19, నవంబర్ 2009, గురువారం

బేతాళ కథలు కథా కమామిషు-2

బేతాళ కథలను పైవిధంగా 1955 సంవత్సరంలో ప్రచురించారు


మరుగున పడిన చందమామ చరిత్రను వెలికి తీసి అక్షరబద్దం చేద్దామనే లక్ష్యంతో నేను సంస్థ లోపలినుంచి చేస్తున్న ప్రయత్నాలు మరింత నిర్దిష్టంగా, ఖచ్చితంగా, సత్యసమ్మతంగా ఉండాలనే భావంతో ఈ బ్లాగులో నేను పొందుపరుస్తున్న కథనాలు, వాటిలోని సమాచారాన్ని మళ్లీ మళ్లీ నాకు నేనుగా నిర్ధారించుకుంటూ, వెనక్కి తిరిగి చూసుకుంటూ పెద్దల సలహాలను తీసుకుంటూ వస్తున్నాను.

ఈ బ్లాగులో సందర్భానుసారం పొందుపరుస్తున్న విషయాలు నూటికి నూరుపాళ్లు వాస్తవమేనని నాకు నేనే సర్టిఫికెట్ ఇచ్చుకునే సాహసం చేయలేను. ఎందుకంటే ఇది 63 సంవత్సరాల చరిత్రకు, చందమామ నేపథ్యానికి సంబంధించిన విషయాలతో కూడిన బ్లాగు.

దశాబ్దాలుగా మరుగున పడి ఉన్న అపరూప చరిత్రను సేకరించే ప్రయత్నంలో పలుసార్లు మనకు అందుబాటులోకి వస్తున్న, పలు కోణాలు, మార్గాలనుంచి అందుతున్న విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని వీలయితే మార్చవలసిన, సవరించ వలసిన, ఇంకా నిర్దిష్ట రూపమివ్వ వలసిన అవసరం ఎంతైనా ఉంది.

అందుకే ఈ బ్లాగులో వస్తున్న వ్యాసాలు, కథనాలు వేటికవిగా శాశ్వతాలు అనే అభిప్రాయం అప్పుడూ, ఇప్పుడూ కూడా నాకు లేదు. ఇకపై ఉండదు కూడా. ఓ అరుదైన చరిత్రకు సమగ్ర రూపం ఇవ్వడానికి ప్రయత్నించడంలో ఎన్ని పురిటినొప్పులు పడవలసి ఉంటుందో నాకు తెలీంది కాదు కూడా.

అందుకే బేతాళ కథలుపై నేను కూర్చిన, సమీక్షించిన విషయాలు, అందులో చందమామతో ముడిపడిన అంశాలకు సంబంధించి లోపాలు, ఇంకా సవరించవలసిన విషయాలపై తగు సూచనలు అందించమని ప్రింట్ చందమామ అసోసియేట్ ఎడిటర్ బాలసుబ్రహ్మణ్యం గారిని కోరి ఆ రెండు కథనాల కాపీలను నిన్న అందించాను. ఈ రోజు సాయంత్రం ఆఫీసులోనూ, క్యాబ్‌లోనూ తనతో జరిపిన సంభాషణకు అనుగుణంగా చందమామ బేతాళ కథల నేపథ్యాన్ని మరికొంత వివరంగా పొందుపర్చే ప్రయత్నం చేస్తున్నా.

బాలు గారు ప్రధానంగా రెండు విషయాలను ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అవి. 1.బేతాళ కథలను ఎప్పుడు కూడా మార్చి రాయలేదు. మొదట్లో మూలంలోని కథలను కొన్నింటిని యధాతథంగా ప్రచురించారు.

తర్వాతనుంచి చందమామ రచయితలు పంపుతూ వచ్చిన మామూలు కథలనే బేతాళ కథలుగా పజిల్ రూపంలో, ప్రశ్నలు – సమాధానాల రూపంలో ట్విస్ట్ చేసి పిల్లలకు అనుగుణంగా కథను మార్చారు. తర్వాత పెద్దలకు కూడా అవి ఇష్టమైన కథలుగా మారిపోయాయి.

