23, ఆగస్టు 2009, ఆదివారం

చిత్ర - చందమామ అద్భుత చిత్రకారుడు

చిత్రా (CHITRA) గా పేరొందిన శ్రీ టి వి రాఘవులు ( T.V.RAGHAVULU )
చందమామ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది అందులోని చక్కటి బొమ్మలు. ఎన్ని బొమ్మలు, ఎన్ని బొమ్మలు! ఆ బొమ్మల కోసమే కదా చందమామ చదెవే వాళ్ళం. చందమామలో ముగ్గురు అద్భుత చిత్రకారులు ఉండేవారు.

చిత్రా
శంకర్
వడ్డాది పాపయ్య

వీరిలో చిత్రాగారి గురించి ముచ్చటించుకుందాము.

వ్యక్తిగతం
చిత్రాగా ప్రసిధ్ధికెక్కిన వీరి అసలు పేరు టి.వి రాఘవులు.వీరి జననం మార్చ్ 12, 1912 వీరు తెలుగువారే. కాని మద్రాసు తెలుగు వారు. అప్పట్లో మద్రాసులో, రమారమి తమిళులు ఎంతమంది ఉన్నారో, అంతమంది తెలుగువారు కూడ ఉండేవారట. ఈయన S.S.L.C వరకు చదువుకున్నారు. వీరి వివాహం 1942లో జరిగింది. చందమామలో చేరక ముందు, కొంతకాలం ఆక్ష్‌ఫర్డ్ ప్రెస్సులో సేల్సుమాన్ గాను చిత్రాకారునిగాను పనిచేసారు.చిత్రాగారు స్వతహాగా చాయా గ్రాకులు కూడా. ఫొటోగ్రఫీలో కొన్ని బహుమతులను కూడా సంపాయించారు. అందుకనే కాబోలు, ఆయన వేసిన చిత్రాలు, ఫొటోల్లాగ ఉంటాయి.

చిత్రలేఖన ప్రవేశం
చిత్రాగారిదగ్గర ఉన్న చిత్రం ఏమంటే, ఆయన చిత్ర లేఖనంలో శిక్షణ పొందలేదు, స్వయంకృషితో మంచి ఆసక్తితో అభ్యాసం చేసి నేర్చుకుని చిత్ర కళలో నైపుణ్యం సంపాయించి, భారత దేశం లో ఉన్న బాలలందరినే కాక పెద్దలను కూడ దశాబ్దాలపాటు అలరించారు.
చిత్రకళా నైపుణ్యం
ఒకానొక సందర్భంలో కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు చందమామ గురించి ఇలా అన్నారు:

"చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా"

జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, రాయాయణ కల్పవృక్షం వంటి కావ్యాలను వ్రాసిన మహా రచయిత, చందమామ మీద ఇంతటి ప్రేమ చూపించటంలో, బొమ్మలదే ఎక్కువ పాత్ర అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు.

చిత్రా వేసిన బొమ్మలు, కథను చిత్రాల ద్వార చెప్పటమే కాకుండా, కథలో చెప్పని అనేక విషయాలను వ్యక్త పరిచేవి. బొమ్మ చూడగానే కథను చదివించే శక్తి, మన మనసులను సూదంటు రాయిలాగ ఆకర్షించి, మన ఊహా లోకాలలో ఆ కథా విషయం, కథా కాలం, ఆ కథలలో ఉన్న పాత్రల స్వబావ స్వరూపాలు వెంటనే మన మనసులకు హత్తుకు పొయ్యేట్టుగా ఆయన వేసిన బొమ్మలు చందమామను ఎంతో ప్రసిధ్ధ పత్రికగా నిలబెట్టినాయి.

