17, మార్చి 2022, గురువారం

 డిజె టిల్లు సినిమా చూశాను

మొదట ఒక చోట హాస్య ప్రధానమైన సమీక్ష చదివి, ఈ సినిమా చూడటం మన పాతివ్రత్యాన్ని చెడగొడుతుందేమో అని భ్రమ పడి చూడలేదు. కానీ స్నేహితుడు/కొలీగ్ Veluri Ramakrishna Rao చెప్పటంతో "ఆహా" చానెల్ లో, ఉన్న ఈ సినిమాను, నిన్న(16 March,2022) సాయంత్రం వద్దువద్దు అనుకుంటూనే క్లిక్ చేసి చూడటం మొదలుపెట్టాను. సినిమా మొత్తాన్ని. రెండు మూడు విడతలుగా, చివరి విడత జష్ట్ పొద్దున్నే(17 03 2022) చూడటం ముగించాను. ముందు, సినిమా పేరు అర్ధం కావాలిగా! ఈ "టిల్లు" ఏమిటసలు అని ఆలోచిస్తే, ఆ కుర్రాడి తండ్రి ముచ్చటపడి పెట్టుకున్న పేరు "బాల గంగాధర తిలక్". ఆ తిలక్ కాస్తా మోడరన్ సాకుతో భ్రష్టు పడి టిల్లుగా మారి ఉంటుంది అని నా బుల్లి బఠాణీ సైజు బుర్రకు తట్టింది. సినిమా పేరులో టిల్లు ఏమిటో, మరేదైనా కారణమైతే విని తరిస్తాను. ఇక కథ. కథ కాసేపు రచయిత/ల అదుపులోనే ఉన్నది అనిపిస్తుంది. కానీ, కథ స్క్రీన్‌ప్లేలకు కర్త ఒకరు కాదూ, ఇద్దరూ అని చివర వచ్చే క్రెడిట్స్‌లో కనిపెట్టాను. ఒకరు ఆ సినిమా దర్శకుడు విమల్ కృష్ణ రెండవవారు ఆ సినిమా హీరో జొన్నలగడ్డ సిద్దు. వారి కథా రచన ఏ నిష్పత్తిలో జరిగిందో తెలియదు కానీ, సినిమాలో కొంతసేపటికి, అంటే "బ్రేక్" కు చాలా ముందే, కథ, తన ఇష్టం వచ్చినట్టు స్వారీ చేస్తూ రచయితలను తన వెంట పరుగు పెట్టేట్టు చేసేసుకున్నది. కథ ఎన్ని వంకర టింకరలు తిరిగిపోయినా, చివరలో ఎలాగోలా ఆ "లూజ్ ఎండ్స్" అన్నీ (అలా ఉన్నాయన్న గ్రహింపే రచయితల గొప్పతనం) కలిపే విఫల ప్రయత్నం చేశారు కానీ నప్పలేదు. అందుకే రెండో భాగం! Or, are they planning to make movies like Carry on Series! Even in Carry on Series, each movie ends but does not carry the story to the next one in the series. ఒక మాట మాత్రం తప్పక చెప్పాలి, ముగింపు నాకు సంతృప్తిని ఇవ్వలేదు. అర్ధాంతరంగా ఆగిపొయ్యింది అనిపించిది. ఈ సినిమా చివరలో పార్ట్-1 అని వేశారు, రెండో భాగంలో ముగింపు ఇస్తారా!? తెలియదు. కానీ, సినిమాలు ఏ భాగానికి ఆ భాగం చూసుకునే వీలుండేట్టుగా, కనీసం మొదటి భాగం చేస్తే బాగుంటుంది. కారణం, టివి సీరియళ్ళలాగా సినిమాలు ఎప్పటికీ తియ్యలేరు, పైగా ఆ రెండో భాగం ఎప్పుడు తీస్తారో, అసలు తీస్తారో లేదో కూడా అనుమానమే. అందుకని ప్రేక్షకులను అటువంటి కష్టంలో పడెయ్య కూడదు అని నా భావన. సినిమా తప్పకుండా చూడండి. ఎందుకు చూడాలి అని అడిగితే:
  1. ఈ సినిమా, ఆంగ్లంలో చెప్పాలి అంటే, "ఫ్రెష్" గా ఉన్నది
  2. టేకింగ్ బాగున్నది
