ఏ భాషలోనైనా సరే కార్టూనులు (వ్యంగ్య చిత్రాలు) వేయటంలో రెండు రకాలు. మొదటిది మనకు మనలోఉన్న బలహీనతలను హాస్య ప్రధానంగా చూపిస్తూ, నవ్విస్తూనే ఒక చిన్న మొట్టికాయ వేసేవి. ఇక రెండో పక్క "రాజకీయ కార్టూన్లు". రాజకీయ కార్టూనులు, నాయకమన్యుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టటమే కాకుండా వాళ్ళు చేసే, చేయబోయే అన్యాయాలను ఎద్దేవా చేస్తూ ఎదిరిస్తాయి, ప్రజాభిప్రాయాన్ని కూడగడతాయి.
మొదటి తరగతి కార్టూనులు, అదే వృత్తిగా పెట్టుకుని ఎవరూ పెద్దగా వేయరు, వేసి ఆ వచ్చే ఆదాయంతో బతకనూ లేరు, కనీసం భారతదేశం లో ఆ అవకాశం తక్కువే. అందుకనే, ఏదో ఉద్యోగమో, వృత్తో చేసుకుంటూ మామూలు కార్టూనులు వేసేవారే ఎక్కువ.
రాజకీయ కార్టూనులు వేస్తూ, ప్రముఖ వార్తా పత్రికలలో పనిచేస్తూ, అదే వృత్తిగా ఎంచుకుని, స్వతంత్రంగా, నిర్భీతిగా పని చేసిన వ్యంగ్య చిత్రకారులు అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అందులో అబూ అబ్రహం ముఖ్యులు. ప్రస్తుతం ఈ విధంగా స్వతంత్రంగా ఉన్న కర్టోనిస్టులు ఉన్నారా? అని అడిగితే వెనువెంటనే జవాబివ్వగల స్థితిలో లేము మనం!
మొదటి తరగతి కార్టూనులు, అదే వృత్తిగా పెట్టుకుని ఎవరూ పెద్దగా వేయరు, వేసి ఆ వచ్చే ఆదాయంతో బతకనూ లేరు, కనీసం భారతదేశం లో ఆ అవకాశం తక్కువే. అందుకనే, ఏదో ఉద్యోగమో, వృత్తో చేసుకుంటూ మామూలు కార్టూనులు వేసేవారే ఎక్కువ.
రాజకీయ కార్టూనులు వేస్తూ, ప్రముఖ వార్తా పత్రికలలో పనిచేస్తూ, అదే వృత్తిగా ఎంచుకుని, స్వతంత్రంగా, నిర్భీతిగా పని చేసిన వ్యంగ్య చిత్రకారులు అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అందులో అబూ అబ్రహం ముఖ్యులు. ప్రస్తుతం ఈ విధంగా స్వతంత్రంగా ఉన్న కర్టోనిస్టులు ఉన్నారా? అని అడిగితే వెనువెంటనే జవాబివ్వగల స్థితిలో లేము మనం!
అట్టుపురతు మాథ్యూ అబ్రహం ఆయన పూర్తి పేరు.
జన్మస్థలం కేరళలోని తిరువళ్ళ. తల్లి తండ్రులు ఈ ఎం మాథ్యూ, కాంతమ్మ ఆయన జూన్ నెల 11 వ తారీకున 1924 సంవత్సరంలో జన్మించారు
చాలా తక్కువమంది ఆర్టిస్టులు తమ (Self Portrait) తామే వేసుకునే సాహసానికి ఓడికడతారు. అందులో అబూ గారు ఒకరు. అతి తక్కువమంది చిత్రకారులు తమ బొమ్మ తామే వేసుకోవటం వల్ల ఇది సాహసమని అనవలసి వచ్చింది.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని తన మూడవ ఏట నుండే బొమ్మలు గీయటం మొదలు పెట్టారు. చదువుకునేరోజులలో తమ గురువుల బొమ్మలు కూడా వేసే వారట. ఒకసారి బొమ్మ బ్లాక్ బోర్డు మీద వేయటం జరిగింది కాని వేసింది ఎవరో తెలియక పోవటం వల్ల బతికిపోయాను అని నవ్వుతూ చెబుతారు . ప్రాధమిక విద్యాభ్యాసం తరువాత, ఆయన యూనివర్సిటీ నుండి 1945 వ సంవత్సరం లో సైన్సు పట్టా పుచ్చుకున్నారు. కాలేజీలో చదువు కునే రోజులలో మంచి టెన్నిస్ ఆటగానిగా పేరు తెచ్చుకోవటమేకాక తమ యూనివర్సిటీ తరఫున కూడా ఆడారట. డెబ్భైవ పడిలో పడిన తరువాత కూడా అప్పుడప్పుడు టెన్నీసు ఆడుతూ ఉండేవారు. మంచి ఆటగాళ్ళు ఆడుతున్న మాచ్ లను తప్పకుండా చూసే వారట.
