26, సెప్టెంబర్ 2010, ఆదివారం

గణపతితో విఫలమైన ఇంటర్‌వ్యూ


1960లు 1970లలో విజయవాడ, పరిసర ప్రాంతాల్లో పెరిగి పెద్దైన వారందరికీ గణపతి చిరపరిచితుడు. ఎవరీ గణపతి? చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి మానస పుత్రుడు. చిలకమర్తి వారు ప్రహసనాలు వ్రాయటంలో అందెవేసిన చెయ్యి. ఆయన రచించిన పూర్తి హాస్య నవల "గణపతి" ఇరవయ్యో శతాబ్దపు తొలి రోజులలో వ్రాయబడిన నాటకాన్ని, 1967 సంవత్సరంలో ఆకాశవాణి విజయవాడవారు ఓక గంట నాటకంగా అద్భుతం తయారు చేశారు. నాటకాన్ని ప్రముఖ రంగస్థల, సినీ, రేడియో కళాకారులు శ్రీ బందా కనలింగేశ్వర రావుగారి ఆధ్వర్యంలో తయారు చేశారు. వారే నాటకానికి దర్శకులు.

నాటకంలో గణపతి పాత్రను ప్రముఖ రేడియో నటులు శ్రీ నండూరి సుబ్బారావుగారు నటించారు. నాటిక ప్రసారం ఐన మరుక్షణం నండూరి సుబ్బారావుగారు సూపర్ స్టార్ అయిపోయారు. నండూరివారి మాట వస్తే చాలు గణపతి, గణపతి అంటే నండూరి సుబ్బారావు గా ఎంతో ప్రాచుర్యం పొదారు. గణపతి పాత్రలో ఒదిగిపోయి, లీనమై పోయి పాత్రలో ఉండే అమాయకత్వంతో మిళాయించిన అహంకారాన్ని, తన తెలియని తనాన్ని కప్పిపుచ్చుకోవటానికి పొగరుమోత్తనాన్నే వాడుకునే తెలివి తక్కువతనన్ని (అలా చేశే వాళ్ళను ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాం!!) నండూరి సుబ్బారావుగారు తన నటనలో అద్భుతంగా చూపించారు, కాదు కాదు జీవించారు.

విషయంలో ఆకాశవాణి వారికి సి డి ప్రచురించి చక్కటి నాటకాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చినందుకు, నా హృదయపూర్వక ధన్యవాదాలు.

గణపతి నాటకం గురించి వ్రాద్దామన్న కోరికతో లేఖిని తెరిచి వ్రాయటం మొదలు పెట్టగానే, ఒక ఆలోచన
తళుక్కుమన్నది. ఇలావ్రాసి, అందులో గణపతి నాటకంలోనని కొన్ని స్వరాలు ఎల్లాగో వినిపిస్తాం. కాని అలా చేసే బదులుగా, స్వరాలను వాడుకుంటూ, మనమే గణపతి పాత్రతో ఇంటర్వ్యూ చేసినట్టుగా ఒక చక్కటి శబ్దతరంగాన్ని ఎందుకు తయారు చెయ్యకూడదు అనిపించింది. వెనువెంటనే గణపతి ఆకాశవాణి వారు ప్రచురించిన సి.డి బయటకు తీసి, సి.డి సహాయంతో ఒక ఇంటర్వ్యూ తయారు చేశాను. గణపతిగారు ఊరికే కోపం తెచ్చుకుని, ఇంటర్వ్యూని సగంలో వదిలేసి వెళ్ళిపోయారు, ఇంటర్వ్యూ అభాసుపాలు అయ్యిందనుకోండి. సవ్యంగా జరిగిన వాటికంటే అభాసుపాలయ్యిన వాటినుండే ఎక్కువ హస్యం పుడుతూ ఉంటుంది.

కింది ప్లెయర్
లో ఇంటర్వ్యూని నిక్షిప్తం చేయటం జరిగింది. విని ఆనందించండి.



ఇంటర్వ్యూలో వినబడిన గొంతులు శ్రీ గొల్లపూడి మారుతీరావు, శ్రీ నండూరి సుబ్బారావు, శ్రీమతి పిసీతారత్నం. విన్న స్వరాలు ఆకాశవాణి వారి సౌజన్యం

నాటికను ఎన్ని సార్లు విని ఉంటానో లెక్కలేదు. అసలు ఇది విన్న నాటకమా చూసిన సినిమానాఅనిపిస్తుంది. శబ్దస్వరాలను మాత్రమే వినిపించగలిగే కళ రేడియో నాటకం. విషయంలో నాటకం అన్నీప్రధమ శ్రేణి మార్కులనే కొట్టేసింది అని చెప్పటానికి నాకేవిధమైన అనుమానం లేదు. నాకే కాదు నాటకంవిన్న వారందరూ కూడ ఇది తాము (తమ మనోచిత్రం లో) చూసిన నాటకమనే అనుకుంటారు. నాటికలోని సంభాషణలను సందర్భోచితంగా ఇప్పటికీ మా కుటుంబంలో మాట్లాడుకునేప్పుడు వాడుతూనేఉంటాం. నాటిక పరిచయం లేని దురదృష్టవంతులకు, మా మాటలు అర్ధం కావు!

