25, మే 2010, మంగళవారం

వినబడే గొంతులు కనబడిన వేళ

అదొక అద్భుత కార్యక్రమం. ఒక అనూహ్యమైన అనుభవం. ఇన్ని రోజులూ వారి వారి గొంతులు వినటమే కాని, వారి పేర్లు వినటమే కాని చూసే అవకాశం రాలేదు. మొన్న ఆదివారం అంటే 23 మే 2010 హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమం నభూతో నభవిష్యతి. కాని నభవిష్యతి అన్నమాటకు చిన్న సవరణ. కార్యక్రమ స్పూర్తితో ఇంకా అన్ని ఆకాశవాణి కేంద్రాలలోనూ ఇటువంటి కార్యక్రమాలు జరగాలని ఆకాంక్ష. దశాబ్దాలుగా ఆకాశవాణిలో మనకు వినబడుతున్న లబ్దప్రతిష్టులైన ఎంతోమంది కళాకారులు అందరూ ఒకే చోట దర్శనం. అంతేకాదు, వారందరికీ సన్మానం, అవార్డుల ప్రదానం.

అక్కడే అలనాటి కళాకారుల ఫోటో ప్రదర్సన ఏర్పరిచారు. ప్రదర్సన నుంచి కొన్ని ఫొటోలతో ఒక స్లైడు షో తయారు చేశాను. చూసి ఆనందించండి.
మొత్తం కార్యక్రమానికి హై లైటు రేడియో కళాకారుల జీవిత వివరాలను తెలిపే ఒక చక్కటి పుస్తక ఆవిష్కరణ. అంతకంటే, వారి వారి గొంతులతో (ఆకాశవాణి ఆర్ఖైవ్స్ నుండి తీసుకున్న) ఒక సి.డి ఆవిష్కరణ. కాకపొతే ఆ పుస్తకం కాని, సి.డి కాని అక్కడే అమ్మకానికి ఉండి ఉంటే ఎంతో బాగుండేది.

ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించే అదృష్టం కలిగింది. కార్యక్రమాని కంతకూ అన్నిటా తానె అయ్యి మొదటి నుండి చివరివరకూ నిర్వహించిన శ్రీ మురళీ కృష్ణగారు ధన్యులు. వారికి రేడియో అభిమానులందరి తరఫునా ధన్యవాదాలు.

ఇంకా అనేకమైన అపురూప చిత్రాలు
మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ శ్రీమతి జోళిమాళియం మంగమ్మ
ఆకాశవాణి మొట్టమొదటి న్యూస్ రీడర్ శ్రీ కపిల సీతాపతి

పిల్ల కార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ

మధ్యలో ఉన్నవారు ప్రముఖ రేడియో నటి శ్రీమతి నాగరత్నమ్మ. అటు ఇటు ఉన్నవారు ఎవరో తెలియదు. వారూ రేడియో కళాకారులే అయ్యి ఉంటారు. వి.బి కనక దుర్గ మరియు వింజమూరి లక్ష్మి అని నా ఊహ. తెలిసినవారు ఎవరైనా తెలియచేయగలరు
(నా ఊహ నిజమయ్యింది. అమెరికా నుండి శ్రీ ఎం వి ఎల్ ప్రసాదు గారు తెలియచేసారు, నాగరత్నం గారి కి ఎడమ పక్కన ఉన్నావిడ వింజమూరి లక్ష్మి గారు )
అప్పట్లో సినీ కళాకారులు రేడియో నాటకాల్లో పాల్గొనే వారు. పై ఫోటోలో ప్రముఖ సినీ నటి శ్రీమతి ఋష్యేంద్రమణి ని చూడవచ్చు. ఫోటోలో ఉన్నది కన్నాంబ అని వ్రాసారు కాని అది తప్పు.
రేడియో కళాకారులు, సినీ కళాకారుల మేలు కలయిక. గోవిందరాజుల సుబ్బారావు (కూచున్నవారిలో మధ్య) ఆయనకు ఎడమ పక్క రేడియో భానుమతి, వెనుక వరుసలో ఎస్వీ రంగారావు. అందరి పేర్లూ తెలిస్తే ఎంత బాగుండునో కదా
ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వార్తలుచదివిన అలనాటి తెలుగు న్యూస్ రీడర్లు. వారిలో సినీ నటుడు జగ్గయ్యను కూడ చూడవచ్చు. కాని కుడిపక్కన చివరగా ఉన్నవారి పేరు తెలియదు.

