13, ఆగస్టు 2010, శుక్రవారం

ఆ .... చందమామ కథలేనా

మధ్యనే రాజశేఖర రాజుగారు తన చందమామలు బ్లాగులో ఒక చందమామ అభిమాని టార్జాన్ రాజుగారి గురించివ్రాస్తూ కొంతమంది చందమామ కథలను తీసిపారేస్తూ మాట్లాడటం గురించి ఉదాహరిస్తూ కింది విధంగా బాధపడ్డారు.

“ఆ… చందమామ కథలేనా” అంటూ తేలిక చేసి మాట్లాడటం ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో సమీక్షకులకు, సాహిత్యకారులకు అలవాటుగా తయారయిందట. లక్షలాదిమందిని కథా మంత్ర జగత్తులో విహరింపజేసిన మహిమ, మ్యాజిక్ అలనాటి చందమామ కథల్లో ఉందని. ఈ తరానికి వేటి మీదా అభిరుచి లేకుండా పోతున్నట్లే చందమామ కథల టేస్ట్‌ను పొందే అవకాశం కూడా లేకుండా పోయిందని రమణగారు నిన్ననే బాధపడ్డారు.
అలా మాట్లాడటం ఫ్యాషన్ గా భావించే వారి గురించి తగిన వ్యాఖ్య వారి బ్లాగులో ఉంచాను. కాని ఇలాంటివ్యాఖ్యలు రావటం బాధ కలిగిస్తూనే ఉన్నది. రోజున ప్రముఖ వారపత్రిక "ఆంధ్ర జ్యోతి" ప్రస్తుత రూపం నవ్య" 18 08 2010 సంచికలో "మొదటి పేజీ" శీర్షికన ఒక చక్కటి సంపాదకీయ వ్యాసం ప్రచురించారు. ఆ సంపాదకీయ వ్యాసం చూసినాక కొంత స్వాంతన పొందాను. ఆ వ్యాసంలో, ప్రస్తుతపు తరం వారు విధంగా పని వత్తిడుల వలన అబధ్రతా భావానికి లొనై అనారోగ్యంపాలవుతున్నారో, అటువంటి మానసిక పరిస్థితికి చికిత్స ఏమిటి అన్న విషయం మీద చక్కగా వ్రాశారు. వ్రాసిన కవనంలో చందమామ కథల గురించి గొప్పగా ఉదాహరించారు. సంపాదకీయాన్ని యధాతథంగా కింద ఇస్తున్నాను.

సాహసమే స్వర్గం

అబ్బాయి జీతం మూడు లక్షల రూపాయలు. హైదరాబాదులో ఉంటున్నాడు. ఇద్దరు పిల్లలు, సొంత ఇల్లు, కారు ఉన్నాయి. పిల్లలిద్దరూ ఏదో పెద్ద స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళను స్కూలుకి తీసుకు వెళ్ళడానికి, ఇంటిదగ్గర దించడానికి ఏసి బస్సొస్తుంది. వాళ్ళ ఇల్లు కూడా ఏసినే! ఆదివారాల్లో కుటుంబ సభ్యులంతా సరదాగా గడపడానికి పేరున్న కబ్బులో అబ్బాయి సభ్యుడట! ఆ క్లబ్బులో సభ్యత్వం దొరకడమే గొప్పంటున్నారు. అంత గొప్పగా ఉన్న అబ్బాయికి హఠాత్తుగా ఏమయిందో ఏమో ఆసుపత్రిలో చేరాడని తెలిసింది. కంగారు పడి ఫోన్ చేస్తే కోడలు పిల్ల పలికింది. ఇటీవల అబ్బాయికి బాగా బిపి ఎక్కువయిందట! దాంతో నాలుగయిదు రోజుల క్రితం సన్నగా గుండె నొప్పి వచ్చిందట! ఇప్పుడు తగ్గింది. బాగానే ఉంది. ప్రమాదం లేదంది.

ఐనా, అబ్బాయిని చూడాలనిపించి బయల్దేరాడు బాబాయ్. హైదరాబాద్‌కి చేరుకున్నాడు. అబ్బాయి ఆ రోజే అసుపత్రి నుంచి ఇంటికొచ్చాట్ట! లంచ్ చేసి పడుకున్నాడు! ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయినట్టున్నారు. వాళ్ళ అలికిడి లేదు. కోడలు పిల్ల కిచెన్‌లో ఉంది.

