6, ఆగస్టు 2009, గురువారం

బేతాళ కథల కథా కమామిషు



చందమామలో మనమందరమూ బేతాళ కథలు చదివేఉంటాము. ఆ కథ మొదలు పెట్టటమే విచిత్రంగా ఉంటుంది. ఆ కథ ఆవిధంగా ఎందుకు మొదలవుతుంది తెలియాలంటే మొట్టమొదటి బేతాళకథ చదవాలి. బేతాళకథల మీద మునుపు నేను తెలుగు వికీలో వ్రాసిన వ్యాసం,కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులతో, ఇక్కడ పున: ప్రచురిస్తున్నాను. వ్యాసం చివర మొదటి బేతాళ కథ డౌన్లోడుకు లింకు ఉన్నది చూడండి.
================================================
గుణాఢ్యుడు రచించిన "బృహత్ కథ" బేతాళకథలకు మూలం. ఈ కథలను కొంతకాలము తరువాత "కథాసరిత్సాగరం" సంపుటి లోనికి చేర్చారు. మూలంలో 25 కథలు మాత్రమే ఉన్నాయి. చివరి కథలో బేతాళుడి ప్రశ్నలకు విక్రమార్కుడు జవాబులు చెప్పలేకపోతాడట. అంతటితో ఆ కథలు సమాప్తమవుతాయి. కాని, బేతాళ కథలలోని చివరి కథ అందుబాటులో ఉన్నప్పటికీ, చందమామలో ఇంతవరకు వెయ్యలేదు. అది కాస్తా వేసేస్తే శీర్షిక ఇన్నాళ్ళు ఉండేది కాదు, ఇంత పేరు ప్రఖ్యాతులు గడించేదికాదు
.
మూలకథగోదావరీ తీరాన, ప్రతిష్ఠానపురానికి విక్రమార్కుడు రాజు. ఒక భిక్షువు ఆయనకు రోజూ ఒక పండు లోపల రత్నము పెట్టి ఇస్తూ, ఆయన ప్రాపకం సంపాదించటానికి ప్రయత్నించేవాడు. అలా పండులో రత్నం పెట్టి ఇస్తున్నట్లు, కొన్ని రోజుల వరకు రాజుకు తెలియదు. ఆ విషయం తెలిసిన రోజున, విక్రమార్కుడు భిక్షువు యొక్క విశ్వాసానికి మెచ్చి, కారణం చెప్తేగాని మర్నాడు పండు తీసుకోనని చెప్తాడు. దానికి బిక్షువు, తను ఒక మంత్రాన్ని సాధించదలచాననీ అందుకు ఒక వీరుడి సహాయం కావాలనీ, విక్రమార్కుని నుండి తానా సహాయం ఆశిస్తున్నాననీ అడుగుతాడు. విక్రమార్కుడు తగిన సహాయం చెయ్యటానికి ఒప్పుకుంటాడు. బిక్షువు, రాబోయే కృష్ణ చతుర్దశి రాత్రి చీకటి పడగానే రాజును మహా శ్మశానానికి రమ్మంటాడు.

అలాగే విక్రమార్కుడు వెళ్తాడు. అక్కడే ఉన్న భిక్షువు, రాజును శింశుపా వృక్షం మీద వేళ్ళాడుతున్న పురుషుడి శవం తెచ్చి, తన సమీపంలో ఉంచమంటాడు. రాజు ఆ చెట్టు ఎక్కి వేళ్ళాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పడవేస్తాడు. కిందపడగానే, శవం ఏడవటం మొదలుపెడుతుంది. బేతాళుదు ఆ శవాన్ని ఆవహించి ఉన్న సంగతి తెలుసుకోలేక విక్రమార్కుడు, ఎందుకు నవ్వుతావు, పోదాం పద అంటాడు. రాజుకు ఇలా మౌనభంగం అవగానే నేలమీది శవం మాయమై, మళ్ళీ చెట్టు మీద వేళ్ళాడుతూ కనపడుతుంది. విక్రమార్కుడు బేతాళుడు పూని ఉన్న ఆ శవాన్ని మళ్ళీ కిందపడేసి, భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవటం మొదలు పెడతాడు.

అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీకు వినోదంగా ఉండటానికి ఒక కథ చెబుతాను విను" అంటూ ఒక కథ చెప్తాడు. కథ చివర ప్రశ్న వేసి, "ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పక పొయ్యావో, నీ తల పగిలి పోతుంది" అంటాడు. విక్రమార్కుడు తన మౌనం వీడి ప్రశ్నకు తగిన సమాధానం చెపుతాడు. ఆ విధంగా, విక్రమార్కుడికి మౌనభంగం జరగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తెరిగి చెట్టు ఎక్కుతాడు.
చందమామలో ధారావాహిక
మొట్టమొదటగా బేతాళ కథలను చందమామలో మొదలు పెట్టినది సెప్టెంబరు 1955లో. ఈ కథలు ఎంతో కాలం చందమామ పత్రికలో కథా స్రవంతిగా వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. ఇదొక చిత్రమైన కథల సంపుటి. ప్రతి మాసం ఒక సంఘటన (విక్రమార్కుడు చెట్టుమీదనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని) తో మొదలయ్యేది, అలాగే, మరొక సంఘటన (విక్రమార్కుడికి ఆ విధంగా మౌన భంగం కాగానే, శవంలోని బేతాళుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు)తో అంతమయ్యేది. ప్రతి కథలోనూ, విక్రమార్కుడు మోస్తున్న శవంలోని భేతాళుడు, విక్రమార్కుడికి "శ్రమ తెలియకుండా విను" అని ఓ చక్కటి కథ చెప్పేవాడు. చివరకు, ఆ కథకు సంబంధించి చిక్కు ప్రశ్న/లు వేసేవాడు. అలా ప్రశ్నలు వేసి, విక్రమార్కుడికి ఒక హెచ్చరిక చేసేవాడు "ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసీ చెప్పకపొయ్యావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది" అని. మౌనం వీడితే వ్రత భంగం అయ్యి, వచ్చినపని చెడుతుంది, సమాధానం తెలిసీ చెప్పకపోతే ప్ర్రాణానికి ప్రమాదం. పాపం విక్రమార్కుడు ఏం చేస్తాడు? తప్పని పరిస్థితులలో, తన మౌనం వీడి, ఆ చిక్కు ప్రశ్నకు చాలా వివరంగా జవాబు చెప్పేవాడు. ఈ విధంగా ప్రతినెలా శవంలోకి బేతాళుడు ప్రవేశించి, కథ చెప్పి, ప్రశ్నలడిగి, హెచ్చరించి, విక్రమార్కుడికి మౌన భంగం చేసి, అతడు వచ్చిన పని కాకుండా చేసేవాడు. అలా పై నెలకి కథ మొదటికి వచ్చేది.

బేతాళ కథ మొదటి కథ ఎలా ఉంటుందో అన్న పాఠకుల అసక్తిని గమనించి గాబోలు, చందమామ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 1972 జూలైలో మొదటి బేతాళకథ రంగులలో పునర్ముద్రించారు. ఈ మొట్టమొదటి కథకు, పున:ముద్రణలో పేరు పెట్టలేదు. కాని మొదటి ముద్రణలో ఈ కథ పేరు "మహామంత్రి మనోవ్యాధి". ఆ తరువాత కథలన్నిటికీ కథ మొదటి పుటలో పైన కథ పేరు, కింద "బేతాళ కథలు" అని వేయసాగారు. బేతాళ కథలకు మొదటి పేజీలో వేసే బొమ్మ చాలా సార్లు మార్చి మార్చి వేసారు .

అలాగే కథ చివరి పుటలో, బేతాళుడు ఎగిరి పోతూ ఉండటం, విక్రమార్కుడు కత్తి దూసి వెంట పడుతుండటం కూడా చాలా రకాలుగా వెయ్యబదినది.

శీర్షికగా బేతాళ కథలు
బేతాళ కథలను చందమామలో సెప్టెంబరు 1955 సంచికలో మొదలు పెట్టారు. అసలు, బేతాళ కథలు పాతిక మాత్రమే! కాని, చందమామలో వందల కొలది మామూలు కథలను (ఇప్పటివరకు 600 పైగా) బేతాళ కథలుగా ఎంతో నేర్పుగా మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతి నెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టతరమైన ఈ పనిని, దశాబ్దాల పాటు నిరాఘాటంగా కొనసాగించడం, చందమామ నిబద్ధతకు, నైపుణ్యానికి, చక్కటి నిదర్శనం. తెలుగు జానపద సాహిత్యంలోని పేరొందిన ఒక కథా సంపుటిని తీసుకుని, ఆ కథలను ప్రచురించటమే కాక, అదే పంధాలో అనేక ఇతర కథలను ప్రచురించి, చిన్న పిల్లలకు(పెద్దలకు కూడ) చక్కటి ఆలోచనా పద్ధతి, సందేహాలను ప్రశ్నల రూపంగా వ్యక్తపరచటం,తర్కంతో కూడిన చక్కటి సమాధానాలు ఇచ్చే నేర్పరితనం ఈ శీర్షిక ద్వారా చందమామ వారు అందచేశారు.