***

వినబడే గొంతులు కనబడే వేళ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రభ వారు కింది విధంగా పాఠకులకు వివరించారు


అక్షర భిక్ష పెట్టిన ప్రథమ ప్రసార మాధ్యమం 'ఆకాశవాణి' 'వాచస్పతి' పురస్కార ప్రదానోత్సవ సభలో వక్తల ప్రశంస

కెఎన్‌ఎన్‌ బ్యూరో - Mon, 24 May 2010,

(ఆంధ్రప్రభ ప్రతినిధి)

హైదరాబాద్‌, మే 23: ఆనాటి సమాజానికి, ప్రజానీకానికి దేశంలో ఏఏ చోట ఏ సంఘటన జరిగిందో తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్న ఏకైక సమాచార వ్యవస్థ ఆకాశవాణి అని, ఆ ప్రసారమాధ్యమం ఎందరికో అవార్డులు, రివార్డులు స్వీకరించడానికి మాతృమూర్తిలా దోహదపడిందని వక్తలన్నారు. ఆల్‌ ఇండియా రేడియో వజ్రోత్సవం, ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం ఏర్పాటై 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాలను పురస్కరించుకుని ఆదివారం రవీంద్రభారతిలో అంబటిపూడి మురళీకృష్ణ (అనౌన్సర్‌) సారధిగా ఉన్న ''వాచస్పతి ఆర్ట్‌ అకాడమీ'' ఆధ్వర్యంలో ''వినబడే గొంతులు కనబడే వేళ'' శీర్షికతో నిర్వహించిన కార్యక్రమం అతిథులతోపాటు ఈ విలక్షణ సంబరాన్ని తిలకించిన రేడియో అభిమానులను పులకింపచేసింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక సౌరభాన్ని వెదజల్లే విధంగా తీర్చిదిద్దిన ఈ వేదికపై పలువురు నృత్య కళాకారులు విఘ్నవినాయకుడు మొదలుకొని అనేక దేవతా మూర్తులను స్తుతిస్తూ ప్రదర్శించిన స్వాగత నృత్యంతో ఈ ''వాచస్పతి'' పురస్కార ప్రదానోత్సవ సభ ప్రారంభమైంది. తొలుత వాచస్పతి సంస్థ ''లోగో''ను ''కళాతపస్వి'' కె.విశ్వనాథ్‌ ఆవిష్కరించారు. సంస్థ రూపొందించిన ''స్వరచిత్రాలు'' సీడీని సభాధ్యక్షులు డాక్టర్‌ కె.వి.రమణాచారి ఆవిష్కరించి తొలి ప్రతిని ప్రసార భారతి మార్కెటింగ్‌ విభాగం సంచాలకులు శైలజాసుమన్‌కు అందజేశారు.

ఆకాశవాణి అనౌన్సర్లు, న్యూస్‌రీడర్లు, డ్రామా వాయిస్‌ స్టాఫ్‌ ఆర్టిస్టుల సంక్షిప్త జీవన రేఖలపై (130 మంది ఆకాశవాణి సిబ్బంది) రూపొందించిన ''వాచస్పతి'' విశిష్ట సంచికను ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసార భారతి బోర్డ్‌ గౌరవ సభ్యుడు వెంపటి శివకుమార్‌ ఆవిష్కరించి తొలి ప్రతిని డ్రామా విభాగం ప్రముఖులు శారదా శ్రీనివాసన్‌కు అందించారు. అనంతరం ఆకాశవాణి సేవలో తరించిన అపూర్వ కళాకారులకు నిర్వాహక సంస్థ పక్షాన ''వాచస్పతి'' పురస్కారాలను అతిథులు ప్రదానం చేశారు. మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్‌, సాంస్కృతిక మండలి అధ్యక్షుడు ఆర్‌.వి.రమణమూర్తి, కె.విశ్వనాథ్‌లు తమ ప్రసంగాలలో గత 7 దశాబ్దాలుగా ఆకాశవాణి ప్రజల్లో మమేకమైన వైనాన్ని వివరించారు. రేడియోతో నాలుగు దశాబ్దాలుగా తమకున్న అనుబంధాన్ని రమణాచారి, వి.ఎస్‌.రమాదేవి గుర్తు చేసుకున్నారు. ఈ సంస్థలో పని చేసిన వారి గళమాధుర్యం అజరామరమని, వారందించిన సేవలను గుర్తించి వారిని ప్రముఖులచే సత్కరింపచేయడం ద్వారా ''వాచస్పతి'' సంస్థ గొప్ప సాంప్రదాయానికి తెరతీసిందని రమణాచారి అన్నారు. ప్రసార భారతి బోర్డు సభ్యుడు శివకుమార్‌ తన ప్రసంగాన్ని పద్య, గద్య శైలిలో కొనసాగించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్నారు. అలనాడు ఆకాశవాణిలో బాలమురళీకృష్ణ లాంటి ప్రముఖులు గానం చేసిన లలిత గీతాలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

