2, ఫిబ్రవరి 2013, శనివారం

నేనూ "మిధునం" చూశానునా చేతికి పైగా కుడి చేతికి ఆపరేషన్ అయ్యి వాడలేని పరిస్థితి, విశ్రాంతికి స్వంత ఊరుకు వచ్చి కాస్త కుదుట పడి, ఈ రోజున మిథునం సినిమా చూడగలిగాను. చేతి పరిస్థితి కూడా కష్టపడి టైపు చెయ్యగలిగినంత  తగ్గింది. కాబట్టి చాలా రోజుల తరువాత ఒక వ్యాసం.అనుకున్నంతా అయ్యింది, మిధునం, మిధునం అనుకున్నంతసేపు పట్టలేదు, వెళ్ళటం చూడటం నచ్చకపోవటం. ప్రస్తుతం తెలుగు సినిమాల పేరిట వస్తున్న చెత్తంతా క్రమం తప్పకుండా చూస్తూ ఎక్కడన్నా మంచి సినిమా ఉన్నదా అని కాగడా వేసి వెతుకుతున్న విక్రమార్క ప్రేక్షకులకి ఈ సినిమా తప్పకుండా సేద తీరుస్తుంది. కాని  మూస సినిమాల బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటూ మంచి సినిమాలనే చూస్తూ వస్తున్న వాళ్ళకి ఈ సినిమా నిరాశే మిగులుస్తుందని చెప్పక తప్పదు.

ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అదేమిటి అంటే, అప్పటికే ప్రసిద్ధమైన ఒక కథను ఆ కథా రచయిత వ్రాసినంత సులభం కాదు సినిమా తియ్యటం. తనికెళ్ళ భరణి గారు కొంత ప్రయత్నం చేశారు కాని,  సినిమా చాలా కృతకంగా, అసహజంగా అనిపించింది. మొదటి విషయం సినిమాలో ఇద్దరే ఉండి తీరాలి మరెవ్వరూ కనపడకూడదన్న నియమం పెట్టుకోవటం పెద్ద తప్పిదం.  శ్రీ రమణ గారు వ్రాసిన కథలో కూడా ఒక కుర్రవాడు ప్రత్యక్షంగానూ, కొన్ని ఇతర పాత్రలు (ఆ కుర్రవాడి తల్లి తండ్రులు) పరోక్షంగానూ కనిపిస్తారు

అసలు కథలో లేని అంశాలను చొప్పించటం కూడా చీకాకు పరిచింది. అలా చొప్పించినవాటిలో ముఖ్యమైనవి: 

1.పుష్ప విలాపం పద్యం కలలో వినిపించటం అనే ఉదంతం:

ఒక చోట పుష్పవిలాపం ఆడియో వినిపిస్తుండగా అప్పదాసు ఫుల్ డ్రెస్ లో పరుగుపరుగున వెళ్ళి ఉయ్యాల్లో ఏడుస్తున్న పిల్లవాణ్ణి తియ్యబోతే అది కోసిన మందార పువ్వు. వెను వెంటనే అప్పదాసు తన భార్య తల్లో పెట్టుకున్న మందార పువ్వు తీసి చెట్టు మీదపెట్టేస్తాడు. కాని అదే అప్పదాసు, పూజ చేసుకుంటూ పూలనే పూజ చేస్తాడు, పైగా అదే మందారపూలు మూడు ఆయన ముందు గిన్నెలో కనిపిస్తాయి. ఇంకా చెబితే  అప్పదాసుగారు కూరగాయల మొక్కల్లో ఆత్రంగా తిరుగుతూ రకరకాల కూరగాయలు పుటుకు పుటుకు తెంపుతూ కనిపిస్తాడు. భార్య  ఒక పువ్వు తెంపి తల్లో పెట్టుకుంటేనే, పుష్ప విలాపం కలలో  కనపడి లేచికూచున్న అప్ప దాసు చేసే పనులేనా ఇవ్వి! పుష్ప విలాపం పద్యం చూపించి మార్కులు కొట్టేద్దామన్న ఆత్రమే  కాని అది చూపిస్తే ఆ పాత్ర గుణగణాల మీద ఆ సీన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది  అన్న విషయం గమనించుకున్నట్టుగా లేదు.

