25, సెప్టెంబర్ 2010, శనివారం

కామన్వెల్త్ ఆటలు అక్కడే ఆడాలా


కామన్వెల్త్ ఆటలపోటీ ఢిల్లీలోనే ఆడాలా? అలాంటి ఆటల పోటీలునిర్వహించటానికి ప్రత్యేక స్టేడియంలు వగైరా కొత్తవి కట్టి తీరాల్సిందేనా? మనదేశం ఏమన్న చిన్నదా స్టేడియాలు లేకుండా గొడ్డుపోయిందా! ఎన్ని నగరాల్లో ఎన్నెన్ని స్టేడియంలు లేవు! ఈ ఆటలను దేశవ్యాప్తంగా ఒక 25 నగరాలను (పెద్దనగరాలతో పాటుగా చిన్న నగరాలను కూడ) ఎంపిక చేసుకుని మనకి ఇప్పటికే ఉన్న స్టేడియాల్లో ఎందుకు నిర్వహించకూడదు. ఒక్కో రకమైన పోటీ ఒక్కో నగరంలో నిర్వహించటం, చివరి ఫొటీలు మరొక నగరంలో, ఇలా ఒక చక్కటి పథక రచన చేసి అనేక నగరాలో ఉన్న ప్రజలు చూసి ఆనందించేట్టుగా ఎందుకు ఈ ఆటలపోటీని నిర్వహించరు??

కామన్వెల్తు ఆటలపోటీ నియమాల్లో పోటీలు ఏమైనా సరే ఒక్కచోటె నిర్వహించాలని శిలక్షరాలు లిఖించారా ఏమిటి??!!!

ఇన్ని కొత్త స్టేడియాలు (ఎప్పుడు కూలతాయో తెలియని) కట్టారుకాని, క్రికెట్ పిచ్చెక్కువగా ఉన్న మన దేశంలో ఈ ఆటలను చూడటానికి ప్రేక్షకులు ఎంతమంది వస్తారు? లక్షలాది మంది ప్రేక్షకులు తిలకించిన క్రికెట్ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించి నప్పుడు ఇలా కొత్త స్టేడియాలు కట్టినటు లేదే! అన్ని ఆటలు దేశవ్యాప్తంగా అప్పటికే ఉన్న స్టేడియాలలో ఆడారుకదా. ఇపుడీ కొత్త ఖర్చు దేనికి. ఎవరికోసం.

ఆటగాళ్లకు ఆతిధ్యమివ్వటానికి దేశవ్యాప్తంగా ఎన్నెన్ని 3స్టార్, 5 స్టార్ హోటళ్ళు లేవు, ఆ వచ్చే ఆటగాళ్ళ కోసం ఒక్కచోటే (నాసిరకపు) గదులు కొత్తగా కట్టాలా.

ఏమిటో ఇదంతా మీడియాలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న కామన్వెల్త్ గేముల నిర్వహణా లోపాలు చూసి/చదివి, సామాన్యుని సణుగుడేకాని, ప్రజలచేత ఎన్నికయ్యామన్న జ్ఞానమే లేకుండా రాజులు యువరాజులు లాగ ప్రవర్తించే ఈ రాజకీయ నాయకులకు ఏమన్నా పట్టిందా?? పైగా తాము చేసిన ఏర్పాట్లే గొప్పగా ఉన్నాయని నిస్సిగ్గుగా డంబాలు పలకటం. చివరకు దేశ ప్రధాని, ఈ చిన్న విషయంలో ప్రత్యెక సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించాల్సిన గతి పట్టింది అంటే, పరిస్తితి ఎంత దారుణం ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఈ ఆటల పుణ్యమా అని డిల్లీ రోడ్లన్నీ తవ్వి పారేశారట. దాంతో అనేక చోట్ల టెలిఫోన్ లైన్లు తెగిపోయి, పేటలకు పేటలు టెలిఫోన్ సౌకర్యం లేకుండా బాధపడుతున్నారు. కొన్ని కొన్ని వ్యాపార సముదాయాల్లో, వినియోగదారుడు తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్/ఏ టి ఎం కార్డు వాడితే, టెలిఫోన్ కనెక్షన్లు లేకపోవటంతో ఆ కార్డులద్వారా అమ్మకాలను పూర్తిచేసుకోలేక, అమ్మకాలు పడిపోయి వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారట .

కామన్వెల్త్ ఆటల పోటీలు 2014లో గ్లాస్గో నగరంలో జరిగే ఆవకాశం బాగా ఉన్నదట . బ్రిటిష్ వారు ఆ ఆటలను ఎలా నిర్వహించినా సరే (వాళ్ళు ఎలాగో అద్భుతంగా నిర్వహిస్తారు) రెండు పోటీలు చూసినవారు, గ్లాస్గో గేములనే మెచ్చుకునేట్టుగా చేసే ప్రయత్నం గా ఉన్నది ఈ వ్యవహారం అంతా కూడ. మన రాజకీయ నాయకులు, వారి తాబేదార్లైన కాట్రాక్టర్లు కలిసి, తమ దురాశ, అవినీతితో రాబొయ్యే గ్లాస్గో గేములనే అందరూ మెచ్చుకోవటానికి చక్కటి పునాది వేస్తున్నారు.

ఇలా ఆటల పోటీకి ప్రత్యేక గ్రామాలను కోట్లు తగలేసి నిర్మించటం ఎవరికోసం, కాట్రాక్టర్లు, రాజకీయ నాయకులు వారికున్న ఎడతెగని ధనదాహం తీర్చుకోవటానికే అనిపిస్తున్నది.

ఏది ఏమైనా మనదేశ ప్రతిష్టకు ముడిపడి ఉన్న ఈ ఆటల పోటీలు, మిగిలిన ఈ కొద్ది రోజులలో ఐన, కొంత పాటుపడి, కొంతలో కొంత నిజాయితీ చూపించి, సవ్యంగా నిర్వహిస్తారని ఆశిద్దాం.
***************

4 వ్యాఖ్యలు:

 1. శివాగారు ప్రజల తలకాయలలోకి తొంగి చూసినట్లుగా చాలా చక్కగా చెప్పారు. అవును ఈ ఆటలు ఎవరి కోసం??? భారతీయ ప్రజలకోసమా!! లేక భారత రాజకీయ దుష్ట అనుచర గణాలైన కాంట్రాక్టర్ల కోసమా?

  అవును నిజమే, లక్షలాదిమంది చూసే క్రికెట్టును ఉన్న స్టేడియాలలో నిర్వహించిన వీళ్ళు, ఈ ఆటల మీద ప్రత్యేక శ్రధ తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటి? ఎవరిని బాగుచెయ్యటానికి....!! విచిత్రమేమిటంటే మన ప్రజల అనందం కోసం పార్కులు నిర్మిస్తుంటే వాటిని అడ్డుకునే ఎర్రజెండావాళ్ళెవరు ఇన్ని వేల కోట్లు తగలేస్తున్నప్పుడు పెదవి విప్పకపొవటం ఏమిటి..!!

  పేదలతో నిండి ఉన్న మనదేశంలో ఎకానమిక్ రిఫాంస్ పేరుతో అనేక సబ్సిడీలు తొలగించిన గొప్ప ఆర్ధికవేత్తలు ఎవరూ కూడా మనదేశంలో ఇన్ని వేలకోట్ల రూపాయలతో ఆటలు నిర్వహించడం అసలు అవసరమా?... అని అడగరా...?

  ఇక 4వ స్తంభమొ 5వదో అయిన మీడియా ఇన్నివేల కోట్ల ప్రజా ధనం తగలేస్తున్నప్పుడు ఏమి చేస్తున్నట్లు? ప్రజలకి చెప్పల్సిన పనిలేదని రాజకీయనయకులతో పాటూ మీడియా కూడ అనుకుంటోందా? ఎందుకంటే ప్రతీ దానికీ అతి చేసి ప్రతి పనికిమాలిన విషయానికి ఎస్.ఎం.ఎస్ పోల్ అడిగే మీడియా దీనికి ఎందుకు స్పందించటం లేదు...?

  అన్నీ ప్రశ్నలే..అందుకనే అనిపిస్తోంది మనకున్నది నిజమైన ప్రజాసామ్యమా...లేక 5 ఏళ్ళ రాజరికమా..?

