21, జులై 2009, మంగళవారం

రాగతి పండరి-ప్రముఖ కార్టూనిస్ట్


రాగతి పండరి తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్టులలో (వాగ్దేవి,కె.సి లలిత అడపాదడపా వ్యంగ్య చిత్రాలను ప్రచురించినప్పటికీ), రాశిలోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్ట్. అదొక్కటే ప్రత్యేకత కాదు, అనతి కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకుని, ఆ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబు ల సరసన నిలబడగలిగిన స్థాయి చేరుకున్నారు . ఈ మంచి పేరుకు వెనుక అకుంఠిత దీక్ష, వ్యంగ్య చిత్ర కళ మీద ఎనలేని ప్రేమ, నిరంతర పరిశ్రమ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఈమెకు చిన్నతంలో వచ్చిన పోలియో మూలంగా శారీరకంగా చలాకీగా తిరగలేక పోయినా, అంతకు మించిన మానసిక చలాకీతనంతో, చకచకా కార్టూన్లు గీసి అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఆవిడ మాటలలోనె చెప్పాలంటే, "జీవితంలో వేదనని కాసేపు పక్కకు నెట్టి, నిండుగా నవ్వగలిగే శక్తినిచ్చే కార్టూన్లు, మనిషికి గ్లూకోజు డోసులాంటివి". ఏవిధమైన తటపటాయింపు లేకుండా, తాను కార్టూన్లు గియ్యాలన్న కోరిక మరియు స్పూర్తి, ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ కలగ చేశారని చెప్తారు. అలాగే, జయదేవ్ కూడ రాగతి పండరి తన నిజమైన శిష్యురాలని చెప్పుకుంటారు.

వ్యక్తిగతం
రాగతి పండరి 1965 సంవత్సరం జూలై 22 న విశాఖపట్టణంలో జన్మించారు. ఈమె తండ్రి రాగతి గోవిందరావు. తల్లి రాగతి శాంతకుమారి. ఈమె చదువు ఇంటివద్దనే కొనసాగింది. అతి చిన్నవయసులోనె పోలియో వల్ల వచ్చిన శారీరక లోపం వచ్చిననూ పట్టుదల, ధీరత్వం కలిగి జీవితాన్ని ఆత్మ విశ్వాసంతో,కఠోర పరిశ్రమతో ఎదుర్కొని, కార్టూన్ రంగంలో అగ్రగణ్యుల సరసన చేరారు .


వ్యంగ్య చిత్ర ప్రస్థానం


రాగతి పండరి కార్టొన్లలో ప్రచురించబడిన మొట్టమొదటి కార్టూన్.బొమ్మలో నాణ్యం అప్పటికి, ఇప్పటికి ఎంత పరిణితి చెందిందో గమనించండి.






రాగతి పండరి తన 8వ ఏటన 1973వ సంవత్సరంలో ప్రచురించిన మొట్టమొదటి వ్యంగ్య చిత్రంతిరిగొచ్చే కార్టూన్లు ఈమెను నిరాశపరచలేదు, పట్టుదలను పెంపొందించి మరింత కృషి సలపటానికి ఆలవాలమయ్యాయి. ఈమె తన వ్యంగ్యచిత్ర ప్రస్థానాన్ని 1973లో తన 8వ ఏటనే మొదలు పెట్టారు . బాల్యం వీడని రోజులలలోనే ఈమె వ్యంగ్య చిత్రాలు ప్రచురణ ప్రారంభమయ్యింది. 1980-1990 దశకాలు ఈమెవే అని చెప్పవచ్చు. కొన్ని వేల వ్యంగ్య చిత్రాలను శరపరంపరగా చిత్రించి పాఠకుల మీదకు వదిలారు. అన్ని ప్రముఖ వార, మాస పత్రికలలో ఈమె కార్టూన్లు ప్రచురించబడ్డాయి. పండుగలు వచ్చాయంటే, పత్రికల సంపాదకులు ఈమె కార్టూన్ల కోసరం ఎంతగానో కోరుకుని, అడిగి మరీ తెప్పించుకుని తమతమ పత్రికలలో ప్రచురిస్తారు.


వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు


సామన్యంగా, కార్టూన్లలో ఆడవారిని ఒక మూసలో ఇరికించి, ఒక గయ్యాళి భార్యగానో, అత్తగారిగానో, అప్పడాల కర్ర ఝుళిపిస్తున్నట్టుగా వేయటం పరిపాటి. రాగతి పండరి, అటువంటి మూసను అధిగమించి, ఆడవారిని తన వ్యంగ్య చిత్రాలలో అనేక ఇతర పాత్రలను, సృష్టించి, చూపించారు. మొదటిరోజులలో, వీరి వ్యంగ్య చిత్రాలు జయదేవ్ చిత్రాలలాగ కనిపించేవి. కాని, రాను రాను, తనదైన చక్కటి శైలి త్వరితగతిన ఏర్పరుచుకున్నారు. కుదురైన చక్కటి చిత్రీకరణ, గుండ్రటి చేతివ్రాత, తేట తెలుగులో సంభాషణలు వీరి వ్యంగ్య చిత్రాల ప్రత్యేకత.
వీరు సృష్టించిన నవగ్రహం అనుగ్రహం మహిళా ద్వయం మంచి పేరు తెచ్చుకున్నది. ఇందులో సన్నగా, పొడుగ్గ ఉన్న ఆమె, పొట్టిగా, లావుగా ఉన్న మరొకామె మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య సంభాషణలతో చక్కటి హాస్యం మేళవించి, వీరు వేసిన వ్యంగ్య చిత్రాలు పాఠకులను అలరించాయి.ఇంకా ఇద్దరు అమ్మాయిలు,మగాడు, కాలేజి గర్ల్‌ వంటి శీర్షికల పేరు మీద వీరు వేసిన వ్యంగ్య చిత్రాలు కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి తెలుగు వ్యంగ్య చిత్రరంగంలో అనేక వ్యంగ్యచిత్ర ధారావాహికలు వార పత్రికలలో నిర్వహించిన ఘనత వీరిదే.
సమకాలీన వ్యంగ్య చిత్రాకారులలో, వార్తా పత్రికలలో పని చేస్తూ ఉన్న కార్టూనిస్ట్‌లను మినహాయిస్తే, రాజకీయ వ్యంగ్య చిత్రాలు వేసే ఏకైక ఫ్రీలాన్స్[తెలుగు పదము కావాలి]మహిళా కార్టూనిస్ట్. 'రాజకీయ చెదరంగం' అన్న పేరుతో వేసిన కార్టూన్లు ఎంతో పేరు తెచ్చుకున్నాయి. ఈ శీర్షికన ఒక దశాబ్దం పైగా రాజకీయ వ్యంగ్య చిత్రాలను ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించబడటం తనకెంతో ఆనందం కలిగించిందని ఈమె చెప్తారు. వీరు వేసే రాజకీయ వ్యంగ్య చిత్రాలలో, నీజమైన రాజకీయ నాయకుల వ్యంగ్య చిత్రాలు ఉండవు. ఊహాజనిత రాజకీయ నాయకులను మాత్రమే చిత్రిస్తారు. మానవ ప్రవృత్తిలో ఉన్న ద్వంద్వ అలోచానావిధానం, సాఘిక దురాచారాలు, వీరి కార్టూన్లలో నిసితంగా విమర్శించి, హాస్యం ప్రధానంగా, ఆకర్షణీయంగా ఉండి, పాఠకులను నవ్వులలో ముంచెత్తటమే కాకుండా, ఆలోచించటానికి కూడ ఉద్యుక్తులను చేస్తాయి.