ఉద్యోగ జీవితం:
ఇరవై ఏళ్ళు నిండీ నిండక ముందే ఉద్యోగం చూసుకోవటానికి బయలుదేరారు. బాబే క్రానికల్ అనే పత్రికలో రిపోర్టరుగాచేరారు . అదొక్కటే ఉద్యోగం తాను దరఖాస్తు చేసుకున్నదని, ఆ తరువాత వచ్చిన ఉద్యోగాలన్నీ కూడా తనను పిలిచి ఇచ్చినవే అని గర్వంగా చెపుతారు. వార్తా పత్రికలో చెరక ముందు, ప్రతిరోజూ, రిపోర్టర్లను వార్తా సేకరణకు వేరు వేరుప్రదేశాలకు పంపుతారన్న భ్రమలో ఉన్నారు అబూ. రిపోర్టరు జీవితం ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో ఉద్యోగంలో చేరిన తరువాత తెలిసింది. వార్త జరిగే ప్రదేశాన్ని ఎవ్వరూ గుర్తించి తనను పంపరని, వార్తలను తనే పసిగట్టి వెళ్లి తేవాలని ఆయన మొదటి ఆరు నెలల అప్రెంటీసు జీవితంలో తెలుసుకోగలిగారు
రాజకీయ వ్యంగ్య చిత్రకారునిగా: అలా రిపోర్టరుగా పని చేస్తూనే అప్పుడప్పుడూ కార్టూన్లు వేస్తూ ఉండే వారట. ఈయన వేసిన కార్టూన్లను చూసి, అప్పటి కార్టూన్ వారపత్రిక శంకర్స్ వీక్లీ అధినేత, ప్రముఖ కార్టూనిస్టు శంకర్ పిళ్ళై గారు అబూకు ఉత్తరం వ్రాసి, తన పత్రికలో చేరమని ఆహ్వానం పంపారు. 1951 లో డిల్లీ వెళ్లి శంకర్స్ వీక్లీలో చేరిపోయి పూర్తి స్థాయి వ్యంగ్య చిత్రకారుడు ఐపోయ్యారు మన అబూ అబ్రహం గారు. శంకర్స్ వీక్లీ భారత దేశంలో అప్పటికి,ఇప్పటికి ఏకైక రాజకీయ వ్యంగ్యచిత్ర వారపత్రిక. 1975 లో ఇందిరాగాంధీ ప్రకటించిన ఆత్యయిక పరిస్థితి, ఆ వెనువెంటనే ప్రవేశ పెట్టబడిన వార్తా పత్రికల సెన్సారింగుకు నిరసనగా శంకర్ పిళ్ళై గారు ఆ పత్రిక మూసివేసిన తరువాత మళ్ళి అటువంటి పత్రిక మనకు లేకపోవటం పెద్ద లోటు. అటువంటి రాజకీయంగా ఎంతో చురుకుగా కార్టూన్లు వేసే పత్రికలోకి చేరిన అబూ మధ్య పెజీలలో తన వ్యంగ్య చిత్రాలను వేసి పాఠకులను అలరించటం మన పత్రికా చరిత్రలో ఒక భాగం.
