటీ అయిపోయి,  టి వి చానెల్ వాళ్ళు, ఆ ట్విట్టుణ్ణి, తమ తమ చానెళ్లకు తీస్కు వెళ్ళటానికి  చొక్కాలు చింపుకుంటూ  ముష్టా-ముష్టి, కచా-కచి  యుద్ధాలు చేసేసుకుంటున్నారని, చొక్కాలు చింపుకోవటానికి కుదరని  చానెళ్ళు బ్రేకింగ్ న్యూస్ అంటూ స్క్రోల్ చేస్తున్నాయి.    ఇదే మరి సెల్ఫ్ గోల్ అంటే. ఏమయినా వీళ్ళకి మట్టికొట్టుకుపొయ్యే రోజులు వచ్చాయి, అందుకనే ఇలాంటి వెర్రి మొర్రి ఆలోచనలతో, అధికారం చేతులో ఉన్నది కదా అని పిచిపిచ్చి పనులు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ, మనిషా మోహన్ బాబా అనే సామెత నూట ఒక్కోసారి నిరూపించబడటం, పైగా అది వంశపారంపర్యం అనే విషయం గురించిన ఉదంతం  ఇంకా రగులుతుండగానే, ఈ సెల్ఫ్ గోల్ ఉదంతం బ్రేకింగ్ న్యూస్ అయ్యి, ఇంకా బ్రేకుతూనే ఉన్నది.

ఈ విషయంలో నాకు ఎంత వద్దనుకున్నా కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. 

  1. సెల్లు ఫోను పోయిదిరా నాయనా కేసు బుక్ చేసి పెట్టండ్రా, వెతికి ఇవ్వక్కర్లేదు, జస్ట్ కేసు వ్రాసుకుని ఎఫ్ ఐ ఆర్ కాపి ఇవ్వండ్రా, నా ఏడుపు నేను ఏడ్చుకుంటాను  అని ఎదురుగా నుంచుని  ఉండే వాళ్ళను పురుగులకింద విదిలించేసి పారేసే ఈ పోలీసులు, ఎక్కడినించో, ఎవరిచ్చారో తెలియకుండా వచ్చిన ఈ మైల్ పట్టుకుని, టెర్రరిస్టులను వెతికేప్పుడు కూడా చూపని సాహసం, నైపుణ్యత చూపించీ, పాపం ఆ ట్విట్టుణ్ణి ఎంతో వేగంతో అరెస్ట్ చేసి జైల్లో పారేసి,  అప్పుడు గుర్తుకు వచ్చి ఆయాస పడటం మొదలెట్టి, ఆ వగర్పును వాళ్ళ  స్వామి భక్తికి నిరూపణగా చూపెట్టారు. ఈ విషయం ఎక్కడా ఏ టి వి చానెల్లోనూ పానెల్ డిస్కషన్లలో రాలేదు. ఎంతసేపూ, ట్విట్టర్లో వ్రాసినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అనే కాని, ఈమైల్ ఇచ్చెస్తే పోలీసులు అరెస్ట్ ఎందుకు చెయ్యాలి అని ఎవ్వరూ అడగరే!!! అలా వ్రాయకూడదు అని లా ఏమన్నా ఉంటే గింటే, స్టేషన్ కి పిలిపించి విషయం కనుక్కుని, ఇంతకు ముందు ఇలాంటి పనులేమన్నా చేశాడా అని వాకబు చేసి, మొదటి సారైతే జాగ్రత్త చెప్పి పంపించెయ్యాలి కాని, అరెస్టు,  జైలు. ఏమి అంత తొందర? మనమేమన్న కమ్యూనిస్టు పాలనలో ఉన్నామా! ఇదే తొందర మరి ఈ అవినీతి కేసుల్లో చూపించరేమి?

  1. అదేదో ఐ టి యాక్టుట, అందులో 60A సెక్షన్ ట దాని ప్రకారం, కప్యూటర్ పరికరాన్ని  ఉపయోగించి. ఒక వ్యక్తి, మరొక వ్యక్తికి తరచూ సందేశాలు పంపుతూ, విసిగిస్తూ,  వేధిస్తే, అలా పంపే వ్యక్తిని అరెస్టు చెయ్యచ్చుట, అలాంటి నేరం నిరూపణ అయితే, శిక్ష మూడెళ్ళుట. అబ్బ ఎంతటి న్యాయ దృష్టి.  ఏదైనా వాహనం, ఇష్టం వచ్చినట్టుగా,నిర్లక్ష్యంగా నడుపుతూ, ప్రమాదానికి కారణం అయ్యి, ఆ ప్రమాదం లో ఎవరైనా మరణిస్తే, ఈ ప్రమాదానికి కారణం అయిన ఆ వ్యక్తి అదే నేరస్తుడికి వేసే శిక్ష ఎంతో తెలుసా, ఎక్కువలో ఎక్కువ రెండేళ్ళుట. ఈ రెండిటిలో ఏది పెద్ద నేరం?? ఒకవేళ ఆ మొదటిది నేరమని అనుకున్నా కూడా? ఎంతటి అద్భుతమైన న్యాయ దృష్టి ఈ లా మేకర్స్ కి,  అదే మనచేత (?) ఎన్నుకోబడ్డ్ ఈ ............. వద్దులెండి(ఎందుకోచ్చిన గోల!!), ఈ మానవ మాత్రులకి (వాళ్ళు మటుకు ఎక్కడినుంచో దిగి వచ్చామనే అనుకుంటున్నారు).

