26, జులై 2017, బుధవారం

"ఫిదా" అను నామధేయము కల ఒక తెలుగు సినిమా

ఫిదా అను పేరుగల ఈ తెలుగు సినిమాను నిన్న రాత్రి (25 07 2017) చూడటం జరిగింది. సినిమా ఎలా ఉన్నది అని ఎవరన్నా అడిగితె, "బాగుంది" అని ముక్తసరిగా చెప్పేంత బాగున్నది. 

నేను సమకాలీన హీరోల సినిమాలు అస్సలు చూడను. మెగా రిలీజులకు దూరంగా ఉంటాను. కాబట్టి నా అభిప్రాయాలు   నా టేస్ట్ ప్రకారం చూసే సినిమాలతో పోల్చి మాత్రమె ఉంటాయి.

వచ్చిన ప్రతి (మూస) సినిమా చూసేవాళ్ళకు,  ఈ సినిమా అద్భుతంగా అనిపించవచ్చు. కానీ, నాకు సినిమా మామూలుగా మాత్రమె ఉన్నది, కుటుంబం తో వెళ్ళి చూసి ఆనందించవచ్చు అని భయం లేకుండా మాత్రం  చెప్పవచ్చు.

కథ: కథంటూ పెద్దగా ఏమీలేదు. పూర్తి అసంబద్ధ పరిస్థితులలో ఒక పొడుగాటి యువకుడు, ఒక చురుకైన పొట్టి (అతనికంటే) అమ్మాయి ఒకరికొకరు పరిచయం అవుతారు. సినిమా (రూలు)  ఆచారం ప్రకారం ఆకర్షితులు అవుతారు. వాళ్ళిద్దరూ ఎవరిదారిన వాళ్ళు పొతే సినిమా ఎట్లా! 

అలాగే,  ఎంతమాత్రం పొంతన లేని మరొక పరిస్థితి వల్ల,  ఆ అమ్మాయి,  అతన్ని  అపార్ధం చెసుకుంటుంది. అలా ఎందుకు అయ్యిందో సినిమాలో హీరోకు ఇంటర్వల్ ఐతేకానీ తెలియదు/అర్ధం కాదు. అర్ధం అయిన మరుక్షణం ఆ అపార్ధానికి కారణమైన సంభాషణ ఆ అమ్మాయికి తెలిసేట్టు చేసిపారేస్తాడు . అతనికి విధి, దర్శకుడు సహాయం చేసి,  ఆ అపార్ధానికి  కారణమైన హీరోకి వరసైన మరదులు(పాపం అమ్మాయికి ముక్కు చివర పెద్ద పుట్టు మచ్చ ఉంటుంది),  ఆ మరదలు పెళ్ళి చేసుకున్న అబ్బాయి, చాలా సౌకర్యంగా  చటుక్కున అమెరికాలోనే దొరికేస్తారు. సరే సినిమా కదా!

ఇంకేమున్నది, అపార్ధం తీరిపోయింది కదా, పొట్టి హీరోయిన్, పొడుగాటి హీరోను "నన్ను ఎత్తుకో" అనేసి వాడి మొహం నిండా ముద్దులు పెట్టేస్తుంది. చివరలో వాళ్లకు పెళ్ళయ్యి సుఖంగా ఉన్నారని చెప్పటాని కిటికీలోంచి ఒక "టపోరీ" సంభాషణ చూపించి ముగించేశారు.

