20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కొత్త బ్లాగు ప్రారంభం -తెలుగులో ప్రప్రధమ రాజకీయ కార్టూనిస్ట్-శ్రీ వి జి ఊమెన్

 సరికొత్త  బ్లాగు ప్రారంభం 
  


  కింది  లింకు నొక్కి కొత్త బ్లాగును చూడగలరు 

లింకు  కొద్దిగా వ్రాసిన ఈ తెలుగు చివరన ఉన్నది

ఊమెన్ పూర్తి పేరు వి జి ఊమెన్. వి జి అంటే ఎమిటి? తెలియదు! వారి జన్మదినం 20 ఫిబ్రవరి, 1916. ఆయన 68 సంవత్సరాలు జీవించి జులై 18 1984 న మదరాసులోని స్వగృహంలో మరణించారు. ఆయన మరణించిన రోజున కూడా ఆయన కార్టూన్ ఆంధ్ర పత్రిక దిన పత్రికలో ప్రచురితం అయ్యింది. అంతే కాదు, ఆయన పంపిన కార్టూన్లు, జులై 1984 చివరివరకూ ఆ దినపత్రిక వారు వేస్తూనే ఉన్నారు . కాని ఆయన ఫొటో కాని ఇతర వివరాలు కాని ప్రచురించే మనసు లేకపోయింది ఆనాటి సంపాదకులకు. ఊమెన్ గారి కార్టూనే కాని ఆయన ఫొటో ఎక్కడా లభ్యం కావటం లేదు. మూడు దశాబ్దాలుగా తన కార్టూన్లతో ఆంధ్ర సచిత్ర వార పత్రిక పాఠకులకు అలరించిన ఊమెన్ గారు మరణించినప్పుడు కూడా ఆంధ్రపత్రిక వారు ఊమెన్ గారి ఫొటోను ప్రచురించలేదు. ఊమెన్ ఎలా ఉంటారు అనే విషయం ప్రపంచానికి తెలియకుండా ఆంధ్రపత్రిక వారు చాలా జాగ్రత్త పడ్డారు. ఆయన ఫొటో, జీవిత వివరాలు ప్రచురించకపోవటం కార్టూన్ చరిత్రలోనే ఒక విషాదం, తెలుగు పత్రికా సంపాదకీయ చరిత్రలో ఒక మాయని మచ్చ.

ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారు ఊమెన్ గురించి వ్యాసం వ్రాస్తూ, తన జ్ఞాపకాల నుంచి ఊమెన్ గారి కార్టూన్ గీశారు. ఊమెన్ గారి కార్టూన్ వేసి పాఠకలోకాని అందించిన జయదేవ్ గారికి, తెలుగు కార్టూన్ అభిమానులందరి తరఫునా, హృదయపూర్వక ధన్యవాదాలు.

ఊమెన్ గారు, తెలుగు పత్రికల్లో రాజకీయ కార్టూన్లకు ఒక పరంపరగా, పత్రికలో శీర్షిక ఏర్పరిచి ప్రచురించే ప్రక్రియకు, ఆద్యుడు. ఆయనకు ముందు తెలుగులో రాజకీయ కార్టూన్లు వరుసగా ప్రచురించబడటం లేనే లేదు. అసలు రాజకీయ కార్టూన్లు ఆయనకు ముందు తెలుగులో లేవు అనటం అతిశయోక్తి కాకపోగా, నిజమే అని నేను పూర్తిగా నమ్ముతున్నాను.

ఊమెన్ కేరళీయుడు. తెలుగు రాదు. మరి ఆయన తెలుగులో కార్టూన్లు ఎలా వెయ్యగలిగారు! అదే వార పత్రికా జర్నలిజంలో ఒక కొత్త పంథాను ఏర్పరిచి, ఆంధ్ర సచిత్ర వార పత్రిక వారు ఈయన కార్టూన్లను ప్రచురింపచేశేవారు. ఆయన ఆంగ్లలో కాప్షన్ పెట్టి కార్టూన్లు వేస్తె, ఇక్కడ అప్పటి పత్రికా సంపాదకులు (అప్పట్లో సంపాదకులు అని ఉండెవారు), ఆ ఆంగ్ల కాప్షన్ ను ఎప్పటికప్పుడు తెలుగులోకి తర్జుమా చేసి ప్రచురించేవారు. అది తెలుగులో రాజకీయ కార్టూన్ల చరిత్ర.