"ఏంటమ్మ! ఏంటీ హడావుడి? ఏమైంది అబ్బాయికి" అడిగాడు బాబాయ్ కిచెన్‌లోకి వచ్చి.
"ఆయన పని చేస్తున్న కంపెనీ ఎత్తేసేటట్టు ఉన్నారట. దాంతో........." అంటూ ఆగిపోయింది కోడలు పిల్ల, కళ్ళు చెమర్చుకుంది.
ఐతే" అడిగాడు బాబాయ్.
"ఐతే ఏంటి మామయ్యగారు" మూడు లక్ష జీతం, హోదా, పిల్లల చదువులు, ఇంటి మీద తీసుకున్న అప్పు, క్లబ్ మెంబర్షిప్, కారు లోన్....ఎన్ని కష్టాలు పడాలో మీకేం తెలుసు? చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది" అంది. అబ్బాయి పరిథితి అప్పుడు అర్ధం అయింది బాబాయికి అభద్రతా భావానికి గురై అబ్బాయి గుండెనొప్పి తెచ్చుకున్నాడనుకున్నాడు.

సాయంత్రం అయింది. అబ్బాయి ఇంటి ముందు లాన్‌లో కూర్చున్నాడు. "ఏంట్రా!" అంటూ అతని దగ్గరికి చేరాడు బాబాయ్. సమాధానంగా నీళ్ళు నిండిన కళ్ళతో చూశాడబ్బాయి.

"చ..చ.. కన్నేళ్ళేంటిరా అసహ్యంగా! మగాడు ఏడవకూడదు. బాగోదు" అన్నాడు బాబాయ్.
"కంపెనీ ఎత్తేస్తారు, ఎత్తనీ! ఇంకో ఉద్యోగం దొరకదా నీకు?" అడిగాడు.
"నమ్మకం లేదు! అన్నాడు అబ్బాయి. అప్పుడు అతని గొంతు ఏడుస్తున్నట్టుగా ఉంది.
"ఇదిగో! ఇదే! ఈ అభద్రతా భావమే నిన్ను అసుపత్రి పాలు చేసింది. ఇంకో ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం నీకందుకు లేదు. నువ్వు చక్కగా పనిచేస్తావు కదా! ఉద్యోగం ఎందుకు దొరకదు? పని చేయడం భద్రత, చేయకపోవడం అభద్రత. అర్ధమయిందా? ఇంకో మాట చెప్పనా అభద్రతంటే శతృత్వం. భద్రత అంటే మిత్రత్వం. అందుకే అందరితో మంచిగా ఉండాలంటారు. ఆ సంగతి అలా ఉంచితే....పిచ్చివాడా! జీవితం అంటేనే అభద్రతరా!; అనుకున్నవి జరగవు, అనుకోనివి జరుగుతాయి. అంతా ప్రమాదభరితం. ఈ సంగతి ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ, మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి. లేకపోతే చిక్కుల్లో పడతాం" అన్నాడు బాబాయ్.

"అందుకే చిన్నాప్పటి నుంచి ధైర్యాన్ని నూరిపోసే కథలు వినాలి. వినిపించాలి. ఊరకనే జానపద కథలు పుట్టుకుని రాలేదురా! చందమామ కథల వెనుక చాలా సైన్సుంది" అన్నాడు బాబాయ్. అబ్బాయి తేరుకున్నట్టు కనిపిస్తే లేచి వెళ్ళిపోయాడు. రాత్రి ఇంటికొచ్చి చూస్తే పిల్లలకి జానపద కథలు చెబుతూ కనిపించాడు అబ్బాయి. "హమ్మయ్య" అనుకున్నాడు బాబాయ్.