సత్కార సమాహారం
1991 సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టరు చేతుల మీదగా ప్రశంసా బహుమతి.
2001 సంవత్సరం ఉగాది పురస్కారం ఆంధ్ర ప్రదేశ్ అప్పటి గవర్నర్ సి.రంగరాజన్ చేతులమీదుగా అందుకోవటం

పుస్తకాలు
రాగతి పండరి ఆత్మకథ నా గురించి నేను...ముఖచిత్రం . రాగతి పండరి ఆత్మకథ వెనుక అట్టమీద చిత్రాన్ని క్లిక్ చేసి చూడండి. తనను గురువుగా చెప్పుకొనే శిష్యురాలి బొమ్మను తనదైన శైలిలో జయదేవ్ గారు గీసి అందించారు. ఇటువంటి అరుదైన గౌరవాన్ని అందుకున్నరు పండరి గారు. ఆపైన వివిధ పత్రికలవారు రాగతిపండరి వ్యంగ్య చిత్రాల మీద వ్యక్తీకరించిన అనేక చక్కటి అభిప్రాయాలు.


రాగతి పండరి ఆత్మకథ నా గురించి నేను...వెనుక అట్ట మీద పత్రికల ప్రశంసల జల్లువిశాలాంధ్ర ప్రచురణ సంస్థ 1997లో వీరి రెండొందల కార్టూన్లను ఒక సంపుటిగా "నవ్వుల విందు" పేరుమీద ప్రచురించారు .చిత్రకళా పరిషత్ వారు 2008 సంవత్సరంలో ఈమె ఆత్మకథ నా గురించి నేను ప్రచురించారు. ఈ పుస్తకాన్ని, ప్రముఖ సాహితీవేత్త ద్వాదశి నాగేశ్వరశాస్త్రి (ద్వా.నా. శాస్త్రి) చేతులమీదుగా 2008లో విశాఖపట్నంలో విడుదలైంది.[1]

ప్రముఖుల అభిప్రాయాలు

జయదేవ్ ప్రముఖ కార్టూనిస్ట్"....రాగతి పండరి కార్టూన్ సామ్రాజ్యాన్ని మొత్తం తన కైవసం చేసుకున్న ఏకైక మహిళ కార్టూనిస్టుగా పేరు ప్రఖ్యాతులనార్జించింది. సామజిక స్పృహతో, అను నిత్యం, కొత్త కొత్త అంశాలపై అమె విసిరిన విసురులు కోకొల్లలు. ముఖ్యంగా తెలుగు మహిళల జీవన సమస్యలను ఆకళింపు చేసుకుని వ్యంగ్యం జోడించి, తన సన్నటి, అతి స్వల్పమైన గీతలలో, పొందికైన వ్యాఖ్యలతో నవ్వుల పంటలు పండిస్తున్నది"

రామకృష్ణ ప్రముఖ కార్టూనిస్ట్-"....కాలక్రమేణా, తనకంటూ స్వంత శైలి ఏర్పరుచుకుని, చాలామంది మగ తెలుగు కార్టూనిస్టులు, వృత్తిపర-అసూయ పడేలా దూసుకు వచ్చిన ఒకే ఒక మహిళా కార్టూనిస్టు. నిత్య జీవితంలో అనేక సంఘటనలను తనదైన శైలిలో, చక్కని హాస్యం మేళవించి వేనవేల కార్టూన్లలో ప్రదర్శించారామె!"

పూర్వం తెలుగు వికీపీడియాలో నేను వ్రాసిన వ్యాసం పున:ప్రచురణ. నేను ఫోనులో ఆడిగిన వెంటనే అన్ని వివరాలు అందించిన రాగతి ఫండరి గారికి, వివరాలు సంపాయించటంలో ఎంతగానో సహకరించిన జయదేవ్ గారికి నా కృతజ్ఞతలు.

7 కామెంట్‌లు:

  1. నాకు ఇష్టమైన కార్టూనిస్ట్ ఫొటోతో సహా ఆవిడ గురించి రాసినందుకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  2. రాగతి పండరి గారి కార్టూన్లంటే నాకు చాలా ఇష్టం! బొమ్మలు చూడగానే నవ్వు రావడమే కాకుండా జోకు కూడా బాగా పేలేవి. అమె గురించి మంచి విషయాలందించారు.

