13, ఆగస్టు 2009, గురువారం

చలం గారి సినిమా సమీక్ష

వ్యాసం చివరి వరకూ చదివిన వారికి ఒక చక్కటి బహుమతి ఉన్నది
ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం 1940లలొ బెజవాడలో ఒక సినిమా హాలుకు(లక్ష్మీ టాకీసు) ఆనుకుని ఉన్న ఇంటిలో నివసించేవారు.చలంగారు తన మ్యూజింగ్స్ వ్యాసాల్లో సినిమా హాలు పక్కన ఉన్న ఇంట్లో ఉంటూ తనెంత క్షొభ పడ్డాడో ఈ కింద విధంగా వ్రాశారు:

"మా గోడపక్కన టాకీగృహం. యజమానులు వాళ్ళకి ఏఫిల్ము డబ్బు తీసుకొస్తుందో ఆలోచిస్తారుగాని, పక్కన నివసించే నిర్భాగ్యుల నిద్ర అదృష్టాన్ని గుర్తించరు. ఫిల్ము మారుతోంది అనేప్పటికి గుడెలు దడదడలాడతాయి, ఏ కొత్తరకం ఉపద్రవం రాబోతోందో అని. అర్ధరాత్రులు మెళుకువగా గడిపేవాళ్ళ మనశ్శాంతి ఈ డైరక్టర్ల శ్రవణ సౌకుమార్యం మీద ఆధారపడవలసి వొచ్చింది. తెలుగు ఫిల్ములను చూడనివాళ్ళ అశ్రద్ధ మీద మంచికసి తీర్చుకుంటున్నారు వారాలకి వారాలు వాటి దుస్సహమైన శబ్దాలను వినిపించి. ఏ హీరోయినో పెద్దపులినోట ప్రాణాన్నో, దుర్మార్గుడి హస్తాలమధ్య శీలాన్నో, సముద్రంలో తనవస్త్రాలనో,కోల్పోయే అపాయంలోకి దిగేటప్పుడు, ఇరవై ఇనపతాళ్ళమీద రంపాలుపెట్టి కోస్తున్నట్టు గోలకల్పిస్తే ఊపిరి బిగబట్టి మెడలుచాచి ఆవింత చూసే రెండువందల అణాకానీలకి ఉత్సాహకరంగా ఉంటుందేమో కాని, వినేవాళ్ళు అపాయం తప్పిందని tension సళ్ళిచ్చి ఎప్పుడు ఈలలు కొడతారా అని ఫిల్ము దేవుళ్ళకి మొక్కుకుంటో వుంటారు..........................టిక్కెట్టు కొనలేని వారికి కూడా art పంచాలనే ఉదార ఆశయంతోగావును, దర్శకులు, మాటలూ, పాటలూ చుట్టూ అరమైలు వరకు వినపడేట్టు ఏర్పాటుచేశారు. ఎట్టాగైనా తెలుగువారు చాల generous people. విశ్వదాత అనుగు బిడ్డలు. ఆ పాటల్ని విని, ఆ గంధర్వ కంఠాల ఆకర్షణని నిగ్రహించుకోలేక,ఎట్లాగో అణాకానీలు సంపాయించుకుని, ప్రజలు చిత్రం చూడ్డానికి వస్తారని ఆశ....................నెలలు వాటితో గడిపి ఇంకా బతికి ఉన్నానంటే, నాకు నూరేళ్ళకన్నా ఎక్కువ అయుర్దాయమున్నదని అనుమానంగా ఉంది. నేను దేశానికీ, భాషకీ చేస్తున్న ద్రోహానికి, యముడి పక్కన, ఇటు భారతమాతా, అటు సరస్వతీ నుంచుని తప్పకుండా నరకంలోకి తోయిస్తారని ఆశపడే నీతిసోదరులకి చాలా ఆశాభంగం కలగబోతోంది. ఈ ఫిల్ముపాటలు వినడంతో నా కర్మపరిపాకం ఇక్కడే తీరింది. నాకుకూడా, నరకంలో వేసినా, ఇంతకన్నా ఏంచేస్తారు అనే నిబ్బరం చిక్కింది. ఇంతలో బాలనాగమ్మ ట్రైలరు వినడంతోటే, చాల పొరబడ్డాననీ, దర్శకుల శబ్దకల్పనాశక్తి లోతుల్ని తెలుసుకోలేక, అబద్ధపు ధీమాలో బతుకుతున్నానని వొణుకు పుట్టింది. ఇల్లు మారుద్దామా, ఇల్లు దొరక్కపోతే రైలుస్టేషనులో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, అక్కడ మకాం పెడదామా అనుకొంటూ ఉండగా, ఆ ఫిల్ము రాదని అబద్ధపు ధైర్యాన్నిచ్చారు".