  1. TIMES NOW చానెల్లో, ఒక వెర్రి కుట్టె వచ్చాడు. వాడు ఈ సైబర్ చట్టాలకు సంబంధించి నిపుణుడుట, అందుకనే కాబోలు గుప్పెట్లో ఎంత ఇసకుందిరా అంటే, ట్రిగ్నామిటరీ లెక్కలు వెయ్యటం మొదలు పెట్టి అంటాడూ, కుమార్ రాజావారికి ఈ ట్విట్టుడు తన సందేశాల ద్వారా అవమానం కలిగించాడు, పరువుట  పొయ్యేట్టుగా చేశాడుట, ఆయనేమో పరువు నష్టం కేసు పెట్టాలి, కాని ఆ లాయర్ నోటీసు ఏ చిరునామాకి పంపాలి, ట్విట్టర్ లో చిరునామా లేదుకదా అని ఉన్నాయి కదా అని కళ్ళను పెద్దవిగా చేసి చూపిస్తూ మరీ తన "కాంగ్రెస్ చంచాతనం" అంతా  చూపించాడు. ఇదుకే వాణ్ణి వెర్రి కుట్టె అన్నది. తెల్లవారు ఝామున వచ్చి ఆ ట్విట్టుడి చిరునామా చట్టుక్కున పట్టేసి  పోలీసులు అరెస్టు చెయ్యగా లేనిది, పరువు నష్టం నోటీసు పోలీసులు ఎక్కడికి వచ్చి అరెస్టు చేశారో అక్కడే ఇవ్వలేరా.

  1. తరువాత, జస్ట్ మూడుసార్లు అదీ పదేసి నెలల అంతరంతో ట్విట్టితేనే, అది వేధించటం అయిపోతే, అరగంట వ్యవధిలో చూపించినదే చూపిస్తూ చెప్పిందే చెప్తూ వేసే వ్యాపార ప్రకటనల మాటేమిటి? అది వేధింపు కాక మరేమిటి! అవ్వి చూపించే చానెళ్ళను ఏమి చెయ్యాలి, ఆ ప్రకటనలు ఇచ్చే కంపెనీలను ఏమి చెయ్యాలి, ఆ వ్యాపార ప్రకటనా కాలుష్యాన్ని వందల  వేల సార్లు చూపించే పథక రచన ఎల్లకాలం చేస్తూ ఉండే యాడ్ మాఫియాని ఏమి చెయ్యాలి. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అండమాన్సులో పారెయ్యద్దూ. ఒక్క ట్విట్టినందుకేనా అరెస్టు చెయ్యటం. ఎంతటి నిస్పక్షపాత వైఖరి!

  1. పేపరు వాళ్ళు, టి వి ల వాళ్ళు నిరంతరాయం ఈ రాజకీయ నాయకులను ఉన్నవి లేనివీ కూడ వ్రాస్తూ, చూపిస్తూ తెగ విమర్శిస్తూ ఉంటారు కదా, మారి వాళ్ళ మీద పెట్టరేమి ఈ కేసులు. సామాన్యుడే దొరికాడా ఈ ఐ టి యాక్ట్ సెక్షన్ 60A అమలు చెయ్యటానికి. బాబూ బ్లాగర్లూ, ఇక మనం కూడా జాగ్రత్తగా ఉండి, ఆచి తూచి వ్రాయాలల్లే ఉన్నది. లేదా సదా అత్యవసర వస్తువులు షేవింగ్ కిట్ లాంటివి, ఒకటి రెండు గుడ్డలు మొత్తం  ఒక మూటగా తయారు చెసి తలకింద పెట్టుకు పడుకోవాలో ఏమో,  ఎప్పుడు వచ్చి ఏమి వ్రాశావని అరెస్టు చేస్తారో, ఆ ట్విట్టుడి కి ఉన్న పరపతి, డబ్బు మన దగ్గర ఉండద్దూ బైయిల్ తీసుకు బయట పడటానికి?

ఇప్పుడే అందిన వార్త 
అసలు విషయం తెలుసా, ఆ ట్విట్టినాయన ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ సభ్యుడటా! చెప్పారు కారేమి, మరంతే అరెస్టు చేసిపారెయ్యటమే. కరప్షనుట కరప్షను ఎక్కడుందీ!!


ఇక మిష్టరీ విచ్చిపోయింది.  హమ్మయ్య హాయిగా పడుకోవచ్చు తెల్లవారు ఝామున ఎవ్వరూ లేపరు, నేను ఆ ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్  సభ్యుణ్ణి కాదు కదా మరి.

2 వ్యాఖ్యలు:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.