22, సెప్టెంబర్ 2010, బుధవారం

ఇంటర్నెట్ ప్రభావం సాహిత్యం మీదా!!


"అక్షరం" బ్లాగు అధినేత శ్రీ అఫ్సర్ గారు పై విషయం మీద చర్చ జరుపుదాం అని తనబ్లాగులో ఆహ్వానం పలికారు అది చూసి, నా అభిప్రాయాలు అక్కడ వ్రాసాను. ఒక మంచి విషయం మీద చర్చకు అవకాశమిచ్చిన అప్సర్ గారికి ధన్యవాదాలు కాని ఇంతవరకూ చర్చ పెద్దగా ఏమీ జరుగలేదు . సరే అడిగినాయనా, పని వత్తిడివల్ల అయ్యి ఉండవచ్చు, స్పందించలేదు అందుకని సరే నా బ్లాగులో కూడవిషయాలు వ్రాసి చూద్దాం అని ఇక్కడ వ్రాస్తున్నాను.

మళ్ళీ ఈరోజున అంటే మార్చ్ 2, 2011 న వ్రాస్తున్నాను. ఈ అక్షరం బ్లాగు వారు తాము అడిగిన విషయం మీద ఇతర బ్లాగర్లు వ్రాసిన అభిప్రాయాలకు స్పందించనేలేదు. కారణం వారికే తెలియాలి.

ఇంటర్నెట్ ప్రభావం సాహిత్యం మీదా!! అలాంటిదేమీ పెద్దగా లేదని నా అభిప్రాయం. సాహిత్య ప్రభావం ఇంటర్నెట్ మీద అనండి తప్పక ఉన్నది. సాహిత్యం గురించి వ్రాసే వారు చాలా తక్కువమంది. వారు దశాబ్దాలపాటు సాహిత్య పఠనం తరువాత తమకు నచ్చిన పుస్తకాలు కథలు ఆపైన తాము మెచ్చిన రచయితల గురించి వ్రాస్తున్నారు. ఒక్కటే ఇంటర్నెట్ వల్ల ఉపయోగం. వ్రాద్దమనై కోరిక, ఓపిక, సామర్ధ్యం ఉన్నవాళ్ళు హాయిగా వ్రాసుకునే ఒక వేదిక ఏర్పడింది. అలా వ్రాద్దామనుకునేవారికి కొద్దిగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు సొంతంగా ఒక బ్లాగు ఏర్పాటు చేసుకుని తమకు తోచినది వ్రాసుకోవచ్చు. పూర్వం ఇలా సొంతంగా వ్రాసి పదిమందికి తెలియ చెప్పాలంటే అవకాశం చాలా తక్కువ. ఉన్నవే ఒక అరడజను వార/మాస పత్రికలు, అక్కడకు పంపేవారి సంఖ్య ఎక్కువ. అక్కడ కూచున్న ఉపసంపాదకుని అక్షరాస్యత మీద ఆధారపడి ఉంటుంది ఎవరన్నా వ్రాసినది ఎంపిక కావటం కాకపోవటం. బ్లాగుల పుణ్యమా అని ఆ కష్టం తప్పింది. మనం వ్రాసుకుని కనీసం ఒక రెండు మూదు వందలమంది వెను వెంటనే చదివే ఎర్పాటు ప్రతి బ్లాగరుకు దొరికింది.


ఇక బ్లాగుల్లో ఒక విషయం గురించి క్షుణ్ణంగా పరిశోధించి వ్రాసే వారు చాలా తక్కువ. సరదాగా బ్లాగు మొదలుపెట్టి చిత్ర విచిత్రాలతో ఆకట్టుకోవలన్న తపనతొ వ్రాసే కుర్రకారే ఎక్కువ. సాహిత్యం మీద అభిరుచి అవగాహన ఉండి వ్రాసే వారు పెద్దగా లేరు. పనికిరాని, అనవసరమైన విషయాల మీద పెద్ద పెద్ద చర్చలు, పోట్లాటలు , పేరడీ బ్లాగులు, ఒకరినొకరు ఎత్తిపొడుచుకోవటం, ఎద్దేవా చేసుకోవటమే బాగా కనపడుతోంది. ఏదైనా విషయం మీద చర్చ రాగద్వేషలకు అతీతంగా జరగటం లేదు. ద్వేష పూరిత వ్యాఖ్యలు, ఆవతలి వారిని ఎంత మాటంటే అంత మాట అనెయ్యటం వంటివి చులాగ్గా పేట్రేగిపోతున్నాయి.