బొమ్మలను చందమామలో ఎలా, ఎక్కడ వెయ్యలి అన్న విషయంలో చక్కటి కొత్త శైలిని ప్రవేశపెట్టారు, చక్రపాణి గారు. ఆయన ప్రవేశపెట్టిన శైలిని తన చిత్రకళా నైపుణ్యంతో ఒక ఒరవడిగా తీర్చిదిద్దిన ఘనత చాలావరకు చిత్రాగారిదే. ఇప్పటికీ పిల్లల పత్రికలన్ని కూడ, చందమామ వారు ఏర్పరిచిన పంథానే అవలింభిస్తున్నాయి. చివరకు చందమామ "వ్యాపార కంపెనీ" పరమయ్యి, కొత్త పోకడలకు పాకులాడి, చందమామ ముద్రించే పద్దతి మార్చినప్పుడు, తీవ్ర నిరసనను ఎదుర్కుని, మళ్ళీ తమ పాత పద్ధతిలోనే ప్రచురిస్తామని మాట ఇవ్వాల్సి వచ్చింది. అంతగా ప్రాచుర్యం పొందింది, చందమామ ప్రచురణ పద్ధతి.

చిత్రాల ప్రత్యేకత
అసలు బొమ్మలో ఉండవలసిన ముఖ్య లక్షణం ఆ బొమ్మలో ఉన్న పరిసరాలు, వస్తువలు, మనుష్యులు మధ్య ఉండవలసిన నిష్పత్తి. ఒక మనిషి మేడపైనుంచి చూస్తుంటే, కింద వస్తువులు అతనికి ఎలా కనిపిస్తాయి, లేదా, కిందనుండి పై అంతస్తులో ఉన్న వ్యక్తితో మాట్లాడే వ్యక్తి మెడ ఏ కోణంలో వెయ్యాలి, అతనికి మేడమీద వ్యక్తులు ఎలా కనిపిస్తారు లాంటి విషయాలు చక్కగా ఆకళింపు చేసుకుని చిత్రాగారు బొమ్మలను వెయ్యటం వల్ల ఆయన బొమ్మలు ఎంతగానో పేరు తెచ్చుకున్నాయి. కథను క్షుణ్ణంగా చదివిన తరువాతగాని బొమ్మ వెయ్యటం మొదలు పెట్టేవారు కాదన్న విషయం, ఆయన వేసిన ప్రతి బొమ్మలోనూ కనపడుతుంది. ఆయా పాత్రల ముఖ కవళికలు, కథలోని పాత్రల మనస్తత్వాలను సరిగ్గా చిత్రీకరించేవారు.

చిత్రాలన్నీ కూడ బొమ్మలోని కథ ఏ ప్రాంతంలో జరిగిందో, ఆయా ప్రాతాంల భౌగోళిక పరిస్థితులను ప్రతిబింబించేవి.అక్కడి మనుషులు ఎలా ఉంటారు, ఎటువంటి జంతువులు దర్శనమిస్తాయి, అక్కడ ఇళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎటువంటి పరికరాలు వాడతారు వంటి అనేక విషయాలు అధ్యయనం చేసి తమ బొమ్మలలో వేసి పిల్లలకు కథలో చెప్పని ఎంతో విలువైన సమాచారం ఇచ్చేవారు చిత్రాగారు. మనం ఇంక ఆ ప్రాంతం గురించి పెద్దగా తెలుసుకునే అవసరం ఉండేది కాదు. అలాగే, కథలోని పాత్రల హోదా బట్టి, వారి ప్రాంతాన్ని బట్టి, కేశాలంకరణలు, దుస్తులు మారిపొయ్యేవి, చక్కగా కథలో వ్రాసిన విషయానికి నప్పేవి.

ధారావాహికలకు బొమ్మలు
కథలకు బొమ్మలు వెయ్యటం ఒక ఎత్తు ఐతే, ధారావాహికలకు చిత్రాగారు వేసిన బొమ్మలు అపూర్వం, నభూతో న భవిష్యతి. ఆయనలాగ దారావాహికలు బొమ్మలు వేయగలవారు లేరు. మొదటి భాగంలో ఒక పాత్ర ఎలా ఉంటుందో, ధారావాహిక చివరి భాగం వరకూ అదేవిధంగా వెయ్యగలిగిన ప్రజ్ఞాశాలి. రచయిత దాసరి సుబ్రహ్మణ్యంగారి కృషి, వారి రచనలకు వన్నె తెచ్చే విధంగా చిత్రా గారి బొమ్మలు, రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, శిధిలాలయం, రాతి రథం మొదలగుగాగల చందమామ ధారావాహికలు ఎంతగానో పాఠకుల మెప్పు పొందటానికి, చందమామ ప్రాచుర్యం పెరగటానికి తోడ్పడినాయి.

