29, ఆగస్టు 2010, ఆదివారం

తెలుగులో కొత్త మాటలు :: తెలుగు భాషా దినోత్సవం



తెలుగు భాషాభివృధ్ధికి, గ్రాంధికంలోనే వ్రాయలన్న కొంతమంది పిడివాదుల వాదన, ఎంతగానో చేటు చేసింది. ఈ పండిత పిడివాదుల కోరల్లోంచి తెలుగు భాషను రక్షించే ప్రక్రియ శ్రీ గిడుగు రామ్మూర్తిగారు చేబడితే, తన అద్భుత శైలితో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం గారు చేసి చూపించారు.

తన రచనా శైలి గురించి
చలంగారు తన ఆత్మ కథలో ఈ విధంగా వ్రాసుకున్నారు:

"నేను రచనలు సాగించేటప్పటికి నాకు తెలీకుండానే, నేను మాట్లాడే భాషలోనే వ్రాశాను. తక్కిన కథలని పుస్తకాల భాషలో వ్రాశాను. అసలు ఆనాడు
భాషా ఉద్యమం అనేది ఒకటి ఉందని నాకు తెలీదు. గిడుగు రామ్మూర్తి గారి పేరు చింతా దీక్షితులు (ఈయన కూడ రచయిత, చలంగారికి సహ ఉద్యోగి) గారినించే విన్నాను . వారి శిష్యులు ఆలోచించి, భాషని ఎంతవరకు మార్చవచ్చో తూచి రాసేవారు. ఆ యత్నాలు, మడి కట్టుకోటాలు చదివితేనే నాకు అసహ్యం వేసింది. భాష ఎట్లా మారాలో నాకు శాసించాలని చూసేవారు. భర్తని యెన్ని ముద్దులు పెట్టుకొవాలో శాసించినట్లు. కాని ఈ చలం ఓ వరదల్లె వూడ్చుకొచ్చాడు. నా భాషాధాటికి వారికెంత భయమో! పైగా ఆ భాష, భయంలేని, సంకోచంలేని, భీతిలేని, పాత గోడల్ని పడగొట్టే తీవ్రవాది ఓ Master Sculptor చేతిలో పడ్డది. చాలా త్వరలో వీళ్ళ కృతక భాషలన్నీ కుప్పకూలాయి. చలం శైలిలో, రాతలో అంత తీవ్రత అంత inevitability అంత భయంకరాకర్షణ ఉండిపోయింది. ఒక్కొక్కరే ప్రతిఘటించబోయి, పరాజితులై, నా భాషనే అనుకరించారు గతిలేక. ఇంకో విధంగా రాస్తే వాటిని చదవరు ఎవ్వరూ. ఈ భాష, ఈ భావాలు వీలులేదు అని ఎంతమంది మొత్తుకున్నా, ప్రజలు ఎగబడి చదువుతున్నారు. రచయితలు, పత్రికలు చలం పేరు చెప్పకుండా చలాన్ని అనుకరించటం ప్రారంభించారు. భాషాదిగ్గజాల మొకాళ్ళూగిసలాడే పాత నీతుల గోడలు విరిగి కింద కూలాయి"

ఇరవైయ్యో శతాబ్దం మొదటి రోజుల్లో, అంటే 1920లలో మొదలైన ఈ భాషోద్యమం చలంగారి రచనలతో ఊపు అందుకుని, ఎంతగానో అభివృధ్ధి చెంది,
ఈ రోజున వాడుక భాష, వ్రాత భాష అనే తేడా పెద్దగా లేకుండా చేసింది. చక్కటి శైలితో, సులువైన పదాలతో, దీర్ఘ సమాస పదాడంబరాలు, లేకుండా తెలుగు వచ్చిన అందరికీ అర్ధమయ్యే భాషలో వ్రాసే ఎందరో రచయితలు మనకు ఉన్నారు. అందులో శ్రీయుతులు కొడవటిగంటి కుటుంబరావు, పాలగుమ్మి పద్మరాజు, మధురాంతకం రాజారాం వంటి దిగ్గజాలు అనేక మంది యువతీ యువకులకు స్పూర్తి ప్రదాతలయ్యారు. ఈ రోజున ఇంతమంది రచయితలు మనకు తయారయ్యారంటే, వ్రాసే ఆసక్తిని పెంచి పెంపొందించటమే కాక, ఎవరికి వచ్చిన భాషలో వాళ్ళు వ్రాయచ్చు అని చేసి చూపించిన ఆ మొదటి తరం రచయితలకు, తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా నివాళి అందిచాల్సిందే.

ఈ మధ్య, తెలుగు భాషలో కొన్ని పదాలను కొత్తగా ఏర్పరచాలన్న కోరిక ఎక్కువైపోయి, కొన్ని చిత్ర విచిత్రమైన మాటల తయారీకి కొంతమంది ప్రయత్నిస్తున్నారని నాకు అనిపిస్తున్నది.
భాష అనేది, సామాన్య ప్రజల నోళ్ళనుండి, వారి వాడుకనుండి తయారవ్వాలి కాని, పడితులనుకునే వారు, డ్రాయింగు రూముల్లో (దీనికి తెలుగేమిటోకదా!) కూచుని తమ పాండిత్య ప్రదర్శనకోసం తయారు చేసే మాటల వల్ల కొత్త మాటలు వాడుకలోకి రావు.

