16, నవంబర్ 2009, సోమవారం

చందమామ అద్భుత చిత్రకారుడు చిత్రా

చిత్రా (CHITRA) గా పేరొందిన శ్రీ టి వి రాఘవులు ( T.V.RAGHAVULU )
చందమామ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది అందులోని చక్కటి బొమ్మలు. ఎన్ని బొమ్మలు, ఎన్ని బొమ్మలు! ఆ బొమ్మల కోసమే కదా చందమామ చదెవే వాళ్ళం. చందమామలో ముగ్గురు అద్భుత చిత్రకారులు ఉండేవారు.

చిత్రా
శంకర్
వడ్డాది పాపయ్య

వీరిలో చిత్రాగారి గురించి ముచ్చటించుకుందాము.

వ్యక్తిగతం
చిత్రాగా ప్రసిధ్ధికెక్కిన వీరి అసలు పేరు టి.వి రాఘవులు.వీరి జననం మార్చ్ 12, 1912 వీరు తెలుగువారే. కాని మద్రాసు తెలుగు వారు. అప్పట్లో మద్రాసులో, రమారమి తమిళులు ఎంతమంది ఉన్నారో, అంతమంది తెలుగువారు కూడ ఉండేవారట. ఈయన S.S.L.C వరకు చదువుకున్నారు. వీరి వివాహం 1942లో జరిగింది. చందమామలో చేరక ముందు, కొంతకాలం ఆక్ష్‌ఫర్డ్ ప్రెస్సులో సేల్సుమాన్ గాను చిత్రాకారునిగాను పనిచేసారు.చిత్రాగారు స్వతహాగా చాయా గ్రాకులు కూడా. ఫొటోగ్రఫీలో కొన్ని బహుమతులను కూడా సంపాయించారు. అందుకనే కాబోలు, ఆయన వేసిన చిత్రాలు, ఫొటోల్లాగ ఉంటాయి.

చిత్రలేఖన ప్రవేశం
చిత్రాగారిదగ్గర ఉన్న చిత్రం ఏమంటే, ఆయన చిత్ర లేఖనంలో శిక్షణ పొందలేదు, స్వయంకృషితో మంచి ఆసక్తితో అభ్యాసం చేసి నేర్చుకుని చిత్ర కళలో నైపుణ్యం సంపాయించి, భారత దేశం లో ఉన్న బాలలందరినే కాక పెద్దలను కూడ దశాబ్దాలపాటు అలరించారు.
చిత్రకళా నైపుణ్యం
ఒకానొక సందర్భంలో కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు చందమామ గురించి ఇలా అన్నారు:

"చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా"

జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, రాయాయణ కల్పవృక్షం వంటి కావ్యాలను వ్రాసిన మహా రచయిత, చందమామ మీద ఇంతటి ప్రేమ చూపించటంలో, బొమ్మలదే ఎక్కువ పాత్ర అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు.

చిత్రా వేసిన బొమ్మలు, కథను చిత్రాల ద్వార చెప్పటమే కాకుండా, కథలో చెప్పని అనేక విషయాలను వ్యక్త పరిచేవి. బొమ్మ చూడగానే కథను చదివించే శక్తి, మన మనసులను సూదంటు రాయిలాగ ఆకర్షించి, మన ఊహా లోకాలలో ఆ కథా విషయం, కథా కాలం, ఆ కథలలో ఉన్న పాత్రల స్వబావ స్వరూపాలు వెంటనే మన మనసులకు హత్తుకు పొయ్యేట్టుగా ఆయన వేసిన బొమ్మలు చందమామను ఎంతో ప్రసిధ్ధ పత్రికగా నిలబెట్టినాయి.

