1, డిసెంబర్ 2009, మంగళవారం

చందమామలో మళ్ళీ పంచతంత్రం

ప్రపంచ సాహిత్యానికి భారత దేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినది పంచతంత్రం . క్రీ. శ. 5 వ శతాబ్దంలో విష్ణుశర్మ అనే గురువర్యుడు సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంధం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదింపబడి, ఎంతో ప్రాచుర్యం పొందింది. తన వద్ద నేర్చుకోదలచిన విద్యార్ధులకు పాఠ్యగ్రంధంగా ఈ పుస్తకాన్ని ఆయన రచించాడు.ఐదు భాగాలుగా విభజించిన ఈ పుస్తకం అనేక చిన్నచిన్న కథల సమాహారం. మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో, ఆసక్తికరమైన కథనంతో విష్ణుశర్మ బోధించాడు.

పంచతంత్రం ధారావాహికగా తెలుగులో ప్రచురించిన ఘనత చందమామ పత్రికకు దక్కింది. సరళమైన తెలుగులో, ఆకర్షణీయమైన బొమ్మలతో కొన్ని సంవత్సరాల పాటు, పంచతంత్రం ధారావాహికగా ప్రచురించారు.

కొన్ని దశాబ్దాల క్రితం చందమామలో వచ్చిన ఈ పంచతంత్ర కథలను పాఠకుల కోరిక మేరకు ఈ డిసెంబర్ నుంచి చందమామ మళ్లీ ప్రచురిస్తోంది. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు కొనసాగే పంచతంత్ర కథలను చందమామ నూతన సంవత్సర కానుకగా తన పాఠకులకు తిరిగి అందిస్తోంది.

ప్యాకింగ్‌కు తయారవుతున్న డిసెంబర్ చందమామ ముఖచిత్రాన్ని సోమవారం ఉదయం ఆఫీసులో దూరంనుంచి చూడగానే కళ్లముందు ఓ మెరుపు మెరిసినట్లయింది. రాజకుమారులకు కథలు చెబుతున్న విష్ణుశర్మను ముఖచిత్రంగా చూడగానే మళ్లీ దాదాపు నాలుగు దశాబ్దాలకు ముందునాటి చందమామ చూసిన అనుభూతి.చందమామను చదవండి. వీలైతే చందా కట్టండి అని ధైర్యంగా మిత్రులకు సిఫార్సు చేయడానికి ఇప్పుడు ఏ సందేహాలూ లేవు. ఒక పంచతంత్రం కథలు, బేతాళ కథలు, దాసరి సుబ్రహ్మణ్యం గారి పాతాళదుర్గం సీరియల్, రామాయణం, 25 ఏళ్ల నాటి చందమామ కథ, జానపద కథ ఇవి చాలు…. చందమామను చూడండి, చదవండి, తీసుకోండి అని రెకమెండ్ చేయడానికి…

అందుకే గతంలో లేని ధైర్యంతో ఇప్పుడు మిత్ర బృందానికి, బంధువులకు, తెలిసిన వారికి చందమామను చూడమని ఫోన్లు చేయడం. ఇప్పుడీ బ్లాగులో కూడా చందమామ అభిమానులకు తెలియజేయడం.ఈ కథలు ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం పంచతంత్ర కథలు.. ఈ డిసెంబర్ నుంచి మళ్లీ ప్రింట్ రూపంలో వస్తోంది. వడ్డాది పాపయ్య గారి ముఖచిత్రంతో జిగేలుమంటున్న డిసెంబర్ చందమామ ఈ వారం మొదట్లోనే మార్కెట్‌లోకి రావచ్చు. ఆద్యంతం జంతువుల పాత్రలతో సమాజం గురించి, వ్యవస్థ, మనుష్య ధర్మం గురించిన ఎన్నో విషయాలను మానవజాతికి సుబోధకం చేసిన ఇప్పటికీ చేస్తున్న అపూర్వ కథా సాగరం పంచతంత్ర కథలు.

మీ పిల్లలకు తప్పక పరిచయం చేయండి. ఓ అరగంటైనా వారితో కూర్చుని పంచతంత్ర కథలను చదివించండి.. చదివి వినిపించండి.
(ఈ వ్యాసం చందమామ చరిత్ర బ్లాగు లోని వ్యాసం నుండి కొంత భాగం, బొమ్మ చందమామలో మొదటిసారి పంచతంత్రం ధారావాహిక మొదలు పెట్టినప్పుడు శ్రీ వడ్డాది పాపయ్య వెనుక అట్టమీద వేసినది ,జులై 1973 )

1 కామెంట్‌:

  1. నేను చందమామ మొదలెట్టిన రోజుల్లో మొదటి పేజీల్లో అసమీక్ష కారిత్వం, ఆ తర్వాత భల్లూకమాంత్రికుడు వచ్చేవి. అవి చదివి పెరిగిన అదృష్టవంతులలో నేనొకణ్ణిగా గర్విస్తున్నాను.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.