1990లలో ఆ సినిమా హాలుతోబాటు చలం పూర్వం ఉన్నఇల్లుకూడా కొని, కూలగొట్టి ఒక వ్యాపార సముదాయం కట్టారు. కూలగొట్టడానికి ముందు, ఆ ఇంటిని చలం ప్రదర్శనశాలగా మార్చడానికి ఆయన అభిమానులు ప్రయత్నించారు,కానీ, ప్రస్తుతపు వ్యాపార వత్తిడులననుసరించి, ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు.

ఇలా తప్పనిసరిగా సినిమాలు వింటూ, అప్పట్లో విడుదలై 56 రోజులు ఆడిన లైలా మజ్ఞు సినిమా మీద చలం గారు తన మ్యూజింగ్సులో(280వ పుటలో 5 వ ముద్రణ 2005) ఈ క్రింది విధంగా వ్రాశారు


లైలా మజ్ఞు ప్రపంచ సారస్వతంలోని ప్రేమ కథల్లో ఒకటి. ఆ కథ, నాటకాలై తరువాత హిందీ సినిమాలై, ప్రస్తుతం తెలుగులోకి దిగింది. ఆ ప్రేమగాధని ఏంగా తయారు చేశారో, ప్రతిరాత్రీ రెండుసార్లు వినడం తప్పలేదు నాకు. ఫిల్ము అంతా ఏడుపే. అంతకన్నా ఏడుపు ఇంక కల్పించడ ఎవరికీ అసాధ్యం చేసేశారు. తెలుగు వాళ్ళకి ఏడుపులు ఇష్టం గావును. పల్లెటూళ్ళాలో చెప్పే పాత బుర్ర కథలన్నీ అన్యాయంగా నరుక్కోడాలూ, ఏడుపులూ, భయాలు.

ఒకరంటారూ, ఈ చిత్రంలో ఆడవాళ్ళకి కొన్ని బట్టలు తీసేసి చూపడం ముఖ్యమైన ఆకర్షణ అని. అట్లాంటి అశ్లీలమైన పని చేస్తే సెన్సార్లు ఎట్లా ఒప్పుకున్నారో! ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి అశ్లీలాలు చిత్రాల్లోకి ఎక్కకండా. ఎందుకంటే తెలుగు సినిమా తారలు పూసుకునే రంగులూ, కట్టుకునే బట్టలూ, ఉండలూ, తీసేసి అసలు స్వరూపాల్ని ఒక్కసారి చూపారంటే, ఇంక ఎటువంటి ప్రేక్షకుడూ ఆ సినిమాల వేపు పోడు. మద్యపాన నిషేధంతో అసలే అవస్థపడుతున్న ప్రభుత్వానికి, ఆదాయం మరీ తగ్గుతుంది. అప్పుడు సినిమాలకి వెళ్ళని వారిమీద పన్ను వెయ్యగల పద్దతి అలోచించాల్సి ఉంటుంది.

ఈ కథలో నాయకీ నాయకులు ప్రపంచ సారస్వతంలో గొప్ప ప్రియులు. గాధ అద్వితీయం. ఈ చిత్రాన్ని తయారు చేసిన గుంపులో, కవులు, చిత్రకారులు, గాయకులు, దర్శకులు, నటులు-ఎవరికన్నా, ఎప్పుడన్నా అలోచనలకి వచ్చిందా, మామూలుగా మనుష్యుల హృదయాల్లో కలిగే ప్రేమ స్వబావం-అది వ్యక్తమయ్యే విధం! ఫిల్ము అంతా ప్రేమో, ప్రేమో అని అరుపులు, వూరంతా వినపడేట్టు అరుపులు. వాళ్ళని పిచ్చివాళ్ళు అనుకోకపోతే ఇంకేమనుకుంటారు?

దీంటో కొత్తరకమైన ప్రియుల్ని కనిపెట్టారు. "పనమయే ప్రేతముల్ని" పాట చివర "పెళ్ళికూతురా!" అంటాడు. కొంచెంసేపు ఆ పాటే ఉంటే మూడోది ఓ తిట్టు వస్తుందనుకుంటాము. ఆ నాయకి "మన ప్రేమలూ ఊ ఊ ఊ" అని ఊరంతా ఊదుతుంది.