బొమ్మలను చందమామలో ఎలా, ఎక్కడ వెయ్యలి అన్న విషయంలో చక్కటి కొత్త శైలిని ప్రవేశపెట్టారు, చక్రపాణి గారు. ఆయన ప్రవేశపెట్టిన శైలిని తన చిత్రకళా నైపుణ్యంతో ఒక ఒరవడిగా తీర్చిదిద్దిన ఘనత చాలావరకు చిత్రాగారిదే. ఇప్పటికీ పిల్లల పత్రికలన్ని కూడ, చందమామ వారు ఏర్పరిచిన పంథానే అవలింభిస్తున్నాయి. చివరకు చందమామ "వ్యాపార కంపెనీ" పరమయ్యి, కొత్త పోకడలకు పాకులాడి, చందమామ ముద్రించే పద్దతి మార్చినప్పుడు, తీవ్ర నిరసనను ఎదుర్కుని, మళ్ళీ తమ పాత పద్ధతిలోనే ప్రచురిస్తామని మాట ఇవ్వాల్సి వచ్చింది. అంతగా ప్రాచుర్యం పొందింది, చందమామ ప్రచురణ పద్ధతి.

చిత్రాల ప్రత్యేకత
అసలు బొమ్మలో ఉండవలసిన ముఖ్య లక్షణం ఆ బొమ్మలో ఉన్న పరిసరాలు, వస్తువలు, మనుష్యులు మధ్య ఉండవలసిన నిష్పత్తి. ఒక మనిషి మేడపైనుంచి చూస్తుంటే, కింద వస్తువులు అతనికి ఎలా కనిపిస్తాయి, లేదా, కిందనుండి పై అంతస్తులో ఉన్న వ్యక్తితో మాట్లాడే వ్యక్తి మెడ ఏ కోణంలో వెయ్యాలి, అతనికి మేడమీద వ్యక్తులు ఎలా కనిపిస్తారు లాంటి విషయాలు చక్కగా ఆకళింపు చేసుకుని చిత్రాగారు బొమ్మలను వెయ్యటం వల్ల ఆయన బొమ్మలు ఎంతగానో పేరు తెచ్చుకున్నాయి. కథను క్షుణ్ణంగా చదివిన తరువాతగాని బొమ్మ వెయ్యటం మొదలు పెట్టేవారు కాదన్న విషయం, ఆయన వేసిన ప్రతి బొమ్మలోనూ కనపడుతుంది. ఆయా పాత్రల ముఖ కవళికలు, కథలోని పాత్రల మనస్తత్వాలను సరిగ్గా చిత్రీకరించేవారు.

చిత్రాలన్నీ కూడ బొమ్మలోని కథ ఏ ప్రాంతంలో జరిగిందో, ఆయా ప్రాతాంల భౌగోళిక పరిస్థితులను ప్రతిబింబించేవి.అక్కడి మనుషులు ఎలా ఉంటారు, ఎటువంటి జంతువులు దర్శనమిస్తాయి, అక్కడ ఇళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎటువంటి పరికరాలు వాడతారు వంటి అనేక విషయాలు అధ్యయనం చేసి తమ బొమ్మలలో వేసి పిల్లలకు కథలో చెప్పని ఎంతో విలువైన సమాచారం ఇచ్చేవారు చిత్రాగారు. మనం ఇంక ఆ ప్రాంతం గురించి పెద్దగా తెలుసుకునే అవసరం ఉండేది కాదు. అలాగే, కథలోని పాత్రల హోదా బట్టి, వారి ప్రాంతాన్ని బట్టి, కేశాలంకరణలు, దుస్తులు మారిపొయ్యేవి, చక్కగా కథలో వ్రాసిన విషయానికి నప్పేవి.

