20, మార్చి 2010, శనివారం

చౌకైపోయిన నిమ్మ రసం


మీకు తెలుసా!! నిరాహారదీక్ష విరమణకు నిమ్మరసమే ఎందుకు ఇస్తారో? తెలిసినా సరే వినండి. నిమ్మరసం పైత్యానికి
మందట. అన్నిటికీ ఒకే మంత్రం. ఏమి కావాలన్నా నిరాహారదీక్ష.

చివరకు సినిమా వాళ్ళు కూడా రోడ్డునపడి
మొదలెట్టారు. షరా మామూలే, ఆ నిరాహార దీక్ష చేసేవాడి మొహాన్ని మీడియాలో చూసి, ఇక వెళ్లి ఓ గ్లాసుడు నిమ్మరసం ఇచ్చి మనం ఫోటోలు తీయించుకోవచ్చు అని బయలుదేరటం. కెమెరా ప్లాషులు మీడియా గాళ్ళ హడావిడి. తీరుస్తారో లేదో గాని కొన్ని పడికట్టు మాటలతో "మనవి చేసుకోవటాలు". సరే ఈ సినిమా వాళ్లకు వాళ్ళ కష్టాలు వాళ్లకు ఉండే ఉంటాయి. ఈ పద్ధతి ఐతే తొందరగా ప్రభుత్వం దిగివస్తుందని సోదాహరణంగా నిరూపించబడినది కాబట్టి, ఒకటి రెండ్రోజులు ( వైద్యులవారు సూచించిన "లంఖణం పరమౌషధం") నిరాహార దీక్ష.

బాగుంది-బాగుంది. ఈ నిరాహార
దీక్ష ఆ విరమణ భాగోతం చూసి "అబ్రకదబ్ర" అన్న పేరుతొ ఒక సినీ విశ్లేషకులు ఒక బహిరంగ లేఖ వ్రాసారు.

అందులో సామాన్యుడి ఆవేదన ఉన్నది. ఈ లేఖలో ఉన్న ఏ ఒక్క కారణానికి అయినా మీరో నేనో నిరాహార దీక్షకు
కూచుంటే ఎవడన్నాపట్టించుకుంటాడా. అరటి తోక్కమీద ఎవరన్నా కాలేసి జారిపడినా బ్రెకింగు న్యూస్ చూపించే పరమ నాసిరకపు న్యూస్ చానెల్ కూడా పట్టించుకోదు. కారణం మన్ని చూపిస్తే ప్రకటనలు రావు. మనం ఉన్నది వాళ్ళు చూపించే ప్రకటనలు చూసి, గొర్రెల్లాగా మన డబ్బులు తగలేసుకుని వాళ్ళు చెప్పే అడ్డమైన వస్తువులు కొనటానికి మాత్రమె. మనకంటూ స్వాతంత్రం లేదు.

ఇక విషయానికి వస్తే, పైరసీ గురించి సినీ రంగం రంకెలేస్తోంది. కొత్త సినిమాలు విడుదల కాక ముందే సిడిలు డివిడి లు
అమ్మకానికి పెడుతున్నారుట. పైగా అవ్వి అసహ్యంగా 30 రూపాయలకే అమ్మేస్తున్నారుట. ఒక్కోసారి, అదే 30 రూపాయల డివిడి లో మూడేసి సినిమాలు కూడా ఇచ్చేస్తున్నారుట. కొత్త సినిమాలు పైరసీ సి డి లుగా రావటం వల్ల వాళ్లకు నష్టం ఉండి ఉండవచ్చు. కాని సినిమాలు మనం హాలుకి వెళ్లి చూసే వాతావరణం ఉన్నదా, ఒక్కళ్ళం (మగవారు మాత్రమె) కాదు, భార్యా పిల్లలతో.