మనకు కొత్తగా ప్రయాణ సాధనమైన రైలు వచ్చినప్పుదు, పండితులు "ధూమ శకటం"
అన్న పేరు కనిపెట్టారు. కాని సామాన్య ప్రజలు, హాయిగా "పొగ బండి" అని చులాగ్గా ఒక తెలుగు పేరు వాడెయ్యటం మొదలు పెట్టారు. అలాగే "హాస్పిటల్" అన్న ఆంగ్ల పదానికి, ఆసుపత్రి అన్న మాట సులువుగా ఒక తెలుగు పదమై పోయింది. మనకు ఇప్పుడు అనేక పట్టణాలలో , నగరాలలో ఫ్లై ఓవర్లు దర్శనమిస్తున్నాయి. దీనికి పండితులైతే ఏమని పేరు పెట్టేవారో తెలియదు కాని, "పై వంతెన" అన్న మాట వాడుకలోకి వస్తున్నది. తెలుగులో పుట్టని కొన్ని పదాలకి తప్పనిసరిగా ఒక తెలుగు పదం తయారు చెయ్యాలన్న తపనతో, చిత్ర విచిత్రమైన మాటలు, చివరికి ఇనుప గుగ్గిళ్ళు, కంకర్రాళ్ళ వంటి మాటలను తయారుచేసి సామాన్యులను భయపెట్టే ప్రయత్నం భాషాభివృధ్ధికి ఏమాత్రం ఉపయోగ పడదు. పైగా, మళ్ళి గ్రాంధిక భాషా వాసనలు పెల్లుబికి సామాన్య ప్రజలను భాషాభివృధ్ధిలో భాగస్వాములు కాకుండా చేసే ప్రమాదమున్నది.ఆంగ్ల భాషలో ఒక అద్భుతమైన గుణం ఉన్నది. అదేమిటి అంటే, "మాట" ఏ భాషలోనిదైనా సరే, ఆ మాటను పెద్దగా ఆంగ్లీకరించకుండా, యధాతధంగా వాడకుండా, కొద్ది మార్పు చేసి ఒక ఆంగ్ల పదం చెయ్యటం. ఈ శక్తి ఆంగ్ల భాష మాట్లాడే ప్రజలకు ఎక్కువగా ఉండటం వల్ల ఆంగ్ల భాష దాదాపుగా ప్రపంచ బాష అయ్యింది. అటువంటి శక్తిలేని లాటిన్ వంటి ప్రాచీన భాషలు కనుమరుగయ్యి, పుస్తకాలకు, పండితులకు మాత్రమే పరిమతమయ్యాయి. మనం తెలుగులో కూడ అనేకానేక మాటలను ముఖ్యంగా ఆంగ్ల, పారశీక, ఉర్దూ, హిందీ మాటలను తెలుగీకరించాము. రోడ్ అనే ఆంగ్ల పదం తెలుగులో రోడ్డు అయ్యింది. ఆ పదాన్ని, రహదారి అని ఎవ్వరూ అనడటంలేదు. చివరకు ప్రభుత్వ శాఖ ఐన Roads and Builldings రోడ్లు భవనాల శాఖగా మారింది కాని రహదారులు భవనాల శాఖ అవ్వలేదు. ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. అలాగే, బాంకు, చెక్కు, డ్రాఫ్టు, బిల్లు, పంపు, సైకిలు, ఫ్యాషను, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకానేక ఉదాహరణలు. ఇలాంటి చిన్ని చిన్ని పదాలకు, తెలుగు పదాలను కనిపెట్టే ప్రయత్నంలో, ఆ పదాల అర్ధాలను భ్రష్టు పట్టించే బదులుగా, ఉన్న చిన్న ఆంగ్ల పదానికి ఉకారమో అకారమో తగిలించి తెలుగు చెయ్యటమే మంచి పధ్ధతి. కారణం, అయా పదాలు విదేశాలలో కనిపెట్టబడిన వస్తువులు, విశేషాలకు సంబంధిచినవి. వాళ్ళు వాటికి సరిపొయ్యే పదాలను కాలక్రమేణా స్థిరపరిచారు (Bicycle, Cycle అయ్యింది, మనం తెలుగులో కూడా కొన్ని బైసికిల్ అనటం కూడ కద్దు).


కొన్ని కొన్ని పదాల తెలుగీకరణ ఎబ్బెట్టుగా ఉంటుంది. ఉదాహరణకి, ఇంటర్నెట్టునే తీసుకుందాము. ఇంటర్నెట్ అనే ఆంగ్ల పదాన్ని యధాతధంగా వాడే బదులు ఇంటర్‌నెట్టు అని మార్చి దానిని తెలుగు పదం చెయ్యటమే శ్రేష్టం. ఆంగ్లంలో నెట్ అనే పదం ఉన్నదికాబట్టి, ఆ పదానికి సామాన్య అర్ధం వల కాబట్టి, ఇంటర్ అంటే మధ్య అని తెలుసు కాబట్టి, ఇంటర్నెట్ ను అంతర్జాలం అనటం నాకు ఎందుకనో నప్పలేదు అనిపిస్తుంది. ఎక్కడైనా కంప్యూటర్ గురించి తెలిసిన ఆంగ్ల భాష అంతగా రాని వారు కూడ ఇంటర్నెట్ అంటే అర్ధమయ్యినట్టుగా ఈ అంతర్జాలం (ఏదో ఇంద్రజాలంలాగ) అటే తికమక పడే అవకాశం ఎక్కువగా ఉన్నది.భాషలోని పదాల ఉద్దేశ్యం, వాటి భావాన్ని అందరూ ఒకేలాగ అర్ధం చేసుకోవటమే కాని పదాఢంబరం చూపటం కాకూడదు. తెలుగు అకాడమీ వాళ్ళ టెక్స్ట్ పుస్తకాల్లో ఉండే భాష, తెలుగుకి ఏవిధమైన సేవ చేస్తున్నది? వృక్ష శాస్త్రం, రసాయన శాస్త్రం, జంతు శాస్త్రం మొదలుగాగల శాస్త్రాలలోని లాటిన్, గ్రీక్, ఆంగ్ల పదాలను అతి భయంకరంగా తెలుగీకరించి, విధ్యార్ధులు ఝడుసుకునేట్టుగా చేసి, వెంటనే ఆంగ్ల మాధ్యమంలోకి పారిపొయ్యేట్టుగా చేశాయి. ఫిజిక్సు, బయోలజీ, కెమిస్ట్రీ వంటి శాస్త్రాలు చదివేది, ఆ శాస్త్ర విజ్ఞానం వంటబట్టించుకోవటానికి కాని, విదేశీ భాషలను తెలుగీకరించి, వాటిని భట్టీయం వెయ్యటానికి కాదుకదా.

ఏతా వాతా చెప్పేదేమిటి అంటే, తెలుగులో కొత్త పదాల సృష్టి జరుగ వలసినదే.
కాని ఆ పేరుమీద నోరు తిరగని, హాస్యాస్పదంగా ఉండే పదాలను తయారు చెయ్యటం సబబు కాకపోవటం అటుంచి , భాషాభివృధ్ధికి ఎంతమాత్రం దోహదం చెయ్యదు అని నా అభిప్రాయం.


మరొక్కమాట. బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాసేప్పుడు, కొంతమంది, బద్ధకం వల్లనో లేక అలా వ్రాయటం గొప్పగా భావించటం వల్లనో, తెలుగును ఆంగ్ల లిపిలో వ్రాస్తుంటారు. అలా తెలుగును ఆంగ్ల లిపిలో వ్రాయటం వల్ల చదవటంలో చాలా ఇబ్బంది కలిగి, అసలు చదవటమే మానేయ్యటం జరుగుతుంది. ఏ భాషను ఆ భాష లిపిలో వ్రాస్తేనే బాగుంటుంది. ఆ విధంగా, తెలుగును వేరొక భాషా లిపిలో వ్రాసి ఖూని చెయ్యొద్దని, ఈ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా అలా వ్రాసే అలవాటుగలవారికి విజ్ఞప్తి. తెలుగులో వ్రాయటానికి కొంత శ్రధ్ధ తీసుకుని, (మనకు ఎన్నో ఉపకరణాలు లేఖిని వంటివి ఉన్నయి) కనీసం ఈరోజు నుంచి అయినా, కొద్దిగా శ్రమ తీసుకుని నేర్చుకుని, తెలుగును తెలుగు లిపిలోనే వ్రాయటం మొదలుపెడితే, తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఒక అర్ధం ఉంటుంది.తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు 
*
**
***
**
*

ఈ క్రింది అప్డేట్ ఫిబ్రవరి 22, 2014 చెయ్యబడినది. ప్రసిద్ధ రచయిత, జ్ఞానపీఠ్ బహుమతి అందుకున్న శ్రీ రావూరి భరద్వాజ గారు ఒక ఇంటర్వ్యూలో వాడుక పదాల గురించి చెప్పిన విషయం వినవచ్చు.



