కాలం వేగంగా పరిగెత్తటం వల్లనో, లేక ఆలోచనల భారం పెరగటం వల్లనో మనం అలనాటి అనేక ఆనందాలు కోల్పోతున్నాము. అలా కోల్పోతున్న ఆనందమే రేడియో.నా చిన్నప్పుడు ఆ కాలమే వేరు అని పెద్దవాళ్ళు అంటుంటే ఏమిటోలే అనుకున్నాను. ఇప్పుడు అంత పెద్దవాణ్ణి కానప్పటికి అలా అనుకోవటంలో ఆనందం ఉందని గ్రహించాను. అవును, శివగారి( మా అన్నయ్యే లెండి ) రేడియో అభిమాని బ్లాగ్ గురుంచి తెలియగానే లోపల ఉన్న రేడియో జ్ఞాపకాలు బయటకు వస్తుంటే తెలిసింది ఆ ఆనందం ఏమిటో!!!
పొద్దున్నే నిద్ర లేచేప్పటికే సుప్రభాతంతో మొదలు ఢిల్లి తెలుగు వార్తలు దాకా నాన్నగారు వింటుంటే అవి వింటూ గబగబ ఏదో ఒకటి తిని స్కూలుకి పోవటం. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచేప్పటికి "కార్మికుల కార్యక్రమం" సైన్ మ్యూజిక్, తరవాత "మంచాహే గీత్" హింది పాటలు వింటూ తిరిగి స్కూలుకి పోవటం. సాయంత్రం అయ్యేటప్పటికి దగ్గరలోని పార్క్ యువజనులకార్యక్రమం, పంటసీమల మ్యూజిక్ వినపడుతుండగా ఇంటికి వెళ్ళటం, జనరంజని పాటలో చాయాగీత్ పాటలో వింటూ నిద్రపోవటము. ఇదంతా పెద్దవాళ్ళు రేడియో వాడుతున్నప్పుడు తెలియకుండానే నిత్యజీవితంలో భాగంగా రేడియో వినటం మొదలైంది. ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే పాత కాలపు చక్కటి సువాసనలు గుర్తుకొస్తున్నాయి.
ఆదివారం వచ్చిందంటే 3 గంటలకి వచ్చే నాటకం కోసము జనమంతా ఎదురు చూడటం, వచ్చినతరవాత ప్రతి ఇంట్లో అదే వినపడటం... రొడ్లన్నీ ఖాళీగా ఉండటం... ఇప్పటి టీవీ పిల్లలకు చెప్పినా నమ్మరు.
ఆ రోజుల్లొ రేడియొకి చాలా ప్రాముఖ్యం ఇచ్చేవారు. పార్క్ రేడియొలకి రోడ్ మీద మైకులకు కనెక్షన్ ఉండేవి. ఏదైనా రేడియొనే.. మంచి కార్యక్రమములు, మంచి నాటకములు. మరియు మంచి వార్తలు..... అవును అలా చెప్పక తప్పదు ఇప్పుడు మనం చూసే టీవీల అతి వార్తలు వెకిలి/సందర్భ శుధ్ధిలేని భాష..భాషా ప్రయోగములు..భయంకర మ్యుజికల్ వార్తా చానళ్ళు.... ఎందుకులే సుఖంగా రేడియో స్వర్గంలో విహరిస్తూ టీవీ నరకంలొకి..
ఇక, రేడియో నాటకాలలో బందా కనకలింగేస్వర్రావుగారు,నండూరి సుబ్బారావు గారు, సి.రామ్మోహన రావు గారు, పాండురంగా గారు, నాగరత్నమ్మ గారు, వి బి కనకదుర్గ గారు ఇలా ఒకరేమిటి[చాలా మంది పేర్లు తెలియవు] అందరూ రేడియో నాటకాల్లో వినపడలేదు..."కనపడ్డారు". నిజంగా వారు ఎలావుంటారో తెలియదు కాని రేడియో నాటకాల ద్వారా ప్రతివారి రూపం మనస్సులో ముద్రించుకొని పోయింది. గణపతి, వరవిక్రయం, దొందుదొందే, తాళం చెవులు,మడిబట్ట, పెళ్ళాంతొ పెళ్ళికి ప్రయాణం లాంటి నాటకాలు రేడియోలో వచ్చాయంటే నమ్మ బుద్ది కావటం లేదు. ఇవన్నీ చూసినట్లుగానే జ్ఞాపకం వస్తున్నాయి.[ఇవాళ మీడీయాలో చూసినవి కనీసం విన్నట్లుగా కూడా జ్ఞాపకం రావటం లేదు].