2. ఆవుదూడ మరణం:

మాతృక లో అప్పదాసు తన ఆవును వేరే వాళ్ళ ఇంటో ఉంచి వాళ్ళ పోషణలో ఉంచుతాడు. సినిమా ప్రకారం ఆయన ఇంట్లోనే ఉంటుంది. సినిమా కథ ప్రకారం ఆవుదూడ "అంజి" తప్పిపోయినప్పుడు ఎండనకా నీడనకా అప్పదాసు తెగ వెతుకుతున్నా కూడా ఇతరులు ఎవరూ కనపడపోవటం ఈ సినిమాలో అసహజత్వానికి పరాకాష్ట. ఆ తరువాత సినిమాలో ఈ ఆవుదూడ మరణించటం, కథకు ఏమి సాయపడిందో స్క్రీన్‌ప్లే  పేరిట అది చొప్పించిన భరణిగారే చెప్పాలి. 

3.బుచ్చి లక్ష్మి స్నేహితురాలు మీనాక్షి వైనం:

ఏదో సస్పెన్సు సినిమాలో లాగ ఒక ఉత్తరం  వస్తుంది.అది రాంగానే అప్పదాసు కొద్దిగా చదువుతుంటాడు. చదువుతుంటె ఒక విచిత్ర గానం నేపధ్యం లో  వినపడుతుంది. సగంలో ఆయన చటుక్కున ఆ ఉత్తరాన్ని మూసేసి చింపేస్తాడు. మ్యూజిక్ కూడా హఠాత్తుగా ఆగిపోతుంది. అలా రెండు సార్లు జరుగుతుంది. ఆ వచ్చే నేపధ్య సంగీతపు "మూడ్" ప్రకారం ప్రేక్షకులు ఏమి అనుకోకూడదో అది అనుకునేట్టు చేసే ప్రయత్నం చేసినట్టుగా కనపడుతుంది.చివరకు ఒక రోజున అప్పదాసు భార్య బుచ్చిలక్ష్మే  ఆ ఉత్తరం  తీస్తుంది. తీరా చూస్తే ఆమె స్నేహితురాలు మీనాక్షి (పేరు అదే అనుకుంటాను) భర్త మరణించటం, ఆమె  కొడుకుకు బుచ్చిలక్ష్మే సహాయం చేసిందని మీనాక్షి అనుకుంటున్నట్టుగానూ, నిజానికి అప్పదాసే ఆ సహాయం చేసినట్టుగానూ  మనకు పరోక్షంగా బుచ్చిలక్ష్మి ఆ ఉత్తరం చదవటం  ద్వారా  డైరెక్టరు గారు మనకు చెప్పిస్తారు. అంతవరకు బాగున్నది కాని, అంతకు ముందు రెండు ఉత్తరాలు అప్పదాసు తీసి చదువుతుండగా వచ్చిన నేపధ్య సంగీతపు ఔచిత్యం ఏమిటో మనకు బోధపడదు. 

4. పిల్లలు వస్తారని చెప్పి రాకపోవటం: 

ఈ సంఘటన వల్ల మనకు మూడో పాత్ర గొంతు మాత్రం వినిపిస్తుంది. ధన్యవాదాలు భరణి గారూ ఆ మాత్రం కన్సెషన్ ఇచ్చి మీ "శిరా" మార్కు కొంత చెరప ప్రయత్నించారు. ఆ గొంతు ఈ దంపతుల కొడుకుల్లో ఒకనిది అని మనకు తెలిసేట్టుగా సంభాషణ నడుపుతారు. ఏదేదో చుట్టరికాలు తిరగేసి/ఏకరువు పెట్టి, వాళ్ళ బంధువుల్లోనే వరసైన వాళ్ళ పెళ్ళి చెయ్యాలి (ఆ కాబొయ్యే దంపతుల పేర్లు కూడా ఈ మిధునపు దంపతులవే  అని కూడా చెబుతారు) పల్లెలో ఉన్న వాళ్ళింటికి వస్తున్నాము అని చెబుతాడు. కాని వాళ్ళు వచ్చినట్టు చూపిస్తే పాత్రలు పెరిగిపోతాయన్న భయం వల్ల కాబోలు, చాలా కృతకంగా ఏదో ప్రమాదం జరిగింది, కాలు విరిగింది అని చెప్పేసుకుని వాళ్ళు రారని తెలియపరుస్తారు. ఈ సంఘటన చొప్పించటం ఉన్న సినిమాను సాగతియ్యటానికే కాని మరే విధంగా పనికి వచ్చిందో తెలియదు.