"చందమామ కథల వెనుక చాలా సైన్సుంది" అవును సైన్సే. ఈ సైన్సు కొడవటి కుటుంబరావు గారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఎటువంటి కథలు వేస్తె బాలలు ఉతేజితులు అవుతారో , ధైర్యం కూడగట్టుకుంటారో, మానసిక ఉల్లాసంతో బాటుగా అంతర్లీనంగా బాలల మానసిక పరిణితికి దోహదపదతాయో ఆయన చక్కగా గమనించి అటువంటి కథలనే ఎన్నుకునే వారు తమకు వచ్చిన కథలను చక్కగా చిత్రిక పట్టి, మరికొంత దర్జీ పని చేసి, సంపాదకుడు అనేవాడు చెయ్యవలసిన చక్కటి బాధ్యతను ఆయన తాను చందమామలో పనిచేసిన ఇరవై ఎనిమిది సంవత్సరాలూ నిర్వర్తించారు. కుటుంబరావుగారి సంపాదకత్వ నైపుణ్యంతో బాటుగా, ప్రముఖ చిత్రకారులు, చిత్ర,శంకర్, వపా గార్ల చిత్ర కళా కౌశలం, ఇందుకు ఎంతగానో తోడ్పడింది ఎక్కడైనా కథలో అర్ధం కాని అంశం ఉంటే ఆ అంశాన్ని ఆ అద్భుతమైన బొమ్మలు బాలలకు సులువుగా అర్ధమవటానికి దోహదపడేవి. కథలోని మాట, బొమ్మ కలిపి ఒక చక్కటి పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాస పాఠంగా కథలు తయారయ్యేవి.

అందుకనే కొడవటిగంటి వారి సంపాదకత్వంలో ఉన్నప్పుడు వెలువడిన చందమామ సంచికలు, ధారావాహికలు, కథలు అంటే అలనాటి బాలలకు (ఇప్పుడు ఎభైలు దాటి ఉంటారు) ఇప్పటికీ ఎంతో మక్కువ. అవే కథలు మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ ఆ జ్ఞాపకాలను ప్రేమగా స్పృశిస్తూ, ఆ కథల వల్ల తమకు తెలియకుండానే తమకు జరిగిన మేలు చూసుకుని ఆశ్చర్యపోతూ ఆనందిస్తున్నారు

మళ్ళి అటువంటి చక్కటి చందమామ పత్రిక మనకు అందే ఆవకాశం ఉన్నదా!









.




1 కామెంట్‌:

  1. "మళ్ళి అటువంటి చక్కటి చందమామ పత్రిక మనకు అందే ఆవకాశం ఉన్నదా!"
    తప్పకుండా ఉంది. కొత్త కథలూ, పాత కథలూ, కలిసి మంచి కథల శాతం ఎక్కువే ఉంటోంది ఇప్పటికి కూడా.
    ఈ వ్యాసం చూడగానే గుర్తుకు వచ్చిన కొత్త కథ అనుకోకుండా రోహిణీ ప్రసాద్ గారు రాసిందే అవ్వడం కాకతాళీయం కాదేమో.
    జూన్ నెల బేతాళ కథ అనుకుంటాను. మా చిన్నబ్బాయి పూర్తిగా వినడమే కాక కథలో పాల్గొని పాత్రల గురించి ఆలోచించాడు. ఇలా వాడు చేసే కథలు తక్కువ, ముఖ్యంగా చందమామ కథలు ఒక్క పేజీ మించినవి వాడు వినడమే ఎక్కువ. ఎప్పటిలా సందేహిస్తూనే మొదలు పెట్టినా, ఆ కథ చెప్తున్నప్పుడు వాడి ఆలోచనను పంచుకోగలిగినందుకు సంతోషించి చందమామకు మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుని, ఆ పత్రిక నిరవధింకంగా నిత్యనూతనంగా తన సంప్రదాయాన్ని కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను.
    మంచి చందమామ కథల మెళకువలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను.
    ఇంకో కథ ఇప్పటికి ఇలాంటి కథలు బాగా అలవాటైపోయాయి అనుకుంటున్నది అనువాదం చేస్తూ మా పెద్దబ్బాయికి proof reading కి ఇస్తే, చదివి, I like this story అని చెప్పాడు. పిల్లల మనస్తత్వం చందమామ రచయితలకి బాగానే తెలుసనిపించింది అప్పుడు.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.