13, నవంబర్ 2009, శుక్రవారం

‘ఈనాడు’లో చందమామ కథల మాంత్రికుడు!


చందమామ’ పత్రికను తల్చుకోగానే చప్పున ఏం గుర్తుకొస్తాయి? నాకైతే... శిథిలాలయం, రాతి రథం, యక్ష పర్వతం, మాయా సరోవరం; ఇంకా... తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట లాంటి ఉత్కంఠ భరిత జానపద ధారావాహికలు మదిలో మెదుల్తాయి. ఖడ్గ జీవదత్తులూ, జయశీల సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ... ఇలా ఒక్కొక్కరే జ్ఞాపకాల వీధుల్లో పెరేడ్ చేస్తారు; మైమరపించేస్తారు.




వీటి సృష్టికర్త దాసరి సుబ్రహ్మణ్యం గారిని మే నెల మొదటివారంలో విజయవాడలో కలిశాను. (ఆయన్ను మొదటిసారి 2008అక్టోబర్లో కలిశాను). ఈసారి అభిమాన పాఠకునిగా మాత్రమే కాకుండా జర్నలిస్టుగా కలిశాను. ఎనిమిది దశాబ్దాల కాలం నాటి జ్ఞాపకాల్లోకి ఆయన్ను తీసుకువెళ్ళాను. ఆ అనుభవాలు తలపోసుకునేటప్పుడు ఆయన ముఖంలో ఎంత సంతోషమో! ‘కరుడు కట్టుకుపోయిన ఆ నాటి జ్ఞాపకాలు’ కరిగి, కదిలి అక్షర రూపంలోకి ప్రవహించాయి.


ఆ కథనం - ‘ఈనాడు ఆదివారం’ 19జులై 2009సంచికలో వచ్చింది.



జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన సుబ్రహ్మణ్యం గారి పేరు- చందమామ అభిమానుల్లోనే చాలామందికి తెలీదు. దీనికి కారణం- ధారావాహికల రచయిత పేరును ప్రచురించకుండా ‘చందమామ’ అని మాత్రమే ప్రచురించే ఆ పత్రిక సంప్రదాయమే. 1952లో చందమామ సంపాదకవర్గ సభ్యుడిగా చేరారు సుబ్రహ్మణ్యం. అలా.. 2006వరకూ 54 సుదీర్ఘ సంవత్సరాలు చందమామ పత్రిక సేవలో తన జీవితాన్ని వెచ్చించారు.



పాఠకులను తన అసమాన కల్పనా చాతుర్యంతో దుర్గమ అరణ్యాల్లోకీ, దుర్గాల్లోకీ, లోయల్లోకీ, సముద్రాల్లోకీ, మంత్రాల ద్వీపాల్లోకీ, మాయా సరోవరాల్లోకీ తీసుకువెళ్ళి, ఊహల స్వర్గంలో విహరింపజేసి ఉర్రూతలూగించిన కథల మాంత్రికుడు ఆయన! తోకచుక్కతో 1954లో మొదలైన ఆయన జానపద ఇంద్రజాలం 1978లో భల్లూక మాంత్రికుడు వరకూ దాదాపు అవిచ్ఛిన్నంగా కొనసాగింది.

సుబ్రహ్మణ్య సృష్టి - చందమామ లోని ఈ ధారావాహికలు!



తోకచుక్క- 1954


మకర దేవత -1955


ముగ్గురు మాంత్రికులు-1957

కంచుకోట - 1958


జ్వాలాద్వీపం- 1960


రాకాసిలోయ- 1961

పాతాళదుర్గం - 1966


శిథిలాలయం- 1968


రాతిరథం- 1970


యక్ష పర్వతం- 1972


మాయా సరోవరం- 1976


భల్లూక మాంత్రికుడు- 1978




‘ఈనాడు ఆదివారం’ సంచికలో ప్రస్తావించని ఇంటర్వ్యూ భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాను.


తన వయసు (87సంవత్సరాలు) ఓసారి స్మరించుకొని, 'I am over stay here!' అని సున్నితంగా జోక్ చేశారు సుబ్రహ్మణ్యం గారు. తన దశాబ్దాల స్మృతులను దశాబ్దాల నేస్తం సిగరెట్ ను వెలిగించి, ఆ పొగ రింగుల్లో ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళి నెమరువేసుకున్నారు. నా విజిటింగ్ కార్డు తీసుకుని, దాని వెనక ఆ రోజు తేదీని నోట్ చేసుకున్నారు. ‘మీరు ఎప్పుడు వచ్చారో దీన్ని చూస్తే తెలుస్తుంది’ అంటుంటే... ఆ శ్రద్ధకు ఆశ్చర్యమనిపించింది.



12 సీరియల్స్ లో మీకు బాగా ఇష్టమైనది?