  3. డైలాగులు బాగున్నాయి, కౌంటర్ కౌంటర్ అని ఊరికే కావాలని వేసినట్టు కాకుండా సందర్భ శుధ్ధితో బాగున్నాయి. సినిమా విజయానికి కారణం, నేను అనుకోవటం, ప్రేక్షకులకు, ముఖ్యంగా ఈనాటి తరానికి రొడ్డ కొట్టుడు ప్రేమ కథల మీద మోజు తగ్గటం అనే కంటే అసలు మోజు ఏర్పడకపోవటం అని చెప్పాలి. ఆ తరువాత, ఒకప్పటి ప్రొఫెషనల్ దర్శకుల తీరు, ఈ కొత్త తరానికి అసలేమాత్రం నచ్చకపోవటం. ఆ కారణాన, ఈ తరం, కుర్ర ప్రేక్షకులు, (ముఖ్యంగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న) దర్శకులు, తమ వయస్సువారయ్యి, సమకాలీన సమాజ పరిస్థితులలో, యువ ప్రేక్షకులకు తెలిసిన కొన్ని నిజాలు ప్రతిబింబించే సినిమాలను తీస్తే ఆదరిస్తున్నారు, అని ఈ మధ్య వచ్చిన సినిమాలు, ముఖ్యంగా ఓటిటి(OTT)లో వచ్చే సినిమాలును చూస్తే తెలుస్తున్నది. ఇది నాకు అనిపించిన కారణం. ప్రేక్షక టేష్టు మారటం, ముఖ్యంగా తెలుగు ప్రేక్షక టేష్టు మార్పు, హీరో వర్షిప్ నుంచి, బయటపడి మంచి సినిమా వైపుగా మళ్ళటం, సినీ ప్రియులు, ఎంతగానో స్వాగతించవలసిన విషయం. ఈ సినిమా దర్శకుడు, రచయిత కథ విషయంలో మరింతగా కష్టపడాలి, ఇంకా బాగా హోం వర్క్ చెయ్యాలి. టేకింగ్ బాగున్నది కానీ, టెంపో మీదే ఎక్కువ దృష్టిపెట్టకూడదు, కథను సజావుగా సాధ్యమైనంత రియాలిటీకి దగ్గరగా నడపాలి అని నా సూచన. కుర్రవాళ్ళయిన దర్శకుడు, హీరో లకు నా అభినందనలు. సిధ్ధూ సినిమా "గుంటూర్ టాకీస్" మునుపు చూశాను. అతని నటన ఒక మూసలో పడిపోతున్నట్టుగా అనిపిస్తున్నది. తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఇక సినిమాలో నటీనటులు నా దృష్టిలో బాగా చేసిన వారు, సినిమా Freshnessకు తోడ్పడినవారు: సిధ్ధూ తండ్రిగా వేసినాయన ముఖంలో ఒక్కటే ఎక్స్‌ప్రెషన్‌తో (అక్కడక్కడా తప్ప) హాస్యం బాగా పండించారు. జంధ్యాల గారి నిర్వచనం ప్రకారం, నవ్వించేవాడు నవ్వకూడదు. కాకపోతే, ఆయన ముఖ కవళికలు, ఆకారం చూస్తుంటే బాల గంగాధర్ తిలక్ మీద భక్తితో తన కొడుక్కు ఆ పేరు పెట్టుకునే వాడిలా కనపడలేదు. ఒక విషయంలో దర్శకుడిని తప్పకుండా అభినందించాలి. ఈ పాత్రకు తనికెళ్ళ భరణిని ఎంచుకోకపోవటం. నేను అలా అనటం, భరణిగారు తక్కువ నటుడు అని కాదు. ఆయన ఈ తండ్రి వేషం వేసి ఉంటే, ఇప్పటికే ఆయన్ను అలాటి పాత్రల్లో చూసి చూసి మొనాటనీ (విసుగు) వచ్చేసింది. Thank You విమల్. తరువాత జడ్జి పాత్ర వేసినావిడ, ఆవిడ నటన సరదాగా ఉన్నది, బాగున్నది. సినిమాలో ఒకచోట సిధ్ధు తల్లి చీపిరి కట్టతో విలన్ గాళ్ళను తన్ని తరమటం, ముఖ్యంగా ఆ తన్నటానికి కారణం. భలేగా ఉన్నది. తండ్రి పాత్రలో ఉన్నాయన అక్కడ ఒక సెకండ్‌లో భలే ఎక్ష్ప్రెషన్ ఇచ్చాడు, చచ్చేంత నవ్వు వచ్చింది. ఇక చాల్లే, మరీ ఇంత రాస్తే ఎలా అనుకుంటున్నారు కదూ. అవును మరీ ఎక్కువయ్యింది అని నాకే అనిపిస్తున్నది. ఇక వీలైతే సినిమా చూడండి. మంచి సినిమాలు తీసే దర్శకులను వారి మొదటి ప్రయత్నంలో బాగా తియ్యటానికి ప్రయత్నించినట్టు కనపడినా చాలు ఆదరించాలి. అందుకే ఈ సినిమా చూడాలి.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.