కీర్తి ప్రతిష్టలు
చిత్రాగారు దాదాపు 10,000 వేల బొమ్మలు చందమామలో వేశారట. చందమామకు కార్యాలయాన్ని దర్శించిన వేలమందిలో ఎక్కువమంది చిత్రా గారిని చూడటానికే వచ్చేవారట. చందమామలో చిత్రాగారు వేసిన బొమ్మలన్నిటిని మంచి నాణ్యంతో ముధ్రించి భద్రపరచవలసిన అవసరం ఎంతో ఉన్నది. చిత్రకళను అభ్యసించేవారికి వారి బొమ్మలు చూస్తే చాలు, బొమ్మలు ఎలా వేయాలో సులువుగా అర్థమౌతుంది. నాకు దొరికినంతవరకు, శిధిలాలయం ధారావాహికలో, చిత్రాగారు వేసిన కొన్ని బొమ్మలను ఈ కింద అందిస్తున్నాను.ఈ కింద ఇచ్చిన చిత్రాగారి బొమ్మలు ఆయన ప్రతిభను కొంతవరకు చూపిస్తాయి. ఇలాగే ఆయన వేసిన వేల బొమ్మలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ చందమామ కథలను చదవటంలోనే ఉన్నది మజా.

కీర్తిశేషులు
ఇన్ని అద్భుత చిత్రాలు వేసి, దేశవ్యాపతంగా వేల ఏకలవ్య శిష్యులను అభిమానులను సంపాయించుకున్న చిత్రా గారు, మే 6 1978 న స్వర్గస్తులయ్యారు. చిత్రాగారు ఎలా ఉంటారు అన్న విషయం , వారు మరణించిన తరువాత చందమామ వారు జూన్ 1978 సంచికలో ప్రచురించిన ఫొటో చూసే వరకు పాఠకులకు తెలియదు. అది కూడ చాలా పాత ఫొటో. ఆ చిత్రాన్నే ఈ వ్యాసం మొదట్లో పొందుపరచటం జరిగింది. ఆయన నిర్యాణంతో చందమామకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన తరువాత వచ్చిన చిత్రకారులు, తమ బొమ్మలతో (చిత్రా బొమ్మల తీరును అనుసరించినప్పటికీ) పాఠకులను అలరించటంలో విఫలమయ్యారు.



ఈ వ్యాసంలోని వివరాలు జూన్ 1978 సంచికలో చందమామ వారు ప్రచురించిన శ్రధ్ధాంజలి నుండి గ్రహించటమైనది. చిత్రాగారి గురించి ఇంకా అనేక విషయాలు తెలియవలసి ఉన్నది. వారిచిత్రాల మీద అప్పటి పాఠకులు, సమకాలీన కళాకారుల అభిప్రాయాలు, ఆయన బొమ్మలు వేస్తుండగా తీసిన ఫొటో, చందమామకు ఇంతటి పేరు సంపాయించిపెట్టిన చిత్రాగారికి ఎంత ప్రతిఫలం ఉండేది, 1970లలో ఆయన ఎలా ఉండేవారు. ఆయన కుటుంబ జీవనం, పిల్లలు వగైరా, వగైరా.


చిత్రాగారు శిధిలాలయం ధారావాహికకు వేసిన బొమ్మలు కొన్ని

11 కామెంట్‌లు:

  1. చందమామ పాఠకులకు బాగా ఇష్టమైన చిత్రాగా ప్రసిద్ధికెక్కిన శ్రీ టీ.వీ.రాఘవులుగారి గురించి తెలియని ఎన్నో విషయాలు తెలియజేసిన మీరు అభినందనీయులు.