తాను వ్యంగ్య చిత్రకారునిగా మారిన విధాన్ని ఆయన మాటలలోనే, "చెప్పాలంటే, కార్టూనింగు నాకు స్వాభావికంగా వచ్చింది, నేను నా మూడేళ్ళ వయస్సునుండి బొమ్మలు వేస్తున్నాను. అందుకనే కార్టూన్లు వేయటం నాకు అప్రయత్నంగా వచ్చేది. వ్రాయటం అంటె కొంత ప్రయత్నం చేయాలి, చదవాలి, ఆలోచించాలి". ఈ మాటలను ఆంగ్లంలో ఆయన గొంతులోనే వినండి:
అబూ చిత్ర లక్షణం: అబూ చిత్రాలు చక్కగా ఒద్దికగా ఉంటాయి . గీత, బొమ్మ వెయ్యటానికే గాని పాఠకునికి అర్థంకాకుండాచెయ్యటానికి కాదు అని నిర్దిష్టంగా తెలిసిన చక్కటి కార్టూనిస్టు అబూ. గీత మొదలుపెడితే బొమ్మపూర్తయ్యేవరకు ఆగనట్టుగా ఉంటాయి ఆయన బొమ్మలు. ఒక్కటే సన్నని గీత, బొమ్మను పూర్తి చేస్తుంది. ఆయన బొమ్మలలో అనవసరకు "చెక్కడం" ఉండదు . ఒక కార్టూనులో ఒక పాత్రను ప్రవేశపెట్టి, ఆ పాత్రబొమ్మను అదేవిధంగా దశాబ్దాలపాటు వేయగల శక్తి ఉన్న అతి కొద్దిమంది కార్టూనిస్టులలో అబూ ఒకరు. సంభాషణలు, వ్యాఖ్యలు చాలా క్లుప్తంగా, తేటతెల్లంగా ఉంటాయి. ఒక్కోసారి నిశ్శబ్దంతోనే గట్టిగా తన నిరసనను నలుదిశలా మోగించగల దిట్ట అబూ. ఆయన కార్టూన్లలో ఉండే సంభాషణలు వ్యాఖ్యలలో ఉండే హాస్యం వ్యంగ్య ప్రధానమైనది. అందుకనే, ఆయనను వ్యంగ్య బ్రహ్మ అనవచ్చు.
విదేశాలలో:
శంకర్స్ వీక్లీలో తనకు దొరికిన పనితో మంచి పేరు సంపాయించినా, ఏదో ఒక మూసలో పడి బతుకుతున్న భావనకు గురై తన దగ్గర ఉన్న డబ్బులతో (భారత్ నుండి బ్రిటన్ కు ఓడలో వెళ్ళటానికి 20 రోజుల ప్రయాణం, రోజుకు నాలుగు సార్లు మంచి భోజనంతో కలిపి అప్పట్లో Rs.650 చార్జ్ చేసేవారట ఓడ కంపెనీ వారు). 1956 లోఇంగ్లాండు చేరారు. తన దగ్గర ఉన్న డబ్బులు మూడు నెలలు వస్తాయని అంచనా తలకిందులు అవటంతో అక్కడక్కడా కార్టూన్లు వెయ్యటం, ఏమన్నా వ్రాయటంచేస్తున్న రోజులలో, అక్కడి ప్రముఖ పత్రిక అబ్జర్వర్ ఎడిటర్ అబూ వేస్తున్న కార్టూన్లలో ఉన్న సున్నిత వ్యంగ్యం నచ్చి తన పత్రికలో పూర్తి కాలపు రాజకీయ వ్యంగ్య చిత్రకారునిగా చేర్చుకున్నారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రముఖ పత్రికకు అబూనే మొట్టమొదటి రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు. తన చిత్రాలను ఏ పేరుతొ వేయాలి అన్న విషయం మీద ఒక చర్చ జరిగిందిట. అప్పట్లో అబూ తన బొమ్మలకు "అబ్రహం" అన్న సంతకం చేసేవారు. ఇది చూసి, ఈయన మధ్య యూరోపు చెందిన యూదు(Jew) అనుకున్నాడట అబ్జర్వర్ సంపాదకుడు. అప్పట్లో ఇజ్రాయిల్ దేశం, సూయజ్ కాలువ విషయంలో గొడవలలో ఉన్నది. అందుకని "అబ్రహం" అని వ్రాస్తే పాఠకులు యూదు చేత కార్టూన్లు వేయిస్తున్నారని అపోహ పడతారని, ఈయనను "అబూ" అన్న పేరుతొ కార్టూన్లను వేయమన్నారు. ఆ విధంగా రాజకీయ వ్యంగ్య చిత్రకారునిగా "అబూ" పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది పదిసంవత్సరాలు అక్కడే పనిచేసారు అబూ అబ్రహం.