ఆయన చెప్పిన విషయాలు, పై వ్యాసం వ్రాసినప్పుడు "కొందరు" వ్యక్తపరిచిన అభిప్రాయాలకు, మరి కొంతమంది ("గుంపులు" బృందాలు కాదష) ఎవ్వరికీ అర్ధం కాకపోయినా, ఎవ్వరూ వాడకపోయినా, నోరు తిరిగి ఉచ్చరించే అవకాశం కష్టమైనా పర్వాలేదు,  ఎదో ఒక పదం "తెలుగు" లో వండి పడేద్దామన్న హడావిడిలో ఉన్న వారికి, కొద్దో గొప్పో వివేచన కలిగిస్తుందన్న "ఆశ/ఆరాటం" తో ఈ అప్డేట్ చెయ్యటం జరిగింది. సరే మేము జ్ఞానపీఠ్ బహుమతి గ్రహీత కన్నా గొప్పవాళ్ళం, అనుకునే వాళ్ళకు సంబంధించి కొన్ని సామెతలు ఉండనే  ఉన్నాయి-మొండివాడు రాజుకన్నా బలవంతుడు అని, తాపట్టిన కుందేటికి, మూడే కాళ్ళు, మేము పట్టిన కుందేలుకు అసలు కాళ్ళే లేవు వంటివి. వీళ్ళ కంటే మొండి వాదన వాడు,  "ఐతే డొల్లిస్తాం" అనేవాడూ తయారవుతాడు (భమిడిపాటి కామేశ్వరరావు గారి హాస్య గుళిక)


పైన ఉన్న ఇంటర్వ్యూ పూర్తిగా చూడాలంటే రెండు భాగాలుగా సుజన రంజని నెట్ పత్రికలో ఉన్నది. ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు. 



30 కామెంట్‌లు:

  1. రాష్ట్రంలో ఉగాది పర్వదినం నుంచి పూర్తి స్థాయిలో తెలుగులోనే పరిపాలన ఉంటుందని 25.2.2010న ముఖ్యమంత్రి రోశయ్య వెల్లడించారు.తెలుగు భాష అభివృద్థికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖనూ ఏర్పాటు చేస్తామన్నారు.తొందరగా అమలైతే బాగుండు.

    రిప్లయితొలగించండి
  2. రహంతుల్లాగారూ. ధన్యవాదాలు. ప్రభుత్వం చెయ్యగలిగినది ప్రబుత్వం చేస్తుంది. ప్రజలు చెయ్యగలిగినదే ఎక్కువ. తెలుగును తెలుగులో వ్రాయటం, కొత్త మాటల అభివృధ్ధి/సృష్టి వంటివి ప్రభుత్వ చెయ్యలేదు. సామాన్య ప్రజలనుండే రావాలి.

    రిప్లయితొలగించండి
  3. తప్పుగా అనుకోవద్దని మనవి. కాని మీ ఆలోచన అడుక్కుతిన్నట్లుగా ఉంది. కొత్తగా వచ్చే పదాలను ఉచ్చరించడమే కష్టమైతే ఇంకా వారికి బాష పట్ల గౌరవం ఏముంటుంది..? ఇంటర్నెట్ అనే పదాన్ని ఇంటర్నెట్టు అని వాడితే మన బాషకు ఉండే విశిష్టత ఏమిటండి ...? పక్క రాష్ట్రమైన తమిళనాడు ప్రతి ఆదునిక సామాగ్రికి ఒక పదాన్ని చేకుర్చుకుంది. కొత్త పదాలు వాడుకలోకి వచ్చే విధంగా చేతనైతే ఏమైనా చేయాలి కాని , ఆంగ్లంలో ఉన్న పదాలను కాస్త అటుఇటుగా మార్చి అదే మన "తెనుగు" బాష అని సంతోషపడడం, ఊరుకోవడం చాల బాదాకరం.

    రిప్లయితొలగించండి
  4. "...ఒక తెలుగు పదం తయారు చెయ్యాలన్న తపనతో, చిత్ర విచిత్రమైన మాటలు, చివరికి ఇనుప గుగ్గిళ్ళు, కంకర్రాళ్ళ వంటి మాటలను తయారుచేసి సామాన్యులను భయపెట్టే ప్రయత్నం భాషాభివృధ్ధికి ఏమాత్రం ఉపయోగ పడదు. పైగా, మళ్ళి గ్రాంధిక భాషా వాసనలు పెల్లుబికి సామాన్య ప్రజలను భాషాభివృధ్ధిలో భాగస్వాములు కాకుండా చేసే ప్రమాదమున్నది..."

    నా ఊదేశ్యం చాలా స్పుటంగా పైన చెప్పిన విధంగా వ్రాశాను. ఊరికే తెలుగు చెయ్యాలన్న తపనే గాని ఆ పదానికి అర్ధం ఏమిటి, సామాన్య ప్రజలకి అర్ధం అవుతుందా లేదా, వారు వాడగలరా అన్న ఇంగితం లేకుండా తయారవుతున్న "తెలుగు మాటలు" తెలుగు భాషకు ఎంతవరకూ దోహదపడుతున్నాయో ఒక్కసారి అలోచించండి. రైన్ బౌ అన్న ఆంగ్ల పదానికి మహానుభావులు ఎవరో ఒక చక్కటి తెలుగు పదం "ఇంద్ర ధనుస్సు" అని ఏర్పరిచారు. ఆ పదమే లేకపోతే, ఆంగ్ల పదాన్ని యధాతధంగా తెలుగీకరించే వికారపు అలవాటులో "రైన్ బౌ" ఏ విధంగా తెలుగీకరించేవారో!! తెలుగులో కొత్త పదాలు తేవటం అంటే, ఆంగ్ల పదాలము యధాతధ తర్జుమా కాదు. మన పధ్ధతిలో, అర్ధవంతమైన తెలుగు పదం, గ్రాంధిక వాసన లేకుండా ఒక సులువైన పదాన్ని తయారు చెయ్యాలి. కుదరని పక్షంలో ఆ అంగ్ల పదాన్నే తెలుగులో కొద్ది మార్పు చేసి తెలుగు మాటగా చెయ్యాలి. అలా చెయ్యటం వల్ల మన భాషకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. పైగా భాషలో అందరికీ ఇప్పటికే అర్ధమవుతున్న మాటలు వచ్చి చేరతాయి. ఇప్పటికే అలాంటి మాటలు కొన్ని వేలు ఉన్నాయి. అలాంటి పదాలు సామాన్య ప్రజలనుండే వస్తాయి పండితులవద్దనుంచి కాదని నే అన్న మాటలు మీకు "అడుక్కు తిన్నట్టు" ఉండటం నాకేమీ ఆశ్చర్యం కలిగించటంలేదు.