  1. ఏ సినిమా హాలు చూస్తె ఏ మున్నది గర్వకారణం. తీసుకునేది ఏ సి తో కలిపి డబ్బులు, వేసేది ఒక అరగంట లేకపోతె ఒక నలభై నిమిషాలు.
  2. ఏమిట్రా ఇది అని ఎవడన్నా అమాయకుడు నిలదీయటానికి ప్రయత్నిస్తే, వాడిని బెదిరించి నోరు మూయించికుక్కిన పెనుల్లగా వెనుతిరిగేలే చేయటానికి మానేజరు రూపంలో ఉండే రౌడీలు.
  3. ఒక ఆట అవటం ఆలశ్యం, తరుముకోస్తున్నట్టుగా, హాలు ని శుభ్రపరుస్తున్నట్టుగా కొద్దిసేపు నటించి ఈ "కళాసేవ" కు ఎగబడే మూకల్ని లోపలి వదలటం. ఎవడో తినిపారేసిన పాప్కార్న్ పాకెట్లు, సగం తాగి వదిలిన డ్రింకుసీసాల మధ్య చోటు చూసుకుని కూచోవటం, ఆ అద్భుత ప్రదర్శన కోసం
  4. పొరపాటున కూడా అటువైపు కూడా చూడటానికి వీల్లేని ధరలతో కాంటీను. లోపల జనాన్ని ఇలా బంధించి చచ్చినట్టుగా వాళ్ళు చెప్పిన ధరలకే బలవంతాన కొనిపించటాన్ని ఎదుర్కునే చట్టమే లేదా మన దేశంలో??. దీనికి ఎవడు నిరాహార దీక్ష చెయ్యాలి. అదేదో MRTP (MAINTENANCE OF RESTRICTIVE TRADE PRACTICE) ట ఇక్కడ అన్వయించ కూడదా? ఈ మధ్య సెక్యూరిటీ అన్న పేరుతొ చివరకు మంచినీళ్ళ సీసా కూడా తీసికెళ్లనివ్వటంలేదు . పిల్లలతో వచ్చేవారు ఏమి కావాలి?
  5. ఇక అభిమాన సంఘాల పేరుతొ చేసే ఆగడాలు, లేకి పనులకు అంతే లేదు. దీని గురంచి ఎంత తక్కువచెప్పుకుంటే అంత మంచిది. వీళ్ళు చేసే ఆగడాలు , అల్లరిని అదుపులో పెట్టలేరా ఈ నిరాహార దీక్షా శిబిరానికి వచ్చి నీతులు చెప్పిన ఈ హీరోలు?
  6. సినిమా మొదలవ్వటం ఆలశ్యం, ఇక దరువు మొదలు. అదేదో డిజిటల్ సౌండట అది ఈ హాలులో ఉందని బెదిరించే స్లైడు చూపించి మరీ మన చెవులు పగలగొట్టటం. వీళ్ళకి తెలిసింది పూర్తి సౌండు పెట్టటమే. పాట మొదలవ్వటం భయం అక్కడున్న స్పీకర్లు చాలవన్నట్టుగా పక్కనుంచి ఉండి ఉండి కనెక్షన్ ఇవ్వటం తీసెయ్యటం. సినిమా జరుగుతున్నప్పుడు కూడా హఠాత్తుగా పక్క స్పీకర్ లోంచి తలుపు తీసిన చప్పుడో, ఎవ్వడో అరిచిన అరుపో , మనం ధడుచు చచ్చేట్టుగా వచ్చెట్టుగా చెయ్యటం, సామాన్య ప్రేక్షకులని ఝడిపించటం. సినిమా అయ్యేప్పటికి తల నెప్పి. వీళ్ళకి తలనెప్పి మాత్రలు చేసే ఫార్మా కంపెనీలకి ఎమన్నా ఒప్పందం ఉన్నదేమో అన్నఅనుమానం కూడ ఉన్నది!!! (కొంతమంది డైరెక్టర్లు ఈ పని గుత్తకి తీసుకుని మరీ చేస్తున్నారనుకోండి) దేనికైనా తెగిస్తారు వీళ్ళు! ఇలాంటి చెత్త పనులు చెయ్యకుండా కట్టడి చేసే ఆవకాశంలేదా??