2. చందమామలోని బేతాళ కథలకు ఘనత ప్రాథమికంగా కథల రచయితలదే. బేతాళ కథలకు సంబంధించి చక్రపాణి, కొకు, శంకర్ గారు వంటి వ్యక్తుల ప్రాముఖ్యత, ఒరవడిల గురించి ప్రస్తావించే క్రమంలో కథల రచయితలను మర్చిపోకూడదు. వారి విలువను విస్మరించవద్దు.

బాలుగారు చెప్పిన ఈ రెండు విషయాలను వివరంగా ప్రస్తావించుకుందాము. ఆయన ఎరుక ప్రకారం…

బేతాళ కథలను చందమామ పత్రిక ఎన్నడూ మార్చి రాయలేదు. 1955 సెప్టెంబర్ సంచికలో తొలి బేతాళ కథను “మహామంత్రి మనోవ్యాధి” అనే పేరుతో ప్రచురించారు. గుణాఢ్యుని మూల కథల్లో ఒకటో కథ, రెండవ కథ, మూడవ కథ అనే ఉంటాయి. తర్వాత అక్టోబర్‌లో “మారిన తలలు” నవంబర్‌లో ఏడ్పు – నవ్వు, డిసెంబర్‌లో ఆత్మబలిదానం అని బేతాళ కథలను మూలంలోనివే వేశారు.

మృతసంజీవనీ మంత్రం వరకు మొత్తం 9 కథలను ప్రచురించిన చందమామ ఆ కథల ముగింపు పుటలో కల్పితం అని వేయలేదు. 1956 జూన్ సంచికలో మాత్రమే బేతాళ కథకు చివర కల్పితం అని ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడినుంచే బేతాళ కథలను ఒరిజనల్ కథలనుంచి కాక రచయితలు పంపిన కథలనుంచే ఏరుకుని ట్విస్ట్ చేసినట్లుంది.

ఇంకా చెప్పాలంటే బాలుగారి ప్రకారం 1955 సెప్టెంబర్ నుంచి మొదటి మూడు కథలు మాత్రం నిఖార్సుగా మూల కథలే అయి ఉంటాయి. తర్వాత నుంచి మామూలు కథలనే బేతాళ కథలుగా మార్చి రాశారు. ఎందుకంటే దీనికి నేపథ్యం ఉంది. గుణాడ్యుని బేతాళ మూల కథలు వాస్తవానికి పెద్దల కథలు అంటే అడల్ట్ కథలు. అంటే కేవలం శృంగారానికి మాత్రమే సంబంధించినవి అని కాదు. అవి భార్యాభర్తలు, స్త్రీపురుషుల సంబంధాలు, సంసార నీతి, కుటుంబ విలువలు వంటి పెద్దలకు సంబంధించినవి. కుటుంబ నీతిని ధిక్కరించిన కథలు కూడా మూలంలో ఉన్నాయి.

కాబట్టి తొలి రెండు మూడు కథలను ప్రచురిస్తున్న క్రమంలో చందమామ సంపాదకులకు, సంపాదక వర్గ సభ్యులకు ఈ పెద్దల విషయాన్ని పిల్లలకు ఎలా చెప్పడం అనే ధర్మసందేహం ఎదురై మూల కథల్లోని ట్విస్ట్‌ను తీసుకుని చందమామ రచయితల కథలనే బేతాళ కథలుగా మార్చి రాస్తే బాగుంటుంది కదా.. ఇలా ఎందుకు చేయకూడదు అనే థాట్ వచ్చిందట.

ఇది చక్రపాణి, కుటుంబరావు గార్లలో ఎవరికయినా వచ్చి ఉండవచ్చు. లేదా కొకు గారే సలహా ఇస్తే దాన్ని చక్రపాణిగారు ఆమోదించి ఉండవచ్చు. ఏదేమైనా మూలకథలను కాకుండా ఆధునిక కథలనే మధ్యలోనో లేదా చివర్లోనూ లేదా కథ మొత్తంగానో మార్పు చేసి పజిల్ లేదా ప్రశ్న-సమాధానం రూపంలో మార్చి ప్రచురించాలనే ఆ ఆలోచనకు గుణాడ్యుని మూలకథలే ఆస్కారం ఇచ్చాయి.