    రిప్లయితొలగించండి
  3. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రముఖ కార్తూనిస్టు "రాగతి పండరి" గారి వివరాలు అందజేసిన మీకు మా కృతఙ్ఞతలు !

    రిప్లయితొలగించండి
  4. సరిగ్గా 1973-80 కాలంలోనే ఆంద్రపత్రిక సపరివారపత్రికలో రాగతి పండరి గారి రాజకీయ కార్టూన్లు, కుటుంబ కార్టూన్లు, పండుగల కార్టూన్లు క్రమం తప్పకుండా చూసేవాళ్లం. కానీ 1973నాటికి ఆమెకు ఎనిమిదేళ్లు మాత్రమేనని, అంత చిన్న వయస్సులోనే ఆమె కార్డూన్లను అత్యుద్భుత రీతిలో గీసి చరిత్ర సృష్టించారనే విషయం ఇప్పుడు మీ ఈ పరిచయం ద్వారానే తెలిసింది. చందమామ మాదిరే మా చిన్ననాటి జ్ఞాపకాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన రాగతి పండరి గారి గురించి ఇంత వివరంగా తెలియపర్చిన మీకు అభినందనలు.

    అలాగే.. 1970లలో శ్రీలంక సిలోన్ రేడియో స్టేషన్ నుంచి మధ్యాహ్నం తర్వాత 2 లేదా రెండున్నర గంటలకు అనుకుంటాను ఓ రేడియో అక్కయ్య (మీనాక్షి కాదనుకుంటాను... సరిగా గుర్తులేదు) అరగంట ప్రోగ్రాంలో తెలుగు పాత సినిమా పాటలతో మా బాల్యాన్ని మొత్తంగా పండించారు. మధ్యాహ్నం దాటిందంటే చాలు సిలోన్ రేడియో ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకుని రేడియో ముందు కదలకుండా కూర్చుని పోయేవాళ్లం. మాటలతో మాధుర్యం కురిపించే ఆమె గొంతు వినడం కోసం, తర్వాత పాఠకుల ఎంపిక ప్రకారం ప్రసారం చేసే పాత పాటల కోసం పడి చచ్చేవాళ్లం. ఇప్పుడు టీవీలు, పీసీల వెల్లువతో రేడియోకు దూరమైపోయాం.

    మీరు కూడా మీ శ్రీలంక రేడియో అనుభవాలను మీ బ్లాగులో ప్రస్తావించినట్లుంది. వీలైతే మా బాల్యాన్ని పాత తెలుగు పాటలతో కమ్మగా పండించిన ఆ సిలోన్ రేడియో అక్కయ్య వివరాలు తెలియజేయగలరా? ప్రస్తుతం ఆమె ఉన్నారో లేదో కూడా తెలియదు. అప్పట్లోనే ప్రసారం మధ్యలో ఆయాసంతో ఆమె దగ్గేవారని గుర్తు.

    మీరు పొందుపర్చిన పాత చందమామ సీరియల్స్ లింకులను చూశాను. కొ్ద్ది కొ్ద్దిగా నేను కూడా డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. తప్పదు. మరో మార్గం లేదు. పాత చందమామలు దొరికే పరిస్థితి లేదు. వపా గారి చిత్రాల ఆల్బమ్ ఓ అద్భుతం. అభినందనలు.

    చిరుకోరిక. ఆన్‌లైన్ చందమామకు మీ 'చందమామ జ్ఞాపకాలు' రాసి పంపాలని అభ్యర్థన.

    మిమ్ములను ఇలా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  5. రాగతి పండరి గారి ఆత్మకథ ఎక్కడ దొరుకుతుందో తెలపగలరా? హైదరాబాదు విశాలాంధ్రలో అడిగితే తెలియదన్నారు.

    రిప్లయితొలగించండి
  6. థాంక్సండి. నా email id: bvijay@gmail.com
    మీ site చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.