4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

ఎప్పటికి నేర్చుకుంటారు వీళ్ళు??


అదేనండి మన మీడియా అనబడే ఒక తెగ. పత్రికా స్వాతంత్రర్యం పేరిట వీళ్ళు చేసే సర్కస్సులు చూడలేక, చెప్పుకోవటానికి మరెవరూ లేక పాఠకులు/ప్రేక్షకులు బాధపడుతున్నారు. వేరే ఇతరల వల్ల మనకేమన్నా బాధ కలిగితే చెప్పుకోవటానికి మీడియా ఉన్నది. మరి వాళ్ళే అతిగా ప్రవర్తిస్తే??

ఈ 24 గంటల వార్తా టి వి లు వచ్చాక, ఈ బాధ మరింత ఎక్కువయ్యింది. ఈరోజున (సెప్టెంబరు 4 2009న) కొన్ని పేపర్లు, మొన్న జరిగిన హెలికాప్టరు ప్రమాదం గురించి ప్రచురించిన ఫొటోలు అరోగ్యకరమైన "జర్నలిజమే" అంటారా!! పాపం పోయిన వాళ్ళు ఆ ప్రమాదంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పొయ్యారు. ఆ సంఘటనా స్థలానికి ఉరుకులు పరుగుల మీద పోయి (ఈ గోలలో ఒక టీ వీ వాడు ఆ అడవుల్లో తప్పి పొయ్యాట్ట కూడ) , అక్కడ జరుగుతున్న వెతుకులాట పనులకు అడ్డుపడటమే కాకుండా, ఛిద్రమైన శరీర భాగాలను ఫొటో తీయటానికి ఎగబడటం.

సరే కుర్రాళ్ళు "అతి" ఉత్సాహం చూపి ఆ భయమేసే ఫొటోలు తెచ్చారు. మరి, పత్రికాఫీసులో, ప్రచురించటానికి ముందు "సంపాదకుడు" అని ఒకడు చూస్తాడు కదా, ఆ సంపాదకునికి, ఈ బొమ్మ వెయ్యచ్చు, ఈ బొమ్మ వెయ్యకూడదు అన్న ఇంగితజ్ఞానం లేకుండా, తెగిన వేళ్ళు, చెట్లల్లో పడి ఉన్న మాంసపు ముద్దలను అందరూ చదివే పత్రికల్లో ప్రచురించటాన్ని ఏమనాలి? ఇది ఎటువంటి వార్త? అటువంటి వార్తలు, ఫొటోల వల్ల ఉపయోగమేమిటి?? కొంతమందిలో ఉండే ఒకరకమైన అనారోగ్యకరమైన ఉత్సుకుతను ప్రేరేరింపచేసి, వాళ్ళ పేపర్లను అమ్ముకుందామనా?

చనిపోయిన ప్రముఖుల గురించిన మంచి వివరాలు వెయ్యండి, తెలియని వారు తెలుసుకుంటారు. అంతేకాని, పాపం మరణించినవారి శవాలను, వారి శరీర భాగాలను ప్రచురించటం భావ్యం కాదు.

ఇలాగే, పూర్వపు ప్రధాన మంత్రి పి వి నరసింహారావు గారు మరణించినప్పుడు, ఆయన అంత్యక్రియలలో ఒక అభాసు చోటు చేసుకున్నది. ఆయన శరీరం పూర్తిగా కాలలేదు. కాటికాపరి ఎంత మొత్తుకున్నా, సంతాపం ప్రకటించటానికి వచ్చిన ప్రముఖులు విరగపడి వేసిన దండలు కారణమట. సరే, పొరపాటు జరిగింది, మర్నాడు పొద్దున్న ఈ విషయం తెలిసి, వారి కుమారులు వెళ్ళి చేయవలసిన పని చేసారు. కాని, ఈలోగా మన ఎలెక్ట్రానిక్ మీడియా వారు, పరుగు పరుగున వెళ్ళి అక్కడ సగం తగలబడిన పూర్వపు ప్రధానమంత్రి శవాన్ని సీదాగా పొద్దున్న వార్తల్లో ముచ్చటగా చూపించి, పిల్లల్ని భయభ్రాంతులను చేసారు,పెద్దలకు జుగుప్స కలిగించారు. ఇటువంటి అతి ప్రవర్తనను గర్హిస్తూ, అనేకమంది, వాళ్ళకి ఈ మైళ్ళు ఇస్తే, అప్పుడు సిగ్గుపడి, ఆ దృశ్యాలను మళ్ళి మళ్ళీ చూపించటం మానుకున్నారు. జరిగిన పొరపాటు గురించి ఎత్తి చూపించాలంటే, అటువంటి వీడియో చూపించాలా?