ఎతా వాతా చెప్పేదేమంటే ఇంటర్నెట్ ప్రభావం సాహిత్యం మీద ఉంటే గింటే చాలా స్వల్పం. సాహిత్యాన్ని ప్రభావపరిచే అవకాశం ఇంటర్నెట్‌కు ఉన్నదా అని చూస్తే మనకు ముందుగా స్పురించవలసిన విషయం ఇదొక మాధ్యమం మాత్రమే అని, అందువలన, తనంతట తానుగా సాహిత్యాన్ని మలుపు తిప్పగల అవకాశం ఇంటర్నెట్టుకు తక్కువ. పత్రికల సంఖ్య లేదా ప్రచురణకర్తల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగినంత మాత్రాన సాహిత్యం ప్రభావితం అవుతుందా? అవుతుంది! ఎలా? పోటీ వల్ల, సామాన్యంగా ప్రచురణకు అవకాశం లేని సరుకు కూడా ప్రచురించబడుతుంది. దానివల్ల సాహిత్య విలువలు పెరుగక పోగా పడిపోయే ప్రమాదం ఎంతైనా ఉన్నది 1980లు 1990లలో తెలుగు పత్రికా/ప్రచురణా ప్రపంచంలో జరిగింది అదే. అలాగే ఇంటర్నెట్, బ్లాగుల వల్ల ప్రచురించటానికి పెద్దగా ఇబ్బంది, వెరేవారి అనుమతి, ఎంపిక లేనందువల్ల తోచిందల్ల ప్రపంచం మీదికి వదిలే వెసులుబాటుతో, సాహిత్యం మీద ప్రభావం నాణ్యత పెంచటం కన్నా, నాణ్యత లోపమే ఒక ప్రభావంగా ఉండే ప్రమాదమున్నది.

ఇక్కడే నిస్పక్షపాతమైన బ్లాగ్ ఆగ్రిగేటర్ల అవసరం ఎంతైనా ఉన్నది. ఆగ్రిగేటర్లు కొంతమంది సాహిత్య పెద్దలను పానెల్ గా ఉంచి, బ్లాగుల్లో వ్రాయబడుతున్న వ్రాతలను క్షుణ్ణంగా పరిశీలించి తప్ప తాలు ఏరేసి, నాణ్యంగా వ్రాయబడుతున్న విషయాలను (ఆ బ్లాగు మొత్తాన్ని కాదు) ఎంపిక చేసి, ప్రత్యేక విభాగంలో ఉంచితే, ఆ విభాగంలో చోటు సంపాయించటం ఒక ధ్యేయంగా వ్రాసే వారు తమ తమ వ్రాతలను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ చక్కగా వ్రాసే అవకాశం పెరుగుతుంది . ఒకరు వ్రాసిన ఒక వ్యాసం ఆ విభాగంలో ఉంచినంత మాత్రాన ఆ బ్లాగు మొత్తానికి అక్కడ స్థానం దొరక కూడదు. ఆ వ్రాసిన వ్యాసం మాత్రమే ఆ ప్రత్యేక విభాగంలో ఉంచాలి. మళ్ళి అదే బ్లాగరు మంచి వ్యాసం వ్రాసి ఎంపిక ఐతేనే ప్రత్యేక విభాగంలో ఉంచాలి. దీనివల్ల కొంత నష్టం ఉన్నప్పటికీ (ఎంపిక చెసే వారి ఇష్టా ఇష్టాల మీద అధారం కాబట్టి-కాని ముగ్గురు నలుగురు ఎంపిక చేస్తే వ్యక్తిగత ఇష్టాఇష్టాల ప్రభావం తగ్గవచ్చు) లాభ శాతమే ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం

1. ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యంలో బాగా కనిపిస్తున్న మార్పులు ఏమిటి?

