26, మే 2013, ఆదివారం

సాహిత్య పరిరక్షణా యజ్ఞం

పై ఫోటో గార్డియన్ పత్రిక వారి సౌజన్యం
 సాహిత్య పరిరక్షణా యజ్ఞమా!! అవునండీ! అవును ! 
మనంతట మనం  పెద్దగా వ్రాయకపోయినా, మంచి సాహిత్యాన్ని గుర్తించి చదువుకోవటం, ఆనందించటం,  ఆ వ్రాసిన విషయాలను ఆకళించుకుని ఆ విషయాల మీద ఆలోచించి సద్విమర్శ చేయటం, సాధ్యమైనంతవరకు చదువుకున్న విషయాలు ఆచరణలో పెట్టటం నలుగురికీ చెప్పటం,  సాహిత్య ప్రక్రియలో ముఖ్యమైన విషయాలు. 


మనకు అందుబాటులో ఉన్న పుస్తకాలు చదువుకోగలం. కాని పూర్వం 1920ల్లో, 30లు 40ల్లో వ్రాసిన పుస్తకాల విషయం ఏమిటి! అప్పట్లో వచ్చిన ప్రతి పుస్తకమూ కూడా అద్భుతమైనదని,  సాహిత్య పరంగా ఉన్నతమయినదీ అని నేను అనుకోవటం లేదు. కాని మన తెలుగు సాహిత్య పరిణామక్రమంలో అనేక సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేయబడినాయి. ఆ పుస్తకాల్లో, వ్యాపారపరంగా ఆలోచిస్తే, మళ్ళీ పున:ముద్రితమయ్యే అవకాశం  ఎన్నిటికి ఉన్నాయి! అతి తక్కువలో బాగా తక్కువ పుస్తకాలు మాత్రమే.  అలా పున:ముద్రణ చేస్తే,  ఆ "సాహసం"  చేసిన వారికి ఎన్ని పుస్తకాల్లో నష్టం రాకుండా ఉంటుంది (లాభం మాట దేవుడెరుగు!). అలా పున:ముద్రితమైన పుస్తకాల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము, అవేమీ హాట్ కేకుల్లా అమ్ముడవటంలేదన్న విషయం విదితమే. 

ఇటువంటి పరిస్థితుల్లో మన సాహిత్య సంపద అంతా కూడా  అలా   దిక్కూ దివాణం లేకుండా అంతరించి పోవలిసినదేనా అన్న ప్రశ్న సాహిత్య అభిమానులైన అందరినీ బాధిస్తూనే ఉన్నది. 

ఈ విషయం లో ఈరోజున అందరికీ అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుని మొట్టమొదటగా చందమామ  సంచికలన్నీ స్కాన్ చేయించి భద్ర పరచటం అనేది అందరినీ ఆనంద పరిచిన విషయం. ఈ విషయంలో తిరుపతి తిరుమల దేవస్థానం వారు, చందమామ సంస్థ వారు అభినందనీయులు . ఆ తరువాత ఆ సంచికలు అందరికీ చందమామ వారి వెబ్ సైటులో ఉంచారు  కాని ప్రస్తుతం ఆ వెబ్ సైటు కనపడటం లేదు. కాని అలా స్కాన్ చేయబడిన కాపీలు కొన్ని ధారావాహికలు అక్కడక్కడా వెబ్సైట్లల్లో ప్రత్యక్షం కావటానికి కారణం మొదట వారు స్కాన్ చేసి ఉంచటమే కదా.ఈ విషయం మీద "అలనాటి చందమామ బ్లాగులో వ్రాసిన సమాచారం చూడగలరు(ఒక  శుభవార్త-క్లిక్). 