ఇలాగే ప్రమాదాలు జరిగినప్పుడు, మరణించిన వారి ఫొటోలను మొహం మీద కప్పి ఉన్న గుడ్డను తొలగించి మరీ ఫొటోలు తియ్యటం, పేపర్లో వెయ్యటం. పోనీ చనిపోయినది ఎవరో తెలియదు, పేపర్లో వేస్తే తెలిసినవారు వివరాలు ఇవ్వాలి అన్న అవసరం వచ్చినప్పుడు, తప్పదు.

ఎంతటి అనాగరిక దేశంలో అయినా చనిపోయిన వారిపట్ల గౌరవం చూపిస్తూ వారి మొహాలను కప్పి ఉంచుతారు. మరణవేదనతో వారి మొహాలు వికృతమయి పోయి, పాపం మరణించినవారు వారి మొఖాలు కప్పుకోలేని స్థితిలో ఉంటారుకాబట్టి, పూర్తిగా కప్పేస్తారు. కాని, మన పత్రికా ఫొటోగ్రాఫర్లకి అటువంటి నాగరికత గురించి ఎంతమాత్రమూ తెలియదు.

9/11 దారుణ సంఘటనలో అనేకమంది చనిపొయ్యారు. అమెరికన్ మీడియా సంయమనం పాటించి, ఒక్క శవం ఫొటో కూడ ప్రచురించలేదు. అలా అని వాళ్ళేమీ పుడుతూనే పతివ్రతలు కాదు, కాలక్రమేణా కొంత (మాత్రమే) పరిణితి వచ్చింది, లేదా వచ్చేట్టుగా అక్కడి పాఠకులు, ప్రేక్షకులు చేసారు.

కొంతకాలం క్రితం, ఒక ప్రముఖ క్రికెటర్ ముంబాయిలో మరణించారు. వారి కుమారుడు ఒక టి వి చానెల్ వీర ఏడిటర్, ఆ ఏడిటర్ భార్య కూడ అదే చానెల్ లో వీర ఏంఖర్! ఆ చనిపోయిన క్రికెటర్ ప్రముఖుడైనప్పటికి, ఆయన పార్థివ శరీరాన్ని దూరంనుచే చూపించారు ఆ చానెల్ వారు, ఇతరచానెళ్ళ వారుకూడ భయ భక్తులతో అలాగే మెలిగారు. మరి అదే గౌరవం, ఇటువంటి సంఘటనలు ఇతరులకి సంప్రాప్తించినపుడు, చూపించానక్కర్లేదా. మనకొక నీతి ఇతరులకి మరొక నీతా!!!!

మన మీడియా వాళ్ళేప్పటికి నేర్చుకుంటారో, స్వాతంత్ర్యం వాళ్ళకే కాదు, చదివేవారికి, చూసేవారికి కూడ ఉంటుందని, కొంత నాగరిక ప్రవర్తనా నియమావళిని అలవరుచుకోవలిసిన అవసరం ఉన్నదని!! లేకపోతె కొంతకాలానికి, వీళ్ళ అనుచిత ప్రవర్తన కారణంగా చూపి, పత్రికా స్వాతంత్ర్యం కట్టడి చేసే ఆలోచనను ప్రభుత్వం చేసే ప్రమాదం ఉన్నది, మరి ప్రజలు కూడా విసిగి, ప్రభుత్వాన్నే సమర్ధించ వచ్చు .ఆ సంగతి తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు.