కుటుంబ జీవనం:
ఆయన వివాహం తమిళనాడుకి చెందిన సరోజినిగారితో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఐష మరియు జానకి. కొంతకాలానికి విడాకులు తీసుకున్నారుట. తరువాత ఇంగ్లాండుకు చెందిన సైకి ని వివాహమాడారు.కుడిపక్క ఫొటోలో వారి కుమార్తెలను చూడవచ్చు. ఎడమ పక్క ఫొటోలో ఆయన రెండవ భార్య సైకి. వారి భార్య శ్రీమతి సైకి అబూ అబ్రహం గారి గురించి ఏమన్నారో ఆవిడ మాటలలోనే విందాము
భారత్ కు తిరిగి రాక: సామాన్యంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెతలలో చూస్తుంటాం. కాని అబూ అబ్రహం బయటి దేశాలలోమంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని భారత్ కు తిరిగిరావటం జరిగింది. 1969లో భారత్ కు తిరిగి వచ్చి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో చేరారు. 1981 వరకు అక్కడే పని చేశారు. రాజకీయ వ్యంగ్య చిత్రకారునిగా అబూ విశ్వరూపం, ఆయన ఇండియన్ ఎక్సుప్రెస్సులో చేరినతరువాత భారత పాఠకులకు అవగతమయ్యింది. రోజుకొక కార్టూన్ "Private View" అన్న శీర్షికతో వేసేవారు. అందులో ఇద్దరే వ్యక్తులు, ఒక పొడుగాటాయన, ఒక పొట్టి మనిషి. ఇద్దరూ చూడగానే రాజకీయ నాయకులని తెలుస్తుంది. ఆర్కే లక్ష్మణ్ గారి సామాన్య మానవుడు (Common Man) ఎంత ప్రాముఖ్యత సంపాయించాడో, ఈ ఇద్దరూ కూడా ఆరోజులలో అంతే ప్రఖ్యాతి గాంచారు.అదే కార్టూన్ల పరంపరలో, మనదేశంలో అనవసరపు ఆత్యయికస్థితి 1975 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధి ప్రకటించినప్పుడు, ఆ వెనువెంటనే పత్రికాస్వాతంత్రాన్ని రద్దు చేసి ప్రెస్ సెన్సార్షిప్ ప్రవేశ పెట్టారు. ఆ వార్తను తనదైన శైలిలో తన పాత్రలైన రాజకీయనాయకులిద్దరూ చేతితో నోరు గట్టిగా మూసుకున్నట్టుగా వేసి అద్భుతమైన నిరసన తెలియచేశారు అబూ. వాళ్ళు నోళ్ళు మోసుకోవటమే కాదు, వారి ముఖాల్లో కనపడే కవళికల్లో, పది పుటలు విషయం వ్రాసినా సరిపోని భావాన్ని వ్యక్తపరిచారు.
పత్రికా రంగంలో పని చేసే వారు కొంతమంది, ఎమర్జెన్సీ రోజులలో వంగమంటే, నేలన పడి పాకారని ఒక అపప్రధ ఉన్నది. అటువంటి చెడ్డపేరు, అబూ అబ్రహంకు గాని ఆయన పని చేసిన ఇండియన్ ఎక్సుప్రేస్సుకు గాని రాలేదు. ఆయన ధైర్యంగా ఉండి తన కార్టూన్లను తాను వేస్తూ, సెన్సార్ అధికారులకు అందకుండా, చాలా తెలివిగా కార్టూన్లు గీసి నెగ్గుకువచ్చారు. ధైర్యం, నిబద్ధత ఉంటే ఎంతటి నియంత అయినా ఏమీ చెయ్యలేదని నిరూపించారు . సెన్సార్షిప్ మీద ఆయనఅన్న మాటలు, "నాకెమీ వ్యక్తిగతంగా హాని జరుగలేదు. ఎమర్జెన్సీ మొదట్లో సెన్సార్షిప్ ప్రవేశపెట్టబడింది. నా పని నేనుమామూలుగానే చేసుకుపోయాను. రెండు నెలలతరువాత, ముందుగా సెన్సార్ చెయ్యటం మాని, పత్రికా విలేఖరులకు, రాజకీయ కార్టూనిస్టులకు కొన్ని మార్గదర్శక సూత్రాలను ఇచ్చారు. దానివల్ల ఏమీ సమస్యలు రాలేదు. నెను మటుకు నా పని ఏమీ జరగనట్టే చేసుకుపోయాను. నాకేమి జరుగలేదు చూశారుగా. .....". ఈ మాటలను కూడఆయన గొంతులోనే వినండి:
అటువంటి పత్రికలూ, సంపాదకులూ, కార్టూనిస్టులు ఏరీ ఈనాడు, పార్టీ బాకా పత్రికలలో పనిచేస్తూ ఆ బాకాలు ఊదటానికి సిద్ధపడుతూ, ఎమర్జెన్సీలో ఏదో ఒక భయం వల్ల కొంతమంది అతిగా ఒక పార్టీకి లొంగి వారికి చెంచాలుగా పనిచేస్తే, ఈ రోజున డబ్బు సంపాదనే పరమావధిగా అందుకు తెగబడుతున్నారు. పైకి పత్రికా స్వేచ్చ అని గంభీర ఉపన్యాసాలు ఇస్తూ ఏదో ఒక పార్టీ పల్లకీ మోస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుత మీడియా దుస్థితి.
