18, సెప్టెంబర్ 2009, శుక్రవారం

ఏమీ దురవస్థ!!!


నిన్న దేవదాసు సినిమా విసిడిలో చూశాను. అలనాటి కళాఖండం దుస్థితి చూసి దు:ఖించటం మినహా చెయ్యగలిగింది ఏమిటనిపించింది. ఆకలిమీద ఉన్నవాడు, ఆశగా కంచంలో ఉన్న పరమాన్నం తిందామని జుర్రుకోగానే పంటికిందకు ఇంగువ వచ్చినట్టయింది ఆ విసిడి క్వాలిటీ చూసేప్పటికి. ఎమిటీ దురవస్థ మన చక్కటి పాత సినిమాలకు. వాటి హక్కులు ఆ కళాఖండాల విలువ తెలియని నిరక్షరాస్యులైన వ్యాపారస్తుల చేతిలోపడి నలిగిపోతున్నాయి. దేవదాసు సినిమా మొత్తం కుడిపక్కన దాదాపు బెత్తెడు వైశాల్యంలో ఒక చతుస్రాకారం సదా కనపడుతుంది.ఎందుకో తెలియదు. అక్కడ మరెవరి పేరో ఉండి ఉంటుంది. అది తీసెయ్యటం దేనికిలే అని దాన్ని కప్పెట్టటానికి ఈ పని! చక్కటి పాటలు, నేపధ్య సంగీతం సంగీతం ఈ సినిమాలో ఉన్నాయి. కాని దురదృష్ట వశాత్తూ సౌండు రికార్డింగు (వి సి డి లో) నాసిరకంగా ఉన్నది. వానాకాలంలో ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు, ఒక చౌక రకమైన ట్రాన్‌సిస్టర్లో పాటలు వినవలసిన గతి పట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నది ఈ విసిడి శబ్ద నాణ్యత.

వి సి డిలుగానో, డివి డీలుగానో, మనకు మార్కెట్టులో పాత సినిమాలన్నీకూడ దొరుకుతున్నాయి. సామాన్యంగా, ఏ పాత సినిమా విసిడి/డివిడిలు తీసుకున్నా సరే, చివరకు మాయా బజారు కూడ, పరమ నాసిరకంగా ఉంటాయి. అనేక సినిమా హాళ్ళల్లో తిరిగి తిరిగి అరిగిపోయి, ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గరో పడి ఉన్న రీలుని దుమ్ము వీలైతే దులిపి దాంట్లోంచి చేస్తారల్లే ఉన్నది ఈ సిడి/డివిడి లను. అన్ని పాత సినిమా సిడిలు, గీతల మయం, కట్లు, దృశ్యాల ఎత్తివేత, పాటల ఖూనితో మాత్రమే దొరుకుతున్నాయి. కన్యాశుల్కం విసిడి చూస్తే మొదలే లేదు. మొదట పావుగంట దృస్యాలు గెంతుకుంటూ కట్లతో వెళ్ళిపోతాయి. చివరలో, సీన్లు కూడ తారుమారయ్యాయి. ఇదేనా ఆ పాత సినిమాలపట్ల మనం చూపించవలసిన గౌరవం?? డబ్బుచేసుకుందామనేకాని, ఈ సిడి గాళ్ళకు, మంచి నాణ్యంతో వినియోగదార్లకు ఇద్దామని ఏ కోశానా లేదు. అప్పుచేసి పప్పుకూడు సినిమాలో ప్రముఖ పాత్ర ధరించిన మేటి నటుడు సి ఎస్ ఆర్ పేరు సిడి కవరు మీద లేనేలేదు.

ఇలా చెప్పుకుంటూ పొతే, తెలుగు సినిమా సిడి/డివిడి లలో సవాలక్ష చీకాకుపెట్టే అంశాలు ఎన్నో. అస్సలు ఈ సినిమా తీసిన మహానుభావులు, అప్పుడు వారెంతో శ్రమకోర్చి మనకోసం తీసిన సినిమాలు ఇప్పుడు సిడి లరూపంలో పడే దురవస్థ చూసి ఎంత కుళ్ళి కుళ్ళి ఏడుస్తారో కదా. విచిత్రం, టి విలో పాత సినిమా వస్తే అది చక్కగా ఉంటుంది. వాళ్ళకి దొరికిన మంచి కాపి ఈ సిడిగాళ్ళకు ఎందుకు దొరకవు??