రేడియా అనౌన్సర్లను కూడా ''నంది'' పురస్కారాల పరిధిలోనికి తీసుకురావాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. సభాస్థలిలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌, అంతకు ముందు ఆకాశవాణి ఉద్యోగులు నిర్వహించిన కళాకారుల ఊరేగింపు కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

'వాచస్పతి' సన్మాన గ్రహీతలు వీరే...

ఈ సందర్భంగా అతిథుల కరకమలములమీదుగా 19 మంది పూర్వ ఆకాశవాణి ఉద్యోగులను సత్కరించింది. మల్లాది నరసింహశాస్త్రి, రతన్‌ప్రసాద్‌, నిర్మలావసంత్‌, కోకా సంజీవరావు, ఇందిరాదేవి, ఉమాపతి బాలాంజనేయ శర్మ, మట్టపల్లి రావు, ఇలియాస్‌, జ్యోత్న్స (దంపతులు), ఇందిరా బెనర్జీ, డి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులు, మల్లాది సూరిబాబు, రాజగోపాల్‌, ఆకెళ్ళ సీతాదేవి, ఎస్‌.బి. శ్రీరామమూర్తి, డి.వెంకట్రామయ్య, ఏడిద గోపాల్‌రావు, వల్లీనాయక్‌, లలితలు ''వాచస్పతి'' పురస్కారాన్ని అందుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. సభానంతరం శనివారం దివంగతులైన సినీగేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి మృతికి సంతాప సూచికంగా అతిథులు, సదశ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.


ఈ వార్తా సేకరణ శ్రీ మాగంటి వంశీ గారు. వారికి ధన్యవాదములు. ఆకాశవాణి కళాకారుల ఫోటోలను వారి వెబ్సైటులో కూడ ఉంచారు.






18 కామెంట్‌లు:

  1. ఈ రేడియో కళాకారుల పురస్కార కార్యక్రమం మిస్సయ్యాను. మీ స్లైడ్ షోలో కళాకారులందరి ఫొటోలు చూస్తుంటే.. అలనాటి ప్రోగ్రాములూ, వార్తలూ తలపుకొచ్చాయి.
    పుస్తకం, సీడీ అమ్మకానికి పెట్టివుంటే ఎంతోమంది అభిమానులు వాటిని కొనుగోలు చేసివుండేవారు. దీని గురించి నిర్వాహకులు ఎందుకు ఆలోచించలేదో!

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు వేణూగారూ. ఆ పుస్తకం, సి డి గురించి ఎందరినో అడిగాను. కాని ఎవరికీ సరిగ్గా తెలియదు. సుధామ గారికి ఇప్పుడే ఒక మైలు ఇచ్చాను. వారు తెలియచేస్తే ఆ చిరునామా నుండి తెప్పించుకోవచ్చు. లేదా వాచస్పతి సాంస్కృతిక సంస్థ ఎ మైలు సంపాయించి వారిని సంప్రదించాలి. ఏమైనా ఈ పుస్తకం, సిడిలు అక్కడే అమ్మకానికి పెట్టకఫోవటం రేడియో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

    రిప్లయితొలగించండి
  3. శివ గారూ !
    అరుదైన రేడియో కళాకారుల చిత్రాలను అందించిన మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. శివ గారూ !
    అరుదైన రేడియో కళాకారుల చిత్రాలను అందించారు......ఇలా ప్రతీసారీ అరుదైన విషయాలు చెబుతున్నారు. మీకు నా ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  5. SR Rao , KottapaaLi and Dharaniroy Chowdari, I Thank all of you for coming to my blog and leaving your good comments

    రిప్లయితొలగించండి
  6. నాగరత్నమ్మగారి ఫొటో చూడ్డం ఎంతో బావుంది. బామ్మ పాత్రలకు(గణపతిలో గణపతి తల్లి గా వేసినావిడ)పెట్టింది పేరు శ్రీమతి సీతారత్నమ్మ గారెలా ఉంటారో అన్నది ఈనాటికీ తెలీదు.అరుదైన ఫోటోలు కూడా సంపాదించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు!