ధారావాహికలకు బొమ్మలు
కథలకు బొమ్మలు వెయ్యటం ఒక ఎత్తు ఐతే, ధారావాహికలకు చిత్రాగారు వేసిన బొమ్మలు అపూర్వం, నభూతో న భవిష్యతి. ఆయనలాగ దారావాహికలు బొమ్మలు వేయగలవారు లేరు. మొదటి భాగంలో ఒక పాత్ర ఎలా ఉంటుందో, ధారావాహిక చివరి భాగం వరకూ అదేవిధంగా వెయ్యగలిగిన ప్రజ్ఞాశాలి. రచయిత దాసరి సుబ్రహ్మణ్యంగారి కృషి, వారి రచనలకు వన్నె తెచ్చే విధంగా చిత్రా గారి బొమ్మలు, రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, శిధిలాలయం, రాతి రథం మొదలగుగాగల చందమామ ధారావాహికలు ఎంతగానో పాఠకుల మెప్పు పొందటానికి, చందమామ ప్రాచుర్యం పెరగటానికి తోడ్పడినాయి.

కీర్తి ప్రతిష్టలు
చిత్రాగారు దాదాపు 10,000 వేల బొమ్మలు చందమామలో వేశారట. చందమామకు కార్యాలయాన్ని దర్శించిన వేలమందిలో ఎక్కువమంది చిత్రా గారిని చూడటానికే వచ్చేవారట. చందమామలో చిత్రాగారు వేసిన బొమ్మలన్నిటిని మంచి నాణ్యంతో ముధ్రించి భద్రపరచవలసిన అవసరం ఎంతో ఉన్నది. చిత్రకళను అభ్యసించేవారికి వారి బొమ్మలు చూస్తే చాలు, బొమ్మలు ఎలా వేయాలో సులువుగా అర్థమౌతుంది. నాకు దొరికినంతవరకు, శిధిలాలయం ధారావాహికలో, చిత్రాగారు వేసిన కొన్ని బొమ్మలను ఈ కింద అందిస్తున్నాను.ఈ కింద ఇచ్చిన చిత్రాగారి బొమ్మలు ఆయన ప్రతిభను కొంతవరకు చూపిస్తాయి. ఇలాగే ఆయన వేసిన వేల బొమ్మలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ చందమామ కథలను చదవటంలోనే ఉన్నది మజా.

కీర్తిశేషులు
ఇన్ని అద్భుత చిత్రాలు వేసి, దేశవ్యాపతంగా వేల ఏకలవ్య శిష్యులను అభిమానులను సంపాయించుకున్న చిత్రా గారు, మే 6 1978 న స్వర్గస్తులయ్యారు. చిత్రాగారు ఎలా ఉంటారు అన్న విషయం , వారు మరణించిన తరువాత చందమామ వారు జూన్ 1978 సంచికలో ప్రచురించిన ఫొటో చూసే వరకు పాఠకులకు తెలియదు. అది కూడ చాలా పాత ఫొటో. ఆ చిత్రాన్నే ఈ వ్యాసం మొదట్లో పొందుపరచటం జరిగింది. ఆయన నిర్యాణంతో చందమామకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన తరువాత వచ్చిన చిత్రకారులు, తమ బొమ్మలతో (చిత్రా బొమ్మల తీరును అనుసరించినప్పటికీ) పాఠకులను అలరించటంలో విఫలమయ్యారు.



ఈ వ్యాసంలోని వివరాలు జూన్ 1978 సంచికలో చందమామ వారు ప్రచురించిన శ్రధ్ధాంజలి నుండి గ్రహించటమైనది. చిత్రాగారి గురించి ఇంకా అనేక విషయాలు తెలియవలసి ఉన్నది. వారిచిత్రాల మీద అప్పటి పాఠకులు, సమకాలీన కళాకారుల అభిప్రాయాలు, ఆయన బొమ్మలు వేస్తుండగా తీసిన ఫొటో, చందమామకు ఇంతటి పేరు సంపాయించిపెట్టిన చిత్రాగారికి ఎంత ప్రతిఫలం ఉండేది, 1970లలో ఆయన ఎలా ఉండేవారు. ఆయన కుటుంబ జీవనం, పిల్లలు వగైరా, వగైరా.


చిత్రాగారు శిధిలాలయం ధారావాహికకు వేసిన బొమ్మలు కొన్ని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.