27, జులై 2010, మంగళవారం

వీరాభిమాని

చందమామ సంపాదకులకు తెలుగు చందమామ పాఠకుడు టార్జాన్ రాజు నమస్కరించి రాస్తున్న ఉత్తరం. ప్రస్తుతం నా వయస్సు 75 సంవత్సరాలు. 1947 సంవత్సరం జూలై-ఆగస్టు నెలలో మన చందమామ మొదటి పుస్తకం కొని చదివినాను. అప్పటినుండి ఈ రోజు వరకు 60 సంవత్సరాలకు పైగా చందమామను కొని చదువుతూనే ఉన్నాను. ప్రతి సంవత్సరం పూర్తి అయిన తర్వాత 6 + 6 పుస్తకాలు చొప్పున బైండింగ్ చేయించి. నా లైబ్రరీలో భద్రంగా ఉంచినాను. ఈ చందమామలు, నా తండ్రి, నేను, నా కుమారుడు, మనమడు, ఇప్పుడు మునిమనుమడు చదువుచున్నారు. నేను చందమామ తప్ప ఏ ఇతర మాసపత్రికలు, వారపత్రికలు చదవను.

నాకు 1947 నాటికి పదేళ్లు. స్కూలుకు పోతూ పాన్‌షాపులో చందమామ కనిపిస్తే కొన్నాను. అప్పట్లో చందమామ ధర 25 పైసలు. నా బ్యాగులో చందమామ పత్రికను చూసి కోప్పడిన నాన్న దాన్ని తీసుకుని చదివారు. ఆగస్టునుంచి స్కూలు ఫీజును ఎక్కువగా ఇచ్చిన నాన్న, మిగిలిన డబ్బుతో చందమామ కొనుక్కోమని చెప్పారు. అప్పటినుంచి ఇప్పటివరకూ మా కుటుంబంలో అందరూ చందమామ పాఠకులే.

నా వయస్సు ఇప్పుడు 75 ఏళ్లు. నా మునిమనమరాలు చందమామ కథలు చెప్పమని రోజూ సాయంకాలం పూట పోరు పెడుతుంటే అప్పటినుంచి ఇప్పటి వరకు చందమామలను బైండు చేయించి రోజూ పిల్లలకు చందమామ కథలు వినిపిస్తున్నాను.

గత కొద్ది నెలలుగా మొదటి పేజీలో బేతాళ కథను ప్రచురిస్తున్నారు. బాగాలేదు. గతంలో ఉన్నట్లుగానే చందమామను ముద్రించగలరు.

పత్రిక 74 పేజీల్లో 20 పుటలు కార్టూన్‌లు, క్రీడలు, ప్రకటనలే ఉంటున్నాయి. తగ్గించగలరు.

నా అడ్రస్
జి.టార్జాన్ రాజు.
G.Tarzan Raju
ఫ్లాట్ నెంబర్ 150, NCL North Avenue
kompalli (via)
Hakimpet
(Near Sai baba temple)
Succendrabad -500014
AP.
మొబైల్: 98483 34503

గమనిక: “నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరేదేమిటంటే, 2009 సంవత్సరం నవంబర్- డిశంబర్ నెల చందమామ పుస్తకాలు నాకు అందలేదు. ఏ కారణం చేతనో పేపర్ బాయ్ ఇవ్వలేదు. నేను హైదరాబాదులో కన్పించిన ప్రతి పుస్తకాల షాపులో అడిగినాను. లేవు అని చెప్పినారు. మీరు నా కోరికను మన్నించి పై 2 పుస్తకాలు పంపించమని కోరుతున్నాను. పోస్ట్‌మెన్‌కు డబ్బు చెల్లించి పుస్తకాలు విడిపించుకొంటాను. నమస్తే.”

టార్జాన్ రాజు
సికిందరాబాద్

వీర చంపికి వీరతాడు

శ్రీ టార్జాన్ రాజు గారు ఆరు దశాబ్దాల చందమామ పత్రిక చరిత్రలో ఒక అపరూప పాఠకులు. 1947 జూలై నెలలో స్కూలుకు పోతూ పాన్‌షాపులో చందమామ కనిపిస్తే కొనుక్కున్న ఈయన అప్పటినుంచి చందమామను చదువుతూనే ఉన్నారు. గత 63 ఏళ్లుగా చందమామ ప్రతులను ఆయన భద్రపరుస్తూనే ఉన్నారు. 2009 నవంబర్-డిసెంబర్ నెల చందమామ పుస్తకాలు హైదరాబాద్‌లో దొరకలేదని తప్పక వాటిని తనకు పంపించే ఏర్పాట్లు చేయించమని జనవరి చివరలో ఉత్తరం పంపారు. మొబైల్ నంబర్ పంపించడంతో వెంటనే ఆయనకు కాల్ చేస్తే అప్పటికే ఎలాగోలా ఆ పుస్తకాలను సేకరించుకున్నట్లు తెలిపారు.

