17, నవంబర్ 2009, మంగళవారం

తరాల ఊహలను ఒడిసి పట్టుకున్న చిత్రకారుడు


అనగా అనగా ఓ ఊరిలో శివశంకరన్ అనే ఓ అబ్బాయి ఉండేవాడు. ఆ ఊరిపేరు కారత్తొళువు. ఇది కోయంబత్తూరు సమీపంలో ఉండే చిన్న ఊరు. పదేళ్ల వయసులో అతడు చదువుకోడానికి మద్రాసు మహానగరానికి వచ్చాడు. పదవ తరగతి పూర్తి చేశాడు. తనకు డ్రాయింగ్ నేర్పిన టీచర్ అతడిని డిగ్రీ చదువుకు పోవద్దని, ఎగ్మూరులో ఉండే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరమని సలహా ఇచ్చారు.

తన టీచర్ సలహాను పాటించిన ఆ అబ్బాయి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చిత్రకళను అభ్యసించాడు. తర్వాత ఓ ప్రముఖ పిల్లల పత్రికలో చిత్రకారుడిగా చేరాడు. తను గీసిన చిత్రాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. దాంతో అతడి జీవితం సాఫీగా, సంతోషంగా గడిచిపోయింది.

ఇది.. శంకర్ గారి కథ. ఓ రకంగా చందమామ కథ కూడా. ఆయనకు ఇప్పుడు 85 ఏళ్లు. మీరు, మీ తల్లిదండ్రులు, చివరకు మీ తాత ముత్తాతలు కూడా దేన్నయితే చదువుతూ, పెరిగి పెద్దవారవుతూ వచ్చారో.. ఆ 'చందమామ' పత్రికను ఉన్నత శిఖరాలమీద నిలిపిన అలనాటి మేటి బృందంలో, మన కళ్లముందు సజీవంగా మిగిలి ఉన్న ఏకైక చిత్రకారుడు శంకర్ గారే.

కత్తి చేత బట్టి వీపుపై శవాన్ని మోసుకుని నడిచే సాహస చక్రవర్తిని వర్ణించే 'బేతాళ కథలు' ధారావాహికకు గత యాభై ఏళ్లుగా చిత్రాలు గీస్తూ వస్తున్న చిత్రకారులు శంకర్. 1950ల మధ్యలో తొలిసారిగా బేతాళ కథలకు బొమ్మలు గీయడం ప్రారంభించారు. తర్వాత చందమామ పత్రికకు వందలాది చిత్రాలు గీసిన చరిత్రను సొంతం చేసుకున్నారు.

శంకర్ గారు అధికారికంగా రెండు దశాబ్దాలకు ముందే పదవీవిరమణ చేశారు. అయితే ఎప్పుడు రిటైర్ అయ్యిందీ ఆయనకు కాని ఆయన సతీమణికి కాని ఇప్పుడు స్పష్టంగా తెలీదు. అయితే రిటైర్ అయన తర్వాత కూడా చందమామకు చిత్రాలు గీయడం మాత్రం కొనసాగించారాయన. ఆయన జ్ఞాపకశక్తి ప్రస్తుతం అంత చురుగ్గా లేకపోవచ్చు కానీ, ఆయన చిత్రరేఖలు మాత్రం ఇప్పటికీ వాడిగానే ఉంటున్నాయి.

ఈ నవంబర్ మొదటి వారం వరకు ఆయన చందమామ ఆఫీసుకు వెళ్లి పనిచేసేవారు. నవంబర్ 2న ఆయన ఉదయం ఆఫీసుకు వస్తుండగా క్యాబ్‌లోనే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాక కోలుకున్నారు. దీంతో ఇకపై ఇంటినుంచే చందమామ పని చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన 1952లో రూ.300ల వేతనంతో చందమామలో చేరారు.

శంకర్ గారి కథ చందమామతో పెనవేసుకుపోయింది. నిజంగానే చందమామ, శంకర్ ఇరువురూ తమ ఆరోగ్యం గురించి ఆలోచించవలసిన సమయమిది. శంకర్ గారికి విశ్రాంతి అవసరం. చందమామకు కాయకల్ప చికిత్స జరగడం అవసరం.
యాజమాన్యం చేతులు మారాక రెండు నెలల ముందు చందమామ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ మూలేకర్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇలా అన్నారు.

