17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

రేడియో అభిమాని ఎందుకు


నాకు రేడియో కార్యక్రమాలంటే ఎంతో అభిమానం, ఆపేక్ష. నా చిన్నతనమంతా రేడియో కార్యక్రమాలువింటూనే జరిగింది. చదువుకుంటున్నప్పుడు కూడ కొద్ది శబ్దంతో రేడియో ఉండాల్సిందే. నా చిన్నతనంలోనాకు కలిగిన లోక జ్ఞానమంతా కూడ రేడియో వల్లనే కలిగింది. అద్భుతమైన వినోదాన్ని అందించినది, మానసిక ఉల్లాసాన్నిచ్చినది రేడియో.

నాకు బాగా జ్ఞాపకం, నాకు ఆరేళ్ళ వయస్సు అప్పుడు, అలమారులో పై అరలో పెట్టిన రేడియో అందుకోవటంనేర్చుకున్న దగ్గర నుంచి, దాదాపు 1998 వరకు నా రేడియో అభిమానం కొనసాగింది. తరువాత ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలు తిరగటం, ఆయా ప్రాంతాల్లో రేడియో అంతగా రాకపోవటం, వచ్చినా ఆయా స్టేషన్ల కార్యక్రమాలు నచ్చకపోవటం వల్ల రేడియోకి కొంత దూరమయ్యాను. తరువాత్తరువాత టి వి వచ్చిరేడియోని పూర్తిగా మర్చిపోయ్యేట్టుగా చేసింది.

కాని ఎప్పటికి గుర్తుండే నాటికలు, పాటలు, ప్రసంగాలు, పరిచయాలను అందించిన రేడియో మళ్ళి మళ్ళి జ్ఞాపకం రావటం, అప్పటి కార్యక్రమాలు మళ్ళి వినగలిగితే అని ఒక తపన కలగటంతో, అప్పుడెప్పుడో చిన్న తనంలో రికార్డు చేసి దాచిన టేపులన్ని MP3 కింద మార్చి అందరితో పంచుకోవాలని కోరికతోఇంటర్నెట్టులో ఉంచాను.

కళాకారులలో మనకు కనపడకుండా వినపడుతూ మాత్రమె మానను అలరించేవారు రేడియో కళాకారులు. మరే ఇతర కళాకారుల గురించైనా సరే వారి గురించి వ్రాయటానికి అనేక మంది ముదుకు వచ్చి పుస్తకాలు, పత్రికలూ నడుపుతారు. కాని రేడియో కళాకారుల గురించి ఎవరూ వ్రాయరేమి అన్న ఒక ప్రశ్న నన్ను చాలాబాధించింది. సాధ్యమైనంత వరకూ, మనమే వ్రాద్దాం, వీలయితే మనకున్న అభిరుచి కలిగిన వాళ్ళను మరి కొంత మందిని కూడగట్టుకుని అందరి దగ్గర ఉన్న సమాచారాన్ని, ఫోటోలను, రికార్డింగులను పోగు చేసి ఒకచోటచేర్చి, ఇప్పటి తరానికి, రాబొయ్యే తరానికి రేడియో కళాకారులను పరిచయం చేద్దామని నా ప్రయత్నం.

ప్రయత్నంలో ఇప్పటికే మాగంటి వంశీ గారు, కారంచేడు గోపాలం గారు, రంజని గారు నాకు ఎంతగానో తోడ్పడ్డారు. వంశీగారు తన సొంత వెబ్ సైటులో, అలనాటి నాటికలను, ఇతర కార్యక్రమాలను ఉంచి అందరికీ అందుబాటులోకి తేవటం ఎంతైనా ముదావహం. గోపాలంగారు, రంజనిగారు వారి వారి దగ్గర ఉన్నరికార్డింగులను పంపి
ఎంతగానో ప్రోత్సహించారు.

బ్లాగులోకంలోగాని, బ్లాగులు చదువుతూ ఆనందించే వారిలో కాని, వారి దగ్గర రేడియో కళాకారులకు సంబంధించిన ఎంత చిన్నదైనా సరే సమాచారం ఉంటే నాకు పంపిస్తే ఎంతైనా సంతోషిస్తాను.

ఈ పని ఒక్కరి వల్ల కాదని నాకు తెలుసు. అందుకనే, ఇలా రేడియో కార్యక్రమాలు, రేడియో కళాకారుల మీద అభిమానం ఉన్నవారిని నాకు సహ రచయితలుగా ఈ బ్లాగు నిర్వహించటానికి ముందుకు రమ్మని మనవి చేస్తున్నాను. ఇప్పటికే రేడియో అభిమానులకు నా ఆహ్వానం పంపాను. ఇంత మంది చాలు అనేమి లేదు. ఎంత మందైనా చేర వచ్చు. కాని ఒక్కటే షరతు, మంచి వ్యాసాలు, రేడియో కార్యక్రమాల మీద వ్రాయాలి.

ఒక్క తెలుగు రేడియో కార్యక్రమాలు కళాకారుల గురించే కాకుండా, హిందీ ఆంగ్ల భాషా రేడియోల గురించి కూడ వ్రాయాలని, నా అభిలాష. త్వరలో, రేడియో కార్యక్రమాల మీద వ్యాస పరంపర మొదలు పెడతాను.

3 కామెంట్‌లు:

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.