20, సెప్టెంబర్ 2009, ఆదివారం

పాపం గుమ్మడిగారు అను ఇంటర్వ్యూ ఆఖ్యానం

ఈ మధ్యనే భక్తి చాన్నెల్‌లో అనుకుంటాను ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారితో ఒక ఇంటర్వ్యూ చూడటం జరిగింది. ఏమి ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూ ఎలా చెయ్యకూడదో ఇది ఒక చక్కటి ఉదాహరణ. చానెల్సులో చేరి మంచి పేరు తెచ్చుకుందామనుకొనే ఏంఖర్లు అందరూ చూసి తీరవలసిన ఇంటర్వ్యూ ఇది. కాపోతే, ఎలా ఇంటర్వ్యూ చెయ్యకూడదో నేర్చుకోవచ్చు.

ఇదివరకు దూరదర్శన్ ఏక చత్రాధిపత్యం జరుగుతూ ఉండగా, వాళ్ళ గుమాస్తాలు కూడ ఇలాగే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. పాపం ఆ వచ్చినాయన్ని మాట్టాడనిచ్చేవాళ్ళుకాదు. పూర్తిగా ఒక ఐదు నిమిషాలు ఎదేదో వాగి, అంతేనా అండి అంటే, ఆ వచ్చిన అతిధి అవునండి అని ఒక వెర్రి నవ్వు నవ్వి తల తాడించేవాడు.

ఇప్పుడు ఉన్న ఈ పోటీ ప్రపంచంలో, భక్తి చానెల్ వాళ్ళు, ప్రముఖ నటుడు గుమ్మడి గారితో ఇలా ఇంటర్వ్యూ ప్రసారం చేస్తారని అనుకోలేదు. ఆ ఇంటరవ్యూ చేసినాయన పెద్ద మాటల రచయిత(ట). ఎంత తాను వ్రాసిన మాటలే నటులు చదువుతారని అనిపించినా, ప్రసుతం తాను ఇంటర్వ్యూ చేస్తున్నాను అని మర్చిపొయ్యాడను కుంటాను.

అరే! గుమ్మడిని మాట్టాడనివ్వడే. పాపం గుమ్మడిగారు ఏదో విషయం చెప్పాలని మొదలు పెట్టగానే పానకంలో పుడకలాగ ఇతగాడు ఆడ్డుపడటం, అనవసరమైన ఒక వ్యాఖ్య చెయ్యటం, చెప్పే మూడ్ అంతా పోయి గుమ్మడిగారు అవునండీ అవునండి అని ముగించటం. చాలా భాధ వేసింది ఆ ఇంటర్వ్యూ పధ్ధతి చూస్తుంటే.

ఇంటర్వ్యూ చేసేవాడికి ఉండవలసిన ముఖ్యమైన ప్రాధమిక లక్షణం వాగుడు తగ్గించుకొని, తాను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిని ఎక్కువగా మాట్టాడించి, అనేక విషయాల్ను
ప్రేక్షకులు/శ్రోతలకోసం రాబట్ట్డం. మాటిమాటికి అడ్డుపడి, ఆవతలి మనిషి తాను చెప్పదలుచుకున్న విషయం మర్చిపొయ్యేట్టుగా చెయ్యటం కాదు. ఇంటర్వ్యూ చేసే మనిషికి అనేకం తెలిసి ఉండవచ్చుగాక. కాని ఆ ఇంటార్వ్యూ చేసేది మాలాంటి పామర, అజ్ఞాన జనంకోసం అని గుర్తుపెట్టుకోవాలి. "అంతేకదండి", "అప్పుడు ఫలానా వారు ఇలా ఉన్నారు" "అలా అన్నారు" అని అడ్డుపడకూడదు. ఇంటర్వ్యూ ఇస్తున్న వ్యక్తి విశేషాలను ప్రేక్షకులకు/శ్రోతలకు చెప్తున్నాడు, ఇంటరవ్యూ చేసే పెద్దమనిషికి కాదు. ఆ అపురూపమైన నటుడి నుంచి ఎన్నెన్ని జ్ఞాపకాలను రాబట్టి ప్రేక్షకులకి తెలియ చెప్పాలి అన్న దృక్పథంలోనే ఉండాలి అతని సంభాషణా చాతుర్యం అంతాకూడా. తన దర్పం, తనకున్న జ్ఞానం ఆ పాత విషయాలమీద గుర్తున్నంతవరకు అనవసర ప్రస్థావన చెయ్యకూడదు.