5. బుచ్చి లక్ష్మి సెల్ ఫోన్ లో మాట్లాడటం:

ఇదొక్కటిమాత్రం ప్రస్తుత సమకాలీన పరిస్థితులకు అతికినట్టుగా సరిపోయింది.కాని వారుంటున్న ఇంట్లో లాండ్ లైన్ ఫోను ఒకసారి అటక మీద మరొకసారి బల్ల మీద ఎందుకు కనపడుతుంది. కారణం తెలియదు. 

6.పెసరట్ల వాసనకి అప్పదాసు తిరిగిరావటం:

ఒకచోట ఏ కారణం లేకుండా అప్పదాసు సన్యాసి వేషం వెసుకుని నిలబడతాడు. తాను సన్యాసం తీసుకోబోతున్నట్టుగా ప్రకటిస్తాడు. ఆయన భార్య పెసరట్లు వేస్తుంటే, ఆ వాసన పీల్చి వెనక్కు వస్తాడు. కాల్లో ముల్లు గుచ్చుకోవటం కూడ చొప్పించారు అనుకోండి. కాని ఒరిజినల్ కథలో  లేని ఈ విషయం సినిమాలో ఏ మాత్రం నప్పలేదు.  

అప్పదాసు ఒకచోట మాటల్లో తనకు రాష్ట్రపతి అవార్డ్ వచ్చినట్టుగా చెబుతాడు (భార్య చీరలు ఎప్పుడెప్పుడు కట్టుకుందో  ఏకరువు పెడుతూ). దానికి ఆనవాలుగా ఆ ఇంట్లో ఎక్కడా ఒక్క ఫొటో కూడా కనపడదు. అదే కాదు ఆ ఇంట్లో ఫొటోలే కనపడవు. అప్పదాసు తల్లి తండ్రులు, ఆయనకు రాష్త్రపతి అవార్డ్ రావటం వంటివి ఫొటోలుగా గోడలమీద అలా చూపించీ చూపనట్టుగా ఉంచితే చాలా బాగుండేది. 

ఏమైనా సినిమా చాలా అసంతృప్తినే  మిగిల్చింది. మరింత జాగ్రత్త తీసుకుని సినిమా తియ్యాల్సింది. శ్రీరమణ గారు వ్రాసిన కథలో అప్పదాసు పాత్ర వెకిలి చేష్టలు చెయ్యడు. బాలు గారి నటన మోతాదుకు మించి ఉన్నది అని అనకుండా ఉండలేకపోతున్నాను. ఆయనకున్న కమెడియన్ బ్రాండ్ వాడుకునే ప్రయత్నం చేసి అభాసుపాలు అయినట్టుగా కనపడుతున్నది. లక్ష్మి నటన కావలిసిన స్థాయిలో లేనే లేదు.

సినిమా ముగింపు:

సరే కథలో లేని అనేకమైన సంఘటనలు  చొప్పించారు. ముగింపు విషయంలో కొంత హోం వర్క్ చేసి ఉండాల్సింది. అప్పదాసుని చంపి తీరాల్సిందేనా అన్న విషయం మీద కొంత చర్చ చేసి, ఆ పాత్రను చంపకుండా మరో రకమైన వైవిధ్య ముగింపుకోసం ప్రయత్నించి  ఉంటె బాగుండేదేమో. ఎలాగో కథలో లేని అనేక సంఘటనలు సృష్టించినప్పుడు, మొత్తం మీద మిధునం కథ లో ఉన్న మెయిన్ ఫార్మాట్ తీసుకుని సినిమాకు సరిపొయ్యే విధంగా  రక్తికట్టెట్టుగా ఉండి ఉంటే సినిమా  పేలవంగా ముగిసి ఉండేది కాదు.