నేను బ్రిటిష్ లైబ్రరీలో క్లాసిక్ మెంబర్ని. అక్కడ వాళ్ళ పాత సినిమాలు 1930లు 1940లలో తీసినవి కూడ రీ మాస్టర్ చేసి శ్రధ్ధగా భద్రపరచి అపురూపంగా దాచుకున్నారు. ఇదేదో ప్రభుత్వం చేసిన పని కాదు. అక్కది సిడి/డివిడి వర్తకులే చొరవ చూపి, అప్పటి నెగెటివ్‌లు సంపాయించి, రెస్టోర్ చేసి, చక్కటి డీవిడి లు అందించి, ప్రేక్షకుల మన్నన పొంది తమ సంపాదన చక్కగా చేసుకుంటున్నారు.కొనుక్కున్న వాళ్ళకు తృప్తి, అమ్ముకున్న వాళ్ళకు లాభం. మన ఈ సిడిగాళ్ళకు అటువంటి బుధ్ధి ఏది. నోట్లో తెల్ల చుట్ట, బుర్రంతా దబ్బు సంపాయించాలనే దుగ్ధ తప్ప వినియోగదార్లకు వారిస్తున్న డబ్బుకు తగిన ప్రతిఫలంగా చక్కటి సిడిలు ఇద్దామనే ఇంగిత జ్ఞానం లేని సి డి నిరక్షరాశ్య వర్తకులు. కళకు సంబంధించినంతవరకు వాళ్ళు నిరక్షరాశ్యులే.

పైరసీ పైరసీ అని ఏడవటమే కాని, వాళ్ళు ఎలాంటి నాణ్యంతో సిడి ఇస్తున్నారో గమనించుకోవటంలా. ఇలాంటి చండాలపు సి డిలని ఒక 5-6 సంవత్స్రాలక్రితం 300-350 రూపాయలు ధర పెట్టి మన్ని దోచుకోలా? ఇప్పుడు ఈ పైరసీ పుణ్యమా అని దిగి వచ్చి 30 నుంచి 50కి అదే చెత్తను అమ్ముకుంటున్నారు.

పేర్లెందుకుకాని, ఎన్నో సినిమాలు తీసి కోట్లకు కోట్లు మన దగ్గ్రనుంచి వడుక్కుని సంపాయించిన దురంధరులు మన పరిశ్రమలో దాదాపు పాతికమందిదాక ఉన్నారు. వాళ్ళకు ఏ మాత్రమైనా సినిమా కళ మీద కనీస ఆసక్తి, గౌరవం (కనీసం ఆ కళను అడ్డుపెట్టుకుని బతికేస్తున్నారు కాబట్టి) ఉంటే, ఒక చక్కటి ఫౌడేషన్ స్థాపించి మన కళా ఖండాలన్నీ కూడ నెగెటివ్‌లతో సహా సేకరించి, రెస్టోర్ చేసి, అప్పటి నటీ నటులు ఇంకా బతికి ఉంటే (చాలావరకు వెళ్ళిపోయారు) వాళ్ళ అనుభవాలను, ఇప్పుడు ఉన్న గౌరవించతగిన విమర్శకులు శ్రీ రావి కోడలరావు, శ్రీ గొల్లపూడి మారుతీరావు మున్నగువారి (మహా ప్రభో దివాకర బాబు మాత్రం వద్దండీ! వద్దు!! చంపేస్తున్నాడు అదేదో చానెల్లో భయంకర సుత్తి వేసి) వ్యాఖ్యలతో డివిడిలుగా కొద్ది లాభం వేసుకుని అమ్మితే పైరసీ జోలికి ఎవరు వెళతారు.

ఇలాంటి చెత్త నాణ్యంతో ఎంత 30-35 రూపాయలు పెట్టి విసిడిలు వేసినా, పైరసీ వాడు ఒక్క డివిడిలో 4-5 సినిమాలు (అవి కూడ చక్కటివి)అదే 30-35 అమ్ముతుంటే, ఒరిజినల్ సిడిలో క్వాలిటే లేనప్పుడు, వినియోగదారుడు పైరసీని ప్రోత్సహించవద్దంటే మానతాడా? మన బంగారం మంచిదైతే అన్నట్టుగా, ఈ సిడి వ్యాపారస్తులు కొంత అవలోకనం చేసుకోవాలి. కళకు సంబంధ్జించిన వ్యాపారం పూర్తి వ్యాపరంలాగ చేస్తే కూలి పోతుంది. కళాదృష్టి ఉండి తీరాలి, కోంతలో కొంత సిన్సియారిటీ ఉండాలి. ఏ పత్తి వర్తకుడో, మిరపకాయలు లేదా సాంబ్రాణి పుల్లలు అమ్ముకునే వాడో ఎవత్తెతో సినిమా తీద్దామా అని ఆబగా వచ్చేసి సినిమాలు చుట్టేద్దామా అని మద్రాసుకో హైదరాబాదుకో ఎగబడటంకాదు, పాత సినిమాలని సిడి/డివిడి రూపంలో తెచ్చి అమ్మటం.