నాకైతే ప్రత్యేకంగా ఇంటర్నెట్ ప్రభావం సాహిత్యం మీద పెద్దగా ఏమీ కనపడటంలేదు. స్పుటంగా కనపడుతున్న విషయం మటుకు పాఠకుల ఆదరణకు నోచుకోని అనేకానేక రచనలు, కవితలు, ఇంటర్నెట్ పుణ్యమా అని పాఠకుల ఇళ్ళల్లోకి వెళ్ళిపోయి, వారందరిచేతా చదువబడే అవకాశం ఐతే వచ్చింది. ఎక్కడెక్కడో తెలుగు భాష కాని ప్రదేశాల్లో ఉండే తెలుగు వారికి ఇంటర్నెట్ ఒక వర ప్రసాదిని. తద్వారా వారు తెలుగులో వ్రాయబడుతున్న అనేకానేక "వ్రాతలు" చదువగలుగుతున్నారు. ఆ "వ్రాతలు" అన్నీ కూడ సాహిత్యమేనా? వేచి చూడాలి. శతాబ్దాల నుండి సాహిత్యం అనేకానేక కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నది. పురాణ కథలు మత్రమే సాహిత్యం, శ్లోకం లేదా పద్యమే కవిత్వం అన్న రోజుల నుండి, కార్డు కథలు, మిని కవితలు, ఇంక ఇలా అనేకానేక రకరకాల ప్రక్రియలు సాహిత్యాన్ని పరిపుష్టం చేశాయి. పైన వ్రాసినట్టుగా, బ్లాగుల్లో వ్రాయబడేది సాహిత్యం కిందకు వస్తుందా, వస్తే ఇదే రకపు సాహిత్యం అనే విషయాలు తెలియటానికి ఇంకా వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

బ్లాగులు వ్రాయటం అనే విషయం చాలా ప్రాధమిక స్థాయిలోనె ఉన్నది. ఒక్క తెలుగులోనె కాదు దాదాపు అన్ని భాషల్లోనూ అదే పరిస్థితి. ఇలా వ్రాయగలగటం అన్న వింత అనుభూతి, కొత్తగా దొరికిన ఈ ప్రచురణా స్వాతంత్ర్యపు ఆనందలో కొట్టుకుపోతూనే ఉన్నారు అందరూ. ఈ కొత్త రకపు వ్రాత పధ్ధతికి అలవాటుపడి, మనకు సాంకేతికపరంగా అందుబాటులోకి వచ్చిన అనేకానేక ఉపకరణాల కలయికతో కొత్త సాహిత్య ప్రక్రియ ఉదయిస్తుందా? అది ఏ రకంగా ఉంటుంది, కథగానా, సినిమాలోలాగ కథ చెప్పటమా, రేడియో నాటకం లాగ వివిధ వ్యక్తులు ఒక కథను పాత్రోచితంగా చదువటమా, సంఘటనలను బొమ్మలతో చెప్పటమా, మనిషి ప్రవృత్తిని ఫొటోలతో వివరించటమా. ఇందులో ఏదైనా కావచ్చు, వీటన్నిటి కలయికా కావచ్చు.


2. ఇంటర్నెట్ వల్ల పాఠకుల సంఖ్య పెరిగిందా? పెరిగితే ఈ పాఠకులు ఏ వర్గం నించి పెరిగారు?

ఇంటర్నెట్ వల్ల పాఠకుల సంఖ్య తప్పకుండా పెరిగిందనే చెప్పాలి. కాని ఆ పాఠకులు ఏ వర్గం నుంచి పెరిగారు అని పరికించి చూస్తే, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. కొంతలో కొంత ఎగువ మధ్యతరగతి వారిలో కూడ పాఠకులు ఇంటర్నెట్ వల్ల పెరిగారు. కింది స్థాయిలో ఉన్న రోజువారి సంపాదనతో జీవించే వారు కాని, అమితమైన సంపద కలిగిన వర్గాలనుండికాని ఇంటర్నెట్ వల్ల పాఠకులు పెరగలేదు. కారణం, కింది తరగతివారికి ఇంటర్నెట్ అందుబాటులో లేదు. కంప్యూటర్ వాళ్ళకు అందని ఫలమే. పైగా రోజులో ఎక్కువ సమయం ఆరోజు సంపాదనకే శ్రమ పడాలి, అదికూడ శారీరిక శ్రమ. అందువల్ల బీదవారిలో ఇంటర్నెట్ పాఠకులు ఎవరూ పెరగలేదనే జవాబు వస్తుంది. ఇక ధనిక వర్గాల వారికి ఇంటర్నెట్ వంటివి వారి సంపాదనను మరింత పెంచుకోవటానికి వాడుకుంటున్నారే తప్ప సాహిత్య పఠనానికి అతి కొద్ది మంది మాత్రమే వాడుతున్నారు అనిపిస్తుంది.
3. ఈ-పత్రికలు, బ్లాగుల పాత్ర గురించి మీరేమనుకుంటున్నారు?