    రిప్లయితొలగించండి
  2. శివ గారూ, నేను నా బ్లాగులో ఈసారి రాద్దామనుకున్న టపా ‘చిత్రా’ గారి గురించేనండీ. మీరు రాసేశారు, ఇంతలోనే! :-) అయినా నేను కూడా నా అభిమాన చిత్రకారుడైన చిత్రా గురించి తప్పకుండా రాస్తాన్లెండి! ఈ పోస్టు రాసినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. వేణూ గారూ,

    నేను చిత్రాగారి మీద వ్యాసం అనుకోకుండా వ్రాశాను. వినాయక చవితి సాయంత్రం,హఠాత్తుగా అనిపించింది, చిత్రాగారు మరణించినప్పుడు ఆయన బొమ్మ చందమామలో వేశారన్న విషయం. వెంటనే గాలింపు మొదలు పెట్టాను. 1975 నుండి చూసుకుంటూ వచ్చాను. చివరకు 1978 చందమామలో కనపడింది. మొదట్లో బొమ్మ ఒకటి అందరికి అందచేద్దామనుకున్నాను. కాని చిత్రా మీద ఉన్న అభిమానంతో వ్యాసమే మొదలు పెట్టాను. ఒక గంట తరువాత చక్కగా తయారయ్యింది.చిత్రాగారు చందమామలో వేసిన మొదటి బొమ్మ ఏది, చివరి బొమ్మ ఏది అన్న వెతుకులాటలో ఉన్నాను ప్రస్తుతానికి.

    మీరు కూడ మరిన్ని వివరాలతో, వ్రాయండి, చిత్రాగారి మీద వ్యాసం. కాని, మీరు శంకర్ గారిమీద వ్యాసం వ్రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం, ఆశ.

    రిప్లయితొలగించండి
  4. శివరామ్ ప్రసాద్ గారూ,
    వేవేల నెనర్లు, మీరు చిత్రా గారి మీద వ్యాసం రాసిన తర్వాతే చందమామ చిత్రప్రపంచంపై ఆయన వేసిన రాజముద్ర మరింతగా బాగా అర్థమైంది. వినాయక చవితి రోజున నిజంగా సార్థకమైన పని చేశారు. చిత్రగారి జీవిత, ఉద్యోగ విశేషాలపై మీరు ప్రస్తావించిన అంశాల గురించిన సమాచారాన్ని వీలయితే సేకరించడానికి ప్రయత్నిస్తాను.

    చిత్రా గారి కుంచె నుంచి 10వేల చందమామ చిత్రాలు. చందమామ చరిత్రను ఉద్దీప్తం చేసిన మహత్తర చిత్రరేఖలు. ముఖ్యంగా మీరు పోస్ట్ చేసిన ఆ మూడో ఫోటో (బావిలోంచి మనిషి పైకి చూస్తున్న చిత్రం) చూస్తుంటే నోరు తెరిచేశానలాగే...

    "ధారావాహికలకు చిత్రాగారు వేసిన బొమ్మలు అపూర్వం, నభూతో న భవిష్యతి. ఆయనలాగ దారావాహికలు బొమ్మలు వేయగలవారు లేరు. మొదటి భాగంలో ఒక పాత్ర ఎలా ఉంటుందో, ధారావాహిక చివరి భాగం వరకూ అదేవిధంగా వెయ్యగలిగిన ప్రజ్ఞాశాలి." మీ వ్యాఖ్య అక్షర సత్యం. అయితే దాసరి నాగభూషణం అని రాశారు. దాసరి సుబ్రహ్మణ్యం గారు కదూ....

    మీరూ, వేణూ గారు ఇలాగే పోటీ పడుతూ ఉండండి. చందమామను హిమవన్నగ శిఖరాలపై నిలిపిన అలనాటి చిత్రకారులు, రచయితలు గురించి ఎంత చెప్పినా, రాసినా ఇంకా కొరవ మిగిలే ఉంటుందని అనుకుంటున్నాను.
    విశ్వనాథ సత్యనారాయణ వంటి ధీమంతుడు, ఉద్ధతుడే చందమామ ఆలస్యంగా వస్తే కొట్టువాడితో కొట్లాడేవారు. చదువుతుంటేనే ఎంత థ్రిల్లింగ్‌గా ఉందో.