ఈశ్వర కటాక్షంవల్ల వాళ్ళిద్దరూ, అంతటితో చచ్చిపొయినారు గాని లేకపొతే ఎట్లానూ వాళ్ళని వెళ్ళగొడుదురు, పురశాంతికోసం. అట్లా ఏడవకపోతే, ఎక్కడికన్నా పారిపోకూడదా అనుకుంటామా, వాళ్ళెందుకు పొతారూ? మరి వాళ్ళ ప్రేమ అరుపుల్ని వినేదెవరు, ఎక్కడి కన్నా పారిపొతే!


ఫిల్ము చివర నీతి సమస్య వచ్చింది. పెళ్ళి అయిన అమెను ప్రెయుడితో కలసి కాపరం ఎట్లానా చెయ్యనీడమని. అందుకని సరే తుఫాను తెప్పించారు. ఆ తుఫానులో ఇద్దరూ చచ్చిపోయినారు. నాయకుడు పటుత్వమైన ఉపన్యాసమిచ్చి, వెంటనే చస్తాడు. 'అమ్మా చచ్చారు. ఇంక నిద్రపోవచ్చు' ననుకుంటామా! వాళ్ళు చావరు. పైకి ఎగిరి ఆకాశంమీద నుంచి మళ్ళీ పాట లంకించుకుంటారు. ఒక వేళ వాళ్ళని సలక్షణంగా కాపరానికి పెట్టినా ఇంత హంగామా రోజూ చేస్తూనే ఉండేవారేమో!

స్వర్గలోక నివాసుల్ని తలుచుకుంటే ఎవరికైనా దిగులు పుట్టకమానదు. ఐనా ఆకాశంలో ఉండరు. దేయ్యాలై దిగివచ్చి, మళ్ళీ పాటలు ప్రాంభించి ఉంటారు. ఏ పరిస్థితిలోనైనా తమ ప్రేమ పాటల్ని, ఇట్లా అర్చుకుంటో తిరెగే వాళ్ళు ఎక్కడన్నా వుంటార అని.

రామాయణాన్ని పుట్టలో ఊదాడుగాని, ఈ లైలా మజ్ఞూలు వస్తున్నారని ఎవరన్నా వాల్మీకి పుట్టలో ఊదితే ఒక్క గంతేసి అంతులేకండా పారిపోయి ఉండును ఆ రుషి. అప్పుడు రామయణం రాయడానికి విశ్వనాధగారు (విశ్వనాధ సత్యనారాయణ) తప్ప ఎవరూ మిగిలేవారు కారు.

ఈ ప్రకారం కథనీ, చిత్రం తీసే పద్దతినీ ధ్వంసం చెయ్యకపోతే ప్రజలు చూడరని చిత్రాలవారికి నిశ్చితాభిప్రాయం. ఈ ఫిల్ములో కొత్త టెక్నిక్ చూపించారు. తుఫాను నాయకుడికి నోట్టోంచి బయలుదేరుతుంది. అతని నోరు మాట్టాడుతున్నప్పుడు ఆగుతుంది. ఆ పని కాగానే నోరు ఖాళీ ఐ, తుఫాను ప్రాంభిస్తుంది. గొంతు కోస్తున్న చీంబోతు మల్లే "లైలా, లైలా" అన్న అతని అరుపూ, పిచ్చి కుక్క తరిమే వెనకకాలు విరిగిన కుందేలు మల్లే "ఓ ఓ ఓ" అనే అమె అరుపూ విన్న తరువాత, ఈ ప్రజలు ఇళ్ళకుపోయి మామూలుగా ఎట్లా బతుకుతున్నారో తెలీదు. కలలు కంటాను-ఇట్లాఇటి ప్రేమగాధ చిత్రం-అసలు చప్పుడు లేకుండా, సగం వినపడే ఒక మాట-ఎప్పుడో స్మూత్ గా పాడిన ఒక్క చరణం-అట్లా నడవకూడదా అని....ప్రేమని ముఖంలో, కళ్ళలో, దేహం ఉనికిలో చూపకూడదా అని.

