22, జులై 2010, గురువారం

మా మంచి మాష్టారు

మా మాష్టారు శ్రీ భగవాన్ దాస్ (ఎడమ పక్కన) ప్రముఖ కార్టూనిస్టు శ్రీ బాబు తో
** ** ** ** ** **
మనం చదువుకునేప్పుడు అనేక మంది మాష్టార్లు మనకి చదువు చెప్పి ఉండవచ్చు. కాని వారిలో కొద్ది మందినే జీవితకాలం గుర్తు పెట్టుకుంటాము. సామాన్యంగా, ఆ చిన్న వయస్సులో మన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడిన గురువునే ఎక్కువ గుర్తుంచుకుంటాము.

అది డిసెంబరు 15 వ తారీకు 1972 సంవత్సరం (అప్పుడే మూడు దశాబ్దాల పైన గడిచి పోయింది!!! నిన్నో మొన్నో జరిగినట్టు జ్ఞాపంకం వస్తున్నది) మా నాన్నగారు మధ్యాహ్నం ఆయన నిద్రలేవంగానే "తయారుకారా! నిన్ను ఇవ్వాళ టైపు నేర్చుకోవటానికి చేరుస్తాను" అని నా గుండెల్లో రాయి పడేట్టుగా చెప్పారు. హాయిగా షిఫ్టు కాలేజీ పొద్దున్న ఏడున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు పది వరకు, ఇంటికి రావటం, లంచ్ చెయ్యటం, రెండు నుండి ఐదు వరకూ బుద్ధిగా చదువుకోవటం, ఆ తరువాత లైబ్రరీ ఆపైన బలాదూర్ తిరగటంగా హాయిగా గడిచిపోతుంటే ఇదేక్కడ గోలే అమ్మా అని చూశాను. కాని అరణ్య రోదనమే. చచ్చినట్టుగా ఓ రెండు అర ఠావు సైజు కాయితాలను గుండ్రంగా చుట్టుకుని మా నాన్న వెంట బయలుదేరాను.

మా సత్యనారాయణపురం (విజయవాడ)లో గిరి వీధి చివరగా ఉన్న మలుపులో ఉన్న స్వామీ కమర్షియల్ ఇన్సిట్యూట్ కు తీసుకు వెళ్ళారు. అందులో చేరిపించి, తన దారిన తాను వెళ్ళారు మా నాన్న. మొదటిరోజున మాష్టారు asdf ;lkj (టైపు నేర్చుకోవటంలో "అ ఆ" లాంటివి) తాను చెప్పలేదు. అప్పటికే అక్కడ నేర్చుకుంటున్న ఒకతని చేత చెప్పించారు. ఆ టైపు స్కూలులో అన్ని హాల్డా మేషిన్లె. నాకు అనిపించింది "ఏమిటీ మాష్టారు తానోచ్చి చెప్పరు?, వీడెవడో నేర్చుకుంటున్న వాడి చేత నాకు చెప్పిస్తున్నారు ??" అనుకున్నాను. కాని తరువాత తెలిసింది, చిన్నతనంలో వచ్చ్చిన జ్వర ఫలితంగా మా మాష్టారు లేచి నడవలేరని.
అప్పట్లో భగవాన్ దాస్ గారి టైపు స్కూల్ ఉన్న భవనపు ఇప్పటి ఫొటో

నాకు టైపు కొత్తేమి కాదు ఎందుకు అంటే మా ఇంట్లో రెమింగ్‌టన్ పోర్టబుల్ టైపురైటరు ఉండేది. మా నాన్నగారు దానిమీద రెండు వేళ్ళతోనే టప టపా టైపు చేస్తుంటే చూసే వాణ్ని, మార్జిన్లు, కాపిటల్ ఎలా కొట్టాలి, స్పేస్ బార్, కాయితం ఎక్కించటం వంటి విషయాలు అప్పటికే తెలుసు.

ఆరోజు సాయత్రం నేను కొట్టిన మొదటి టైపు కాయితం మాష్టారు చేతిలో పెట్టాను. ఆయన చూసి అక్కడక్కడా ఓవర్ టైపు అయిన వాటి మీద గీతలు పెట్టి. బాగా చేస్తున్నావు, కొంచెం అభ్యాసం కావాలి అని చెప్పారు.

ఇంతకూ మా టైపు మాష్టారి పేరు చెప్పలేదు కదూ. ఆయన పేరు శ్రీ క్యానం భగవాన్ దాస్. ఆయన ఆ టైపు ఇన్స్టిట్యూట్ 1965 లో మొదలు పెట్టారు.