    ఒక విషయం గురించి చర్చ చేద్దాం. అంతే కాని ఒకరు చేసిన అలోచనలు ఎద్దేవా చెయ్యటం వల్ల, చర్చకు ఉపయోగం ఏమీలేదని తెలుసుకోగలరు.

    రిప్లయితొలగించండి
  5. తెలుగుపదాల సృజన పట్ల ఆసక్తి ఉన్నవారికోసం ఒక చర్చావేదిక:
    http://groups.google.com/group/telugupadam

    అనుబంధిత సైటు : http://telugupadam.org

    రిప్లయితొలగించండి
  6. తెలుగు భాషాభివృద్ధి గురించి రాసింది సహేతుకంగా ఉంది.
    ఆంగ్ల పదాలను మన కనుగుణంగా తెలుగీకరణ చేసుకోవడంలో తప్పేముంది? అలా చేసుకుంటుండబట్టే ఆంగ్లంలో ఎటేటా వేలవేల పదాలు కొత్తగా చేర్తున్నాయన్నది సత్యదూరం కాదుగదా!
    బ్రిటిష్ మనభాషకు గుర్తుపట్టలేనంతగా చేసిన మేలు/కీడు ‘పంక్చ్యుయేషన్’.
    ఖచ్చితంగా చేసిన కీడు భరతావనికి ‘ఇండియా’ అన్న నామకరణం. రాష్టాల పేర్లు, జిల్లాల పేర్లు తమ చిత్తం వచ్చినట్లుగా మార్చేస్తున్న నాయకనేతలు మన దేశం పేరును “భారత్” అని మార్చాలని ఎందుకు అనుకోరన్నది బేతాళ ప్రశ్న.
    బ్లాగుల్లోనే కాదు _ ఈమెయిల్స్‌లో కూడా తెలుగును ఇంగ్లీషు లిపిలో రాయడం చాలా మందికి అలవాటయిపోయింది. నాకు చాలా చిరాకు _ అందుకే అవి ఎంత ముఖ్యమైన సమాచారాన్నిచ్చేవైనా _ ఖచ్చితంగా చదవలేను _ చదవను. అంతగా తెలుగులో రాయడం ఇబ్బందికరంగా ఉంటే (నాకులాగా) అందరికీ అలవాటైన ఇంగ్లీషులోనే రాయొచ్చునుగదా!
    _ శాయి

    రిప్లయితొలగించండి
  7. శాయిగారూ ,

    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు మొట్టమొదటి సారిగా నా బ్లాగుకు వచ్చి వ్యాఖ్య వ్రాసినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది శాయిగారూ.

    ఏ భాషైతే కొత్త పదాలను అవసరాన్ని బట్టి ఇతర భాషల పదాలను తనలో ఇమడ్చుకోలేదో ఆ భాష అభివృద్ది జరగటం కష్టం అవుతుంది. ప్రపంచ భాషల చరిత్ర చూస్తె, అలా ఇముడ్చుకోలేని భాషలు సంస్కృతంతో సహా మృత భాషలైనాయి. సైకిలు అన్న పదానికి కొత్తగా తెలుగు పదం కనిపెట్టి ఆ పదం అర్ధం ఇది అని మళ్ళి ఆంగ్లంలో బ్రాకెట్టులో వ్రాసి జనానికి అది అలవాటుపడి చివరకు రెండు మాటలూ కాకుండా నోరు తిరగకుండా భ్రష్టుపడి ఎటిమాలజీకి అందని పదమేదో తయారు అవ్వటం కన్నా, ఆంగ్ల సైకిల్ పదాన్ని తెలుగులో సైకిలు గా మార్చటమే భేషైన పని.

    రిప్లయితొలగించండి
  8. అవును.ఎన్నో ఆంగ్ల పదాలు మన తెలుగు ప్రజల నాలుకలపై నాట్యమాడుతూ, మన పదాలే అన్నంతగా స్థిరపడిపోయాయి. ఈ పదాలను విడిచిపెట్టి మనం తెలుగులో సంభాషణ చేయలేము. చేసినా ప్రజలకు అర్ధంగాదు. ఉర్దూ, సంస్కృత పదాలెన్నింటటినో తెలుగు తనలో కలుపుకుంది. అలాగే తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీషు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది. సంస్కృత, ఉర్దూ పదాలు వేలాదిగా తెలుగులో చేరకపోయి ఉన్నట్లయితే తెలుగు భాషకీపాటి శక్తి వచ్చి ఉండేది కాదు గదా?

    రిప్లయితొలగించండి
  9. బాగా చెప్పారు రహంతుల్లాగారు. కొంతమందికి పాపం అర్ధం కాని వాళ్ళకు "అడుక్కుతిన్నట్టుగా" ఉందట. ఏమి చెస్తాం!.. అందుకనే వాళ్ళకి అలా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించలేదు అని చెప్పాను.

    రిప్లయితొలగించండి
  10. తెలుగులో చేరిన పరభాషాపదాల జాబితా ఇక్కడ చూడండిః
    తెలుగు నిఘంటువులో చేరాల్సిన ఇంగ్లీషు పదాలు
    2010http://nrahamthulla3.blogspot.com/2010/08/blog-post.html

    తెలుగు వారు పలికే ఉర్దూ పదాలు

    http://nrahamthulla3.blogspot.com/2010/08/blog-post_29.html

    రిప్లయితొలగించండి
  11. రహంతుల్లాగారూ. మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు. మీ బ్లాగులో తెలుగులో కొత్త మాటల జననం గురించి బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  12. శివగారు, నేను అలా వ్రాసి ఉండకూడదు, క్షమించండి.కాని ఎం చేస్తాం, మన రాష్ట్రంలోనే పరిస్థితి అలా ఉంది మరి. హైదరాబాదులో ఉండే వారు తెలుగు వారమని (నేను మాట్లాడేది మన ముస్లిం సహోదరుల గురించి కాదండి) చెప్పుకుంటూ ఎప్పుడు హిందీ బాషలో సంబాషించుట చాల సార్లు గమనించాను. రాజధానిలోనే పరిస్థితి ఇలా ఉంటె మన బాషకు ప్రాచుర్యం ఎక్కడ కలుగుతుందండి. పక్కనున్న తమిళనాడు సినిమా పేర్లు తమిళ్ లో పెడితే 20 % పన్ను మినహాయింపు లాంటి ఎన్నో కార్యక్రమాలతో వారి బాషకు ప్రాచుర్యం కలిగిస్తుంది. రహంతుల్ల గారు చెప్పినట్లు తెనుగు బాషకు " పరబాష సహనం " ఎక్కువ అనడం కంటే " పరబాష పీడత్వం " మరియు శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు చెప్పినట్లు " భరత ఖండం మొత్తంలో అందరికంటే తెలుగువారికి బాష పట్ల అభిమానం తక్కువ " అనడం అతిశయోక్తి కాదేమో. ఇప్పటికే ఉన్న పర బాష పదాలను ప్రక్కన పెట్టి, ఇప్పటి నుండి కొత్తగా సృష్టించబోయే తెనుగు పదాలకు ( ఆంగ్ల పదాలను అరువు తెచ్చుకొనుట కాదు ) ఏ విదంగా ప్రచారం చేయాలనీ ఆలోచిస్తే బాగుంటుంది. (ఈ రోజుల్లో మనకు ఎన్నో ప్రచార మాద్యమికాలు ఉండనే ఉన్నాయి).