అసలు కథలో లైలాది గోషాదేశం. బైటికి రావడం ఆమెకి అసాధ్యం. చొట్టూ ఎడారి. పోవడాని వీలెలేదు. ఈ లైలామజ్ఞూలది మద్రాసు. ఒక్క కార్లు లేవుగాని, తక్కిన రాకపోకలకి ఏ అభ్యంతరాలు లేవు. లైలాకి-ఇంటివారిలో ఆడవాళ్ళందరూ మిత్రులే. ఎందుకు పారిపోరో వాళ్ళు! మతం మహ్మదీయ మతం. పునర్జన్మలు వొప్పుకుని మాట్టాడతారు. ఆ తురక దేశాల మధ్య. ఆ ప్రేమ, పెళ్ళి ఐనవాళ్ళకి వొచ్చిందా, ఆ ప్రియులకి ఈ హక్కుల్లో ఒక్కటీ ఒప్పుకోరు. పెళ్ళి అయిన వాళ్ళకి వొచ్చెది అపవిత్ర ప్రేమ అంటే, ఆ దేశాల్లో ఎప్పుడూ విడాకులు ఉన్నాయి.

అంత దయగల ఆ రాజు, పెళ్ళి చేసుకున్న పిల్లని అట్లా పంపకపోతే తాను ఆమెకు విడాకులిచ్చి, ప్రియుల్ని తానే కలపగూడదా? అసలు ఈ లైలా లెక్చర్లూ, గుంజుకోడాలు, అరుస్తో పాటలు విని ఈ పిల్లతో ఎవడు కాపరం చెయ్యగలడని హడలిపోయి, మంచి మాటలు చెప్పి, ఎంత త్వరగా పంపితే, అంత మంచిదనుకుని ఉంటాడు. ఆ తుఫాను కోసమే కాచుకుని ఉన్నారు ఈ ప్రియులు. కాకపోతే ఒక్కచోటే, ఒక్క సమయంలోనే, లైలా,మజ్ఞూ, తుఫానూ కలుసుకోవడం అసంభవం.


ఇలాగే చలంగారు సినిమా ప్రియులు అన్న వ్యాసంలో అప్పటి సినిమాలు అందులో ఉండే అపభ్రంశపు అంశాలను చక్కటి హాస్యం పండిస్తూ ఎండగట్టారు. ఎప్పుడో 50ఏళ్ళ క్రితం వ్రాసిన ఈ వ్యాసంలోని అనేక అంశాలు ఈనాటికి మనం సినిమా పేరుతో చూస్తున్నటువంటి దృశ్య శబ్ద మేళవింపుకు చక్కగా వర్తిస్తాయి. కాని వినేవాళ్ళెవరు!!!
చలం గారు వ్రాసిని "సినిమా ప్రియులు" వ్యాసాన్నీ ఈ కింద ఇచ్చిన లింకు నొక్కి  (డౌన్లోడ్ చేసుకుని) చదువుకుని ఆనందించవచ్చును. చలంగారు సినిమాలను చీల్చి చెండాడడం చదివినాక, భమిడిపాటి కామేశ్వరరావుగారు సినిమాలలో కథ గురించి అన్నమాటలు చూద్దాం

.....సరి మరి కథ. అది పురాణం అవాలి. లేకపోతే అంధ(అచ్చు తప్పేమో ఆంధ్ర బదులు అంధ అని ఉన్నదనుకోవటానికి వీలులేదు. రచయిత ఉద్దేశ్యం "అంధ" అంటే "గుడ్డి" అని) జనానికి గణ్యత ఉండదు. అంధ జనం నూటికి తొంభై. వాళ్ళంతా హాజరైనప్పుడుగాని టాకీ వర్తకం కిట్టదు. వాళ్ళకి భక్తి కుదిరేందుకు దేవుళ్ళూ, భయం వేసేందుకు అడివి మృగాలూ, హుషార్ కలిగేందుకు సుందరులూ వాళ్ళ స్నానాలూ, ఆటలకి గంభీరమైన శీర్షికలూ-సర్వంగిలాబా చెయ్యడంకోసం కైంయిమంటూ మంచి పీకవాళ్ళు పాటలూ! దాంతోటి జన బాహుళ్యం మొదట తమాషాకోసమున్నూ తరువాత తోచకానూ ఎగపడడం. 'వార ప్రతిష్ఠతో' డబ్బురావడం, డబ్బొచ్చిన టాకీ గనక గొప్పదని చెప్పడం! అందువల్ల అందులో యంత్రిపబడ్డ నటులు అసమానంగా అభినయించారనిన్నీ, వాళ్ళ కీర్తి మిన్ను ముట్టడం రూఢీ గనకనే వాళ్ళని 'తార' లు అంటున్నారనిన్నీ చెప్పుగోడం.
...బొమ్మకి కన్ను చాలు (టాకీలో మాటలకి గణ్యత తక్కువ గనక) అందుకని, టాకీ పామరుల్ని కూడా అకర్షిస్తుంది. కాదు పామరుల్నే ఆకర్షిస్తుంది....