ఇన్ని గోలల మధ్య సినిమా చూసే కన్నా ఇంట్లో సి.డి తో చూడటం ఎంత హాయి. చీకాకు పరచే సుత్తి సీనులు తోసిఆవతల పారేయ్యచ్చు. చెత్త పాటల్ని స్కిప్ చేసెయ్యచ్చు, మనకి నచ్చిన సీను ఒకటికి రెండు సార్లు చూడచ్చు. మరందుకే పైరసీ. ప్రజలు ఆ సిడి కూడ మా దగ్గరే కొనవచ్చు కదా అని వీళ్ళ గోల. తప్పకుండా కొంటారు, ఎప్పుడు? సవ్యమైన ధర పెట్టి, ఆ ధరకు తగ్గ నాణ్యం అందిస్తే ప్రజలు పైరసీ జోలికి ఎందుకు వెళ్తారు. ఈ పైరసీని అరికట్టాలంటే, పైరసీ ఎందుకుజరుగుతోంది, అలా జరగటానికి గల ముఖ్య కారణాలు సినిమా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాటి మూలాలు పరిశీలించి తగిన నివారణోపాయాలు చేపట్టాలి. నిరాహార దీక్షల వల్ల సమస్యలు పోవు!!!

ఇది కొత్త సినిమాల తీరు.

పాత సినిమాల సి డి లకు ఏమి రోగం పైరసీ చేస్తున్నారు??

అవును పాత సినిమాలకే పైరసీ డిమాండు ఎక్కువ. కారణం, ఏ పాత సినిమా సి డి
సవ్యంగా ఉన్నది? ఎక్కడో టూరింగు హాళ్ళల్లో కూడా తిరిగి తిరిగి మాసికలు పడిపోయిన రీళ్లతో ఒకసి డి చెయ్యను మన ముఖాన పడెయ్యను. పేరేమో డి వి డి చూస్తె నాణ్యం అదే చెత్త రకం. డి వి డి లో ఉండే పిక్చరుక్వాలిటీ మన తెలుగు ప్రేక్షకులకి అస్సలు తెలియదు. తెలియనివ్వలేదు ఈ నిర్మాతలు. అదే వి సి డి ని డి.వి.దిలో కాపీ చేసేసి ఎక్కువ రేటుకు డబ్బు చేసుకోవటమే కాని, డివిడి క్వాలిటీ సినిమాని ఇద్దామన్న ఇంగితం వీళ్ళకు ఏది ??

చివరకు ఆణిముత్యాలైన మాయా బజార్, కన్యాశుల్కం, దొంగ రాముడు మొదలుగాగల సినిమాలు కూడా ఎటువంటినాణ్యంలో దొరుకుతున్నాయి?? పరమ నీచమైన స్థితిలో అమ్ముతున్నారు. ఎన్ని కట్లో, ఎన్ని ఉరుములు మెరుపులో, ఈ సీన్ ఉంటుందొ లేదో అని ప్రాణాలు ఉగ్గపట్టుకు చూడాల్సిందే. మనం అనుకున్న పాట సవ్యంగా చూడలేము, ప్రతి పది ఫిల్ములకి నాలుగేసి ఫిల్ములు కోత, అర్ధాంతరంగా పాట అయిపోవటం, రాయి వేసినట్టుగా మరొక సీన్ రావటం. ఎంతటినిరాశ.

పైగా ఇటువంటి నాణ్యత లేని సి డి ల ధరలు ఆకాశాన్ని అంటేట్టుగా ఉండేవి. ఇటువంటి పరిస్థితులలో పైరసీ రాకఏమవ్వుతుంది ?? అసలు సరుకులో నాణ్యం లేకపోగా, ఇష్టమొచ్చిన ధరలు పెడితే, నకలునే కొంటాం, అది చౌక కదా. ఇటువంటి తప్పులన్నీ వాళ్ళ దగ్గిర పెట్టుకుని నిరాహార దీక్షలు చేసి నిమ్మ రసం తాగినంత మాత్రాన సమస్యలు తీరవు. ఈ సినిమా వాళ్ళు మనం ఇచ్చే డబ్బులకు సరిపోయే నాణ్యమైన (కట్లు గట్రా లేని) సి డి అమ్మే వరకు ఈ పైరసీ కొనసాగితీరుతుంది. కొనసాగాలి కూడా. నిర్మాతలు, వాళ్ళదగ్గర రైట్లు కొనుక్కునే వాళ్ళు వినియోగదారునికి, నాణ్యమైన సరుకుఇవ్వాలి అన్ని ఒక నిబధ్ధతతో వ్యాపారం చేసుకున్న చేసిన రోజున మాత్రమే ఈ పైరసీ బెడద తప్పుతుంది. పైరసీని అరికట్టటానికి ఒక్కటే మార్గం "నాణ్యత" తీసే సినిమాలలో నాణ్యం, వాటిని ప్రజలకు అమ్మే సి డి , డి వి డిల్లో నాణ్యం.