    అయితే రహంతుల్ల గారి ఈ తపా http://nrahamthulla3.blogspot.com/2010/08/blog-post_29.html నాకు కొంచెం కనువిప్పు కలిగించింది. ఇది మన బాష దౌర్భాగ్యం. నాకు తమిళ్ కూడా బాగానే తెలుసు,ఆ బాష వ్యాప్తి చెండుతున్నంతగా మన బాష అవడంలేదని నాకు తెలుసు. CD మరియు DVD కూడా ఒక తమిళ్ పదం (ఆంగ్లంలో తెచ్చుకున్న అరువు కాదు ) ఉందంటే నమ్మగలరా మీరు....? పదాలు వాడుకలో ఉన్న లేకపోయినా వారి బాషకంటూ, ప్రతి ఆదునిక సామాగ్రికి ఒక పదం ఉంది, అది గొప్ప, అంతేకాని పదాలను ఆంగ్లంలో నుండి అరువు తెచ్చుకుని, వాటినే తెనుగు పదాలుగా భావించడం సభబు కాదని నా ఉద్దేశం.

    ఏది ఏమైనా ఇది పెద్ద విభేదమయిన విషయం. మీరంతా నాకన్నా పెద్దవారు. నేనయితే మీ అభిప్రాయాలతో ఎకిభవించలేను.

    రిప్లయితొలగించండి
  13. "......నాకు కొంచెం కనువిప్పు కలిగించింది. ఇది మన బాష దౌర్భాగ్యం....."
    రాజేష్. మీరు అలా అనుకుని తీవ్రంగా స్పందించి బాధపడే పనిలేదు. ఆంగ్ల భాషలో పర భాషా పదాలు తీసెయ్యానికి ప్రయత్నిస్తే, ఆ భాష మిగులుతుందా? మరి ఆ భాష ప్రపంచ భాష కాలేదా? తెలుగులో ఇప్పటికే ఉన్న సంస్కృత భాషా పదాలను మనం గుర్తు పట్టలేనంతగా తెలుగులో ఇమిడిపోయినాయి. హిందీ భాషలో ఉన్న పారశీక, అరబ్బీ, ఉర్దూ భాషా పదాలు విడివిడిగా గుర్తు పట్టటం కష్టం.

    తెలుగులో లేని ఒక పదాన్ని సృష్టించవలసినదే. కాని అలా ఒక కొత్త పదాన్ని తయారు చేసే క్రమమే అభ్యంతరకరంగా ఉండి, భాషాభివృధ్ధికి దోహదం చెయ్యకుండా, భాష నాశనం అయిపొయ్యేట్టుగా ఉంటే అటువంటి "భ్రష్ట" పదాలు అక్కర్లేదని నా అభిప్రాయం. సామాన్య ప్రజలు ఉచ్చరించలేని, అర్ధంచేసుకోలేని, పదం మనం తయారు చేస్తే ఏమి చెయ్యకపోతే ఏమి. ప్రజలకు తెలుసు తమ భాష ఎలా బాగుచేసుకోవాలో, పండితులు అనుకునేవారి కన్నా, సామాన్య ప్రజలే భాషాభివృధ్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. "పండితులు" చెత్త మాటలు తయారు చేసి అకాడమీ పుస్తకాల్లో నింపుతున్నారు, వాటి వాడకం ఎక్కడా కూడా లేదు. మరొక్కసారి చెబుతున్నాను, భాషలో పదాలు కొత్తవి పుట్టటానికి అదే భాషలోని శబ్దాలే అక్కర్లేదు. ఆ శబ్దాలు ఎక్కడనుంచైనా సరే తీసుకు వచ్చి ఒక కొత్త పదాన్ని తయారుచెయ్యవచ్చు. అలా చెయ్యలేనినాడు ఆ భాష నశిస్తుంది.

    ఆంగ్ల భాషలో "ఎటిమాలజీ" అన్న పదం ఉన్నది, మీకు తెలిసే ఉంటుంది. అనగా, ఒక పదం జన్మ, కొన్ని రోజుల తరువాత ఆ పదం ఎలా మార్పు చెందినది, ఆ పరిణామక్రమం, చివరకు ఆ పదం ఎలా తయారయ్యింది క్షుణ్ణంగా పరిశీలించే శాస్త్రం ఈ "ఎటిమాలజీ". ఈ శాస్త్రాన్ని వాడి, ఒక్కో పదాన్ని పరీక్ష చేస్తే, ఏ భాషలోనూ, వంద శాతం పదాలు ఆ భాషవి కాదనే విషయం తేట తెల్లమౌతుంది.

    మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, భాషాభివృధ్ధి, సామాన్య ప్రజల వల్లే జరుగుతుంది. మరొక మాట, భాష అన్నది సమాజంలోని వ్యక్తులు ఒకరి భావాలు మరొకరితో పంచుకోవటానికి మాత్రమే కాని, గిరి గీసుకుని, నేనింతే, ఇదే నా భాష ఇంతకంటే నేను మరే విధమైన మాటలు నా భాషలోనికి రానివ్వను, నేను తయారు చేసుకునే కంకర్రాళ్ళవంటి మాటలే మాటలు, అవ్వే వాడాలి అని భీష్మించుకు కూచోవటం కానే కాదు. అలా చేసిన నాడు, ఆ భాష మరణిస్తుంది.

    రిప్లయితొలగించండి
  14. శివగారు, మీవ్యాసం నాకు బాగా నచ్చిందండీ! తెలుగీకరణపై మీ అభిప్రాయాలతో నావి కూడా కలుస్తాయి.