అన్నిటికన్నా ఇంటర్వ్యూ ఇస్తున్న మహా మహుణ్ణి మాట్టడనివ్వాలి, చీటికి మాటికి ఆడ్డుపడకూదదు. దాన్నే, అష్టావధానంలో అసందర్భ ప్రసంగం అని కాబోలు అంటారు.

గుమ్మడిగారితో మరొక్కసారి కాస్త ఓపిక, చక్కగా ఇంటర్వ్యూ చెయ్యగల శక్తి, నైపుణ్యం ఉన్న వ్యక్తి (అతను మనకి పెద్దగా తెలియవసిన అవసరం లేదు) చేత మళ్ళి చేయించి భక్తి చానెల్ వారు ప్రసారం చేస్తే బాగుండును.
=======================================
గుమ్మడిగారిగురించిన చక్కటి విశేషాలను  ఈ కింది లింకు నొక్కి చదువవచ్చు
గుమ్మడిగారి విశేషాలు


=======================================

4 వ్యాఖ్యలు:

 1. మీరు రాసింది చదువుతుంటే చిన్నప్పుడు దూరదర్శన్ లో ఆనందోబ్రహ్మ కార్యక్రమంలో మార్కండేయులు(ధర్మవరపు)కోతి కొమ్మచ్చి ఆటగాడిని ఇంటర్వ్యూ చేసే దృశ్యం గుర్తొచ్చింది. అచ్చు ఇలాగే ఉంటుంది.

  ఏం చేస్తాం, మేథావులమని అనుకునేవారు తమ పాండితీ ప్రకర్ష(అంటూ ఏమైనా ఉంటే)దాన్ని బయట పెట్టుకోడానికి ఈ ఇంటర్వ్యూలొక మార్గమన్నమాట.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఇంటర్వ్యూ చేసింది పేరున్న రచయిత కాబట్టి ఇంటర్వ్యూ అలా జరిగి ఉంటుంది. అదే కొత్తగా కాలేజీ నుంచి టీవీ చానల్లో అడుగుపెట్టిన అమ్మాయో అబ్బాయో ఐతే "మీరు ఏ ఫీల్డ్ వాళ్ళు? ఓన్లీ యాక్టింగేనా? ఎన్ని ఫిలిమ్స్ లో యాక్టు చేశారు?" వగైరా ప్రశ్నలతో అటు గెస్టుని ఇటు ప్రేక్షకుల్నీ కూడా హడలెత్తించే వాళ్ళు.. అంతేనా "మీ మూవీస్ ఏవీ నేను చూడలేదు.." అని బోల్డంత గర్వంగా చెప్పేవాళ్ళు... ప్చ్.. టీవీ గురించి యెంత చెప్పుకున్నా తక్కువే...

  ప్రత్యుత్తరంతొలగించు
 3. సుజాత గారు,

  నేను చెబామనుకున్న ’మా’ర్కండేయులు కథని మీరే చెప్పేశారే?

  SIVA గారు, చక్కని లంకెలను అందించారు. ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అన్నీ ఇంతే అనుకుంటానండీ. మొన్నామధ్య ఏదో టీవీ చానెల్ వారు నటి సౌందర్య కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేశారు. నేను యూట్యూబులో చూశాను. "సౌందర్య పోయినప్పుడు మీకేమనిపించింది" మార్కు ప్రశ్నలే అన్నీ. ఒక మనిషి పోతే కుటుంబానికి ఏమనిపించింది? అని అడగడం ఒక ప్రశ్నా???
  -Sowmya.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.