ఇంతకు ముందు ఇదే విషయం మీద వ్రాసిన వ్యాసం ఈ లింకులో చూడవచ్చు.
ఏమీ దురవస్థ

ఏది ఏమైనా నిరాహార దీక్షలు చాలా రొటీను అయిపోయినాయి. నిమ్మరసం అంతకన్నా చౌక అయిపోయింది. అందుకనే, ఇప్పటికైనా ఈ సినీలోకం, వాళ్ళ వ్యాపార సలహాదార్లు, ఈ చౌకబారు నిమ్మ రసం మాయలో పడకుండా, వాళ్ళు చెయ్యవలసిన పనులు నిబధ్ధతో చేసి వినియోగదార్ల గౌరవాన్ని సంపాయించుకుంటే పైరసీ నెమ్మదిగా తగ్గుతుంది.


అబ్రకదబ్ర బహిరంగ లేఖ ఈ కింది లింకు నొక్కి చదువవచ్చు

అబ్రకదబ్ర గారి బహిరంగ లేఖ

లేఖ వ్రాసినది బ్లాగరు అబ్రకదబ్ర కాదని రామూ గారు (ఆంధ్ర ప్రదేశ్ మీడియా కబుర్లు బ్లాగ్) ఇప్పుడే వివరణఇచ్చారు:

సార్...
బ్లాగర్ అబ్రకదబ్రకు నా కోసం లేఖ రాసిన అబ్రకదబ్రకు ఎలాంటి సంబంధం లేదు. అబ్రకదబ్ర అనే మనిషి టీ.వీ.లుసినిమాలలో చాలా మంది పెద్దమనుషులతో సంబంధం ఉన్న ఒక జర్నలిస్టు. ఆయనకు కాస్త ఆవేశం ఎక్కువేగానీ...నాకు మంచి ఇన్ పుట్ ఇస్తుంటారు.
రాము

లేఖలోని విషయాలు మాత్రం చాలా
చక్కగా చెప్పారు, సామాన్య మానవుడి ఆలోచనలు ప్రతిబింబించినాయి


11 కామెంట్‌లు:

  1. శివప్రసాద్ గారూ,
    బహిరంగ లేఖ రాసిన అబ్రకదబ్ర బ్లాగర్ అబ్రకదబ్ర కాదనుకుంటాను. ఆయన రాము గారి సోర్స్ అబ్రకదబ్ర! ఈ ఇద్దరూ ఒకరు కాదని ఇంతకు ముందు రాము గారు తన బ్లాగులో ఒక చోట స్పష్టం చేశారు చూడండి.

    పోతే, ఈ మల్టిప్లెక్స్ లలో సినిమాల వల్ల సామాన్య జనాలు పడుతున్న ఇబ్బందుల్ని బాగా వివరించారు మీరు. మొన్నీమధ్య మాయాబజార్ సినిమాకి వెళ్ళినపుడు మా పాప చేతిలో చిన్న కాండీ ఉంటే అది,వాటర్ బాటిల్ లాక్కుని మరీ లోపలికి పంపారు. లేదంటే ఇంటికి వెళ్ళేటపుడు (ఎగ్జిట్ వేరేవైపు నుంచి ఉంటుంది. అక్కడినుంచి మళ్ళీ ఈ ఎంట్రన్స్ కి రావడానికి చాలా సమయం పడుతుంది)వచ్చి కలెక్ట్ చేసుకోమన్నారు.