ఒక నాటకమేదో వచ్చింది[పేరు గుర్తు లేదు] దానిలో అందరూ ఒక గుహలో చిక్కుకొని పోతారు... చీకటి. భయం!! భయానక వాతావరణం ఆ గంటా మనమే చీకటి గుహలో ఉన్నామా అనిపిస్తుంది. దీనికి ఏ ఇంగ్లీష్ హర్రర్ సినిమా కూడా సాటి రాదు.
అలాగే గణపతి నాటకంలో గణపతి వర్ణన మనకి చెవుల ద్వారా కనపడేట్లు చేసింది. మధ్యాహ్నం పూట సర్వే చేసీ మండుటెండలో వచ్చినట్లుగా సి. రామ్మొహనరావు గారు తమ గొంతు ద్వారా ఆ వాతావరణంలోకి మనని తీసుకెళ్ళారు.నాటకం చివర్లో ఇల్లు అంటుకోవటంలాంటి వాతావరణాన్ని రేడియోలో సృష్టించటం నిజంగా అద్భుతం.
ఇంకా చెళుకులు,కబుర్లు, ఉషశ్రి ధర్మ సందేహాలు, సంగీత కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాలను జనరంజకంగా తయారుచేసిన వారి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. వీరికి తగిన రీతిలో గుర్తింపు రాలేదు. ఇప్పుడు అలాంటి అవకాశం శివ గారి "రేడియొ అభిమాని" బ్లాగు ద్వారా పరిచయాలు కావటం కన్న కావల్సింది ఏముంది..
ఈ సందర్భంగా మనం విజయవాడ, హైదరాబాదు రేడియో స్టేషన్లతో పాటు తప్పనిసరిగా రేడియొ మాస్కొ మరియు సిలోన్ [ఎస్ ఎల్ బి సి] లను గుర్తు తెచ్చుకోవాలి. సిలోన్ లో మధ్యహ్నం వచ్చే అక్కయ్యగారి పరిచయం కూడ జరిగితే బాగుంటుంది.
ఆ అన్నట్లు సిలోన్ అంటే గుర్తు వస్తున్నాయి... షార్ట్ వేవ్ రావటానికి అప్పుడున్న రేడియోలకి చాలా కష్టపడాల్సి వచ్చేది. అవి వాల్వు రేడియొలు. వీటికి సిగ్నల్ క్యాచ్ చేసే శక్తి తక్కువ. మా ఇంట్లో హాలండ్ ఫిలిప్స్ రేడియో ఉన్నది. దానిలో మీడియం వేవ్ 1 బ్యాండు మరియు షార్ట్ వేవ్ లో 3 బ్యాండ్లు ఉన్నాయి. మీడియం వేవ్ లో విజయవాడ, మెడ్రాస్, హైదరాబాదు లాంటివి వినే వాళ్ళము. ఇవి రేడియో లోపల యాంటినాతో పనిచేస్తాయి.
కాని అసలు కష్టం షార్ట్ వేవ్ తోనే. ఇందులో కొన్ని బయట యాంటినా లేకుండా రావు. వాటికోసమని చెప్పి నేను మా అన్నయ్య కలిసి వైర్లతో రకరకాల డిజైనులు చేసి కర్రలకి కట్టి మేడమీద నుంచోబెట్టేవాళ్ళము. అలా మార్చినప్పుడల్లా కొత్త రేడియో స్టేషన్లు వస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. నాకు బాగా గుర్తు 11 లేక 13 మీటరు బ్యాండు మీద రేడియొ స్వీడన్ వచ్చింది మా అనందం చెప్పటానికి వీలులేదు. ఈ వైర్లూ... గోలా చూసి చుట్టుపక్కలవాళ్ళు కొందరు ఝడుసుకునేవాళ్ళు, కొందరు నవ్వుకునేవాళ్ళు. వాళ్ళని చూసి మేము నవ్వుకునే వాళ్ళము. నిజంగా అదొక ఆనందం.
సరే, ఇప్పటికే చాలా చెప్పేసినట్లున్నాను ఇప్పటికి ఇలా శలవు తీసుకుంటున్నాను. మళ్ళి కలుసుకుందాము
జై హింద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.