మరొక మాట కొంతమంది డివిడి గాళ్ళు, ఒక డివిడిలో 3-4 సినిమాలు వేసి అమ్ముతున్నారు. ఒక సినిమా మంచిది పెట్టి, మిగిలినవి ముష్టి సినిమాలు పెడతారు. అలా కాంబినేషన్ మార్చి, వాళ్ళు కొనుక్కున్న చండాలపు సినిమాలన్నీ మనచేత కొనిపించాలని వాళ్ళ దురాశా ప్రయత్నం. కాని, మన పైరసీ సోదరులు(!) ఈ కిటుకు కనిపెట్టి, ఒక్కే డివిడిలో అన్నీ మంచి సినిమాలు పెట్టి వీళ్ళని దెబ్బకొడుతున్నారు.ఇలా ఎంతవ్రాసి ప్రయోజనం, ఈ సిడి/డివిడి వర్తకులకి నాణ్యత మీద అవగాహన రావాలిగాని-వాళ్ళ వ్యాపారాభివృధ్ధి కోసమే!! అది వచ్చిన నాడు పైరసీ జోలికి వినియోగదారుడు వెళితే ఒట్టు.

7 వ్యాఖ్యలు:

 1. అవునండి. మిస్సమ్మ DVD/VCDలతో కూడా ఇదే సమస్య. DVDలో కొన్ని సన్నివేశాలు తీసేసారు. 300-400 రూపాయలు పెట్టినా ఉపయోగంలేదు.
  "శ్రీ రావి కోడలరావు, శ్రీ గొల్లపూడి మారుతీరావు మున్నగువారి వ్యాఖ్యలతో డివిడిలుగా కొద్ది లాభం వేసుకుని అమ్మితే పైరసీ జోలికి ఎవరు వెళతారు." ఇది చాలా మంచి ఆలోచన.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ప్రసాద్ గారూ, సరిగ్గా చెప్పారండీ. మేము దూర దేశంలో ఉంటాము. పాత సినెమాల మీద మక్కువతో ఓ పది, పదిహేను సిడిలు కొనుక్కొచ్చామండీ ఇక్కడికి పోయినసారి. ఇక నా అవస్థ అంతా ఇంతా కాదు. బోలెడు డబ్బు పోసి కొన్నానా, ఒక్కటి కూడా చూడ గలిగినట్టుగా లేదండీ. పాతాళ భైరవి, బడి పంతులు, తోడి కోడళ్ళు, చదువుకున్న అమ్మాయిలు, ఎన్నొ కొన్నాను. పైగా వచ్చెవరకు కూడా కలలు కంటూ వచ్చాను. బాగా ఎంజొయ్ చెద్దామని. ఏం చేస్తాం మనకు ఆ ప్రాప్తం లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. yaa..i can understand u r feelings.thats y only i am collecting from web.


  మీకు మంచి ప్రింట్ కావలంటే చెప్పండి నా దగ్గర వుంది.. ఈ క్రింది Links చూడండి.
  మంచి ప్రింట్స్ దొరుకుతాయి.