  రాధాక్రిష్ణ,
  విజయవాడ.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శివగారు! చాలా బాగా విశ్లేషణాత్మకంగా వ్రాసారు. ప్రజా ధనం వృధా అవుతున్న తీరు, నిబద్ధతలేని రాజకీయ వేత్తల పట్ల బాగా వ్రాసారు.
  అయితే డిల్లీలోనే నిర్వహించడం వెనుక కారణాలు (సహేతుకం కాకపోవచ్చు):
  1. కామన్ వెల్త్ అంటేనే గతంలో బ్రిటీషు వారి ఏలుబడిలో నలిగిన(ఆసియా దేశాలు)/ ఎదిగిన(ఆస్ట్రెలియా, న్యూజీలాండ్) దేశాల సమూహం.
  2. బ్రిటీషు మరియు వారి తాబేదారు దేశాల వారికి ఇప్పటికీ మన దేశమంటే ఎంత చులకన భావన ఉందంటే ఒక్క డిల్లీలో (అదీ దేశ రాజధాని కనుక) తప్ప ఎక్కడా మన రక్షణ వ్యవస్థ సరిగాలేదనీ, అందువల్ల తమ క్రీడాకారులు నిర్భయంగా పాల్గొనాలంటే డిల్లీలోనే క్రీడలు నిర్వహించాలని అనధికారిక షరతులు పెడుతుంటారు.
  3. అదే వారి దేశంలో అయితే ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగినా భద్రతమాత్రం చెక్కుచెదిరినట్లు కాదన్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేవారు మన దేశంలో మాత్రం గోరింతలు కొండంతలు గా చూపించి ఇలాంటి కండీషన్లు పెడతారు.
  4. అలాంటి కండీషన్లు ఒప్పుకొనె చేతగాని నాయకుల ఉండడం మన దౌర్భాగ్యం. పైగా వేల కోట్లు ఖర్చుపెట్టి ఇలాంటి క్రీడా 'మహో'త్సవాలు నిర్వహిస్తేనే దేశంలో క్రీడలు అభివృద్ధిచెందుతాయని పగటి కలలు కంటుంటారు.
  5. కనీసం అత్యున్నత క్రీడాకారులను సరిగా గౌరవించడం కూడా చేతగాని గిల్లుల, కిలాడీ కల్మాడీల చేతుల్లో క్రీడా భవిశ్యత్తుని పెట్టి ఇంతపెద్ద క్రీడా సంరంభాన్ని ఘనంగా నిర్వహిస్తామనీ, ఆ తర్వాత ఇక వెనక్కు తిరగకుండా క్రీడాభివృద్ధి జరిగిపోతుందనీ పగటి కలలు కంటున్నారు.
  అయితే ఏది ఏమైనా, మీరన్నట్లు గ్లాస్గో గేములనే మెచ్చుకునేట్టుగా చేసే ప్రయత్నం గా మాత్రం భావించనవసరం లేదులెండి. ఎందుకంటే మనం ఎంత ఘనంగా నిర్వహిస్తే అంతకు రెండు మూడు రెట్లు ఛాలంజింగ్ గా నిర్వర్తించే చూపే మెంటాలిటీ వాళ్ళది. కాకపోతే మన (వి)నాయకులకు 'ఇంత పెద్ద పండగ ' మళ్ళీ వస్తుందో రాదో అన్నట్లు కాంట్రాక్టులన్నీ తమ వారికే దక్కించుకున్నారు. వారి అత్యాశే మన ఈ ప్రస్థుత ఖర్మకు కారణం తప్ప మరొకటి కాదు.
  Also have a look @ my post on the same issue in my blog

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఒకే అథ్లెట్ అనేక పోటీలలో పాల్గొనే అవకాశం ఉండడం వల్ల సాధారణంగా ఇలాంటి పోటీలు ఒకే సిటీలో జరుగుతాయి. ఒకేసారి సమాంతరంగా అనేక నగరాలలో నిర్వహిణడం సాధ్యం కాదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నిత్యాన్వేషిగారూ, పాతకాలపు ఎడ్ల బండ్ల రోజులలో మీరు చెప్పింది నిజం కావచ్చు. అప్పటి రోజులు, ఆనాటి ప్రయాణ సాధనాల దృష్ట్యా, ఇలా ఒకచోటె నిర్వహించటం జరుగుతూ ఉండి ఉండవచ్చు. ఈరోజుల్లో విమానయానం, హెలికాప్టర్ సర్వీసులు ఎంతో అభివృధ్ది చెందినాయి.

  ఆపైన, ఢిల్లీ నగరంలో కాని, ఆ చుట్టుపక్కల కాని, అనెకానేక హోటళ్ళు, స్టేడియాలు ఉన్నాయి. ఇలా జనం డబ్బు తగలేసి మళ్ళి కొత్తగా కట్టాల్సిన పనిలేదు. అప్పుడెప్పుడో ఏషియాడ్ (1982లోనా) కూడ కట్టారుగా, ఏవైనాయి అవన్నీ. సరిగ్గ నిర్వహించక, నాశనమై పోయి ఉంటాయి. ఇదేమరి, సామర్ధ్యం లేని గుమాస్తాలు అంటే.

  ప్రత్యుత్తరంతొలగించు

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.