    రిప్లయితొలగించండి
  7. రేడియో అభిమానులకు అపురూపమైన వ్యాసమిది. అభినందనలు. ఈ సందర్భంలో వెలువరించిన పుస్తకం, సి.డి.వివరాలు తెలుపగలరు.
    -cbrao
    Mountain View, CA.

    రిప్లయితొలగించండి
  8. శివప్రసాద్ గారూ,నా పై వ్యాఖ్యకు ముందు నేను ఇంకో వ్యాఖ్య రాశాను. అది మీకు వచ్చినట్లు లేదు. మీ టపా చదివాక కన్నీళ్ళొక్కటే తక్కువ నాకు! మనం ఈదే ఒక చెంచాడు భవసాగరాలు (ముఖ్యంగా స్త్రీలు)మనకు ప్రియమైన వాటిని కోల్పోయేలా ఎలా చేస్తాయో చూడండి.అందుకు ఉదాహరణ నేనే!

    ప్రతి ఉదయం లేస్తూనే రామం మెత్తని స్వరంతో ప్రారంభించే భక్తి రంజనితో రోజులు మొదలయ్యేవి ఒకప్పుడు. విజయవాడ రేడియో అనౌన్సర్లు పెద్ద సెలబ్రిటీలు మా ఇంట్లొ! మా అక్కయ్య వాళ్ళు కాలేజీ డే కి కోకా సంజీవ రావు గార్ని ముఖ్య అతిథిగా పిలిచారంటే చూడండి! పేరి కామేశ్వర్రావు గారు,డీయెస్సార్,మల్లాది సూరిబాబు,కమలకుమారి,మాడుగుల రామకృష్ణ గార్లు హాట్ ఫేవరెట్స్ మాకు!

    "ఆకాశ్శవాణి"అంటూ శ అక్షరాన్ని మాత్రమే వత్తి పలుకుతూ వార్తలు చదివే కందుకూరి సూర్యనారాయణ గారు హైదరాబాదు వచ్చారని తెలిసీ కలుసుకోలేకపోవడం నాకే ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ఆయనతో పాటు అద్దంకి మన్నార్ గారు,మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి గారు కూడా వార్తలు భలేగా చదివే వారు.ఒక్క తప్పుగానీ,తడబాటు గానీ,పొరపాటు గానీ ఉండేది కాదు.

    నండూరి సుబ్బారావు, వీబీ కనకదుర్గ గార్ల లఘునాటికలు టపాసుల్లా పేలేవి!

    మీరు అదృష్టవంతులు!వారిలో కొందరినైనా చూడగలిగారు.
    మొత్తానికి వరసాగ్గా అద్భుతాల గురించి రాసి నన్ను మరింత ఉడికిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  9. మంచి ప్రోగ్రాంకి వెళ్లి వచ్చారు చాలా సంతోషం. నేను ఎప్పుడూ రేడియో వినడమే కానీ పేర్లు గుర్తు ఉంచుకోలేదు. ఇప్పుడు వీరందరి ఫోటోలు చూడడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది.

    రిప్లయితొలగించండి
  10. మీ బ్లాగు...అద్భుతం
    మీ ఫోటోలలో నాగరత్నం గారి ఎడమ పక్కన ఉన్న ఆవిడే వింజమూరి లక్ష్మి గారు...నాకు చిన్నప్పుడు బాగా తెలుసు ఆవిడ..మా ఇంట్లో పేరంటానికి వస్తూ ఉండేవారు.

    Prasad MVL

    రిప్లయితొలగించండి
  11. First of all Thank you Prasad garoo for confirming my guess that Smt. Vimjamuri Lakshmi was in the photo with Smt. Nagaratnamma.

    Thank you Sujata garu, CB Rao garu and Swarnamallika for your comments.

    Sujata garoo! Most probably in the book that was published about which I mentioned, all the details may be available.

    It is my intention to write about all the well known Radio Artists of yester years in my blog. I am in the process of collecting the details.