    పైరసీ సీడీలు చూసే జనాల మీద ఎగిరిపడే సినిమా వాళ్ళు పైరసీ కి తాము కూడా ఒక కారణమేనని ఇక గుర్తించక తప్పదు.

    రిప్లయితొలగించండి
  2. కొత్త సినిమాల DVDలతోనూ ఈ సమస్య వుంది. గోదావరి సినిమా DVD అనుకుంటా aspect ration మార్చి (16:9 నుంచి 4:3కి)ఆ విషయం DVD coverమీద వ్రాయకుండా అమ్ముతున్నారు. అది మంచి పద్దతి కాదు - technical details పూర్తిగా ఇవ్వాలి. పైగా aspect ratioని ఆలా మార్చినపుడు కుడి ఎడమ ప్రక్కలలో వీడియో cut అవుతుంది. ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు లేరండి.

    రిప్లయితొలగించండి
  3. విజయ్ మీరు చెప్పిన విషయం మన డి వి డి ప్రేక్షకులలో ఎంతమందికి తెలుసు. అమ్మేవాడు అలాగో నిరక్షరాశ్యుడు. వ్యాఖ్యకు అభినందనలు

    రిప్లయితొలగించండి
  4. సుజాతగారూ . నేనుకూడ అబ్రకదబ్ర పేరును రామూ గారి బ్లాగులో రహస్య గూధచారిగానే చూశాను కాని ఈ లేఖ బ్లాగరు అబ్రకదబ్ర వ్రాశారని భావించాను. రామూగారి బ్లాగులో ఇదే విషయం మీద వివరణ కోరుతూ కామెంటు ఉంచాను. వారి దగ్గరనుంది జవాబు వచ్చినప్రకారం మార్పు చేస్తాను.

    ఇక సినిమా హాళ్ళ గురించి ఒక ప్రత్యేక వ్యాసమే వ్రాయాలి. ఇదివరకు సినిమాకి వెడితే ఎంత ఆరాముగా ఆనందించేవాళ్ళం. రోజుకు మూడు ఆటలే. ఫిల్ము డివిజన్ వారి డాక్యుమెంటరీ, వార్తలు చూసినాక సినిమా మొదలు. ఇప్పుడు ఫిల్ము డివిజను ఉందో లేదో తెలియదు. అటు శుభం పడటమేమిటి, రెండు నిమిషాల్లో మళ్ళి సినిమా టైటిలుతో మరో సినిమానో అదే దరిద్రమో మొదలు. అంతా హడావిడి, అల్లరి. హాలు కు వెళ్ళి సామాన్య ప్రేక్షకుడు ఆనందించే రోజులు కావు ఇవ్వి.

    రిప్లయితొలగించండి
  5. Siva gaaru,
    The letter in my blog (apmediakaburlu.blgospot.com) has been written by my source called Abrakadabra. He is not the blogger you were referring to. My Abrakadabra is a very senior respected journalist.
    thanks
    Ramu

    రిప్లయితొలగించండి
  6. సుజాతగారూ, ఇద్దరు "అబ్రకదబ్ర" ల తికమక సరిచేశాను. తెలియపర్చినందుకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  7. Thank you Ramu garu for the clarification. I rectified the blog content suitably.