రేడియోలో నాటకం అంటే, ఉద్యోగ ధర్మంగా, బల్ల మీద పెట్టిన మైకు చుట్టూ గుమికూడి, తమ తమ పాత్రలుచదివేసి చేతులు దులుపుకుని ఐదు అవ్వగానే వెళ్ళిపోవటంగా భావించలేదు అలనాటి కళాకారులు. చేసినప్రతి కార్యక్రమాన్ని, మన:స్పూర్తిగా, తమకు ఇవ్వబడిన పాత్రలలో లీనమైపోయి నటించేవారు. అందుకనే నాటిక/నాటకాలంటే ఇప్పటికీ ఎంతో అపురూపంగా వింటూ ఉంటారు శ్రోతలు. ఈనాటకంలో నటించిన నటీనటులందరూ ధన్యులు. అద్భుత రేడియో నాటకంలోని పాత్రలు పాత్రధారుల వివరాలను ఆకాశవాణి వారిస్వరంలోనే వినటం సముచితం. వినండి.



ఆకాశవాణి, విజయవాడ కేద్రం వారు తయారుచేసిన ఇంకా అనేక అద్భుతమైన నాటకాలు ఉన్నాయి.
1. డాంక్విక్సోట్
2. మడిబట్ట
3. కరివేపాకు
4. నాటికి నేడు
5. తాళంచెవులు
6.బామ్మగారి రేడియో
7.దొందూ దొందే
8. మూడు వరాలు
ఇలా చెప్పుకుంటూ పోతే 1960-75 వరకు ఆకాశవాణి విజయవాడ కేద్రపు బంగారు రోజుల్లోని వచ్చిన అన్నికార్యక్రమాలన్నిటినీ ఏకరువు పెట్టాలి. అప్పట్లో వచ్చిన నాటక/నాటికలను, చెళుకులను, ఉషశ్రీ గారిపురాణాలు, ధర్మ సందేహాలు అన్ని కూడ వరుసగా సి.డిలుగా తెచ్చి అమ్మితే, అలనాడు విన్న వేలఅభిమానులు మళ్ళి విని ఆనందిస్తారు. ఇప్పటి శ్రోతలకు రేడియో లో ఉన్నత ప్రమాణాలతో వచ్చిననాటకాలను పరిచయం చేసినట్టూ అవుతుంది.

వ్యాపార పరంగా నాటకాలు అమ్ముడుపోవు నష్టం వస్తుంది అనుకుని ఆకాశవాణి వారు భావిస్తే , నాటకాల ఆడియోలన్ని కూడ వారి వెబ్ సైటులో ఉంచి వినటానికన్నా అవకాశం కల్పించాలని, ఆకాశవాణివిజయవాడ కేద్రం నాటక/నాటికల అభిమానులందరి తరఫున, సంబంధిత అధికారులను వినయపూర్వకంగాకోరుతున్నాను. మనందరి చిన్ని కోరిక, రేడియో అధికారుల చెవిలో పడే అదృష్టం కలగాలని, వారు విషయంలో వ్యాపార పరంగా కన్నా, శ్రోతల కోరికలను మన్నిస్తూ, ఇంటర్నెట్ ద్వారా, అలనాటిరికార్డింగులన్ని కూడ శ్రోతలకు అందుబాటులోకి తెస్తారని భావిస్తూ, ప్రస్తుతానికి శలవు.

2 కామెంట్‌లు:

  1. ఒకే మాట : చాలా బాగా చేసారు

    ధన్యవాదములు - రంజని

    రిప్లయితొలగించండి
  2. ఇప్పుడే విన్నాను శివగారూ...బ్రహ్మాండంగా ఉంది...క్లిప్పులు అతకటం మధ్య మీ ప్రశ్నల మధ్య కొద్దిగా ఖాళీ - అనగా ఒక్క సెకను అట్టిపెడితే బాగుండేదేమో అని అనిపించింది కానీ ఇలాక్కూడా బానే ఉన్నది...

    ఇహ "బ్లాగ్ ఆహ్వానితుల కొరకు మాత్రమే" దానికి వస్తే ఇంకా కొన్ని రోజులు వేచి చూడటం మంచిదేమో అని నా అభిప్రాయం.

    వంశీ

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.