ఈ ప్రశ్న కాస్త ‘జటిల’మైనది. చందమామలో రాసిన ఆ పన్నెండు సీరియల్స్ 24సంవత్సరాలపాటు వరసగా రాసినవి. వాటిల్లో కొన్నిటి పేర్లు నాకు గుర్తు కూడా లేవు. కొంచెం ఆలోచించి చూస్తే- అన్నిటికన్నీ నాకు ఇష్టమైనవే అనవలసివస్తుంది. చిత్రగుప్త, తెలుగు స్వతంత్ర, ఆంధ్రజ్యోతి, అభిసారిక... ఇలా కొన్ని పత్రికల్లో సాంఘిక కథలు రాశాను. అవీ, ఈ చందమామ సీరియల్స్ అన్నీ నాకు ఇష్టమైనవే. ప్రత్యేకంగా బాగా ఇష్టమైనవంటూ ఏమీ లేవు.


కొ.కు. గారితో మీ అనుబంధం గురించి....

శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారిది తెనాలి. శ్రీ చక్రపాణి గారిదీ తెనాలే. కొ.కు. గారితో నా అనుబంధం గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇద్దరం అభ్యుదయ వాదులం. అనేక రాజకీయ, సామాజిక సమస్యల గురించి ఏకాభిప్రాయం కలవాళ్లం. ఆయన రాసిన చదువు, కాలభైరవుడు లాంటి రచనలు చదవడమే గాక, ఆయన గురించి లోగడ విన్నవాణ్ణి. కానీ ఆయనతో ముఖాముఖి పరిచయం 1955లో. చందమామ సంపాదకత్వం పనిని అప్పట్లోనే శ్రీ చక్రపాణి గారు కుటుంబరావు గార్కి ఒప్పగించారు. మొదటిసారి ఆఫీసులో ఆయనను కలిసినపుడు , ఆయనతోపాటు నేనున్న ఆఫీసు గదిలోకి ఎవరు వచ్చారో గుర్తులేదు. పరిచయ వాక్యాలు అయాక, కొ.కు. గారు ‘‘స్వతంత్ర, ఇతర పత్రికల్లో మీరు రాసిన కథలు చదివాను. అవి రాసింది తెనాలిలో మా కుటుంబాన్నెరిగిన దాసరి సుబ్రహ్మణ్యం ఏమో అనుకున్నాను. అయితే వ్యక్తిగా ఆయన్ని నేను చూడలేదు. ఏనాడో ఊరొదిలి పోయాడు’’, అన్నారు.




* * *


సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం విజయవాడలో తన అన్నయ్య కుమార్తె ఝాన్సీ గారి ఇంట్లో ఉంటున్నారు. ఆయనను సంప్రదించటానికి అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను.



దాసరి సుబ్రహ్మణ్యం

c/o శ్రీమతి ఝాన్సీ

G-7 వైశ్యా బ్యాంక్ ఎంప్లాయీస్ అపార్ట్ మెంట్స్

దాసరి లింగయ్య వీధి

మొగల్రాజపురం, విజయవాడ-10

ఫోన్- 0866 6536677


* * *


ఇంతకీ... కాల భుజంగ కంకాళాలనూ, నరవానర నల్లగూబలనూ, గండ భేరుండ వరాహ వాహనాలనూ, మంత్ర తంత్రాల మాయాజాలాన్నీ సృష్టించి తెలుగు వారినీ, అనువాద రూపంలో ఇతర భారతీయ భాషల చదువరులనూ సమ్మోహనపరిచిన సుబ్రహ్మణ్యం గారు- హేతువాదీ, నాస్తికుడూ!


ఆయన పెద్దన్నయ్య ఈశ్వర ప్రభు హేతువాదిగా చాలా ప్రసిద్ధుడే. ‘‘మా పెద్దన్నయ్య శ్రీ ఈశ్వరప్రభు దగ్గిర చాలా పురాతన సాహిత్యం ఉండేది. ఆ గ్రంథాలు పనిగట్టుకొని చదివాను. నేను అన్నలూ, అక్కయ్యలూ గల కుటుంబంలో అందరికన్నా చిన్నవాణ్ణి; ఆఖరివాణ్ణి. పది సంవత్సరాల వయసులోపలే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాణ్ణి గనక పెద్దన్నయ్యా, వదినెల దగ్గిర పెరిగాను, వాళ్ళు నాకు చిన్నమెత్తు పని చెప్పకపోగా, చదువుకో, స్కూలుకు పో అని బలవంతపెట్టేవాళ్ళు కాదు. అలా పెరిగాను’’ అని చెప్పుకొచ్చారు సుబ్రహ్మణ్యం గారు- తన అన్నగారి గురించీ, బాల్యం గురించీ!


ఈ జానపద ధారావాహికల గురించి చెప్పేటప్పుడు అపురూపమైన ఆ కథల్లోని వాతావరణాన్ని కళ్లముందుంచే అద్భుత వర్ణ ‘చిత్రాలను తల్చుకోకుంటే అది అన్యాయమే! ఆ విశేషాలు... మరో టపా రాసేంత ఉన్నాయి మరి!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.