ఈ బ్లాగు ఎందుకు మొదలెట్టబడింది! ఊమెన్ అనే అద్భుతమైన కార్టూనిస్టు ఉండేవారనీ, ఆయన ప్రపంచ ప్రసిధ్ధి చెందిన శంకర్ పిళ్ళై, ఆర్ కె లక్ష్మణ్, అబు అబ్రహంల సరసన నిలబెట్టవలసినంతటి సమాన సమర్ధుడన్న విషయం ఇప్పటివారెవ్వరికీ తెలియదు. నేను ఆయన కార్టూన్లు చూస్తూ పెరిగాను, ఆయన కార్టూన్ల వల్ల రాజకీయ పరిజ్ఞానం పెరిగింది. అటువంటి అద్భుత కార్టూనిస్టుకు నివాళీగా ఈ బ్లాగు ప్రారంబిహిస్తున్నాను. తెలుగులో రాజకీయ కార్టూన్ బ్రహ్మ గురించి తెలుసుకునే ఓపిక, ఆసక్తి ఇవ్వాళ ఎవరికన్నా ఉంటె, వారికి తెలియచేయటానికి ఈ బ్లాగు ఉపయోగపడితే ఎంతయినా ఆనందం.ఈ బ్లాగులో తరచుగా ఆయన వార పత్రికలోనూ, దినపత్రికలోనూ వేసిన కార్టూన్లను ప్రచురించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పత్రిక అంటే ఆధ్ర పత్రికే కాని మరే పత్రికా కాదు. ఊమెన్ గారు మరే ఇతర దిన/వార/ మాస పత్రికల్లో కార్టూన్లు వేసిన దాఖలాలు లేవు.

ఆయన కార్టూన్లను ఈ బ్లాగులో ప్రచురిస్తూ, ఆ కార్టూనుకు ఉన్న నేపధ్యం కూడా నాకు తెలిసినంతవరకూ వ్రాద్దామని ప్రయత్నం. ఎందుకు అంటె, ఊమెన్ గారు వేసినవి రాజకీయ కార్టూన్లు. నేపధ్యం తెలియకుండా ఆ కార్టూన్లు అర్ధం కావు. ఊమెన్ గారి ఘాటైన, హాస్యభరితమైన అప్పటి కార్టూన్లు అందరూ చూసి ఆనందించెదరుగాక.
ఇక్కడి కార్టూన్లన్నీ కూడా ఆంధ్ర సచిత్రవారపత్రిక, ఆంద్ర పత్రిక దినపత్రిక వారి సౌజన్యం. ఆపైన, ఎక్కడెక్కడి లైబ్రరీల్లోనూ శోధించించి, స్కాన్ చేసి భద్ర పరిచిన ఎ పి ప్రెస్స్ ఎకాడమీ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

ఇలా వారి కార్టూన్లు ఈ బ్లాగులో ప్రచురించటంలో ఏ విధమైన ఆర్ధిక లాభాలు ఆశించి ఎంతమాత్రం కాదు. ఈ కార్టూన్లు ఇక్కడ ప్రచురించటం ఎవరికన్నా వారికి ఉన్న కాపీ రైట్లు ఉల్లంఘింపబడుతున్నాయని అనిపిస్తే, వారికి నేను చెయ్యగలిగిన విన్నపం ఒక్కటే, ఈ బ్లాగులో ఈ కార్టూన్ల ప్రచురణ ఉద్దేశ్యం, ఊమెన్ గారి కార్టూన్ల అప్పటి నేపధ్యాలను వివరిస్తూ, పరిచయ,సమీక్షలే కానీ మరేవిధమైన ఉద్దేశ్యం లేదని. 

ఎ పి ప్రెస్స్ ఎకాడమీ వారి పుణ్యమా అని ఆంధ్ర సచిత్ర వార పత్రికలు ఇంటర్ నెట్లో అందుబాటులో ఉన్న కారణాన, ఊమెన్ గారి కార్టూన్లను ఈవిధంగా నా బ్లాగులో పరిచయం/సమీక్ష చెయ్యగలిగిన అవకాశం లభించటం నా అదృష్టంగా బావిస్తున్నాను. 

ఈ కార్టూన్లను, నేను వ్రాసిన నేపధ్యం, సమీక్షలను చూసి/చదివిన వారు, తమ తమ అభిప్రాయాలను తెలియచెస్తే, రాబొయ్యే రోజులలో ఊమెన్ గారి కార్టూన్ల గురించి వ్రాయబొయ్యే వ్యాస పరంపర కు ఒక మంచి ఒరవడి సాధించటానికి మార్గ దర్శకం అవుతుందని నా ఆశ, అపోహ కాదని అనుకుంటున్నాను.

చివరగా, నాకు ఈ సాఫ్ట్ కాపీలను ఎప్పటికప్పుడు అందచేసిన శ్రీ శ్యాం నారాయణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.



 

2 కామెంట్‌లు:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.