"చందమామ ఒక మంచి శక్తివంతమైన బ్రాండ్ మాత్రమే కాదు. చాలామంది గుర్తుపెట్టుకుంటున్న బలమైన బ్రాండ్ కూడా. అందుకనే చందమామను దాని వైభవోజ్వల గతానికి తిరిగి తీసుకుని పోవాలని కృతనిశ్చయంతో ఉన్నాం. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న టెలివిజన్, ఇంటర్నెట్‌లతో మేం పోటీ పడలేం కాని వాటిని ప్రశంసించగలం."

గత ఆరు దశాబ్దాలుగా చందమామ చెన్నయ్‌లోని బి.నాగిరెడ్డి కుటుంబ యాజమాన్యంలో ఉండేది. తర్వాత దానిని ముంబై కేంద్రంగా పనిచేసే కలకత్తా సంస్థ జియోదెశిక్ కొనుగోలు చేసింది. చందమామ కార్యాలయం చెన్నయ్‌లోనే ఉంటోంది. అయితే 50 సంవత్సరాలపాటు వడపళనిలో ఉంటూ పిల్లల పత్రికలను శాసించిన చందమామ తర్వాత రెండు మూడు అద్దె భవనాలకు మారి ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్ రోడ్‌లోని చిన్న నీలాంకరై నివాస ప్రాంతంలో ఉంటోంది.

చందమామ సంథాలి భాషతో పాటుగా మొత్తం 13 భాషల్లో వస్తోంది. సంథాలి తూర్పు భారతంలోని గిరిజనుల భాష. అన్ని భాషలు కలిపి 2.5 లక్షల ప్రతులు చలామణిలో ఉంటున్నాయి.

1980లలో చందమామ ప్రాభవం వెలిగిపోతున్నప్పుడు పత్రిక సర్క్యులేషన్ 9 లక్షలను తాకింది. అది చిత్రా, శంకర్ వంటి చిత్రకారుల పేర్లు లక్షలాది పాఠకులు ఇళ్లలో నానుతున్న సమయం. చందమామ కార్యాలయంలోని చిన్న గదుల్లో వారు తమకు తెలియకుండానే లక్షలాది మంది ఊహలను, జీవితాలను మారుస్తున్న సమయం.

కింది మూడు ఉదాహరణల ద్వారా చందమామ ఆనాడు భారతీయుల జీవితాలపై కలిగించిన ప్రభావాన్ని అంచనా వేయవచ్చు. మన రాష్ట్రంలో ఓ చదువురాని గ్రామీణ మహిళ చందమామ వల్లే రాయడం, చదవడం నేర్చుకుంది. చందమామలో వచ్చే బొమ్మలను చూసి విపరీతంగా ఆకర్షితురాలైన ఈమె ఆ కథలను ఇతరులచే చదివి వినిపించుకోవడమే గాక, వయోజన విద్యా తరగతులలో తన పేరు నమోదు చేసుకుంది కూడా.

తర్వాత కర్నాటకకు చెందిన ఓ కృష్ణ భక్తుడి ఉదంతం ఉండనే ఉంది. ఓసారి గుడికి వెళ్లి పూజలు చేయలేని పరిస్ధితుల్లో చందమామలో శంకర్ గారు వేసిన బాల కృష్ణుడి చిత్రానికి పూజలు సల్పి, ఇంట్లో కృష్ణ విగ్రహానికే పూజలు చేసిన అనుభూతిని పొందారాయన. ఇకపోతే ఒరిస్సాలో ఆ పశుల కాపరి అనుభవం... చందమామ ఒరియా కాపీని ఇతడు ఓ వెదురు బొంగులో దాచి పెట్టేవాడు. శంకర్, చిత్రాల మాదిరి బొమ్మలు గీయాలనేది అతడి జీవిత కాల స్వప్నం మరి.

చందమామలో శంకర్ గారు పనిచేసిన తొలిరోజుల్లో చిత్రా గారు ఈయనకు బాస్‌గాను,ప్రత్యర్థి గాను ఉండేవారట. అయితే తర్వాత్తర్వాత వారి మధ్య ప్రగాఢ స్నేహం అంకురించింది. 1976లో చిత్రాగారు ఆకస్మికంగా మరణించేవరకు చందమామలో చిత్రా, శంకర్‌లు ప్రాణమిత్రులుగా గడిపారు. శంకర్ గారి సమకాలికులైన రాజి (భాషా), వపా కూడా ఇప్పుడు లేరు.