పత్రికా స్వేచ్చగాని , వ్యక్తిగత స్వేచ్చ కాని మనం కాపాడుకుంటేనే నిలుస్తుంది. థామస్ జఫర్సన్ చెప్పినట్టుగా, మనం ప్రజాస్వామ్యాన్ని సంపాయించుకున్నాం, కాని మనం నిలబెట్టుకున్నన్నాళ్ళు మాత్రమె అది ఉంటుంది.
మరణం: ఎంతో మందిని తన భావ యుక్తమైన కార్టూన్లతో కదిలించిన, ఈ ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు, 2002 సంవత్సరం డిసెంబరు 1 వ తేదీ మరణించారు. మనకు ఇటువంటి సున్నిత మనస్కుడైన కార్టూనిస్టు మళ్ళి దొరకటం చాలా కష్టం.
అబూ వ్యంగ్య చిత్రమాలిక
అమెరికావారు మన నుండి విద్యావంతులను దిగుమతి చేసుకుని, మన సరుకుల దగ్గరకు వచ్చెప్పటికి చూపే ద్వంద్వ నీతి
అబ్రహం వేసిన కార్టూన్లలో సెన్సార్ అయ్యిన కార్టూన్లలో కొన్ని. ఎమర్జెన్సీ ఎత్తేసినాక "GAMES OF EMERGENCY" పేరుతొ సెన్సారింగు వల్ల ప్రచురణ చేయనివ్వని కార్టూన్లు అన్ని ఒక పుస్తకంగా ప్రచురించారు. పైన ఉన్న కార్టూన్లు సెన్సార్ అయినవి. పక్కనే అధికారిక ముద్రలు ఉండి అనుమతి నిరాకరిం చినట్టు క్రాస్ చేసారు చూడండి
ఆయన అభిప్రాయాలు :
కార్టూనిస్టుకు ఉండవలసిన లక్షణాలు:
నిర్భయంగా ఉండటం. అవును. , మీరు అనుకున్న భావాలు, వ్యక్తీకరించటం లో, అదొక మంచి లక్షణం.
సంపాదకునో, పేపరు యజమానినో లేక మరింకెవరినో సంతోషపెట్టే ప్రయత్నంలో మీకు నచ్చని విషయాల మీద కార్టూన్లు గీస్తే అదే పిరికితనం. సామాన్యంగా కార్టూనిస్టు ఒక పేపరు నుండి మరొక పేపరుకు వలస వెళ్లినప్పుడు, ఇలాంటిది జరిగే ఆవకాశం ఉన్నది. మీకోసం మీరు నిజాయితీగా ఉన్నప్పుడే, స్వేచ్చా వాయువులను పీల్చగలుగుతారు. కార్టూనిస్టులు కొద్దిమందే ఉంటారు, అదే వారి ప్రేత్యేకత . ఏ పేపరైనా తమకున్న కార్టూనిస్టును వెళ్లగొట్టే స్థితి లో ఉండదు. కాని మీరు భయపడటం మొదలు పెడితే రిస్కు తీసుకోలేరు.