ఇప్పుడు చెప్పండి మన సినిమలకి సరైన సమీక్షలు అవసరమా కాదా??

5 వ్యాఖ్యలు:

 1. చాలా బాగుందండి ఈ సినిమా సమీక్ష. నాకు చలం గారి మూజింగ్స్ లో నచ్చిన భాగం మీరు ప్రస్తావించిన భాగం. చాలా పాత సినిమాలను చూసినప్పుడు చలం ఏమనే వాడా అని వూహించుకుని నవ్వుకోవటం నాకు అలవాటు.. బావుందండి..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చలం ఉడికించే శైలికి మ్యూజింగ్స్ పరాకాష్ట.
  ఎదుటివాడు సమాధానం చెప్పటానికి లేకుండా ఉక్కిరిబిక్కిరి చేయగలడు, తన మాటల తూటాలతో.

  so he became a legend

  thank you for sharing a nice essay.

  bolloju baba

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అవును, మ్యూజింగ్సులో ఈ భాగం నాకు బాగా గుర్తుండి పోయింది. అదృష్టవశాత్తూ మా యిల్లు ఏ సినిమాహాలుకీ పక్కన్ లేదు, కానీ మా ఇంటి దగ్గర్లో కొండమీద ఒక దుర్గ గుడి ఉంది. దాంట్లో నవరాత్రుల టైములో మైకు పెట్టి అర్ధరాత్రిదాకా భజనలు చేసేవారు. ఆ భజనలన్నీ ఆనాటి సూపర్ హిట్ సినిమాలైన సర్దార్ పాపారాయుడు, కోండవీటి సింహం ఇట్టి చిత్రరాజాల పాటల త్యూన్లో ఉండేవి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. "ప్రేమని ముఖంలో, కళ్ళలో, దేహం ఉనికిలో చూపకూడదా అని." ఇది చలంకి మాత్రమే సాధ్యమైన మహా మౌన భావన. యాసిడ్ ప్రేమలతో తగలడుతున్న తెలుగు సమాజానికి ఈ రకం ప్రేమ ఏనాటికైనా అర్థం అవుతుందా మరి.


  సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి నివ్వరాదా అన్నది చలం బాధ.

  'తను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు తన చాతగాని తనాన్ని, అర్థ అస్పష్టతనీ ఛందస్సు చీరల వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి -ముఖ్యం, సహజ సౌందర్యం తక్కువైనప్పుడు! సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి నివ్వరాదా అని చెలం కోరిక.'

  '...కవిత్వంలోనూ జీవితంలోనూ, economy of words and thoughts లేకపోవటం దేశభక్తి కన్న హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా.'

  చలం 'మహాప్రస్థానం'కు రాసిన ముందుమాట 'యోగ్యతాపత్రం'లో చెప్పిన ఈ మెరుపు వాక్యాలు మన తెలుగు సినిమాలకు కూడా చక్కగా వర్తిస్తాయనుకుంటాను.

  ఒకే రకమైన అభిరుచి గలవారికోసమే కాక మనం సమర్పిస్తున్న పోస్ట్ పదిమందికీ చెబితే బాగుంటుందని మీరు భావిస్తే ఇంకా మంచిదనుకుంటాను. ఎన్ని కూడళ్లు, హారాలు, జల్లెడలు, బ్లాగర్లు, జాలాలు మన కొత్త లింకులను ఆరోజుకు నెటిజన్ల ముందు ప్రత్యక్షం చేస్తున్నప్పటికీ, మనకున్న పని, జీవిత ఒత్తిళ్ల కారణంగా మంచి బ్లాగంశాలను, మంచి కథనాలను, పోస్ట్లులను తరచుగా మిస్సవుతున్నామని నా పరిశీలనలో తేలిన విషయం.

  సాహిత్య అభిమానిను తనిఖీ చెయ్యడానికి అంటూ మీరు పంపిన ఆహ్వానం సరైన పద్ధతి. మీరు పంపక పోయి ఉంటే బహుశా ఈ రోజు నాకు మీ కొత్త పోస్ట్ కనపించేది కాదేమో. మళ్లీ వెతుక్కుని మీ బ్లాగ్‌ని తెరిస్తే తప్ప.

  పంపినందుకు అభినందనలు. ఇలాగే పంపిస్తుంటారని ఆశిస్తూ..

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.