29, జనవరి 2010, శుక్రవారం

జానపద కథల మాంత్రికుడి అంతర్థానం!


ర్తమాన చరిత్రకు వార్తా పత్రికలు అద్దం పడతాయంటారు. అయితే, ‘Journalism is literature in a hurry' కాబట్టి వాటిలో పొరపాట్లు కూడా సహజమేనని సరిపెట్టుకోవాలేమో.

అద్భుత జానపద ధారావాహికలతో తరతరాల ‘చందమామ’ పాఠకులను ఉర్రూతలూగించిన దాసరి సుబ్రహ్మణ్యం గారి మరణ వార్తను పాఠకులకు అందించటానికి ప్రయత్నించిన పత్రికలను అభినందించాల్సిందే.

అయితే-

బుధవారం (జనవరి 27) విజయవాడలో కన్నుమూసిన ఆ జానపద కథల మాంత్రికుడి  గురించి రెండు పత్రికల్లో వచ్చిన వార్తల్లో factual error దొర్లింది.

‘భేతాళ మాంత్రికుడు ఇక లేరు’అని శీర్షిక ఇచ్చిన పత్రిక ఆయన్ను ‘భేతాళ కథల సృష్టికర్త’గా అభివర్ణించింది.బేతాళుణ్ని భేతాళుడిగా రాయటం కాదు- ఇక్కడ సమస్య.


మరో పత్రిక ‘ఆగిన ‘చందమామ’ బేతాళ కథ’ అనే శీర్షికను ఇచ్చింది.‘బాల కథాసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిన బేతాళ కథలను దాసరి సృష్టించారు.ఐదు దశాబ్దాలపాటు బేతాళకథలు రాశారు’ అని పేర్కొంది.

వాస్తవానికి- దాసరి గారు బేతాళ కథల సృష్టికర్త కాదు!

చక్రపాణి, కొడవటిగంటి కుటుంబరావు గార్ల ఆలోచనలే చందమామలో బేతాళ కథలకు నాంది పలికాయి. 1980 తర్వాత మరో పాతికేళ్ళపాటు దాసరి గారు సంపాదక వర్గ సభ్యుడుగా బేతాళ కథలను పర్యవేక్షించినా, ఆయన ప్రధాన రచనా వ్యాసంగాన్ని ఆ కథలతో ముడిపెట్టటం సరి కాదు.


అసలు సుబ్రహ్మణ్యం గారి మౌలిక కృషి అజరామరమైన జానపద ధారావాహికలు. చందమామ పాలసీ మూలంగా ఆయనకు దక్కాల్సిన పేరు దక్కనే లేదు.జానపద సీరియల్స్ ను ఏళ్ళ తరబడి ఆనందించిన పాఠకులు కూడా రచయిత ఎవరో తెలియక, ఆయన్ను గుర్తుంచుకోలేదనిపిస్తుంది.

అసలు కృషిని సరిగా పట్టించుకోకుండా, దాసరి గారికి నేరుగా సంబంధం లేని కీర్తిని ఆపాదించటం ఆయనకు గౌరవం కాదు!

దశాబ్దాల తరబడి, సాహిత్య సృష్టి చేసిన రచయితల కృషి గురించి కూడా ఇలా తారుమారు జరుగుతున్నపుడు-

ఇరవై ఒకటో శతాబ్దంలో,సమాచార యుగంలో కూడా ఇలాంటి దుస్థితా? అనిపిస్తోంది!

....


'I am overstay here' అని తన పెద్ద వయసు గురించి జోక్ వేసుకున్న అపురూప రచయిత దాసరి గారు.

‘కొ.కు.గారు 1980లో నాకన్న ముందుపోవడం నాకు తీరని ఆవేదన’ అంటూ బాధపడి, ఆ మాటలన్న ఎనిమిది మాసాలకే జీవితం చాలించారు.


2009 మేనెల మొదటివారంలో దాసరి సుబ్రహ్మణ్యం గారిని విజయవాడలో రెండోసారి (చివరిసారి) కలిశాను.ఆయనకు వినికిడిశక్తి తగ్గిపోవటంతో రైటింగ్ పాడ్ మీద ఒక్కో ప్రశ్న రాసిస్తే, దానిమీదే స్వయంగా సమాధానాలు రాశారు.

సిగరెట్ తాగుతూ ఆ పొగ లోపలి గదిలోకి వెళ్ళకుండా ఆ తలుపు మూసి, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు. స్మృతులను నెమరువేసుకున్నారు. ‘స్మోకింగ్ ని మాత్రం వదల్లేకపోయాను’అని ఒప్పుకున్నారు, అడక్కుండానే.


‘మీ జానపద సాహిత్యానికి ప్రేరణ ఏమిటి?’ అని అడిగినప్పుడు చాలా సంతోషించారు.అది ఆయన మొహంలో వ్యక్తమవ్వలేదు కానీ, ‘మేలిమి బంగారంలాంటి ప్రశ్న అడిగారు’ అంటూ సమాధానం ప్రారంభించినపుడు ఆయన సంతోషం అవగతమయింది.


2008లో దసరా రోజున విజయవాడలో ఆయన అడ్రస్ అన్వేషించి , నివాసానికి వెళ్ళి తొలిసారి దాసరి గారిని చూడబోతున్నపుడు ఎంత ఉత్కంఠ అనుభవించానో ఇప్పటికీ గుర్తొస్తోంది. ఇంటిలోపల్నుంచి మెల్లగా నడిచొచ్చిన పొడుగ్గా, బలహీనంగా ఉన్న వృద్ధమూర్తిని చూడగానే సంబరంగా ‘ఈయనేనా అంతటి అద్భుత రచనలు చేసిన రచయిత!’ అనుకోకుండా ఉండలేకపోయాను.


ఆయన జీవన సంధ్యలో రెండు సార్లు వ్యక్తిగతంగా కలుసుకోగలిగాననే తృప్తి మాత్రమే ఇప్పుడు మిగిలింది.

ఇచ్చిన విజిటింగ్ కార్డును వెనక్కి తిప్పి, నేను ఆయన్ను కలిసిన తేదీని ఎంత శ్రద్ధగా రాసుకున్నారో.

ఇంటర్వ్యూ చేసిన గుర్తుగా ఆయన ఏటవాలు చేతిరాతతో ఉన్న రైటింగ్ ప్యాడ్ దీనంగా,విషాదంగా...నా దగ్గర!


...


మంత్రముగ్ధులను చేసే దాసరి సుబ్రహ్మణ్యం గారి కథా కథన శైలి ఎలా ఉంటుందో గుర్తు చేసుకుందాం-

‘హఠాత్తుగా వారికి ఒక పొదచాటు నుంచి సింహం గర్జించిన ధ్వని వినబడింది. రాజకుమారులిద్దరూ, ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు ఎత్తి, బాణాలు ఎక్కుపెట్టేలోపలే, రెండు సింహాలు గర్జించుతూ వారికేసి దూకినై. సింహాలను చూస్తూనే రాజకుమారులు ఎక్కివున్న గుర్రాలు బెదిరి వెనుదిరిగి వేగంగా పారిపోసాగినై.’ (జ్వాలాద్వీపం)

‘హేయ్, కాలభుజంగా!కంకాళా!రండి,రండి!ఆ చతుర్నేత్రుణ్ణి వెతికి పట్టి హతమార్చండి!’అనే ప్రళయ భీకర నాదం దశదిశలా వ్యాపించింది’ (తోకచుక్క).
...

చందమామ చరిత్ర బ్లాగు లో రాజు గారు నిన్న (గురువారం) సమగ్రంగా రాసిన టపా కూడా చూడండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.