నాకు బాగా నచ్చినవి:
 1. హీరోయిన్ కు మేనత్తగా వేసినావిడ పేరు గీత  (సీనియర్ సిటిజన్) చాలా అద్భుతంగా నటించింది. సినిమా రెండోసారి చూస్తె గీస్తే ఆవిడ హావభావాలకు చూడాలి.
 2. హీరోయిన్ పిల్ల చాలా చలాకీగా ఉన్నది. మన తెలుగు సినిమాకు చాలా కాలం తరువాత "నటించగల" హీరోయిన్ దొరికిందని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. పాపం ఆ అమ్మాయికి మళ్ళీ  ఇలాంటి  మూస పాత్రలు ఇవ్వకండిరా చక్కగా నటించగల అవకాశం ఉన్న వైవిధ్యమైన  పాత్రలు ఇవ్వండి,
 3. హాస్యానికి దిక్కుమాలిన ట్రాక్ ఒకటి  లేకపోవటం  ప్రత్యెక ఆకర్షణ.
 4. సినిమా మొత్తం తెలంగాణా మాండలికంలో తీయటం అద్భుతంగా ఉన్నది. కాకపొతే కథ ప్రకారం హీరో కుర్రాడు ఎక్కడివాడో తెలియదు. ఎక్కడో ఒకచోట సూచనప్రాయంగా విశాఖపట్టణం అనిపిస్తారు . అటువంటి కుర్రాడు మాటిమాటికీ "కైకు-కైకు" అనటం  చాలా ఏబ్బెట్టుగా ఉన్నది. 
 5. పాటలు బాగున్నాయి. సంగీతం బాగున్నది.
 6. నాకు బాగా నచ్చినది బాక్-గ్రౌండ్ సంగీతం. చాలా చక్కగా చేసారు.
 నాకు నచ్చనివి:
 1.  అమెరికన్ టి వి లో Two and Half Men అని ఒక ప్రముఖమైన ధారావాహిక ఉన్నది. సీజనల కొద్దీ వచ్చిందట. ఆ టి వి సీరియల్ ప్లాట్ ను కొంత "చురాయిద్దామని" చూసినట్టు కనపడుతుంది.  పెళ్ళి అయి విడాకులు తీసుకుని తన కొడుకుతోనూ, ఇంకా పెళ్ళి కావాలిసిన తమ్ముడుతోనూ  కలిసి  ఒకే ఇంట్లో ఉండటం, వాళ్ళ మధ్య సంఘటనలు ఆ సీరియల్ లో ప్రధానం. ఈ సినిమాలో అలా పూర్తిగా చెయ్యటానికి మనసు రాక లేదంటే మన భారతీయ నేపధ్యానికి పడదని, చాల అసంబద్ధంగా ఆ చిన్న కుర్రాణ్ణి కథలో "ఇరికించి" వాడితో కొద్దిగా హాస్యం రాల్చటానికి ప్రయత్నించారు. నాకైతే ఆ చిన్న పిల్లగాడేవరో సరిగ్గా అర్ధమే కాలేదు.
 2. సినిమాలో ఒక మూక పాట ఉన్నది. హీరోయిన్ తన అక్క పెళ్ళిలో చటుక్కున పాట అందుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చుట్టాలమ్మాయిలను  స్నేహితురాళ్ళను వేసుకుని (ఎప్పుడు ఎన్నిరోజులు ప్రాక్టీస్ చేసారో మరి)  కోరియోగ్రఫీ చెడకుండా   గెంతుతారు. కానీ హీరోయిన్ పక్కన ఎగిరే అమ్మాయిలను కాస్త చూసి సెలెక్ట్ చేసుకోవాల్సింది.
 3. సినిమాలో పాటలోనే కాదు అనేక చోట్ల అవకాశం ఉన్నది అనిపించినప్పుడల్లా హీరోయిన్ నడ్డి తెగ ఆడించటం చూట్టానికి అంత బాగాలేదు.
 4. ఉన్నట్టుండి ఒక ఫైట్ పెట్టాలని గుర్తుకు వచ్చి పెట్టినట్టుగా సరిగ్గా అతకని ఒక సంఘటన తో ఆ ఫైట్ బెడద కూడా తీర్చిపారేసారు.హీరో అన్నాక ఫైట్ లేకపోతె ఎలా!  కాకపొతే, ఆ చెడ్డ కుర్రాళ్ళను హీరో  చిత్తుగా తన్నాక, దెబ్బలు తిన్న ఆ చెడ్డ కుర్ర వాళ్ళు, దెబ్బలు తిన్నారుగా మరి,  ఒకళ్ళను పట్టుకుని ఒకళ్ళు నడుస్తూ సేల్ఫీలు తీసుకోవటం సరదాగా అనిపించింది.
 5.  అపార్దానికి కారణం అయిన సంభాషణ ఫస్ట్ క్లాస్ కూపే బయటనుంచి వినేసి హీరోయిన్  కోపం పెట్టుకోవటం, విచిత్రంగా బిహేవ్ చేయటం ఎంతమాత్రం పొసగలేదు. సినిమాలో ఎదో ఒక ట్విస్ట్ కావాలి కాబట్టి పెట్టినట్టు ఉన్నది.
 6. ఉట్టి పుణ్యానికి,  హీరోయిన్ తండ్రికి మతాంతర వివాహం అంటగట్టి  అలాగని చెప్పి బాలాజీ ఫోటో పక్కన,  జీసస్ ఫోటో చూపిస్తారు. కాని కథకు ఆ విషయం ఎంతమాత్రం సంబంధం లేదు, ఆపాయింట్ వాడుకోవాల్సిన అవసరమూ రాలేదు.మరెందుకు. సెక్యూలర్ వెర్రా!
రీడర్స్ డైజెస్ట్ అనే ఒక చక్కటి ఆంగ్ల మాస పత్రిక ఉండేది. ఇప్పుడూ ఉన్నది అనుకొండి.  కానీ, గత వైభవం చూసుకుని సంతోషిస్తున్నది ఆ పత్రిక. ఈ రీడర్స్ డైజెస్ట్ కు భారత దేశపు ఎడిషన్ కు ఉన్న భారతీయ సంపాదకుడు ఒకసారి ఇలా వాపోయ్యాడు, "ఈ రీడర్స్ డైజెస్ట్ కు  సంపాదకత్వం వహించటం చాలా కష్టం. అరె! ఒక కామా, ఒక ఫుల్ స్టాప్ తప్పు పడినా వందల్లో ఉత్తరాలు వస్తాయి, ఇక పొరబాటున చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఐతే! ఘోరంగా ఉత్తరాలు వస్తాయి" అని. ఎందుకనీ! ఆ పత్రిక అంత అద్భుతంగా ఉండేది కాబట్టి, చిన్న తప్పులు కూడా పాఠకులు భరించలేక ఉత్తరాలు వ్రాసేవారు. 