బ్లాగులు ప్రస్తుతానికి అద్దాల్లాగ ఉండి వస్తున్న సాహిత్య ప్రక్రియలను పరిచయం చెయ్యటమో లేక సమీక్షించటమో వరకే పరిమితమై ఉన్నాయి. సాహిత్య పరంగా చూస్తే ఒక కథ పత్రికలో ప్రచురితమైనా, లేదా రచయిత తన బ్లాగులో ప్రచురించుకున్నా ఒక సాహిత్య ప్రక్రియగా పెద్ద తేడా ఏమీ లేదు. మాధ్యమం మారింది అంతే. "ఈ పత్రికలు" కూడ ప్రస్తుతం వస్తున్న వార పత్రికల దారినే వెడుతున్నాయి. ఒక్కటే బేధం, వ్యాపార పరంగా నడుపబడుతున్న వార/మాస పత్రికలలో ఎన్నెన్నో ప్రకటనలు ఉంటాయి. ఈ పత్రికల్లో ప్రస్తుతానికి ప్రకటనలు చాలా తక్కువగా ఉంటాయి. మిగిలిన విషయాల్లో, అంటె, ప్రచురణ చేసే వివిధ అంశాలను చూస్తే పెద్ద తేడా ఏమీ లేదు. సాంకేతిక పరంగా అందుబాటులో ఉన్న మల్టీ మీడియాను వాడుకుని వ్రాతకు శబ్దం, చలన చిత్రం కలిపి సినిమాలా కాకుండా, మరో రకమైన సాహిత్య ప్రక్రియ ప్రయోగాలు "ఈ పత్రికలు" చేయవలసి ఉన్నది.

సాహిత్య పరిణామ క్రమంలో పద్యాలు, శ్లోకాలతో విషయం చెప్పటం మొదలయ్యి, వచన రూపంలో కథలు, నవలలు వచ్చి, పద్య కవితలు, గద్య కవితలు, కార్టూన్లు, బొమ్మల కథలు, నాటకాలు ఇలా అనేక ప్రక్రియలు వచ్చినాయి. నాటక రచన ఒక సాహిత్య ప్రక్రియ ఐతే, నాటక ప్రదర్శన మరో రకమైన సాహిత్య ప్రక్రియ. సాంకేతిక పరంగా సంగీత సాహిత్యాలను మిళాయించే మరోరకమైన సాహిత్య ప్రక్రియ సినిమా. మరి బ్లాగులు, "ఈ పత్రికలు", కొత్త రకమైన సాహిత్యాన్ని పుట్టించగలవా?


ఎంతటి సాంకేతిక అభివృధ్ధి జరిగినా, ఒక రచయిత పరిశీలనలోనుండి ఊహాలోనుండి సాహిత్యం పుట్టవలసినదే కాని ప్రచురణా మాధ్యమాలు సాహిత్యాన్ని పుట్టించలేవు.

4. ఇటీవలి కాలంలో ఈ-పత్రికల చదువరులు తగ్గి, బ్లాగులకు ఉరవడి పెరిగిందని అంటున్నారు. ఇది ఎంత వరకు సరయింది?

ఈ ప్రశ్నకు ముందుగా, అసలు "ఈ పత్రిక" అంటె ఏమిటి అని ఒక నిర్వచనం తీసుకు రావాలి. "ఈ పత్రిక", "బ్లాగు" కు ఏ విధంగా భిన్నమైనది? "ఈ పత్రిక" "అచ్చు పత్రిక" కు ఉన్న బేధాలేమిటి. ఒకటి ఎలెక్ట్రానిక్ తెరమీద చూడగలిగితే, మరొకటి కాయితం మీద అచ్చు చేయబడటమేనా లేక ఇంకేమైనా తేడా ఉన్నదా? నాకేతే "ఈ పత్రిక" కు "అచ్చు పత్రికకు" పెద్దగా తేడా ఏమీ లేదనే అనిపిస్తున్నది.

