28, సెప్టెంబర్ 2009, సోమవారం

కళాపోసన కోసం ఉచితం-అద్భుతం

మనిషన్నాక కొంచెం "కళాపోసన" ఉండాలి అన్న ముళ్ళపూడివారి మాటలు అక్షర సత్యాలు. లేకపోతే గొడ్డుకి మనిషికి తేడా ఉంటుందా? అనికూడ ముత్యాల ముగ్గులో కాంట్రాక్టరు చేత అనిపించారు. ఎంతో కొంత "కళాపోసన" చేస్తున్నవారికోసం ఈ వ్యాసం. సినిమా పిచ్చి అనండి, మంచి సినిమా చూడాలన్న తపన అనండి, లేదా చిక్కటి దర్శకత్వపు నైపుణ్యం మీద ప్రేమ అనండి,మంచి ఫొటోగ్రఫీ అనండి, లేదా మంచి సంగీతం, ఇలా రకరకాలుగా మన అభిరుచులు ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా, మన దగ్గర కొన్ని వందల సిడిలు/డివిడిలు ఉండే అవకాశం ఉన్నది. మనం ఇలా సేకరించటం మొదలు పెట్టినప్పుడు పెద్దగా పట్టించుకోని విషయం, అయా సినిమాలకు ఒక వర్గీకరణ, జాబితా తయారు చేయటం.

కొంతకాలం అయ్యేప్పటికి, మన దగ్గర ఉన్న సినిమా ఏదో, లేని సినిమా ఏదో తెలియని స్థితి. చుట్టమో, స్నేహితుడో పట్టుకుపోయిన సినిమా మళ్ళి ఇచ్చాడో లేదో తెలియక, వారిని అడగలేక సతమతం!!

ఈ విధంగా కొంతకాలం నా సినిమా/సంగీతం సేకరణ ఒక దారి తెన్ను లేక పడి ఉన్నది. రకరకాలుగా ప్రయత్నించాను-ఎక్సెల్ షీట్, రకరకాల కాటలాగర్ సాప్ట్వేర్లు-కాని పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కారణం, నా సినిమాల జాబితా, ఒక్క సినిమా పేర్లే కాకుండా ఇంకా అనేక విషయాలను కూర్చి తయారుచేద్దమని ప్రయత్నించటం. కావల్సినప్పుడు, ఒక దర్శకుని సినిమాలు, ఒక నటుడు నటించినవి, ఒక సంగీత దర్శకుడు సంగీతం సమకూర్చినవి, ఒక రకానికి చెందినవి(కామెడి, వార్ మొదలగునవి).

ఇక ఇలా లాభం లేదని, ఓ మంచి ముహుర్తాన, నెట్ మీదపడి తీవ్రంగా వెతుకులాట మొదలుపెట్టాను. అదృష్టవశాన, కొంతసేపటికే ఒక చక్కటి సాప్ట్వేర్ దొరికింది. అదే ఇపుడు మీ అందరికి చెప్పదల్చున్న "ఉచితం-అద్భుతం".

ఈ సాఫ్ట్వేర్ పేరు పెర్సనల్ వీడియో డాటాబేస్. ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా ఉచితం, మన ఇష్టం వచ్చినన్నాళ్ళు వాడుకోవచ్చు, మన మూవీ కలెక్షన్ బాక్ అప్ తీసుకోవచ్చు. ఈ సాప్ట్వేర్ తయరుచేసిన వ్యక్తి యానిషివ్కే అలెగ్జాండర్(Yanishevskyy Alexander).ఇంత చక్కటి సాప్ట్వేర్ ను తయారు చేసి అందించిన వ్యక్తి గురించి నెట్ లో వెతికితే వివరాలు దొరకలేదు.

ఈ సాప్ట్వేర్ను ఈ కింది లింకునుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును.

సినిమా జాబితా తయారి


డౌన్లోడ్ చేసుకుని, మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకున్నాక, మీ దగ్గర ఉన్న సినిమా పేరు ఈ పాకేజిలో టైపు చెయ్యగానే నెట్ మొత్తం వెతికి, ఈ సినిమా గురుంచిన అనేక వివరాలు సంపాయించి పొందుపరుస్తుంది. మీరు సులభంగా ఆ సినిమా ఎక్కడ ఉన్నది అని తెలుసుకోవటానికి, మీడియా లొకేషన్ లో సిడి నంబర్ గాని మరి ఏ ఇతర గుర్తులుగాని వ్రాయవచ్చు. అన్ని సిడిలు ఈ విధంగా తయారు చేసుకున్నాక, ఫలానా సినిమా మనదగ్గర ఎక్కడ ఉన్నది అని చూడలంటే, సెర్చ్ ఆప్షన్ లో ఆ సినిమా పేరును టైపు చెయ్యగానే, మనం ఎక్కడ దాచామో తెలుస్తుంది (మనం దాచిన చోటును ముందే ఎంటర్ చేసి ఉండాలి, ఆ సిడి అక్కడే ఉంచాలి). ఒక నెలరోజుల పాటు ఒక యజ్ఞం లాగ చేసి నా కలెక్షన్ మొత్తానికి, ఈ పాకేజీ పుణ్యమా అని, చక్కటి జాబితా చేసుకున్నాను. నేను నా సిడి/డివిడి లకు వరుస నంబర్లు ఇచ్చి, వాటిని అదే వరుసగా అట్టపెట్టలలో భద్ర పరిచాను. తీసి చూసిన తరువాత మళ్ళి అదే స్థానంలో ఉంచటం వల్ల మళ్ళి మనకు కావల్సినప్పుడు, సులభంగా ఈ పాకేజి ద్వారా తెలుసుకోవచ్చు.అదే విధంగా ఒక దర్శకుని సినిమాలు మన దగ్గర ఏమి ఉన్నయి అని చూసుకోవచ్చు. ఇలాగే అనేక రకాలుగా వెతుకవచ్చు(పైన ఉన్న బొమ్మను నొక్కి పెద్దదిగా చూడండి)

ఇంకొక ముఖ్య విషయం! మనదగ్గర ఉన్న ఉన్న సినిమా ఏదన్నా ఎవరికన్నా ఇచ్చినప్పుడు, మనం ఎవరికి ఇచ్చామో కూడ ఈ పాకేజీలో వ్రాసుకోవచ్చు. వారానికో, నెలకో ఒకసారి ఈ జాబితాను చూసి (ఎవరికి ఇచ్చామో ఒక జాబితా తీసుకోవచ్చు) వాళ్ళను తిరిగి ఇమ్మని అడగవలిసిన గతి పట్టినప్పుడు (సామాన్యంగా తీసుకునేప్పుడున్న ఆత్రం, తిరిగి ఇచ్చేప్పుడు సహజంగా చాలామందికి ఉండదు.అందుకనే మార్క్ ట్వైన్ ఒకసారి వాపోయ్యాడు "ఈ పుస్తకాలు అన్నీ ఇచ్చినవాళ్ళు, పెట్టుకోవటానికి బీరువా ఇచ్చారుకాదు") సులభంగా ఎవరికి చ్చామో వారినే అడుగవచ్చు. మన సినిమా కలెక్షన్ భద్రంగా ఉండి సినిమాలు పోవటం లాంటి ప్రమాదాలు జరుగవు.

కాబట్టి, ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడుకుని మీ "కళాపొసణ" మరింత బాగా చేసుకుంటారు కదూ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.