    రిప్లయితొలగించండి
  15. జే బి గారూ! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు . ప్రస్తుతం తెలుగులో కొత్త మాటలు తయారు చేద్దామని తహతహలాడేవాళ్ళందరూ చేసే పనేమిటి. ఆంగ్లంలో ఒక పదం ఉంటె, దానికి తెలుగు అర్ధం వ్రాసెయ్యటానికి ప్రయత్నం చెయ్యటమే . అలా పర భాషా పదాలు యధా తధంగా అందులోనూ ఆంగ్లం వంటి versatile భాషలోనుండి అనువాదాలు చెయ్యటం హాస్యాస్పదం అవటమే కాకుండా ప్రజ్లలోకి వెళ్ళటం లేదు. అందుకు ఉదాహరణ ఇంటర్నెట్టుకు "అంతర్జాలం" మించినది లేదు. పర భాషా పదాల తర్జుమా, కొత్త పదాలను పుట్టించదు. తెలుగులో కొంత శ్రమ తీసుకుని, అలోచించి, అర్ధవంతంగా సులువుగా ఉండే పదాలను తయారు చెయ్యాలి. సామాన్యంగా, కొత్త పదాలు, పండితులనుండి పుట్టవు, మనం "పామర జనం" అనుకునే వాళ్ళ దగ్గరనుండే పుడతాయి. సామాన్య ప్రజలకు ఉందే ప్రజ్ఞా పాటవాలు, పండితులు అనుకునే వారికి ఏనాటికీ రావు. అందుకనే, ప్రస్తుత భాషా సంక్షోభం, కొత్త పదాల వెతుకులాటలో భాషను నాశనం చెయ్యటం జరుగుతున్నది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. internet ను వలగూడు అని అన వచ్చు కదా.. మళ్ళీ సంస్కృతం ఎందుకు?
      ఒపిగ్గా నేర్చుకుంటే తెలుగులో మాటలు తయారు చేసుకోవచ్చు.
      స.వెం. రమేశ్ గారి "ఎల్లలు లేని తెలుగు" పుస్తకం చూస్తే ఎన్నో విశేషాలు దొరుకుతాయి. ఉదాహరణకు మనకు కూని కూర్పు పదాలు ఉన్నాయి.. ఎన తీసుకుంటే, రెండు వంతులను కలిపేది వంతెన, దువ్వేది దువ్వెన, వీచేది వీవెన. దీనిని అన్వయించుకుంటూ mixie నూరేది కాబట్టి నూరెన, wet grinder రుబ్బేది కాబట్టి రుబ్బెన. చక్కగా వాడుకలోకి తీసుకు రావచ్చు కదా..

      తొలగించండి
    2. "వలగూడు" అని ఎందుకు. హాయిగా ఇంటర్నెట్ నే తెలుగు పదం అనుకుంటే పోలేదా. ఎందుకు అనవసరమైన అనువాద పదాల పీడ.

      తొలగించండి
    3. తెలుగులోకి ఇప్పటికే వచ్చీన సంస్కృత, పారిశీక,హిందీ, ఉర్దూ పదాలకు లేని అభ్యంతరం ఆంగ్ల పదాలకు ఎందుకు? పై చెప్పిన భాషల్లో పదాలు తెలుగులోకి వచ్చేసి అవి తెలిగు పదాలు కావంటే ఆశ్చర్య పొయ్యేంతగా కలిసిపోయ్యాయి. అలాగే తెలుగులో బ్లేడ్ కు తెలుగు ఏమి చెబుతారు. తెగ చదివిన పండితుడు తెగ ఆలోచించి ఏదో ఒక కాకర్రాయి లాంటి మాట మన మీద విసురుతాడు. బ్లేడ్ తెలుగులో బ్లేడు. అంతే, ఇది సులభమా ఒక్క ఆంగ్ల పదాలకు మాత్రం పని కట్టుకుని దిక్కుమాలిన అనువాదాలు చేసి వాడదాం అని "ఉపబలాట" పడటం సులభమా. మొదటిదే సౌలభ్యమైనది, సులభమైనది.

      తొలగించండి
  16. సెల్‌ఫోన్‌లో ఎస్సెమ్మెస్‌లు వచ్చాక.. పొడిపొడి అక్షరాలతో ఇంగ్లి ష్‌లో మెసేజ్‌లు పంపటం అందరికీ అలవాటైంది. అలాగే అన్న దానికి ఇన్నాళ్లూ వాడిన 'ఓకే' కాస్తా.. ఇప్పుడు 'కే' అయిపోయింది. టేక్ కేర్ అని చెప్పడానికి.. టీసీ అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేస్తే చాలు. ఇలా ఎస్సెమ్మెస్‌లలో వాడే సరికొత్త సంక్షిప్త పదాలు ఎన్నో.. తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన 'న్యూ ఆక్స్‌ఫర్డ్ అమెరికన్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లిష్' మూడో సంచికలో చేరాయి.

    బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ అనే అర్థానిచ్చే బీఎఫ్ఎఫ్.. అలాగే టాక్ టూ యూ లేటర్ అని చెప్పే టీటీవైఎల్ వంటి సంక్షిప్త పదాలు వీటిల్లో కొన్ని. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీ ల్లో ప్రేక్షకులను బాగా ప్రభావితం చేసిన నోటితో ఊదే వాయి ద్యం 'వువుజెలా' కూడా ఈ డిక్షనరీలోకి వచ్చి చేరింది.

    ఇంగ్లిషు భాషలో ఇప్పుడిప్పుడే వాడుకలోకి వస్తున్న.. సోషల్ నెట్‌వర్కిం గ్ (ఒకే అభిరుచి కలిగిన వాళ్లు ఓ సమూహంగా ఏర్పడటం), లిప్‌స్టిక్ లెస్బియన్ (మహిళల్లాగా దుస్తులేసుకొనే నపుంసకులు), స్టేకాషన్ (ఇంటి దగ్గరే ఉండి సెలవులను ఎంజాయ్ చే యడం) వంటి పదాలతో పాటు.. పర్యావరణానికి సంబంధించిన కార్బన్ ఆఫ్‌సెట్టింగ్, గ్రీన్ ఆడిట్, కార్బన్ క్రెడిట్ వంటి కొ త్త కొత్త పదాలను కూడా ఈ నిఘంటువులో పొందుపరిచారు.

    ప్రభుత్వ వ్యవహారాల్లో కొత్తగా దొర్లుతున్న పదాలు వాటర్‌బోర్డింగ్, ఎగ్జిట్ స్ట్రాటజీలతో పాటు సరికొత్త సాంకేతిక పదాలు క్లౌడ్ కంప్యూటింగ్, హాష్‌ట్యాగ్, ట్యాగ్ క్లౌడ్ వంటి వాటిని కూడా ఈ డిక్షనరీలో చేర్చారు. ఇలా రెండు వేలకు పైబడిన కొత్త పదాలు, పదబంధాలు, నుడికారాలు ఈ నిఘంటువులో చేరాయి.(ఆంధ్రజ్యోతి23.9.2010)
    తెలుగు ప్రజల వాడుకలో బాగా బలపడిన, ఇక ఎవరూ పెకలించలేనంతగా పాతుకుపోయిన, ఇంగ్లీషు పదాలను మన తెలుగు డిక్షనరీలో చేర్చటం వల్ల మన భాష తప్పక బలపడుతుంది.తెలుగునిఘంటువును కూడా ఇలా విస్తరించుకుంటూ పోతే మనభాషకు కొత్తశక్తి వస్తుంది.తెలుగు ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది.