సరే అలా తుమ్ముతూ దగ్గుతూ టైపు నేర్చుకుంటూ ఉన్నాను. అన్ని అక్షరాలూ ఆ యా వేళ్ళతో కొట్టటం వచ్చేసింది. కొన్ని కొన్ని మాటలు పుస్తకం చూసుకుని టైపు చేసేవాణ్ని . నాకు బాగా గుర్తు, ఒక రోజున Development, Station, Enough అనే మాటలలో స్పెల్లింగు తప్పులు టైపు చేసానని, మా మాష్టారు, మూడు తెల్ల కాయితాలు తన దగ్గరవి ఇచ్చి ఒక్కో కాయితం మీద ఒక్కో మాట కాయితం చివర వరకూ కొట్టించారు. ఇక ఆ తరువాత స్పెల్లింగు అందులో ఉండే సిలబల్ ఒక్క మాటలోనే ఉండే సిలబల్స్ గురించి ఒక మాటను మధ్యలో విరవాలంటే సిలబల్ ప్రకారం విరవటం వంటి మౌలికమైన విషయాలను తరువాత ఓపికగా వివరించి చెప్పారు. ఇలా మాకు ఆంగ్ల బోధించిన మాష్టార్లు కూడ ఏనాడు వివరించలేదు. ఆయన చెప్పిన విధానం చెప్పాలన్న ఆసక్తి నాకు ఎంతగానో స్పూర్తిని ఇచ్చింది. ఆంగ్ల భాషను నేర్చుకోవాలన్న ఆసక్తి ఆయనే కలిగించారు.

ఇక మాటలు కొట్టటం కూడ అయిపోయి స్పీడు పేపరు దగ్గరకు వచ్చేప్పటికి, ఆయన నన్ను టైపు లోయర్ పరీక్షకు ఫీజు కట్టించారు. అక్కడనుంచి, టైపు సెకండు పేపరు(స్టేటుమెంటులు గజిబిజి చేతి వ్రాతతో ఉండే ఉత్తరాలు) సాధన మొదలు పెట్టించారు. ఇక్కడ నుంచి మొదలయ్యింది మా మాష్టారి బోధనలో ఉండే అద్భుత శక్తి చూసే ఆవకాశం. ప్రతి ఆదివారం పొద్దున్నే ఆరున్నర ఏడు గంటలకు ప్రవైటు క్లాసు పెట్టేవారు. అందరూ టైముకు రావాలిసిందే. అ ప్రవైటు క్లాసుకు ఇచ్చే ఇంటిమేషన్ కూడ చాలా ఆకర్షణీయంగా కార్టూను వేసి మరీ తయారు చేసి నోటీసు బోర్డులో పెట్టేవారు.

అన్నట్టు మరచాను, మా మంచి మాష్టారు అప్పట్లో ప్రముఖ కార్టూనిస్టు కూడ. "భగవాన్" అన్న పేరుతొ అనేక కార్టూన్లు వేసేవారు. స్వయంగా కార్టూనిస్టు కావటంతో, మాకు చెప్పే పద్ధతిలో కూడ తన చిత్రకళా నైపుణ్యం చూపేవారు.

పైన ఉన్న ఫొటోలో ప్రముఖ కార్టూనిస్టు "బాబు" ఉన్నారు. "బాబు" మా భగవాన్ దాస్ గారు సమ వయస్కులు, మంచి స్నేహితులు. కాని "బాబు" భగవాన్ దాసు గారిని, "గురువు లాంటి స్నేహితుడని" ప్రస్తుతించారు. తాను కార్టూనిస్టు కావటానికి, పట్టుదలగా పనిచేయటానికి భగవాన్ దాసుగారి స్నేహమే కారణమని, "బాబు" ఈ మధ్య కలిసినప్పుడు కూడా అన్నారు.

ఆయన చెప్పిన ఒక ప్రాక్టికల్ జోకు మీతో పంచుకోవాలి. మా విద్యార్ధుల గుంపులో శర్మ అని ఒక కుర్రాడు ఉండేవాదు. అతనికి నాలిక బాగా బయటపెట్టి నవ్వటం అలవాటు. ఒకరోజున మాష్టారి జోకుకు అందరం నవ్వుతున్నాం. మాష్టారు శర్మ వంక చూసి, "ఏమోయ్ శర్మా! నువ్వు అలా పోస్టాఫీసులో నుంచుని నవ్వుతూ ఉండకూడదూ, జనం హాయిగా స్టాంపులు అంటించుకోవటం సులభం అవుతుంది" అని మరొక జోకు పేల్చారు. శర్మ అప్పటినుంచి కొంత సాధన చేసి, మామూలుగా నవ్వటం నేర్చుకున్నాడు.

ఈరోజున ఆంగ్లంలో కొద్దొ గొప్పో ప్రావెణ్యం, ఏ విషయాన్నైనా తెలుసుకుని నేర్చుకోవాలన్న తరగని జిజ్ఞాసా మా మాష్టారివల్లే. ఆయన నేర్పిన పాఠాలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూ మార్గదర్శకాలుగా నిలుస్తూనే ఉన్నాయి.

మాకు ఎంతో ప్రేమపాత్రుడైన మా మాష్టారు భగవాన్‌దాస్ గారు ఇప్పుడు లేరు. మంచివాళ్ళను తొందరగా తీసుకువెళ్ళిపోతాడు దేవుడు అంటారు. అలాగే ఆయన్నూ తీసికెళ్ళి "అక్కడ" అందరికీ పాఠాలు చెప్పిస్తున్నారులా ఉంది.

గురుపూర్ణిమ సందర్భంగా
భగవాన్ దాస్ గారి వద్ద చదువుకున్న పూర్వ విద్యార్ధులచే చదువబడే అదృష్టం, ఈ వ్యాసానికి పడితే, అలనాటి ఆ పూర్వ విద్యార్ధులను, వారి అనుబంధాన్ని నెమరువేసుకుంటూ జ్ఞాపకాలను పంచుకోమని విజ్ఞప్తి.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.