  http://chinnamama.folderland.com/

  lazydesis.com

  no need to register.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పేరున్న కంపెనీల డీవీడీ లలో కూడా నాణ్యత అంతంతమాత్రం గానే ఉంటోంది.. పైగా ఈ జాడ్యం ఒక్క తెలుగు సినిమాలకి మాత్రమే.. పాతవనే కాదు, కొన్ని కొత్త సినిమాల డీవీడీ నాణ్యతా అంతంత మాత్రమే.. బాగుంది మీ టపా.. ఆలోచించాల్సిన విషయాలు...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. వ్యాఖ్యలు వ్రాసిన వారందరికి నా కృతజ్ఞతలు. ఈ సిడి/డివిడి వ్యవహారంలో అందరం కలసి ఏమైనా చెయ్యగలమా అని అలోచించాలి. మనకు క్లాసిక్ సినిమాల మీద ఉన్న అభిమానంతో తరచి తరచి చూసుకుందామని కొనుక్కుంటే, ఆ సిడి/డివిడి నాణ్యంతో మొదటిసారికే మొహం మొత్తుతుంటే ఇంకా కలెక్షన్ ఎందుకు చెయ్యాలి. ఈ సిడిల అమ్మకం మీద ఏదైనా సర్టిఫికేషన్ వ్యవస్థ , అంటే అమ్మేముందు, సిడి నాణ్యం చూసే మిష మీద లంచాలౌ కొట్టేసి వాళ్ళన్నమాట. అటువంటి వ్యవస్థకనుక ఉంటే వాళ్ళకి అనేక ఫిర్యాదులు పంపితే, వాళ్ళు తాము తీసుకుంటున్న లంచాల రేటు పెంచుతారు, అప్పుడు ఈ సిడిగాళ్ళకి మంచిగా అమ్మటమే చౌకగా అనిపించి, మనకు గీతలు కట్లు లేని సిడిలు అమ్ముతారేమో. జోక్ కాదు నిఝంగానే అంటున్నాను. అటువంటి పర్యవేక్షణ ప్రభుత్వ అధికారి ఎవరైనా ఉంటే తెలిసినవాళ్ళు చెప్పగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మొన్న పొగతాగుడు రాయుళ్లపై... ఇప్పుడు సీడీరాయుళ్లపై ధ్వజమెత్తారు. మనసుకు హాయికలిగించే పాత సినిమాలు క్వాలిటీలో దొరకవు. నరాలకు పనికల్గించే ఇప్పటి సినిమాలు టెక్నికల్ క్వాలిటీతో లభ్యమవుతాయి. ఇదేం రోగమో మీరన్న సీడీ రాయుళ్లకు.. నేను కూడా చాలా పాత సినిమాలు సేకరించాను. కాని క్వాలిటీతో ఉన్నవి వాటిలో కొన్ని మాత్రమే... టీవీ ట్యూనర్ కార్డుతో గతంలో టీవీల్లోంచి కొన్ని కాపీ చేసుకున్నా. కానీ దీంట్లో కూడా బోలెడు అడ్డంకులు.

  మంచి క్వాలిటీతో డీవీడీలు ఎక్కడ దొరుకుతాయి. వ్యక్తుల వద్ద ఉంటే వాటిని ఎలా సేకరించాలి అనే సమాచారాన్ని కూడా మనం భవిష్యత్తులో పంచుకోవలసి ఉంటుందేమో.. ఎవరెవరివద్ద పాత సినిమాలు ఏవేవి ఉన్నాయో కూడా మనం సేకరించి జాబితాను బ్లాగుల్లో పెట్టాలేమో ఆలోచించండి. నా వద్ద గత పదేళ్లుగా సేకరించిన ఆపాత మధురాల్లాంటి సినిమా పాటలు, పాత చిత్రాలు చాలానే ఉన్నాయి.

  శివరాం గారూ పాత చిత్రాల సేకరణ, సమాచార పంపిణీ కూడా మనమే చేపడితే బాగుంటుందేమో కదూ.. ఆలోచంచండి. వ్యక్తులుగా మనవద్ద ఉన్నవైనా మనం పంచుకోగలిగితే, సమాచారం ఇచ్చి పుచ్చుకోగలిగితే ఎంత బావుంటుంది. నా వద్ద పాత సినిమాల్లోని వీణ పాటలు వీడియో, ఆడియో పాటలు చాలానే ఉన్నాయి. అన్నీ మర్చిపోయి ఏ సాయం సమయంలోనో, ప్రాభాతవేళలోనూ సెలవురోజు ఆ పాటలు సిస్టం ముందు వేసుకుని వింటూంటే అలాగే ప్రాణం పోయినా నష్టం లేదనిపిస్తూంటుంది.

  అన్నట్లు.. నా వద్ద వీడియోలనుంచి పాటలను, మంచి సన్నివేశాలను కట్ చేసి సీడీలుగా తయారుచేసుకునేందుకు ఓ సాప్ట్ వేర్ ఉంది దీంతోనే గత పదేళ్లుగా పాత చిత్రాల పాటలను, సన్నివేశాలను కొల్లగొట్టాను. కామెంట్ల ద్వారా జ్ఞానాన్ని పంచుకోవడం కూడా కుదరకుండా పోతోంది. ఏమిటో.. ఇది..

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.