నాకు అనిపించింది ఏమంటే, దురదృష్ట వశాన ప్రముఖ నటి రాధా కుమారి మరణించారు కాని, ఆవిడ ఉన్నప్పుడే, రావి కొండలరావుగారు ఆవిడను కలిపి ఈ సినిమా తీసి ఉంటే ఎంతయినా బాగుండేదని. వాళ్ళిద్దరూ నిజ జీవితంలో కూడా  భార్యా భర్తలే అవటం ఈ సినిమాకి ఎంతయినా ఉపయోగ పడేది.

చివరగా :

ఏది ఏమైనా మిథునం కథ చదివిన వాళ్ళు తప్పకుండా చూడవలిసిని సినిమా. ఆ కథను తనికెళ్ళ భరణి గారు తనకు తెలిసినంతవరకూ మనకు దృశ్య రూపంలో చూపించటంలో ఎంతవరకూ కృతకృత్యుడయ్యాడు  అన్న విషయం తెలిసికోవటానికైనా సరే.  

మొత్తం మీద  తనికెళ్ళ భరణి ఒక "మంచి సినిమా"  తీసే ప్రయత్నం ప్రోత్సహించటానికి అందరూ చూడవలసిన సినిమా.ఇలా మన సాహిత్యంలో ఉన్న మంచి కథను సినిమా తియ్యాలి అన్న తపనతో తీసే  దర్శక నిర్మాతలను ప్రోత్సహిస్తూ (భట్రాజు పొగడ్తలతో కాకుండా) మన స్పందన తెలియచేసే ప్రయత్నం చేస్తూ  ఉంటే,  కొంతకాలానికి మనకు తెలుగులో నిజంగా  మంచి సినిమాలు తరచూ  రావటానికి అవకాశం లేకపోలేదు అని నా అభిప్రాయం.

అందరి కంటే ఈ సినిమా నిర్మించిన  శ్రీ ఆనంద్ ముయిదా రావు గారిని  ఆయన ధైర్యానికి ఎంతైనా మెచ్చుకోవాలి. ఇలాంటి నిర్మాతలు డజన్లకొద్దీ రావాలి, మన తెలుగు సినిమాను ప్రొఫెషనల్ నిర్మాతలు, చిన్న సినిమాలకు ప్రదర్శించటానికి హాళ్ళను కూడా దొరకకుండా శాసిస్తున్న అసాంఘిక శక్తుల  కోరల్లోంచి విముక్తి చెయ్యాలి.  oooOooo


    

8 వ్యాఖ్యలు:

 1. ఏమిటా మీరు కనపడడం లేదనుకుంటున్నాను. మీ చేయి త్వరగా కోలుకుని ఎప్పటిలాగే రెగ్యులర్‌గా పోస్టులు వ్రాయాలని ఆశిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Thank you "Telugu Abimaani". I just do not know your name. I hope you shall include it in your profile, to make it complete.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ninnane ee cinema gurinchi maatlaadukunnaamu. mee review oka rakamgaa cinemani kalla mundu unchindi.
  chaalaa baagaa pratee vishayaanni express chesaaru.
  kiranmai

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కిరణ్మయి గారూ
  మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. కాని తెలుగును తెలుగు లిపిలో వ్రాస్తేనే అందం. మీకు తెలియకపోతే lekhini.org వాడి చూడండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. One more unnatural thing I noticed was that through out the film, Appadasu remains cool to the reference of Daksharamam except on one occasion where he gets very angry over Buchhi Lakshmi. It has no logic as why he got upset only once.... other times tolerating it.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.