ఆ తరువాత ఈ విషయం లో అద్భుతమైన ముందడుగు వేసినది ఆంధ్ర ప్రదేశ్  ప్రెస్ అకాడమీ వారు. తెలుగు నాట ఎక్కడెక్కడ పాత సంచికలు, వార్తా పత్రికలూ, వార పత్రికలూ, మాస పత్రికలూ దొరికినవి దొరికినట్టుగా స్కాన్ చేయించి భద్ర పరిచారు. అలా భద్ర పరిచి వాటిని తమ వెబ్ సైటులో ఉంచారు పేజీ పేజీ డౌన్లోడ్ చేసుకోవటం అంత సౌకర్యంగా లేదు అన్న విషయం పక్కన పెడితే, అలనాటి వార్తా/వార/మాస ఇతర పత్రికలూ అన్నీ కూడా స్కాన్ చేయబడి భద్రంగా ఉన్నాయి, కావలిసిన వారు అంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ వారిని సంప్రదించి ఆ కాపీలను చూసుకునే అవకాశం ఉన్నది. 

ఇక కొద్ది సంవత్సరాల బట్టి సాహిత్య సాగరాలను ప్రచురించే బృహత్ కార్యక్రమాన్ని మనసు ఫౌండేషన్  వారు నిర్వహిస్తున్నారు, కొనసాగిస్తున్నారు. ఈ కింది లింకు నొక్కి వారు చేస్తున్న, చెయ్యాలని ప్రణాళిక వేసుకున్న విషయాలను తెలుసుకోవచ్చు:


ఇప్పటికే,  వీరు రాచకొండ విశ్వనాథ శాస్త్రి, కాళీ పట్నం రామారావు, శ్రీరంగం శ్రీనివాసరావు, బీనాదేవి, గురజాడ అప్పారావు, పతంజలి గార్ల సాహిత్య సర్వస్వాలను ప్రచురించి సాహిత్య అభిమానులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు.ఇకపైన శ్రీయుతులు జాషువా, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, వీరేశలింగం సాహిత్య సంపుటాలను సేకరించి ప్రచురించే పనిలో ఉన్నారు. 

ఈ ఫౌండేషన్ కు ఆద్యుడు,  వెన్నుముక శ్రీ రాయుడు గారు. ఆయన,  ఆయన కుటుంబ సభ్యులు కలిసి వారి తల్లి తండ్రుల పేర్ల మొదటి అక్షరాలు కలుపుకుని "మనసు" ఫౌండేషన్ ఏర్పరిచి తమవంతు సాహిత్య సేవ చేస్తునారు.  


నేను బెంగుళూరులో ఉండే రోజుల్లో ఆయన్ను కలుసుకుని మాట్లాడే అదృష్టం కలిగింది. వారి గురించి బ్లాగులో వ్రాద్దామన్న ప్రసక్తి తీసుకు రావటానికి ఆయన ప్రచారం గురించి వైముఖ్యం ఆయన మాటల్లో స్పుటంగా కనపడటం అడ్డుపడింది. కాని ఆయన తన గురించి వ్రాయటానికి నవ్య పత్రిక వారికి అవకాశం ఇచ్చినట్టున్నారు, ఈ ఫౌండేషన్ వారు చేస్తున్న అద్భుత కార్యక్రమాల గురించి "నవ్య" వార పత్రికలో ఈ మధ్యనే వ్యాసం ప్రచురించారు. ఈ కింది ఇమేజి ఫైళ్ళు ఆ వివరాలు అందచేస్తాయి. 
పై ఇమేజి "నవ్య" వారపత్రిక వారి సౌజన్యం అందచేసినవారు శ్రీ శ్యాంనారాయణ
పై ఇమేజి "నవ్య" వారపత్రిక వారి సౌజన్యం అందచేసినవారు శ్రీ శ్యాంనారాయణ