    రిప్లయితొలగించండి
  17. బాగా చెప్పారు రహంతుల్లాగారూ. తెలుగు నిఘంటువును పరిపుష్టం చేసే పెద్దలెవరో మరి వారుకూడ ఈ అభిప్రాయాలని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  18. మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు ఇంటర్నెట్టు లో తెలుగు వాడకంపై గత సంవత్సరం వేసిన కమిటీ పరిస్థతేమిటి
    మీ వ్యాసం షేర్ చేశాను.ఇంతకన్నా వ్రాయలేను.
    కృతఙ్ఞతలు.
    చూడండి.
    iteacherz.blogspot.com

    రిప్లయితొలగించండి
  19. ప్రసాద్ గారు ఆలస్యంగా చూస్తున్నాను ఈ పోస్టుని. బాగుంది. అయితే రోడ్డు , ఇంటర్నెట్టు ఇలా ఇంగ్లీషు వారివే ఉకారాలు కలిపి వాడే పదాలు వాడుక భాషకు సరిపోతాయి. వాడుక భాషకు ( వ్యావహారికం అనుకుంటాను) ఎవరూ రూల్స్ పాస్ చేయలేరు. వాడుకలో తయారయిన తెలుగు పదాలౌ కూడా ఉంటాయి. పండితులు చేయలేనివి అవసరం మేరకు సామాన్యులు సృష్టిస్తారు. వాటిలో తెలుగువి , ఇంగ్లీషువుఇ , తెలుగూ ఇంగ్లీషు కలిపిన టింగ్లీషువీ ఇలా రక రకాలుగా ఉండవచ్చు. వాటిని భాషా పండితులు తెలుగు వ్యాకరణం లేదా నియమాల మేరకు నిర్ధారిస్తే బాగుంటుందేమో. గ్రాంధిక గందరగోళం తగ్గించి తెలుగులోనే తేలికగా ఉండే పదాలను తయారు చేయాలి తప్ప ఇంగ్లీషు వారివి వాడడం మొత్తం పరిష్కారం కాదేమోననిపిస్తోంది. మార్జాలం - పిల్లి రెండూ తెలుగు పదాలే అయితే పిల్లి అందరికీ తెలిసేలా ఉంది కదా? మార్జాలం రద్దు కాకున్నా పిల్లి సౌకర్యంగా ఉంటుంది. కేట్ అని మోజుగా పలకడం వేరు. అయితే ఇంటర్నెట్టు, రోడ్డు అనేవి మోజుతో పలకడం లేదు. సౌకర్యంగా ఉండి పలుకుతున్నారు. సామాన్యులు పలికేవాటికి ఎవడి పర్మిషనూ రూల్స్ అవసరం లేదు. కానీ వీటికే తేలికైన తెలుగు పదాలు తయారు చేయగలిగీ వాటిని పట్టుదలతో వాడకంలో పెడితే తెలుగు పదాలు వికసిస్తాయి. అంతర్జాలం మొదట్లో బాగులేనట్లనిపించినా ఇప్పుడదే అలవాటుగా మారింది నాకైతే. మీరన్నదానిలో నా అభ్యంతరం వాడుకలో వాటికి రూల్స్ కుదరనట్లే తేలికైన తెలుగు పదాలుకు రూల్స్ ఉండాలి. వాటిని ఓ పదకోశం లా ఎప్పటికప్పుడు స్తిరీకరించే, వెలుగులోకి తెచ్చే , వాడేందుకు కృషి నిరంతరం పట్టుదలగా జరగాలన్నది నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా పాయింట్ మళ్ళీ చెబుతాను. ప్రపంచంలో ఏ ఇతర భాషా కూడా పూర్తిగా వాళ్లకు మాత్రమె స్వంతం అయిన మాటలతో లేదు. అన్ని భాషలలోనూ పరభాషా పదాలు ఉంటాయి, వాటిని ఎవరి పద్ధతిలో వాళ్ళు వారి వారి భాషల్లో కలిపెసుకున్నారు. ఈ విధానంలో ఆంగ్లం అందరికంటే వెయ్యి అడుగులు ముందు ఉండటం వలన అంతర్జాతీయ భాష అయ్యింది. ఎవ్వరూ కూచుని కొత్త మాటలు "తయారు" చెయ్యనక్కర్లేదు. అలా చేస్తే చేసినట్టే ఉంటుంది కాని, వాడుక పదం కాదు.

      తొలగించండి
  20. ఒక్కసారి రావూరి భరద్వాజ గారు అన్న మాటలు నా వ్యాసంలోనే అంతర్భాగంగా ఉంచాను చూడండి. మిగిలిన విశేషాలు సాయంత్రం, ఇప్పుడు ఆఫీసు టైము వెళ్ళాల్సిన సమయం అవుతున్నది!

