12 భాషల్లో చందమామలు…
చక్రపాణి, నాగిరెడ్డి గార్ల చందమామకు ప్రస్తుతం 63 ఏళ్లు. గత 63 ఏళ్లుగా ఒక కాపీ కూడా తప్పిపోకుండా చందమామను కొని భద్రపర్చు కుంటున్న టార్జాన్ రాజు గారి నుంచి ఇంకా దశాబ్దాలుగా చందమామలు కొని భద్రపరుస్తున్నవారినుంచి ఇటీవలి కాలంలో చందమామ తెప్పించుకుంటున్న వారివరకు చందమామ పాఠకులకు వయోభేదాలు లేవు.
చందమామను నెలవారీగా కొని దశాబ్దాలపాటు భద్రపర్చటం పాఠకులు ఎలాగూ చేస్తూ ఉన్నారు. కాని ప్రతిసారీ కాకున్నా అన్ని భాషలలోని ఒక నెల చందమామల సెట్‌ను జీవిత కాల జ్ఞాపకంగా సేకరించుకుని భద్రపర్చుకోలిగితే.. అందరికీ ఈ అవసరం ఉండకపోవచ్చు. చందమామలో కథ ప్రచురితమయితే అది సంతాలీ భాషతో సహా 12 ప్రాంతీయ బాషలలోనూ అదే నెలలోనే ప్రచురితమవుతోంది.
ఇలా ఒకే రచయిత కథ 12 భాషల్లో ఒకే నెలలో ప్రచురితం కావడం ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అరుదైన విషయం. కాని చందమామ గత 60 ఏళ్లుగా ఈ చరిత్రను కొనసాగిస్తూనే ఉంది. గతంలో తెలుగు చందమామలో వచ్చే కథలను తర్వాతి నెలలో అన్ని భాషల చందమామల్లోనూ ప్రచురించేవారు. ఇప్పుడు ఒకే నెలలో అన్ని చందమామలనూ ఒకే ఫార్మాట్‌లో తీసుకువస్తున్నారు.
ఒక పత్రిక 12 భాషలలో తొలి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఒకే ఫార్మాట్‌లో రూపొందుతున్న చరిత్ర నాకు తెలిసి ప్రపంచంలో ఒక్క ‘చందమామ’కు మాత్రమే దక్కిందనుకుంటాను.
తెలుగు, హిందీ, మరాఠీ, ఒరియా, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళం, గుజరాతీ, అస్సామీస్, సంస్కృతం, సంతాలీ.. ఇలా 12 బాషల్లో చందమామ క్రమం తప్పకుండా ప్రచురించ బడుతోంది. (వీటికి అదనంగా ఇంగ్లీషు చందమామ, జూనియర్ చందమామ -తొమ్మిదేళ్ల వయసు లోపు పిల్లలకు ఇంగ్లీషులో ప్రచురిస్తు న్నారు- కూడా వస్తున్నాయి.)
ఆలస్యంగా అయినా సరే క్రమం తప్పకుండా వస్తున్న చందమామను అన్ని భాషల్లోనూ ఏదైనా ఒక నెలలో తీసి పెట్టుకుంటే అదొక విశేష జ్ఞాపకంగా ఉంటుంది. ఈ ఆలోచనకు ఇటీవల ప్రేరణగా నిలిచిన వారు దాసరి వెంకటరమణ గారు. రెండు నెలల క్రితం ఫోన్‌లో తనతో మాట్లాడుతున్నప్పుడు.. సందర్భవశాత్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. తెలుగు చందమామలు, ఇంగ్లీష్ లేదా హిందీ సంచికలు అవసరమైతే తీసుకుంటూనే ఉన్నాము కాని ఒకే నెలలో 12 భాషల చందమామలను తీసుకుని జీవితకాల జ్ఞాపకంగా వాటిని భద్రపర్చుకోవాలని ఉందని ఆయన సూచన ప్రాయంగా తెలిపారు.
మామూలుగా అయితే చందమామ ఆఫీసునుంచి చందాదారుల కాఫీలు అందలేదని కంప్లెయింట్ వచ్చిన సందర్భాల్లో వాటిని సంబంధిత చందాదారులకు మళ్లీ పంపటం జరుగుతోంది కాని ఇలా అన్ని భాషల చందమామలను ఒక నెలలో కోరినవారికి పంపే పద్ధతి అమలులో లేదు.