 ఇదే కాకుండా ప్రస్తుతానికి ఎక్కడా దొరకని ఔట్ ఆఫ్ ప్రింట్ పుస్తకాలను సేకరించి వాటిని స్కాన్ చేసి భద్రపరుస్తున్నారు అని శ్రీ శ్యాం నారాణ తెలియచేశారు. కాబట్టి, ఈ విషయం లో మనలాంటి వారు ఉడతా భక్తిగా మన దగ్గర ఉన్న పుస్తకాల వివరాలు వారికి అందచేస్తే వారి దగ్గర లేని పుస్తకం ఐతే మనకు తెలియచేసి ఆ పుస్తకం/పుస్తకాలను పంపమని తెలియ చేస్తారు. ఆ తరువాత ఈ పుస్తకాలను వారు స్కాన్ చేయించి, తిరిగి పంపుతారు. మనకు సాఫ్ట్ కాపీ (కాపీరైట్ నిబంధనల ప్రకారం వీలైతే) ఇస్తారు .  

 ఇలా కనుక జాగ్రత్త పడి పుస్తకాలను భద్రపరచకపోతే మరి కొన్ని సంవత్సరాలు గడచిన తరువాత స్కాన్ చేద్దామన్నా అలనాటి అపురూప పుస్తకాలు దొరకని పరిస్థితి వచ్చేస్తుంది.   అలాంటి విపత్కర పరిస్థతి మన తెలుగు సాహిత్యానికి కలుగకుండా, అన్ని వనరులు ఉన్నవారు ప్రయత్నం చేస్తున్నారు,  మనం చెయ్యాల్సిందల్లా వారికి మన వంతు సహకారం అంటే మన దగ్గర ఉన్న అలనాటి పుస్తకాలు పంపటమే.  మిగిలిన పని మొత్తం వారే   చూసుకుంటారు. 

మనకు, ఈ సాహిత్య పరిరక్షణా యజ్ఞం లో పాలు పంచుకున్న తృప్తి  దొరుకుతుంది. కనీసం కొన్ని పుస్తకాలన్నా రాబొయ్యే తరాలకు సాఫ్ట్ కాపీలుగా అందచేయబడతాయి. వివరాలు పంపవలిసిన ఈ మెయిలు చిరునామా ఈ కింద ఇవ్వబడినది:

syamnarayana.t@gmail.com


ఈ విషయంలో పాశ్చాత్యులు సహజంగా మనకంటే ఎంతో ముందు ఉన్నారు. వారి సాహిత్యంలో    వచ్చిన అనేకానేక పుస్తకాలను స్కాన్ చేసి  రకరకాల మోడ్స్ (పిడిఎఫ్, ఇ-పబ్, కిండల్ వగైరా) లో సాహిత్య అభిమానులకు అందచేస్తున్నారు. అంతే కాదు ఆయా పుస్తకాలను చదివి రికార్డ్ చేసి ఆడియో పుస్తకాలుగా భద్రపరుస్తున్నారు. మనం   ఇటువంటి అద్భుతమైన సాహిత్య పరిరక్షణా యజ్ఞాన్ని తెలుగు సాహిత్య గ్రంధాలకు కూడా  మన పధ్ధతిలో మనం అన్వయించుకుని భద్రపరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని  నా భావన. 

ఈ గూటెన్-బర్గ్ ప్రాజెక్ట్ వివరాలకు ఈ కింది లింకు నొక్కి చూడండి

GUTENBERG PROJECT


అమెరికా అధ్యక్షుల్లో ఒకరు (ట్రూమన్ అనుకుంటా) ఒక అద్భుతమైన మాట అన్నారు. "ఒక పనికి పేరు ఆపైన కీర్తి ఎవరికి  వస్తుంది అని చూసుకున్న తరువాతే ఆ పని చెయ్యాలని అనుకునే ఆలోచనా పధ్ధతి మానేస్తే,  ప్రపంచంలో ఎన్నెన్ని అద్భుతాలు జరిగి  ఉండేవో  కదా".  నిజమే! ఇలా అనుకోగలగటం అంత సులభం కాదు కాబట్టే, అమెరికా అద్యక్షుడంతటి వాడు ఇలా వాపోవ్వాల్సి వచ్చింది. సాహిత్య పరిరక్షణ విషయంలో ఇలాటి తడబాటు ఉండకూడదని నా ఆకాంక్ష