    రిప్లయితొలగించండి
  21. మార్జాలం సస్కృత పదం. ఈ విధంగా పిల్లిని ఎవ్వరూ అనరు. ఇంగ్లీషు పదాలను మొత్తంగా తెలుగులో చొప్పించమని నేనేమీ చెప్పలేదు మరొకసారి జాగ్రత్తగా చదవండి. ముఖ్యంగా మనకు తెలుగునాట అలవాటులేని ప్రక్రియలు, ఇక్కడ కనిపెట్టబడని సాంకేతికతకు సంబంధించి పదాలు తెలుగు చెయ్యబోతే ఎబ్బెట్టుగా ఉండటమే కాదు ఎందుకూ కొరగావు. ఉదాహరణగా యూ ట్యూబ్ ని యధాతధంగా తెలుగు చేస్తే ఏమవుతుంది! అలాగే బ్రేక్‌ఫాస్ట్ కు తెలుగు ఏమిటి? తెలుగులో బ్రేక్‌ఫాస్ట్ అన్న ప్రక్రియ లేదు. తీరి కూర్చుని దానికి తెలుగు కనిపెట్టక్కర్లేదు. ఈ బ్రేక్‌ఫాస్ట్ అనే ప్రక్రియ మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక అదీ 30 దశకం నుంచి ఉద్యోగస్తులు ఎక్కువయ్యి వచ్చిన ఒక ప్రక్రియ. దానికి బ్రేక్ఫాస్ట్ అని తెలుగు చేసుకుంటే భాషకు జరగబోయే ప్రమాదం ఏమీ లేదు అని నా అభిప్రాయం. ఓపక్క "సామాన్యులు పలికేవాటికి ఎవడ పర్మిషనూ రూల్స్ అవసరం లేదు" అంటూనే, తత్విరుధ్ధంగా తేలికైన తెలుగు పదాలకు రూల్స్ ఉండాలి అని అంటున్నారు. ఆ రూల్స్ ఎవరు తయరుచేస్తారు?. భాష అనేది ఎవరి అనుమతీ, నిబంధనా, నియంత్రణా లేకుండా చక్కగా వికసించగలదు, అనవసరంగా విచారపడద్దు అని నా మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మార్జాలం సంస్కృత పదమని తెలీదు ప్రసాద్ గారు. ఉదాహరణగా చెప్పానంతే. దాని స్థానంలో ఒకే అర్ధాన్నిచ్చే రెండు తెలుగు పదాలు తీసుకోండి. ఒకటి క్లిష్టంగా ఉన్నది రెండోది అదే అర్ధాన్నిచ్చే తేలికైనది అని నా ఉద్దేశాన్ని గమనించగలరు. వాడుక భాషకు రూల్స్ అవసరం లేదు పెట్టినా అవి పాటించే అవకాశం అవసరం వారికి లేవనే నా ఉద్దేశం. ఎందుకంటే వారికి వ్యాకరనంతో భాష నియమాలతో పని లేదు. కమ్యూనికేట్ చేయడమనే ఒక్క అవసరమే అక్కడ ప్రధానం. అదే సందర్భంలో పండితులు సృష్టించలేనివి వాడుకలో జనాలు పదాలను సృష్టించగలరు. అవి పలు భాషల కలగాపులగమైనా కావచ్చు, అచ్చ తెలుగువీ కావచ్చు. వాటిలో తెలుగువి స్తిరీకరించి అందరికీ ప్రచారంలో పెట్టాలి. తెలుగు కాకుండా ఉన్నవి మీరు చెప్పే breakfast లాంటివి స్తిరీకరించవచ్చనేవి భాషాపరమగా కరెక్టు కాదనేది నా వ్యాఖ్య సారాంశం సర్. అదే సందర్భంలో అలాంటివాటికి పండితులు తయారుచేసేవి గందర్గోళంగా కాకుండా తేలికగా ఉండాలి. తేలిక అంటే breakfast కంటే టిఫెన్ కంటే తేలికగా ఉండాలి. ఉదయపు ఆహారం అనే క్రియకు అది తెలుగులో తేలికగా ఉండాలి. అల్పాహారం అంటారు అది సరికాదు. ఉదాహరణకు ఫలహారం అనేది ఓ పదం ఉన్నది. దేవుని ప్రసాదం కు ఎక్కువగా ఆ పదం వాడతారు. అలాగే అల్పాహారం కాకుండా పొద్దుటిబువ్వకు మంచి తెలుగు పదం తయారు కావాలి. తయరై ఉంటే వాడకంలో పెట్టాలి. వాడకంలో సక్సెస్ కాలేదంటే అది గందరగోళంగా ఉనంట్లు మరింత తెలైకైనది రావాలని నా అభిప్రాయం. మొత్తంగా నేను చెప్పేది వ్యావహారికంలో పదాలను ఎద్జెస్ట్ చేసేదానికి వ్యాకరణ బద్ధంగా తయారు చేసేదానికి తేడా ఉంటుంది. వ్యాకరణబద్ధంగానే అందరికీ అర్ధమయ్యేలా తేలికగా కూడా ప్రయతిస్తే ఇష్టం ఉంటే అది కష్టం కాదని నా అభిప్రాయం. వాడుక భాష వేరు - గ్రాంధిక భాష వేరు. గ్రాంధికమంటే గందరగోళంగా తెలుగువారే భయపెట్టేదిగానే ఎందుకుండాలి? అనేది పండితులపై నా విమర్శ.

      తొలగించండి
    2. ఒక ఆఫీసులో గుమాస్తాలు మాట్లాడుకునే భాష వాళ్ళ స్థాయీ ఒక విధంగా ఉంటాయి. కొంతకాలం గుమాస్తాలుగా ఉండి అనుభవం ద్వారా పదోన్నతి పొందిన వారి పరిణితి మాట్లాడుకునే పద్ధతి మరొక పద్ధతిలో ఉంటుంది. సమాజం కూడా అంతే ఎవరి "ప్లేన్" (Plane) వారిది. ఇక్కడ ప్లేన్ అంటే విమానం కాదు, "స్థాయి"(a level of existence, thought, or development). పండితులు కానీ పండితులము అనుకునేవారు కాని, తయారు చేసే మాటలు గందరగోళంతో నిండి ఉండిన మాట వాస్థవమే, అందుకు శిక్ష ఆ మాటలు వాడుకలోకి రాకపోవటమే. కాని మనకు అర్ధంకానిది గందరగోళం అనిపించటం తప్పేమీ లేదు అని నా అభిప్రాయం. గందరగోళంగా లేకుండా భాషా ప్రయోగాలు చెయ్యగలగటం అందరి పండితుల వల్ల జరిగే పని కాదు. మొత్తం మీద మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు, కొండలరావు గారూ.

      తొలగించండి
  22. వ్యాసము మిక్కిలి బాగుంది.ధన్యవాదములు.మనము తెలుగులోనే చదవాలి,మాట్లాడాలి,వ్రాయాలి.అప్పుడే కదా మన మాతృభాష తెలుగుయొక్క రుచి తెలుస్తుంది.కానీ ఈ రోజుల్లో మన తెలుగులో ఇతరభాష పదాలు చేరుతున్నాయి.అప్పుడప్పుడు మనము మాట్లాడేటప్పు ఇది గమనించము.ఏదో మాట్లాడేస్తాము.బస్ వచ్చింది ఆటోమాటిక్ ఎక్కేశాను అంటాము.బస్,ఆటోమాటిక్ ఈ రెండూ ఆంగ్ల పదాలు.కానీ వాడేస్తున్నాము.అచ్చమైన,స్వచ్చమైన తెలుగులోనే మాట్లాడాలంటే మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి.తప్పకుండా తీసుకుందాము.

    రిప్లయితొలగించండి
  23. అయ్యా..తమరి వ్యాసము చదివి నాను. చాలా బాగుంది. ఈ మధ్య కోదండ రామయ్య గారు మరియు కొన్ని బృందాలుగా చేరి విశాఖ పట్టణం లో విశెష మైన కృషి తెలుగు వాడకం మీద చేస్తున్నారు. గూగుల్ బృందాలు నుండి నాకు లేఖలు అందుతున్నవి. పోతే దిన దినము వాడే ఆంగ్ల పదములు అలాగే తెలుగు నందు దత్తత తీసుకోవడమ్ మంచిది. సోపు లేదా సబ్బు, థాంక్స్ , రైలు, ప్లేటు, సిగరెట్టు, టిఫిను, మీల్సు, బస్సు, బెల్లు, బెల్టు, మొబైలు( చర వాణి), స్కూటరు, కారు, ఇంజను, గ్లాసు ( పంచ వాత్ర లేదా లోటా), టెలివిజను ( దృశ్య వాణి), సినిమా, హీరో ....ఇలాంటి పదాలన్ని తెలుగు లో వాడు కోక తప్పదని నా అభ్హి ప్రాయము.

    రిప్లయితొలగించండి
  24. విబిఎం రావుగారూ. అవును తప్పదు. ఇతర భాషా పదాలకు సరైన పదం లేనప్పుడు, ఆ పదాన్నే వాడుకోవటం తెలివైన పని, ఆ పదాన్ని మన పదంగా మార్చుకోవటం అవసరమైన పని.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.