కాబట్టి బేతాళ కథలను చందమామ ఎన్నడూ మార్చి రాయలేదు. చందమామలో తొలి మూడు, లేదా తొమ్మిది కథల తర్వాతే కొత్త కథలను చందమామీకరణ చేసి ఉంటారన్నది బాలూగారి అభిప్రాయం. తొలి 3 కథలూ నిఖార్సయిన మూల కథలే అని తానంటారు.

ఇకపోతే రెండోది. చందమామ బేతాళ కథలకు ఘనత ప్రాథమికంగా రచయితలదే. ఏ కారణాలతో అయినా సరే చందమామకు కథలు రాస్తూవచ్చిన రచయితలను విస్మరించకూడదు. ఎందుకంటే వీరు రాసి పంపుతూ వచ్చిన సాధారణ కథలనే బేతాళ కథలుగా సంపాదకులు మార్చి రాస్తూ వచ్చారు. బేతాల కథలకు అని ఉద్దేశించకుండా రచయితలు పంపిన సాధారణ కథలను కూడా బాగుంటే, బేతాళీకరణకు అనువుగా ఉంటే వాటిని సెపరేట్ చేసి సవరించేవారట.

దీనికి తొలి పాతికేళ్లూ అంటే 1955 నుంచి 1980 వరకు చక్రపాణి, కుటుంబరావు గార్లు మార్గదర్శకత్వం వహించగా, తర్వాతి దశలో విశ్వంగారు, దాసరి సుబ్రహ్మణ్యం గారు 2006 వరకు బాధ్యత వహించారట. కొకు గారి తర్వాత బేతాళకథలను సాపుచేసే బాధ్యత దాదాపుగా దాసరి గారిదే అని బాలు గారి అభిప్రాయం. 2006 తర్వాత బాలుగారే ఈ బాధ్యతను చేపట్టారనుకోండి. పైగా ఇతర సంపాదకవర్గ సభ్యుల వలే కాక ఈయన స్వతహాగానే చందమామ అవసరాలకు గాను బేతాళ కథలను అడపాదడపా రాస్తున్నారని తెలిసింది. దీన్ని కూడా పైకి అంగీకరించని మోడెస్టీ ఈయనది.

అయితే చక్రపాణి, కుటుంబరావు, విశ్వం, దాసరి సుబ్రహ్మణ్యం గార్లలో ఏ ఒక్కరూ స్వంతంగా బేతాళ కథలను రాయలేదని కథకులు పంపిన కథలలోంచి ఏరిన వాటినే కొకు, దాసరి గార్లు బేతాళ కథలుగా మార్పు చేసేవారని అంటారీయన. కథ మధ్యలో మార్చినా, చివర్లో మార్చినా, లేదా కథ మొత్తంగా మార్పులకు గురిచేసినా చందమామ బేతాళ కథలకు మూలం చందమామ కథకులే. వీరిలోనూ రాజగోపాలరావు -వసుంధర- గారిదే అగ్రతాంబూలం అని బాలుగారి ప్రకటన.

చందమామ సంపాదక బృంద సభ్యులు సాపు చేసి తుది రూపమిచ్చిన బేతాళ కథలకు కూడా సవరణలు సూచించినవారు చందమామ చరిత్రలో ఇద్దరే ఇద్దరు. వారు చక్రపాణి గారు, విశ్వనాథ రెడ్డి గారు. బేతాళ కథకు మార్పులను సూచించడంలో చక్రపాణి గారి కంటే విశ్వంగారే రెండాకులు ఎక్కువగా చదివారన్నిది బాలూగారి అభిప్రాయం.

సంపాదక సిబ్బంది బాగా లేదు అని కొట్టిపారేసిన కథను కూడా మధ్యలోనో, చివర్లోనూ మార్పులు చేసి బేతాళకథగా మార్చవచ్చు కదా అని విశ్వంగారు సూచించేవారట. చక్రపాణిగారికి ఎంత సంపాదక అనుభవం ఉందో అంత అనుభవం విశ్వంగారికి ఉందని, ఇందుకు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తోడయిందని బాలు గారు చెప్పారు.