6 కామెంట్‌లు:

  1. అరుదయిన సాహిత్యగ్రందాలను కంటిరేప్పల్లా భద్రంగా కాపాడుకోవలసిన ఆవశ్యకత గూర్చిసవివరముగా ఆర్తితో వివరించారు ధన్యవాదాలు!అందుకు అందరం నడుము లు కట్టి పూనుకుందాం!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య ప్రకాశ్ గారూ! మీ స్పందనకు ధన్యవాదాలు. నా దగ్గర మాక్జిం గోర్కీ రచనలు ముఖ్యంగా ఆయన ఆత్మ కథ మూడు భాగాలు, మరొకొన్ని పాత పుస్తకాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అవ్వి లభ్యం కావటంలేదు. వాటిని త్వరలో శ్యాంనారాయణగారికి స్వయంగా వెళ్ళి ఇవ్వబోతున్నాను. ఇంతకంటె నేను పెద్దగా నడుంకట్టలేను. ఇంతకంటే ఎక్కువగా పాలు పంచుకోవలనుకుంటే మరింత సంతోషం. హైదరాబాదులో కాని బెంగుళూరులో కాని ఉన్నవారికి ఈ బృహత్ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం బాగా ఉన్నది.

      తొలగించండి
  2. నా వద్ద వేనవేల పుస్తకాలు ఉన్నాయి ఈరోజు నేను USA వెళ్తున్నాను 6 నెలల్లో తిరిగి సికింద్రాబాద్ వస్తాను అర్ధ శతాబ్దిగా మంచి పుస్తకాలు ఎడాపెడా పిచ్చెత్తినట్లు వెర్రిగా కోనేస్తున్నాను!నాకు నచ్చితేచాలు వెంటనే కొని చదివితీర వలసినదే!అదొక వ్యసనం mania!పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదుకదా! స్కాన్ చేసుకోనిస్తాను కాని పుస్తకాలు అమ్మను ఇంటికి అరువివ్వను నా చివరి రోజుల్లో నేను పుట్టిన నిజామాబాద్ లోని ఒక గ్రంధాలయాన్ని ఎంపిక చేసుకొని మొత్తం విరాళం ఇచ్చేస్తాను!అయినా నాకు ఇంకా 70 కూడా నిండలేదు కదా అందుకు ఇంకా పదేళ్ళ సమయముంది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య ప్రకాష్ గారూ.

      ఈ సాహిత్య పరిరక్షణా యజ్ఞం జరిపిస్తున్న రాయుడుగారు ఉండేది బెంగుళూరులో, స్కానింగ్ వగైరా జరుగుతున్నది శ్యాం గారి ఆద్వర్యంలో హైదరాబాదు లో, నేనుండేది ముంబాయిలో. మీరు ఉండేది ఎక్కడో తెలియదు. మీరు శ్యాం గారికి ఒక మైలు మీ కాంటాక్ట్ డితైల్స్ ఇవ్వండి. తద్వారా మీతో కాంటాక్ట్‌లో ఉంటారు. తరువాత మీ దగ్గర ఉన్న పుస్తకాల్లో ఏ ఏ పుస్తకాలు స్కానింగ్ చెయ్యాలి అన్న విషయం మీ ఇద్దరూ నిర్ణయించుకోవచ్చు.

      తొలగించండి
  3. నేను ప్రస్తుతం మినియాపొలిస్ లో ఉన్నాను 6 నెలల తర్వాత secunderabad oldbowenpally లో ఉంటాను.అలాగే చేద్దాం!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Suryaprakash garu.

      I hope by now you have returned to India. Please contact Shri Shyam Narayana regarding scanning of books you have.

      తొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.