    రిప్లయితొలగించండి
  12. సుజాతగారూ. మీరు చెప్పే "ఇంతకు ముందు వ్యాఖ్య" నేను చూడలేదు. నచ్చటం నచ్చకపోవటంతో పనిలేదు, అన్ని కామెంట్లు నేను ప్రచురిస్తాను. కొన్ని సార్లు స్పాం కామెంట్లు వస్తుంటాయి. అవి నివారించటానికే కొంత కంట్రోలు ఉంచి నా అనుమతితోనే వ్యాఖ్యలు ప్రచురితమయ్యేట్టుగా కంఫిగర్ చేశాను. మీరు ఇంతకు ముందు వ్రాసిన వ్యాఖ్య ఏమిటో మళ్ళి వ్రాయండి.

    రిప్లయితొలగించండి
  13. శివ గారూ,
    మా వ్యాఖ్యను మీరు సరిగ్గా చదీవినట్లు లేదు! "నా కామెంట్ మీకు "వచ్చినట్టు లేదు" అన్నాను. "Didn't u receive my comment?" అన్నానన్నమాట! ఇదే వ్యాఖ్య ఇంతకు ముందు కూడా రాశాను విజయవాడ రేడియో తో నా అనుబంధం గురించి! బ్లాగర్ లో సమస్య వల్ల మీకు అది రాలేదేమో అని మళ్ళీ రాశాను.

    స్వర్ణమల్లిక గారూ, వింజమూరి లక్ష్మి గారు మీ ఇంటికొస్తూ ఉండేవారా? చాలా ఈర్ష్యగా ఉంది సుమా!

    రిప్లయితొలగించండి
  14. Sivaramaprasad garu:
    చాలామంచి టపా. అరుదైన ఫొటోలు అందించినందుకు ధన్యవాదాలు...
    -సౌమ్య

    రిప్లయితొలగించండి
  15. సుజాత గారూ, ఒ కే ఇప్పుడు నాకు అర్ధమయ్యింది. ఏమిటా మీరు ఇట్లా అంటున్నారు అనుకున్నాను. సరే కంప్యూటర్లో "న" కు "వ" కు తేడా చాలా తక్కువగా ఉన్నది. తరువాత. వింజమూరి లక్ష్మిగారు, స్వర్ణమల్లిక గారింటికి కాదు వచ్చేది , ఎం వి ఎల్ ప్రసాద్ గారింటికి. ప్రసాద్ గారు నాకు మంచి స్నేహితులు, అమెరికాలో డల్లస్ లో ఉంటారు. ఆయన నేను ప్రచురించిన బొమ్మలను చూసి అందులో వింజమూరి లక్ష్మిగారిని గుర్తుపట్టి, తన చిన్ననాటి జ్ఞాపకం గుర్తుకు వచ్చి, నాకు మైలు చేశారు. అది నేను కామెంటుగా బ్లాగులో ఉంచాను.

    రిప్లయితొలగించండి
  16. రేడియో అనగానే నా చిన్నతనం గుర్తొచ్చింది. ఉదయం నిద్ర లేవడంతో, సాయంత్రం పడుకునే ముందు, సమయం చిక్కినప్పుడల్లా (విజయవాడ,ఆకాశవాణి) రేడియో వినడం ఒక అలవాటుగా,దినచర్యగా ఉండేది.ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి హాజరైన మీరు అదృష్టవంతులు. ఈ టపాలో పాత రేడియో కళాకారులకు సంబందించిన చిత్రపటాలు, సమాచారము అందించినందుకుగాను కృతఙ్ఞతలు. ఇప్పటి కాలంలో రేడియో కన్నా టీవీ మిన్న అని నా ఉద్దేశం.

    దయచేసి, ఆ పుస్తకం మరియు సిడి వివరాలు తెలుపగలరు !

    రిప్లయితొలగించండి
  17. @తెలుగు పాటలు. మీ పేరు తెలియదు. రేడియో కన్నా ఈ రోజుల్లో టి.వి మెరుగు అన్నారు. అవును డి.డి 8 అయితే మెరుగు. మిగిలిన చానేళ్ళన్ని దండగమారివి. నా వ్యాసంలో వ్రాసిన పుస్తకం సి.ది వివరాలు ఇంకా తెలియలేదు. తెలిసినాక అందరితో పంచుకుంటాను.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.