జ్ఞాపకం అంటే గతించినది. అంటే మృతం. కొన్ని జ్ఞాపకాలు మాత్రం అమృతాలు. చందమామ జ్ఞాపకాలు. అచ్చంగా అలాంటివే. నేను రెండవ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మ మొట్టమొదటి సారి చందమామ కొని తెచ్చింది, నాకూ మా అన్నకూనూ. వీధిబడి కాబట్టి తెలుగు మీడియంలోనే చదువు. అప్పటికి తెలుగు చదవడం, కొన్ని తెలుగు పద్యాలు నోటికి రావడం, ఇంతే తెలిసింది నాకు. ఆ చందమామ చదవగానే చాలా డవుట్లు వచ్చాయి. జ్ఞాపకమున్నవి చెబుతున్నాను.
౧. భల్లూక మాంత్రికుడు సీరియల్ చివర్లో "ఇంకా ఉంది" అని రాసుంది. ఆ "ఇంకా" ఎక్కడుంది?
౨. మాచిరాజు కామేశ్వరరావు గారి కథలో "కట్నం" అంటే ఏమిటి? అది చెడ్డదా?
౩. చింత చెట్టు మీద దయ్యాలుంటాయా?
౪. రాజుకు "మౌనభంగం" ఎందుకు అయింది? అయితే, తిరిగి చెట్టు ఎందుకు ఎక్కాడు?
ఇదుగో..ఇలా. అమ్మనడిగితే, అమ్మ అంది. అలాగే చదువుతుండండి. ఒక్కొక్కటి అర్థమవుతాయి అని. మొదటి ప్రశ్నకు మాత్రం సమాధానం కనుక్కునే వరకు మాకు కాళ్ళాడలేదు. పుస్తకమంతా వెతికేం, నేనూ మా అన్నా. ఎక్కడో దొరకలేదు. చివరికి మా నాన్న మిత్రులొకాయన చెప్పారు, అది ధారావాహిక, నెల నెలా వస్తుందని.
ఆ తర్వాత కొన్ని రోజులకు "తోకచుక్క" మొదలయ్యింది. ఆ ధారావాహిక మొదలయినప్పుడు మా అమ్మ కళ్ళల్లో మెరుపు నాకిప్పుడూ గుర్తే. (తన చిన్నప్పుడు- అమ్మ మా వయసులో ఉన్నప్పుడు చందమామలో తోకచుక్క వచ్చిందట) . మా అమ్మే నాకు, మా అన్నకు, "ఏకాక్షి, చతుర్నేత్రుడు" అన్న పదాలకు అర్థం వివరించి చెప్పింది.
చందమామ అట్ట మీద "వపా" అని ఎందుకు రాసుంటుందో చాలా కాలం తెలియలేదు. ఓ చందమామ చివరి అట్టను ఫ్రేం వేసి పెట్టుకున్న తర్వాత కూడా. ఆయన "వడ్డాది పాపయ్య" గారని ఎలాగో తెలిసింది.
చందమామ నెలకొక సారి వస్తుంది, రాగానే ఓ అరగంటలో ఎగబడి చదివేస్తామా? తర్వాత నెల రోజులు మళ్ళీ ఎదురుచూపులు. ఇలా కాదని, పాత చందమామల వేటలో పడ్డాం, అన్నయ్యా, నేనూ. మా ఇంటి వద్ద పాత పుస్తకాలు, కిలో లెక్కన కొని, 15 పైసలకొకటి చొప్పున అమ్ముకుని జీవించే వృద్ధ దంపతులు ఉండేవారు.
వారి దగ్గర చందమామలు 50, 60 లలోనివి దొరికేవి. అమ్మ తినుబండారాల కోసం ఇచ్చిన దబ్బుతో వాటిని కొనుక్కునే వాణ్ణి. అవన్నీ ఎక్కెడికెళ్ళాయో? వాటిలో కథలకన్నా, మొదట్లో వచ్చే వాణిజ్యప్రకటనలు భలే ఉండేవి. రెమి పవుడరూ, మంఘారాం బిస్కట్లు, లక్స్ సోపు, సినిమా ప్రకటనలూ ఇలా...
పాత చందమామలకు సంబంధించిన ఓ ముచ్చట. "గుడ్డి న్యాయం" అన్న కథ 25 యేళ్ల నాటి చందమామ కథగా వచ్చిందో సారి. ఆ సంచిక చదువుతున్న సమయంలోనే, ఆ సంచికకు పాతికేళ్ళ క్రితం నాటి సంచికా, అందులో అదే కథా దొరికాయి. అదొక గొప్ప సంబరం, అప్పట్లో ఓ గ్రేట్ అచీవ్ మెంట్ నాకు!
చందమామ జ్ఞాపకాలు తవ్వుకునే కొద్దీ వస్తూనే ఉంటాయి. కొన్ని మా పాపాయి కోసం దాచుకుంటున్నాను,
అరుదయిన చందమామల్లాగే....
అన్నట్లు, "కట్నం" అంటే ఏమిటో, మూడేళ్ళ క్రితం అర్థం తెలిసింది. నేను నా భార్య దగ్గర తీసుకున్న కట్నం ఈ కనిపించే చందమామలే.
మా ఆవిడ ద్వారా నాకు దొరికిన నిధి అది. ఇప్పుడు మా పాపాయికి చెందుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.