రమణ గారు తన కోరిక వెలిబుచ్చాక ఈ విషయం పైవారికి తెలియజేస్తానని అవకాశం ఉంటే ఒక నెల చందమామలను తెప్పించి ఆయనకు పంపుతానని ఆరోజు చెప్పాను. నేనయితే ఆఫీసులోనే అన్ని భాషల చందమామలు అదనంగా కొన్ని వస్తాయి కాబట్టి, అదనంగా కొన్ని నెలలుగా ముఖచిత్రం బాగుందని అనిపించినప్పుడు 12 భాషలలోనూ చందమామల సెట్ నేరుగా కొని భద్రపర్చుకుంటున్నాను.
రమణ గారిలాగా స్వంత అభిరుచితో లేదా చందమామలో ప్రచురించబడిన తమ కథను అన్ని భాషల్లోనూ చూసుకోవాలని కుతూహలం ఉన్న వారికి అన్ని భాషల చందమామలను పంపించే వీలుందా అని ఆపీసులో అడిగి చూశాను. అలా ఎవరయినా అన్ని భాషల కాపీలు కావాలని అడిగితే వారికి పంపడానికి అదనంగా కాపీలు పంపిస్తామని పైవారినుంచి సమాధానం వచ్చింది. దీంతో గత వారమే రమణ గారికి జూలై చందమామ 12 భాషల కాపీలను, ఇంగ్లీష్ చందమామ, జూనియర్ చందమామను పంపడమైనది. ఇలా 12 భాషలలో ఒక నెల చందమామలను అరుదైన జ్ఞాపకం కోసం తొలిసారిగా తీసుకున్న ఘనత దాసరి వెంకట రమణ గారికే దక్కింది.
సాధారణ పాఠకులకు 12 బాషల చందమామలను భద్రపర్చుకునే అవసరం ఉండకపోవచ్చు కాని, చందమామకు కథలు పంపుతున్న వారు తమ కథలు ఎంపికై ప్రచురించబడితే పన్నెండు బాషల చందమామలలో వాటిని చూసుకోవాలని అనుకున్నప్పుడు ఇలాంటి వారికి ఈ పథకం చక్కగా ఉపయోగపడుతుంది. అలా జీవిత కాల జ్ఞాపకం కోసం పన్నెండు భారతీయ బాషలలోని చందమామల ఒక నెల సెట్‌ను తీసుకుని భద్రపర్చుకోవాలని ఎవరికయినా అనిపిస్తే అలాంటి వారికి ఇప్పుడు చందమామ అవకాశం కల్పిస్తోంది.
పన్నెండు భాషల చందమామల ధర 240 రూపాయలను చందమామ చెన్నయ్ ఆఫీసు చిరునామాకు పంపిస్తే వారికి ఇటీవలి నెలల చందమామల సెట్‌ను పంపించే వీలుంది. ఇది కేవలం ఆసక్తి, జ్ఞాపికగా దాచుకోవాలని కుతూహలం ఉన్నవారికి మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి ఆలాంటి వారు 12 బాషల చందమామలను ఇప్పుడు తమ స్వంతం చేసుకోవచ్చు.
దాసరి వెంకట రమణ గారూ!
12 బాషల చందమామ సంచికలను తీసుకున్న తొలి వ్యక్తి మీరే అయినందుకు అభినందనలు. కొరియర్‌లో పంపాము కాబట్టి అవి క్షేమంగా అందినందుకు సంతోషంగా ఉంది.
అలాగే ‘రచన’ పత్రిక సంపాదకులు శాయి గారు గత వారమే చందమామ అపురూప చిత్రకారులు చిత్రా, ఎంటీవీ ఆచార్య, వపా, శంకర్ గార్ల 200 చిత్రాల సంకలనం Art Book రెండు భాగాల సెట్… రెండు కాపీలను గత వారమే చెన్నయ్ ఆపీసు నుంచి తెప్పించుకున్నారు. అత్యుత్తమ క్వాలిటీతో తయారైన ఈ సెట్ వెల రూ.1500 మాత్రమే……………..!!!!!!
శాయిగారికి అభినందనలు.. చందమామ ఆర్ట్ బుక్‌పై మీ అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నాము.
చందమామ చెన్నయ్ చిరునామా
Chandamama India Limited
No.2 Ground Floor, Swathi Enclave
Door Nos.5 & 6 Amman Koil Street
Vadapalani, Chennai – 600026
Phone : +91 44 43992828 Extn: ౮౧౯
రాజశేఖర రాజుగారు చందమామలు బ్లాగు నుండి పున:ప్రచురణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.