చందమామ పత్రిక పెద్ద సైజులో వచ్చినందువల్ల ఆ చిత్రాలను ప్రస్తుత సైజుకు అనుగుణంగా తిరిగి శంకర్ గారు గీయవలసి వస్తోంది. చందమామ కథల భాండాగారం -ఆర్కైవ్- దానికి పెద్ద నిధిలాగా ఉంటోంది. ప్రపంచంలోనే ఏ సంస్థ కూడా ఇంత పెద్ద కథా సంపదను కలిగిఉండలేదంటే అతిశయోక్తి కాదు.

చందమామ ఎడిటర్ మాత్రమే కాక జియోదెశిక్ సీఈఓగా కూడా వ్యవహరిస్తున్న ప్రశాంత్ మూలేకర్ ఇలా చెప్పారు "మేం ఇప్పుడు ముద్రణకు మాత్రమే పరిమితం కాదల్చుకోలేదు. చందమామ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆరు భాషల్లో వస్తోంది." పైగా జియోదెశిక్ కంపెనీ పిల్లలు కథలను మొబైల్ ఫోన్లలో కూడా చదువుకోడానికి ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రూపొందిస్తోంది. "మొబైల్ ఫోన్లలో కథలు చదవడం అనే ఆలోచన ప్రాధమిక దశలోనే ఉన్నప్పటికీ, దీనికి స్పందన మాత్రం సానుకూలంగానే ఉంటోంద"ని మూలేకర్ చెప్పారు.

చందమామ 1947లో మొట్టమొదటగా తెలుగు, తమిళ భాషల్లో ప్రచురింపబడింది. బి. నాగిరెడ్డి చెన్నయ్‌లోని జార్జ్ టౌన్‌లో ప్రింటింగ్ ప్రెస్‌ నడిపేవారు. ఈ ప్రెస్‌లో ప్రముఖ తెలుగు మాసపత్రిక ఆంధ్రజ్యోతిని ప్రచురించేవారు. ఈ క్రమంలో ఈయనకు చక్రపాణిగారితో పరిచయం ఏర్పడింది.

స్వాతంత్ర్యానికి పూర్వం శరత్ చంద్ర కథలు, నవలలను బెంగాలీనుంచి తెలుగులో అనువాదం చేస్తూ పేరుపొందిన చక్రపాణిగారు దేశభక్తితో కూడిన యువ పత్రికను ప్రారంభించడానికి నాగిరెడ్డి గారితో పొత్తు కలిపారు. ఆ పత్రిక పొందిన విజయం ప్రేరణగా వారు చందమామను ప్రారంభించారు. ఆవిధంగా ఆరు అణాల ధరతో, 6వేల ప్రతులతో చందమామ మొట్టమొదటి ఎడిషన్ ప్రారంభమయ్యింది.

ప్రారంభంలో 6 వేల కాపీలతో మొదలైన చందమామ సర్క్యులేషన్ క్రమంగా 9 లక్షల కాపీల స్థాయికి చేరుకున్న వైనం ఆశ్చర్యం కొల్పుతుంది. 'అనగా అనగా ఒక రాజు'తో మొదలయ్యే చందమామ కథలు భారతదేశంలో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకునేవి. కార్మికుల సమస్య, దాంతోపాటు నాగరెడ్డిగారి కుటుంబంలో ఆస్థి వివాదాలవల్ల చందమామ ప్రచురణ 1990లలో తొలిసారిగా మూసివేతకు గురైంది.

శంకర్ గారి మాటల్లో చెప్పాలంటే అది చందమామకు 'అజ్ఞాతవాసం'. 1998లో చందమామ పబ్లికేషన్ మూతపడింది. దాదాపు సంవత్సరం తర్వాత అది బయటినుంచి వచ్చిన నిధులతో తిరిగి ప్రారంభమైంది. అప్పటినుంచి చందమామ సర్క్యులేషన్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతోంది. చందమామ సర్క్యులేషన్‌ను గణనీయ స్థాయికి పెంచడమే ప్రస్తుత సీఈఓ మూలేకర్ ముందున్న అతి పెద్ద సవాలు. అయితే ఆయన ఆశాభావంతోటే ఉన్నారు.

"మాముందు పెద్ద లక్ష్యమే ఉంది, వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా దీన్ని అధిగమించగలం."

మూలం: 'టైమ్స్ ఆఫ్ ఇండియా' దినపత్రికలో విశ్వనాధ్ ఘోష్ 12-11-09న రాసిన వ్యాసం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.