పైన అన్నట్టుగా మన బాధను ఎవరికి చెప్పుకోవాలి. ఈ భావాలను లేఖగా వ్రాస్తే ఏ పేపరులోన్నన్న ప్రచురిస్తారా! ఏదో బ్లాగుల్లోచ్చాయి కాబట్టి, మనం ఇలా అరణ్యరోదనం చెయ్యగలుగుతున్నాం, లేకపోతే మన భావాలు తెలియక, వాళ్ళు చేసేదే జర్నలిజం అని పేట్రేగి పోతారు.

ఏమిటి, ఉదాహరణకి ఆ బొమ్మలేమిటి చూపించమంటారా?? సరి పోయింది, రామాయణం అంతా విని, రావణుడిని రాముడు ఎందుకు చంపాడు అని అడిగినట్టుంది!

8 కామెంట్‌లు:

  1. i agree with u...........nenu today eenadulo choosi alane feel ayyanu
    tegipadina velu ani choopinchatam ento...........

    రిప్లయితొలగించండి
  2. siva garu meru cheppindhi correct andi,
    ala chupadam nijamga ibbandikaram,
    chuse manake ala unte ayana family members chusthe inkentha badhapadutharo,
    a matram kuda teliyada e paper vallaki.
    ayananu abimaniche vallaku a clipings,photos chudatam nijam ga narakam andi

    రిప్లయితొలగించండి
  3. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన న్యూస్ చానల్స్ వల్ల, వాటి మధ్య అనారోగ్యకరమైన పోటీ ఏర్పడి ఇలా మనల్ని చావగొడుతున్నారు. అసలు అన్ని చానల్స్ కి పర్మిషన్ ఇచ్చినోడిని తన్నాలి మొదట. మన రాష్ట్రానికి మరిన్ని కొత్త చానల్స్ రాబోతున్నాయంట త్వరలో. అవి గనక వస్తే పొయ్యి మీద పడినట్టవుతుంది మన పరిస్థితి.

    రిప్లయితొలగించండి
  4. The only true medicine for this media ailment is to tell them what we feel. Silence on our part is injurious to the society.

    If you feel that certain channel or paper is improperly telecasting or printing, immediately react and tell them by one e mail or a post card. Series of such responses will ke them to realise the mistake they are committing and also they would realise that we do not require such nasty news. In fact if we want to write about Media today and the advertisements, it becomes another article.

    రిప్లయితొలగించండి
  5. నిజమేనండీ.. చాలా చర్చ జరగాలి ఈ విషయం మీద.. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో..

    రిప్లయితొలగించండి
  6. చనిపోయిన వారి గౌరవాన్ని రెండో సారి, మూడోసారి కూడా చంపడంలో విలేఖరుల కంటే మించినవారు లేరు. బ్రిటిష్ యువరాణి డయానాను వెంటాడి మరీ చంపనప్పుడే ఇది ఎంత ప్రమాదకర సంతతో ప్రపంచానికి తేటతెల్లమైపోయింది మరి.

    రిప్లయితొలగించండి
  7. ఆరోగ్యకరమైన జర్నలిజం గురించి మీ ఆవేదన చాలా సమంజసంగా ఉంది. మురళి గారు అన్నట్టు- చాలా చర్చ జరగాలి, ఈ అంశమ్మీద. ప్రేక్షకులూ, పాఠకులూ తమ అభ్యంతరాలనూ, అభిప్రాయాలనూ ఉత్తరాల ద్వారా, ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటేనే మీడియాలో కనిపించే అపసవ్య ధోరణుల్లో మార్పు సాధ్యమవుతుంది!

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.