కార్టూనిస్టు-జర్నలిస్టు మధ్య ఉన్న పోలిక లేదా తేడా:
తరచి చూస్తె కార్తూనిస్తుకు స్వతంత్రం ఎక్కువ. కొంచెం అతి చేసి కూడ తప్పించుకోగలడు. స్వేచ్చ లేనినాడు కారూనిస్టు తన పనికి న్యాయం చెయ్యలేడు . స్వేచ్చ లేని కారూనిస్టు చెత్తే గీస్తాడు , కార్టూనిస్టు అన్నవాడు ఆలోచించాలి, సంఘటనలకు స్పందించాలి, ఆకలి కావచ్చు, బీదరికం కావచ్చు, అవినీతి, కట్నాలు తీసుకోవటం, సతీ సహగమనం. ఉదాహరణకి కార్టూనిస్టు వరకట్న వ్యవస్థ సరైనదే అనుకుంటే, అది దురాచారమని కార్టూను వెయ్యలేడుకదా. కొంతలో కొంత కార్టూనిస్టు మార్పు గురించే అలోచించాలి, ఒకవేళ ఇప్పుడు ఉన్న పరిస్థితే బాగున్నది అనుకుంటే, ఇక కార్టూన్లు వేసి లాభమేమున్నది?
కార్టూనిస్టు నిస్ఫక్ష పాతం గా ఉండగలడా/ఉండాలా ?
కార్టూన్లలో నిస్పక్షపాతమేమిటి? నేను ఏనాడు నిస్పక్షపాతంగా కార్టూన్లు వేయలేదు, ఎప్పుడూ కూడ ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చాను........."
పర్యావరణ పరిరక్షణ
ఈ ప్రభుత్వేతర సంస్థలు (N G Os) లకు విదేశాల నుండి చాలా డబ్బు అందుతూ ఉంటుంది. నాకు వాళ్ళ కార్యకలాపాల గురించి పెద్ద అనుమానమే ఉన్నది. వీళ్ళు లండన్ నుండో, ఫ్రాన్సు నుంచో ఈ "పర్యావరణం...పర్యావరణం..." అని గోలేడుతూ ఇక్కడకు వస్తారు. నేనొకసారి లండను నుండి వచ్చిన వ్యక్తిని వేల్లనాడ్(Vellanad) తీసుకు వెళ్లాను. దారిలో, అతనికి కర్మాన (Karmana) డ్యాం చూపి, ఇక్కడ నుంచే మాకు నీళ్ళు వచ్చేది అని చెప్పాను. అతను వెంటనే, "మీరు ఇది మంచిదే అనుకుంటున్నారా" అని అడిగేశాడు. వీళ్ళతో మనం వాదించలేము. వాళ్లకి మనం ఆభివృద్ది చెందటం ఇష్టం ఉండదు. వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని ఒకే గ్రామం గా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. కాని, అక్కడ తెల్లవాడే పెత్తందారుగా ఉండాలి, మన గోధుమ రంగు, నల్ల వాళ్ళు మాత్రం కూలీలుగా, రైతులుగా మిగిలిపోవాలి. అణుశక్తి అన్ని తెల్ల దేశాలకు మంచే చేస్తున్నదట, మనకు మాత్రం కాదట!! ఇదో కొత్త వలసవాదం
కృతజ్ఞతలు
ప్రముఖ కార్టూనిస్టు శ్రీ శంకు గారు భారత దేశంలోని అద్భుత వ్యంగ్య చిత్రకారుల గురించి దూరదర్శన్ కొరకు కొన్ని డాక్యుమెంటరీలను తీసారు. ప్రముఖ కార్టూనిస్టుల గురించి వ్యాస పరంపర వ్రాస్తున్న నా ఆసక్తి గమనించి తాను తీసిన డాక్యుమెంటరీల డివిడిలను పంపారు. ఈ వ్యాసంలోని బొమ్మలు, కార్టూన్లూ,వారు పంపిన డి వి డి లోనివి .
శ్రీ శంకు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు
అబూ అభిప్రాయాలు రీడిఫ్ ఆన్ ది నెట్ నుండి తెలుగులోకి తర్జుమా చేయబడినవి
ఆయనతో ఇంటర్వ్యూ ఈ కింది లింకు నొక్కి చదువవచ్చు
thank u very much sir,I got a nice article on my Fav cartoonist.hope there is no objection If im sharing :)
రిప్లయితొలగించండిOK Go ahead and share it with your friends.
రిప్లయితొలగించండి