ఇలా పిల్లలకోసం తయారైన బేతాళకథలు తర్వాత ఆంధ్రదేశంలో అన్నివయస్సుల వారిని దశాబ్దాలుగా ఆకట్టుకున్నాయి. చనుబాల కథలుగా మాత్రమే పేరొందిన చందమామ కథల పట్ల తర్వాత పెద్దలు కూడా బాగా ఆసక్తి చూపేలా చేయడంలో మొదటి మలుపు బేతాళ కథలనుంచే ప్రారంభమయ్యిందిని చెప్పవచ్చు.

పెద్దల విషయంగా పేరొందిన బేతాళ మూల కథలను మినహాయించి పిల్లల కంటెంట్‌గా మార్పుకు గురయిన బేతాళ కథలు అచిర కాలంలోనే కుటుంబంలోని స్త్రీ, బాల, వృద్ద బాంధవ్యులందరికీ నచ్చిన అద్భుత విజయ గాధలుగా చరిత్రలో నిల్చిపోయాయి.

బాలు గారికి కృతజ్ఞతలతో…

చివరగా చందమామ బేతాళ కథల ప్రాశస్త్యం గురించి శివరాం గారు తన బ్లాగులో రాసిన కథనంలోని చివరి పేరాతో దీన్ని ముగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.

“కథా సంపుటి లేదా ధారావాహికగా మొదలు పెట్టబడినా, చివరకు ఒక కథా శీర్షికగా స్థిరపడినాయి ఈ బేతాళ కథలు.చిన్న చిన్న ధారావాహికలు మొదలు పెట్టినప్పుడల్లా తమ సంపాదకీయంలో ఆ ధారావాహిక గురించి కొద్దో గొప్పో చందమామలో వ్రాసే వారు. కాని చారిత్రాత్మకమైన బేతాళ కథల ధారావాహిక (శీర్షిక) చడి చప్పుడూ లేకుండా మొదలు పెట్టేశారు. మరి అప్పట్లో ఈ కథలను ఎలా వేయ్యలో ఇంకా నిర్ణయించుకోలేదేమో.

చివరికి , ఇలా ఎటువంటి ప్రకటన లేకుండా మొదలు పెట్టబడినా, చందమామలోని అన్ని ధారావాహికలలోనూ ఎక్కువరోజులు ప్రచురించబడింది, ఇంకా ప్రచురిస్తూనే ఉన్నారు. భారత పత్రికా చరిత్రలో ఇది ఒక మైలురాయి (రికార్డు)అని నా అభిప్రాయం. తెలుగు పత్రికా చరిత్రలో అన్ని శీర్షికలకన్న ఎక్కువకాలం ప్రచురించబడిన, ఇంకా ప్రచురించబడుతున్న శీర్షిక ఇది ఒక్కటే అయి ఉండవచ్చును.ఈ చక్కటి సాహిత్య ప్రక్రియ వెనుక ప్రసిద్ధ రచయిత, చందమామకు ఎక్కువకాలం సంపాదకుడిగా పనిచేసిన, శ్రీ కొడవటిగంటి కుటుంబరావు కృషి ఎంతగానో ఉన్నది.

బేతాళకథలు ధారావాహిక అనండి లేదా శీర్షిక అనండి, ఏది ఏమైనా కథలను ఏకధాటిగా ఇంత ఆసక్తికరంగా, పిల్లలకు(అనేకసార్లు పెద్దలకే) తెలివితేటలు పెంపొందించే విధంగా ప్రచురించటం నభూతో నభవిష్యతి.”
*************

కొన్ని లింకులు
గుణాఢ్యుడి బేతాళ కథలు

బేతాళ కథలు – కుటుంబరావు గారి ఒరవడి


(పై కథనం చందమామ చరిత్ర బ్లాగులోనిది, రచయిత శ్రీ రాజశేఖర రాజు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.