    ఈ మధ్య చంద్రబాల అని హైదరాబాద్ నుంచి ఓ కథల పత్రిక వస్తోంది. ఆగస్టునుంచి ప్రారంభం. ఆన్‌లైన్ కూడా లాంఛనప్రాయంగా ప్రారంభించారు.

    http://chandrabala.com/

    మళ్లీ ఒకసారి పాత చందమామను చూసినంత ఆనందం కలిగింది. చందమామ కోల్పోతున్న స్పేస్‌లో చంద్రబాల ఆగమనం. ముఖ్యంగా దాని ఫ్రంట్ పేజీ, లోపలి పుల్ పేజీ చిత్రాలు అదరగొట్టాయి. ఇంకా మార్కెటింగ్ టీమ్ కుదరలేదేమో, తిరుపతి, కడప, నెల్లూరు, చెన్నయ్ ఎక్కడ గాలించినా ప్రారంభ సంచిక దొరకలేదు. ఒక పుస్తకాన్ని మటుకు హైదరాబాద్ నుంచి కష్టపడి తెప్పించుకున్నాం. మీరూ చూడండి వీలయితే..
    మరోసారి హృదయపూర్వక అభినందనలు

    రిప్లయితొలగించండి
  5. రాజుగారూ,
    మీరు వ్రాసిన వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్టు దాసరి సుబ్రహ్మణ్యం గారి పేరు తప్పుగా వ్రాశాను. పొరపాటుకు చింతిస్తూ సరిచేశాను. చిత్రా గారి గురించి చందమామలో ఏమన్నా విశేషాలు దొరుకుతాయేమో అన్వేషించి, మీ బ్లాగులో వ్రాయండి. వారి ఫొటోలు ఏమన్నా దొరుకుతాయా? ఎక్కడో ఒక మూల పారేసి ఉంటారు, కాస్త చూసి సంపాయించండి. ఆయన పెద్దయ్యాక ఎలా ఉండేవారు. వారి కుటుంబం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వారి పిల్లలు, వారిప్పుడు ఏమి చేస్తున్నారు, చిత్రా గారి వారసత్వం అందిపుచ్చుకున్నారా ఇలా ఎన్ని వీలయితే అన్ని మీ బ్లాగులో వ్రాయండి.

    మీరు చెన్నైలోనే ఉన్నారు కదా. సరదాగ ఒకసారి శంకర్ గారిని కలసి, వివరాలు సేకరించి ఒక చక్కటి వ్యాసం వ్రాయండి, ఆయన ఫొటోతో సహా.

    వపా బొమ్మలను గ్యాలరీ చేసినట్టు, చిత్రా, శంకర్ గార్ల బొమ్మలను కూడ చేసి అందించుదామనుకుంటున్నాను. ఏమంటారు.

    రిప్లయితొలగించండి
  6. శివ గారూ!
    > వపా బొమ్మలను గ్యాలరీ చేసినట్టు, చిత్రా, శంకర్ గార్ల బొమ్మలను కూడ చేసి అందించుదామనుకుంటున్నాను.

    ఎంత మంచి ఆలోచన! మరి మీదే ఆలస్యం... వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటాను.

    అన్నట్టు... చిత్రా గారి జానపద ధారావాహికల బొమ్మలు సేకరించేటప్పుడు ‘తొలి ప్రచురణల్లోవి’ మాత్రమే తీసుకోండి. మలి ప్రచురణల్లో చిత్రా గారి బొమ్మలను ఇతర చిత్రకారులతో ట్రేస్ చేయించినట్టు గమనించొచ్చు. అలాగే వాటి క్వాలిటీ కూడా బావుండదు!