    రిప్లయితొలగించండి
  8. ప్రసాద్ గారూ, సినెమా రంగం గురించి ఒకటీ అరా పోస్టులు చాలవండీ. ఒక సీరియల్ గా రాయాల్సిందే. థియేటర్, సిడిలు, డివిడిలు, సినిమాల్లో ఉపయోగించే తెలుగు భాష, నటీనటుల ఉచ్చారణ దోషాలు, చవకబారు హాస్యం, అర్ధం పర్ధం లేని కధలు, అసలు సినెమా నాణ్యత గురించి ఇలా రాస్తూ పొతే ఖచ్చితంగా ఓ మూడు నెలలపాటు వేరే టాపిక్ అవసరం ఉండదు. పైరసీ డివిడి నాణ్యత బాగోక పోయినా వెచ్చించింది తక్కువ మొత్తం కాబట్టి పెద్దగా బాధపడం. వందలు వందలు పోసి ఒరిజినల్ సిడిలు కొంటె వాటి నాణ్యత బాగోనినాడు ఇంకెంత బాధపడాలి. అయినా అసలు ఈరోజుల్లో థియేటర్ కి వెళ్లి చూడగలిగిన సినిమాలు వేళ్ళపై లెక్ఖపెట్టచ్చు. అలాంటి చెత్త సినిమాల కోసం థియేటర్ల కి వెళ్లి మీరు పైన ఉదాహరించిన అన్ని బాధలు పడి, అటు డబ్బు దండగ పెట్టుకుని, ఇంటికెలళుతూ బోనస్ గా తలనొప్పిని తీసుకెళ్లడం కన్నా ఈ పైరసీలే నయం. చక్కగా ఓ ముప్పై రూపాయలు పెట్టి మూడు నాలుగు సినిమాలు తెచ్చుకుని, మనకి నచ్చని సీన్లు, పాటలు దాటిన్చేస్తూ హాయిగా ఇంట్లో చేసుకున్న ఫలహారాలు ఆరగిస్తూ... ఎంజాయ్ చేసేయడమే.

    రిప్లయితొలగించండి
  9. శివగారు వ్రాసిన "నిమ్మరసం ఎందుకు" చదివాను, హాస్యంతో మేళవించి సామాన్యుల దైన్య స్తితిని చూపించే చార్లీ చాప్లిన్ సినిమాలాగుంది. నిజమే మరి, సగటు సినిమా ప్రేక్షకులు పడే బాధ మనసిక క్షోభ తదితరాలు పట్టించుకోకుండా తమ వ్యాపారం తమ ఆయుష్షు అన్నట్లుగా ప్రవర్తిస్తున్న సినిమావారికి దీనిలొని వ్యంగమైన నిజం అందుతుందో లేదో మరి!!

    ఇప్పటికే ఫాన్స్ అంటే జీతం బత్తెం లేని ఉద్యోగులకు [అదేనండి అభిమాన సంఘాలు] అభిమానసంఘాల పేరుతొ చిన్నప్పటినుంచే మానసిక బానిసత్వం అలవాటు చెస్తూ కుర్రాళ్ళ జీవితాలని నాశనం చేయటమేకాక వారిని విభజించి కొట్టుకు చచ్చేటట్లు చేస్తున్నరు.

    నకిలి నకిలి అని తెగ పైరసి భాధపడే ఈ సినిమా ప్రముఖులకి సమాజంలొ సామన్యులు నకిలీ నోట్లు, నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, నకిలీ పాలు, నకిలీ తిండి పదార్ధాలు ఇలా ఒకటేమిటి ......... ఎన్నో నకిలిలతొ సతమతం అవుతూ ఉంటుంటే; వారికేదొ పనీ పాటా లేనట్లు తమ పనే ప్రజల తక్షణ కర్తవ్యం అన్నట్లు వీరు మీడీయా తమచేతుల్లొ ఉందికదా అని స్వార్ధపూరితంగా ప్రకటనలు గుప్పిచేస్తున్నారు.

    అంతే కాకుండా సంపాదనే పరమావధిగా ప్రమాదకరమైన ప్రకటనలలొ కనపడి "దీనికి నేను గ్యారంటీ, దానికి నేను గ్యారంటీ" అని పోటీపడి నటించి మరీ, వీళ్ళు తమను గుడ్డిగా నమ్మే సామన్యులను ఆరోగ్య, ఆర్ధిక కష్టాలలొకి నెడుతున్నారు.

    ఏదొ ఎప్పుడో తుఫానుకో, వరదలకో గోరంత సహాయం చేసి కొండంత ప్రచారం చేసుకొనే వీరికి సమజం పట్ల ఎంత భాధ్యత ఉన్నది? వీళ్ళ సినీ పరిశ్రమలొనే ఆర్ధికంగ దెబ్బతిని దిక్కులేనివాళ్ళు అవుతుంటే పట్టించుకోని ఈ కార్పొరేట్ సినీ పెద్దలకి "ఏదొ ఇది" ఉన్నదని ఆశించటం మనది దురాశేమో!!!!

    రాధాక్రిష్ణ,
    విజయవాడ.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.