ఈ సినిమాలో,  నాకు నచ్చనివి కూడా పైన చెప్పిన పద్ధతిలోనే ఉన్నాయని అనిపించటంలా! కాబట్టి,  హాయిగా వెళ్ళి సినిమా చూసి ఆనందించండి. మన సినిమాలు అద్భుతంగా ఉండాలి అనీ, ప్రపంచ సినిమాలలో అత్యుత్తమంగా ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు కదా! కోరుకుంటూఉండి, కొద్దిగా ఆ దిశలో ఉన్న సినిమాలు చూస్తూ ఉంటే, కొన్నాళ్ళకు మన ఆశ తీరకపోదు అని నా భావన.  
  
"ఫిదా"  అంటే ఆవతలి వాళ్ళు నచ్చి  బానిస అయ్యిపోవటం. ఈ సినిమాలో ఎవరికీ ఎవరు బానిస అయ్యారో, లేదా ఒకరికొకరు బానిస అయ్యారో  తెలియాలంటే సినిమా చూడాలిసిందే. ఈ సినిమాతో ప్రేక్షకులను తనకు "ఫిదా" చేసుకోవాలని దర్శకుడు అనుకోవటంలో తప్పులేదు కానీ, ప్రేక్షకులకు ఉండే ఆలోచనలు ప్రేక్షకులకు ఉంటాయి కదా మరి! ఏది ఏమైనా శేఖర్ కమ్ముల మళ్ళీ ఫామ్ లోకి వస్తున్న లక్షణాలు కనపడుతున్నాయి. అతని తరువాతి సినిమా మరింత బాగా రావాలని కోరుకోవటం మన (అంటే ప్రేక్షకులమైన మన) హక్కు. 

5 వ్యాఖ్యలు:

 1. హీరోయిన్ మేనత్తగా వేసినవారు గీత. ఈమె పెళ్ళిచూపులు దర్శకులు భాస్కర్ కు తల్లి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రీడర్స్ డైజెస్ట్ ఉదాహరణ బావుందండి. కామా,ఫుల్-స్టాప్,...ల అవసరం తెలీని పాఠకులు వుంటే ఆ ఎడిటర్ గారికి కష్టాలు తగ్గేవి ��. ఆయనతో పోలిస్తే ఇవాళ్టి తెలుగు యాంకర్లు /యాక్టర్లకి భాషాకష్టాలు తక్కువే, ప్రజలు సద్దుకుపోతున్నారు పాపం��.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. "కామా ఫుల్ స్టాప్ అవసరం తెలీని పాఠకులు" కాదండీ, బాగా తెలిసిన పాఠకుల వల్ల ఆ సంపాదకుడికి వచ్చిన కష్టాలు.

   తొలగించు
 3. మన సినిమా టేస్ట్ ఉండవలసిన స్థితి నొక్కిచెప్పటానికి ఆ ఉదాహరణ వాడాను. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.