కథా సంపుటి లేదా ధారావాహికగా మొదలు పెట్టబడినా, చివరకు ఒక కథా శీర్షికగా స్థిరపడినాయి ఈ బేతాళ కథలు.చిన్న చిన్న ధారావాహికలు మొదలు పెట్టినప్పుడల్లా తమ సంపాదకీయంలో ఆ ధారావాహిక గురించి కొద్దో గొప్పో చందమామలో వ్రాసే వారు. కాని చారిత్రాత్మకమైన బేతాళ కథల ధారావాహిక (శీర్షిక) చడి చప్పుడూ లేకుండా మొదలు పెట్టేశారు. మరి అప్పట్లో ఈ కథలను ఎలా వేయ్యలో ఇంకా నిర్ణయించుకోలేదేమో. చివరికి , ఇలా ఎటువంటి ప్రకటన లేకుండా మొదలు పెట్టబడినా, చందమామలోని అన్ని ధారావాహికలలోనూ ఎక్కువరోజులు ప్రచురించబడింది, ఇంకా ప్రచురిస్తూనే ఉన్నారు. భారత పత్రికా చరిత్రలో ఇది ఒక మైలురాయి (రికార్డు)అని నా అభిప్రాయం. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత, చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కృషి ఎంతగానో ఉన్నది.

బేతాళకథలు ధారావాహిక అనండి లేదా శీర్షిక అనండి, ఏది ఏమైనా కథలను ఏకధాటిగా ఇంత ఆసక్తికరంగా, పిల్లలకు(అనేకసార్లు పెద్దలకే) తెలివితేటలు పెంపొందించే విధంగా ప్రచురించటం నభూతో నభవిష్యతి.

1972లో పున:ముద్రణ జరిగిన కథను ఈ కింది లంకెద్వారా చదువుకోవచ్చును.

http://rapidshare.com/files/264443903/FIRST_BETALA_KATHA.PDF

అస్సలు చందమామలో మొట్టమొదటగా ముద్రించబడిన బేతాళ కథ సెప్టెంబరు 1955 కథను ఈ కింది లంకె ద్వారా చదువవచ్చు. రెండిటికీ పెద్ద భేదం లేదు, ఒక్క రంగులు తప్ప.

http://rapidshare.com/files/264597624/ORIGINAL_BETALA_KATHA_EP_1955.PDF

పైన డౌన్లోడ్ కు ఇచ్చిన లింకులు పనిచేయవు. బేతాళ కథలు   మీద  ఆసక్తి ఉన్నవారు చందమామ వారి వెబ్ సైటుకు వెళ్లి అక్కడ పాత చందమామలు చదువుకోవచ్చు. ఆశగా డౌన్లోడ్ చేసుకోవాలని వచ్చిన వారు అర్ధం చేసుకోగలరని భావిస్తున్నాను) 

అప్డెటెడ్ 27 ఏప్రిల్, 2013

9 కామెంట్‌లు:

  1. భేతాళ కథల పరిచయం పేరుతో ఓ మహా గాధాలహరి చరిత్రను తెవికీలో పొందుపర్చింది మీరేనన్నమాట. చాలా సంతోషం. దీంతో పాటు దశాబ్దాలుగా చందమామ పాఠకులను మంత్రముగ్దులను చేస్తున్న భేతాళ కథల ధారావాహికలో తొలి కథను కూడా నిధిలాగా మాకు అందించారు. వదలగలమా.. ఆ తొలి కథను డౌన్ లోడ్ చేసుకున్న తొలి వ్యక్తిని ఇపుడు నేనే కాబోలు. మీ బ్లాగులో మీరు పొందుపర్చిన ఇతర చందమామ సీరియల్స్ ను కూడా ఒకటొకటిగా తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. కథా సరిత్సాగరమూ, బేతాళ పంచవింశతీ కథలు లభిస్తూనే ఉన్నయ్యి, లభించకపోవడం ఏమీ లేదు. విక్రమార్కుడు సమాధానం చెప్పలేకపోయిన ఆ చివరి కథ టుకీగా ఇది.
    ఒక తండ్రీకొడుకులు ఇద్దరూ పెళ్ళి చేసుకునే కోరికతో ఏదో ఊరు వెళ్తుంటారు. దారిలో ఇద్దరు స్త్రీల అడుగు జాడలు కనిపిస్తాయి, తాము వెళ్తున్న దిక్కుగానే. పెద్ద అడుగుల ఆమెని తండ్రీ, చిన్న అడుగుల ఆమెని కొడుకూ చేసుకోవలి అనుకుంటారు. గబగబా నడిచి ఆ స్త్రీలని కలుసుకుని తమ కోరిక చెబుతారు. ఆ స్త్రీలు కూడా ఒప్పుకుని వీరిని పెళ్ళి చేసుకుంటారు. ఐతే ట్విస్టు ఇది.
    1. ఆ స్త్రీలు తల్లీ కూతుళ్ళు.
    2. పెద్ద అడుగులు కుతురువి, చిన్న అడుగులు తల్లివి.
    తండ్రికి ఈ పెళ్ళివల్ల మళ్ళి పిల్లలు పుడితే ఆ పిల్లలు మొదటి కొడుకుని ఏమని పిలవాలి - అనే ప్రశ్నకి విక్రమార్కుడు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండి పోతాడు.
    ఇదే బేసిక్ కాన్సెప్టుతో దాసరి నారాయణరావు గారు తూర్పు పడమర సినిమా తీశారు.