ఇక పై ప్రశ్నకు జవాబు చెప్పవలసివస్తే "ఈ పత్రిక" లకు పాఠకులు తగ్గి బ్లాగులనే ఎక్కువ చదువుతున్నారా? ఈ విషయం నిజమే! ఇలా జరగటానికి నా దృష్టిలో కారణాలు:

  1. "ఈ పత్రికలు" ఒక మూసలో ఇమిడిపోయి వైవిధ్యం లేకపోవటం
  2. బ్లాగుల్లో ఒకే బ్లాగర్ రక రకాల విషయాల మీద వ్రాయటం, అలా వ్రాసే బ్లాగర్ల సంఖ్య బాగా పెరగటం వల్ల ఎంతో వైవిధ్యం ఉండటం, బ్లాగుల ప్రాచుర్యాన్ని పెంచిందనే చెప్పాలి. ఈ కారణం వల్ల "ఈ పత్రిక" ల కన్నా బ్లాగులనే ఎక్కువ మంది చదువుతూ ఉన్నారు.
  3. బ్లాగులో ప్రచురణలకు ఒకా కాల నియమమేమీ లేదు. రాత్రి నిద్ర పట్టకపోయినా సరే ఏదో ఒకటి వ్రాసే వారున్నారు, పైగా ఆ వ్రాసినవి చదవటానికి బాగుంటున్నాయి కూడ, కాలక్షేపం బఠాణీల్లాగ. కాని ఈ సౌలబ్యం "ఈ పత్రిక" లకు లేదు. వారు నెలకొకసారో, మూణ్ణెల్లకొకసారో,ఒక కాల నియమాన్ని పాటించి సంచికలుగానే ప్రచురించటం వాటి ప్రాచుర్యాన్ని తగ్గించిందని చెప్పాలి.

"ఈ పత్రిక" లు నెలవారీగా కాకుండా ఎప్పటికప్పుడు ప్రచురణ జరుగుతూనే ఉండాలి. అంటే ఒక పాత విషయం తీసేసి, ఒక కొత్త విషయం ప్రచురణ చేస్తూపోతూ ఉండాలి. ప్రతి పేజీకి "విజిట్ మీటర్" పెట్టి అయా పుటలలో ఉన్న విషయానికి ఉన్న ప్రాచుర్యాన్ని కొలువ వచ్చు. అలా కొలుస్తూ, బాగా ప్రాచుర్యం పొందిన విషయాలు ఎక్కువ కాలం ఉంచి, తక్కువ మంది చదువుతున్న విషయాలను తొలగిస్తూ పోవచ్చు. ఈ సౌకర్యం అచ్చు పత్రికలకు లేనే లేదు.

మొత్తం మీద బ్లాగులు, ఈ పత్రికలను పక్కకు తోసేస్తున్నాయనె చెప్పాలి. మరి కొన్నాళ్ళకు అచ్చు పత్రికలకు కూడ ఈ సెగ తగలక మానదు. Just a matter of Time. ఇంటర్నెట్ మరింత ప్రాచుర్యం పొంది, బ్లాగుల్లో మరింత వ్రాసే వారు వస్తే, అచ్చు పత్రికలకు కాలం చెల్లినట్టే. ఒకరు వ్రాసినది మరొకరు చదువుకుంటూ కావలిసినంత కాలక్షేపం చెయ్యవచ్చు.

తరువాత కొంతకాలం క్రితం కూడలిలో వెబ్ పత్రికల వర్గంలో దాదాపు బ్లాగుల్లాగానే ఉన్న అంశాలు చేరుస్తూ ఉంచటాన్ని చూసి, వీవెన్ గారికి మెయిలు చేశాను. ఆయన కొన్ని మార్గదర్శక సూత్రాలు వ్రాసి పంపండి అన్నారు. సరే ఒక ఆదివారం కొంత ఆలోచించి, ఈకింది విషయాలు వ్రాసి ఆయనకు మెయిలు చేశాను. ఈలోగా ఎలాగో సందర్భం వచ్చింది కదా మనం చర్చించటంలో తప్పు లేదు అనిపించి ఇక్కడ ప్రచురిస్తున్నాను. మీ అభిప్రాయాలు తెలుపగలరు.

వెబ్ పత్రిక లక్షణాలు

1.