మళ్లీ గత ఫిబ్రవరి నుంచి చందమామలు లేటుగా వస్తూండటంతో అప్పటినుంచి చందమామలు మిస్ అవుతున్నాయని. తప్పక ఈ కాపీలను పంపవలసిందని కోరుతూ ఇవ్వాళే ఆయన చెప్పారు. నెల దాటిన తర్వాత చందమామ వద్ద పాత కాపీలు అందుబాటులో ఉండని పరిస్థితుల్లో ఆయన కోరిక తీరటం కష్టమే.

కానీ ఇలాంటి అవసరాలు వస్తాయనే ఉద్దేశంతో అదనపు చందమామలను ముందుగా కొని పెట్టడం వల్ల ఆయనకు వ్యక్తిగతంగా అయినా కోరిన చందమామలను పంపించగల అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అదే సమయంలో ప్రతినెలా లేటుగా రావడం మూలాన చందమామను నిలిపివేశారని హైదరాబాద్‌ బుక్ ఏజెన్సీల వారు ఈయనకు చెప్పారనే వార్త విన్నందుకు బాధగా ఉంది.

నిన్న ఆదివారం (25-07-2010) చందమామ పత్రికపై పరిశోధన చేస్తున్న బాల సాహిత్య పరిషత్ కార్యదర్శి శ్రీ దాసరి వెంకటరమణ గారితో ఫోన్‌లో మాట్లాడుతూ ఈ చందమామ అపురూప పాఠకుడి గురించి సమాచారం తెలిపితే మహదానందపడ్డారు. 60 సంవత్సరాల చందమామలు ఆయన వద్ద ఉండటమే ఒక అపురూప విషయం అంటూ వాటిని శాశ్వతంగా భద్రపర్చటంపై చర్చించారు. ఆయనతోటే నేరుగా ఈ విషయం ప్రస్తావించవలసిందిగా కోరుతూ ఆయన గతంలో రాసిన ఉత్తరంలోని విశేషాలను చందమామ బ్లాగులో పెడుతున్నట్లు చెప్పాను.

టార్జాన్ రాజు గారు ఇంటర్నెట్, ఈ మెయిల్ వంటివాటి గురించి ఏమీ తెలియని అతి సాధారణ అరుదైన పాఠకులు కాబట్టి నేరుగా కలిసి ఆయనతో మాట్లాడితే మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తూ హైదరాబాద్‌లో ఆసక్తి ఉన్న చందమామ అభిమానులు ఆయనను సంప్రదించేందుకు గాను ఆయన చిరునామా కింది ఇస్తున్నాము.

చందమామ పరిశోధనకోసం తన వద్ద లేని ఒక పాత చందమామను హైదరాబాద్ పేవ్‌మెంట్ల మీది అంగళ్లలో ఒక సంచికను అక్షరాలా వెయ్యిరూపాయలు ఇచ్చి కొన్న వీరాభిమాని దాసరి వెంకట రమణ గారు. శ్రీ చొక్కపు వెంకటరమణ గారివంటి పరిచయస్తులు తనను ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి మరీ తమ వద్ద ఉన్న పాత చందమామలను ఇచ్చి ఉపయోగించుకోమని చెప్పిన విషయం నిన్ననే ఆయన మాట్లాడుతుంటే ఆప్రతిభుణ్ణయిపోవడం నావంతైంది.

“ఆ… చందమామ కథలేనా” అంటూ తేలిక చేసి మాట్లాడటం ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో సమీక్షకులకు, సాహిత్యకారులకు అలవాటుగా తయారయిందట. లక్షలాదిమందిని కథా మంత్ర జగత్తులో విహరింపజేసిన మహిమ, మ్యాజిక్ అలనాటి చందమామ కథల్లో ఉందని. ఈ తరానికి వేటి మీదా అభిరుచి లేకుండా పోతున్నట్లే చందమామ కథల టేస్ట్‌ను పొందే అవకాశం కూడా లేకుండా పోయిందని రమణగారు నిన్ననే బాధపడ్డారు.

శ్రీ పాలంకి వెంకట రామచంద్ర మూర్తి గారు తొలి తరం చందమామ రచయితగా పుంఖానుపుంఖాలుగా కథలు రాశారని, ఒక్కో సందర్భంలో చందమామ పత్రిక నిండా ఆయన కథలే రకరకాల మారుపేర్లతో ప్రచురించబడేవని మరెన్నో చరిత్రకు సంబంధించిన విషయాలు ధారాళంగా చెప్పుకుంటూ పోయారాయన.

వెంకట రమణ గారూ, మీకు వీలయితే సికిందరాబాద్‌లో హకీంపేట్ ప్రాంతంలో ఉన్న టార్జాన్ రాజుగారిని కలిసి లేదా ఫోన్ చేసి సంప్రదించడానికి ప్రయత్నించగలరు. మీరు చందమామ చరిత్రకు సంబంధించి ఎన్ని విషయాలు తోడుతున్నా, వ్యాసాల రూపంలో రాస్తున్నా ఇంకా చాలావరకు మీవద్ద సమాచారం మిగిలే ఉందనిపిస్తోంది.

ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు విభాగానికి చెందిన శ్రీ ఎమ్.దాసు గారు కూడా చందమామ పత్రిక పై పరిశోధన చేస్తున్నానని, కావున మీ పత్రికలో పనిచేసిన రచయితలు, వారి జీవితచరిత్రకు సంబంధించిన విషయాలు (1947-2000) దయచేసి పంపగలరని ఈ మధ్యే చందమామకు ఈమెయిల్ పంపారు. మీవద్దనుంచి అవసరమైన సహాయాన్ని ఆయనకూ అందించగలరు

Sri. DASU.M
DEPT OF TELUGU
ANDHRA UNIVERSITY
VISAKHAPATNAM
PIN-530003
CELL NO : 9989283692

NB: గత నలబై, యాభై ఏళ్లుగా చందమామలు వరుసగా చదువుతున్న అభిమానుల వివరాలు పాఠకులకు తెలిసి ఉంటే వారి వివరాలు చందమామకు పంపించగలరు.


వ్యాసం చందమామలు బ్లాగు (రాజశేఖర రాజు) నుండి పున:ప్రచురణ

1 వ్యాఖ్య:

 1. శివరాం గారూ,
  మన తెలుగు చందమామ రూపం చాలా బాగుంది. పేజీ మొత్తంలో చందమామలు, పుస్తకాల ధీమ్ మెరుస్తోంది. బ్లాగుకు గాను మీరు ఎంచుకున్న శీర్షికలు కూడా చాలా బాగున్నాయి. వీటిలో దొరికిన సమాచారాన్ని దొరికినట్లుగా పోస్ట్ చేస్తూ వస్తే చందమామ అభిమానులకు పెన్నిదే మరి. రచన పత్రికలో చక్రపాణిగారి పై వచ్చిన వ్యాసాలు, చక్రపాణి జ్ఞాపకాలు పుస్తకంలోని అపురూప వ్యాసాలు, వికీపీడియాలో మీరందరూ కలిసి రాసిన చందమామ ప్రధాన వ్యాసం, అలాగే ఈమాట, కౌముది వెబ్‌సైట్లలో రోహిణీ ప్రసాద్ గారు, వసుంధర గారు చందమామ, దాసరి సుబ్రహ్మణ్యంగారిపై రాసిన చక్కటి రచనలు కూడా వారి వారి అనుమతి తీసుకుని ఇక్కడ పోస్ట్ చేస్తే చందమామ ఆన్‌లైన్ పాఠకులకు శాశ్వత ప్రయోజనం ఉంటుందని నా అభిప్రాయం. అలాగే తెలుగులోకి అనువాదం కాకుండా ఇంగ్లీషులో చందమామ గురించి పలువురు రచయితలు రాసిన రచనలను కూడా అనుమతితో ఇక్కడ ప్రత్యేకంగా చందమామ ఇంగ్లీష్ వ్యాసాలు శీర్షిక రూపొందించి పొందుపర్చి పోస్ట్ చేయగలగితే చందమామ చరిత్ర అంతా ఇక్కడే చదవటానికి అందరికీ అవకాశం ఉంటుంది కదా. విశ్వనాధ రెడ్డి గారు చక్రపాణి గారి గురించి, చందమామ గురించి ఇంగ్లీషులో రాసిన వ్యాసం జెరాక్స్ కాపీలు నా వద్ద ఉన్నట్లున్నాయి. ఈ ప్రయోజనం రీత్యా మీకు కావాలంటే పంపుతాను.

  మీ ఆరోగ్యం చక్కబడిన తర్వాత మీరు ఈ విషయం సీరియస్‌గా ఆలోచించండి. కేవలం చందమామ బ్లాగర్ల రచనలు రీ పోస్ట్ చేయడం మాత్రమే కాకుండా చందమామపై జనరల్ వ్యాసాలు కూడా ఇక్కడే పోస్టే చేస్తే మన తెలుగు చందమామకు సమగ్రత వస్తుందని అనుకుంటున్నాను. ఇది ఓపికతో చేయవలసిన పని కాబట్టి సమయం పడుతుంది. అయినా ఫర్వాలేదు. రచన శాయిగారు 2008లో చక్రపాణి గారి శతజయంతి సందర్భంగా రచనలో ప్రచురించిన ప్రత్యేక వ్యాసాలను ప్రచురించుకోవచ్చని గతంలో అనుమతి ఇచ్చారు. మీరు కూడా ఒకసారి అడిగి చూడండి కాదనరు. చందమామపై పత్రికలు, వెబ్‌సైట్‌లలో వచ్చిన వ్యాసాలు కూడా వేయాలంటే మన తెలుగు చందమామ పరిధి విస్తృతమవుతుందనుకుంటాను.

  చందమామ అపురూప పాఠకుడు వ్యాసం పునఃప్రచురించినందుకు కృతజ్ఞతలు.
  ముందుగా మీ ఆరోగ్యం జాగ్రత్త. యాభయ్యవ పడి దాటారు కదా. శారీరక సమస్యలు తప్పవు.
  రాజు.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.