    రిప్లయితొలగించండి
  3. బేతాళ కథ మొదటిది ఎలా ఉంటుందోననే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఇలా మీరు అందించటం బావుంది. కానీ పునర్ముద్రణలో ప్రచురించిన కథను ఇవ్వటం కొంత నిరాశ.
    చందమామలో 1955 సెప్టెంబర్ సంచికలో తొలి బేతాళ కథను ప్రచురించారు. దాన్నే అప్ లోడ్ చేసివుంటే ... బేతాళ కథల బొమ్మలకు నాంది పలికిన అద్భుతమైన చిత్రా బొమ్మలు చూసే అవకాశం వచ్చేది!

    రిప్లయితొలగించండి
  4. రాజు గారూ

    తెల్లవారు ఝామున మూడు గంటలకు ఇంకా మేలుకుని బ్లాగులు చూస్తూ చందమామ మీద మీరు చూపిస్తున్న ఆసక్తి చూస్తుంటే ముచ్చట వేస్తోంది. మన చందమామలో (ఇప్పుడు "మన" అనలేము అనిపిస్తున్నది) ఆ చివరి బేతాళ కథ ముద్రిస్తే ఎంత బాగుంటుంది. మణిపూసల వంటి ఒక 100 బేతాళకథలను ఏరి వాటికి ముందు చివర మొదటికథ చివరి కథ అతికి ఒకే ఫైలుగా ఇస్తే ఎంత బాగుంటుంది.

    మనమేమో ఎం బి ఏ చదవలేదయ్యే మనకు చందమామ వంటి పత్రిక ను ఎలా మళ్ళి పైకి తేవాలో వ్యాపార పంధా తెలియాదయ్యే. ఏం చెస్తాం ఈ ఘొప్ప వ్యాపార వేత్తలు ఏమి చెస్తే అది భరించాల్సిందే. ఖర్మ!

    రిప్లయితొలగించండి
  5. వేణూగారూ,

    మీ కోరిక నెరవేర్చాను. అంతే కాకుండ మరిన్ని బొమ్మలు గుప్పించాను. చూడండి.

    రిప్లయితొలగించండి
  6. "గుణాఢ్యుడు సంస్కృతంలో రచించిన బృహత్కథ.." అన్నారు. గుణాఢ్యుడు పైశాచీ భాషలో రచించాడని కదా ఐతిహ్యం? ఆ బృహత్కథను సోమదేవుడనే ఆయన సంస్కృతంలో "కథా సరిత్సాగరం" అన్న పేరుతో అనువదించాడట.

    ఇలా ఉంటే "కథా సరిత్సాగరం" అన్నది "బృహత్కథ" కాదు, "పెరుంగదై" అన్న తమిళ సాహిత్యానికి తర్జుమా అని మరొక వాదన.

    మొదటి భేతాళ కథ చందమామ పుస్తకం ఉన్న ధనవంతుణ్ణి నేను!!

    రిప్లయితొలగించండి
  7. శివ గారూ,నా కోరిక మన్నించి, 1955 నాటి బేతాళ కథను షేర్ చేసినందుకు ధన్యవాదాలు. పునర్ముద్రణలో రంగుల బొమ్మలున్నప్పటికీ తొలి ప్రచురణలో సింగిల్ కలర్ అయినా చిత్రా బొమ్మలే బాగున్నాయి, స్పష్టంగా. మీరు ‘గుప్పించిన మరిన్ని బొమ్మల్లో’ చిత్రా బొమ్మలుండటం ఎంతో సంతోషం. బేతాళ కథ లోగో బొమ్మకు చిత్రా తొలి రూపం ఇవ్వగా, దాన్ని శంకర్ మెరుగుపరిచి, ఇప్పుడు మనం చూస్తున్న పద్ధతికి మార్చారు!

    రిప్లయితొలగించండి
  8. నమస్కారం శివ గారూ,
    మంచి విషయాలు తెలియచేసారు.
    మొదటి భేతాళకథ డౌన్లోడ్ లింక్ తెగిపోయినట్లుంది ఒకసారి చూడండి.

    రిప్లయితొలగించండి
  9. Dear Sir,

    download links of many ebooks are dead. Please re-upload them.

    Chakrapani

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.