  1. పత్రికకు అంతర్లీనంగా ఒక ప్రధాన ఉద్దేశ్యం ఉండాలి, వినోదం, సినిమా విశేషాలు, సాహిత్యం, రాజకీయాలు, హాస్యం, లేదా వీటన్నిటి మేళవింపుగా ఉండాలి. అంటే ఫార్మాట్ తప్పనిసరిగా ఉండాలి.
  2. పత్రికకు ఒక ముఖ చిత్రం ఉంటే బాగుంటుంది. ఆ ముఖ చిత్రాలు కాపీ రైటు కలిగిన బొమ్మలై ఉండాలి. ముఖ చిత్రం ప్రతి సంచికకూ వేయటం ప్రయాస అయినప్పుడు, పత్రిక మొదటి పుట ఆకర్షణీయంగా ఉండేట్టుగా తీర్చి దిద్దాలి.
  3. విషయ సూచిక తప్పనిసరిగా ఏర్పరిచి, ప్రముఖంగా రూపొందించి పాఠకుడిని తికమక పెట్టకుండా అమర్చాలి. విషయ సూచికనుండి లోపలి విశేషాలకు లింకు పెడితే బాగుంటుంది.
  4. ఒక కాల పరిమితిలో ప్రచురించబడాలి, గుర్తుకు వచ్చినప్పుడు కాకుండా, వారాని కొకసారి ఐతే బాగుంటుంది
  5. సంపాదకత్వం జరుగుతూ ఉండాలి. దగ్గరకు వచ్చినవన్ని చోటు నింపటానికి, సంచిక తీసుకురావటానికి ప్రచురించకూడదు.
  6. పత్రిక మొదలు పెట్టిన వారే కాకుండా అందులో ఇతర రచయితల వ్యాసాలు, కథలు, కవితలు ఉండాలి. ఇతర రచయితలు సాధ్యమైనంతవరకూ ఏ కొద్దిమందో వాడికగా కాకుండా, అనేకమంది ఉంటూ ఉండటం సముచితం. ప్రతి సంచికలోనూ వేరు వేరు రచయితల రచనలు, వ్యాసాలు, వగైరా ఉండాలి.
  7. ప్రచురించే విషయాలు వ్రాసే పధ్ధతి తేటతెల్లంగా, అచ్చు తప్పులు (స్పెల్లింగు తప్పులు) లేకుండా ఉండాలి. భాష పొందికగా అందంగా ఉండి పాఠకుడికి చదివే ఆసక్తిని పెంచేదిగా, విజ్ఞానాన్ని/వినోదాన్ని అందిస్తూ ఆలోచింపచేసేదిగా ఉండాలి. పాఠకుణ్ణి బ్రైన్ వాష్ చేసి ఏదో ఒక ఇజాన్ని ఎక్కించే ప్రయత్నం జరుగకూడదు.
  8. వ్యాసాలలో వ్రాసే విషయాన్ని కూలంకషంగా చర్చిస్తూ, నిస్పక్షపాతంగా ఉండాలి. ఏదో ఒక కొమ్ము పట్టుకుని పిడివాదంగా వ్యాసాలు ఉండకూడదు. పార్టీ విధానాలను సూటిగా ఏవిధమైన పక్షపాతం లేకుండా విశ్లేషణలు చెయ్యాలి కాని పార్టీ తత్వాలు వ్యాసాల్లో బోధించకూడదు. పత్రికలు ఏదో ఒక పార్టీ తత్వాన్ని బోదించేవిగా ఉండకూడదు. అలా చేస్తే అవి పార్టీ ప్రచార కరపత్రాలే కాని, సామాన్య పాఠకులు చదవగలిగే పత్రికలుగా పరిగణించలేము.
  9. అవసరమైన చోటల్లా కుదిరినంతవరకూ కాపీ రైటు ఉన్న బొమ్మలు, కార్టూన్లు వాడుతూ ఉండాలి.
  10. పాఠకుల అభిప్రాయాలకు తప్పనిసరిగా ఒక భాగం కేటాయింపు ఉండాలి. ప్రతి సంచికలోనూ, సంచికలో వచ్చిన విశేషాల మీద పాఠకుల స్పందన ఉండాలి. ఎక్కువమంది పాఠకులు స్పందిస్తూ, ఈ పత్రిక వ్రాసే విషయాలు ఒక ఎజెండా పెట్టుకుని వ్రాస్తున్నట్టుగా ఉన్నాయి అని ఫిర్యాదులు ఆగ్రిగేటర్‌కు సూటిగా పంపినప్పుడు, ఆ పత్రిక తొలగించబడుతుంది. ఈ విషయంలో తుది నిర్ణయం ఆగ్రిగేటర్‌సంపాదక వర్గానిదే అయ్యి ఉండాలి.
ఇలా కొన్ని నియమాలను అనుసరించి వెబ్ పత్రికలను ఆగ్రిగేటర్లో ఉంచటం మొదలుపెడితే, "ఈ పత్రికలు" బాగా అభివృధ్ధి జరిగే అవకాశం ఉన్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.