    రిప్లయితొలగించండి
  7. శివ గారూ,

    చిత్రా గారి గురించి ఇప్పటివరకూ ఇంకెక్కడా దొరకని అరుదైన సమాచారంతో చక్కటి వ్యాసం అందించినందుకు నెనర్లు. ఈ వివరాలు వికీపీడియాలో చేర్చారా? ఇలాగే మీరు, వేణు గారు, ఇతర చంపిలు కలిస్తే చందమామకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఒకచోట చేర్చవచ్చు.

    రిప్లయితొలగించండి
  8. చిత్ర గారి 6 ప్యాక్ శిఖిముఖి బొమ్మలకు నేను ఓ పెద్ద ఏ సీ మిషన్ని. ఆయన్ను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. రాజి అనే ఒక చిత్రకారుడు/చిత్రకారిణి బొమ్మలు కూడా నాకు చాలా ఇష్టం.

    చంద్రబాల మా వూళ్ళో చూశానండి. కొంచెం ఆశ్చర్యపడ్డాను, కానీ కొనలేదు. ఈ సారి కొని చదవాలి.

    రిప్లయితొలగించండి
  9. తివిక్రం గారూ

    మీరు వ్రాసిన వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    నేను వికీపీడియాలొ వ్రాయటం మానుకున్నాను. ఇక వ్రాయను. అక్కడ వ్రాయటానికి తగిన వాతావరణంలేదు.

    నేను నా బ్లాగులో వ్రాసినవి అక్కడ ఉదహరించటానికిగాని, లింకు ఇవ్వటానికి కాని నేను ఇష్టపడను.

    రిప్లయితొలగించండి
  10. వ్యాఖ్యలు వ్రాసిన అందరికీ ధన్యవాదాలు. చిత్రాగారి వ్యాసంలో చివరగా ఉన్న బొమ్మలలో, ఒక బొమ్మలో గండుపోతు పడి ఉన్నది బావి కాదు. దానిని పాతర అంటారు. పూర్వపు రోజులలో (నేను కూడ చూశాను, మాఇంట్లో ఉండేది), కొత్త పంట రాగానే, నేలలో ఒక కొలత ప్రకారం గొయ్యి తవ్వి, అందులో కింద ఎండు గడ్డి పరచి అప్పుడే, కొత్తగా వచ్చిన వడ్లని పోసి, గొయ్యి మీద ఒక తడికలాంటిది పెట్టి పైన మళ్ళీ మట్టిపోసి కప్పేసి, ఆపైన తడి మట్టితో అలికేవారు. పైన కప్పేప్పుడు, పూడ్చిన తరువాత దాదాపు ఒక అర్ధ చంద్రాకారం వచ్చేట్టుగా చేసేవారు. దీనివల్ల లోపల కొత్త వడ్లు, బాగా మాగి పాతబడేవి అప్పుడు వాటిని దంచి (మర పట్టి కాదు), జల్లించగా వచ్చిన బియ్యాన్ని తినేవారు.

    చిత్రంలో గండుపోతు పొరుగు గ్రామం మీద పడి దోచుకోవటానికి, వాళ్ళు ఇలా దాచుకున్న ధాన్యాన్ని పాతరలలోంచి దోచుకుంటుండగా, శిఖిముఖి అడ్డుపడతాడు, అతన్ని తన్ని ఆ పాతరలోనే పడేస్తాడు. బొమ్మలో శిఖిముఖి తండ్రి శివాలుడు, గండుపోతును పరామర్శిస్తున్న దృశ్యం. ఈ బొమ్మ వెనుక ఇంత కథ ఉన్నది.

    రిప్లయితొలగించండి
  11. Iam a regular reader of Chandamama magazine.. but the thing is that they are repeating the same illustrations and stories again and again which is not at all good for their future market. it will be good if they consider to place new art works which is like VAPA arts and to publish new stories. Now a days i saw another magazine called CHANDRABALA which is in rich art works and content. I came to know that the publishers is and artist and hw done cover design for chandamama after Vapa expire. They have launched and website too www.chandrabala.com

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.